• facebook
  • whatsapp
  • telegram

జీవవైవిధ్య నెలవులు

‘రామ్‌సర్‌’ జాబితాలోకి మరిన్ని చిత్తడి నేలలు

శీతోష్ణస్థితి, వరదల నియంత్రణ, నీటిశుద్ధి, పర్యావరణ పరిరక్షణలో చిత్తడి నేలలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంటార్కిటికా మినహా ప్రపంచంలోని అన్ని ఖండాల్లో చిత్తడి భూములున్నాయి. వాటిని పుడమికి మూత్రపిండాలుగా పర్యావరణవేత్తలు అభివర్ణిస్తారు. ప్రకృతి సిద్ధమైన చిత్తడి నేలలు తీరానికి సమీపంలో నదీ ముఖద్వారం వద్ద ఎక్కువగా కనిపిస్తాయి. రెండు వనరుల నుంచి నీటినందుకొంటూ ఒకదానితో మరొకదాన్ని కలుపుతూ జీవవైవిధ్య రక్షణకు ఆలంబనగా నిలుస్తాయి. విభిన్నమైన మొక్కలు, జంతుజాతుల అభివృద్ధికి, పక్షి జాతుల సంతానోత్పత్తికి అవి అనుకూలంగా ఉంటాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ ఆగస్టు తొలివారంలో అదనంగా మరో 10 చిత్తడి నేలలను రామ్‌సర్‌ క్షేత్రాల జాబితాలో చేర్చింది. ఇది ప్రతి పర్యావరణ ప్రేమికుడూ ఆనందించాల్సిన విషయంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. సహజ పరిసరాలను పరిరక్షించుకోవాలనే మన నిబద్ధతను ఈ చర్య మరింతగా పెంచుతుందని ఆయన పునరుద్ఘాటించారు. తాజాగా మరో 11 చిత్తడి నేలలను కేంద్రం రామ్‌సర్‌ క్షేత్రాలుగా గుర్తించింది.

ఇరాన్‌లోని రామ్‌సర్‌ నగరంలో 1971 ఫిబ్రవరి రెండున చిత్తడి నేలల పరిరక్షణపై సదస్సు జరిగింది. 169 దేశాలు అందులో పాల్గొన్నాయి. నాటి నుంచి చిత్తడి నేలల సంరక్షణ కోసం సభ్య దేశాలు కృషి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 2400 చిత్తడి నేలలను రామ్‌సర్‌ క్షేత్రాల జాబితాలో చేర్చారు. రామ్‌సర్‌ సమావేశం ప్రకారం సముద్రం పక్కన ఉండే చిత్తడి నేలలు ఆటుపోట్లకు గురవుతూ గరిష్ఠంగా ఆరు మీటర్ల లోతు నీటిని కలిగి ఉండాలి. సముద్రానికి దూరంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే చిత్తడి నేలలు ఎల్లప్పుడూ నీటిని కలిగి ఉంటాయి. రామ్‌సర్‌ సదస్సు తరవాత చిత్తడి నేలల పరిరక్షణలో భారత్‌ చెప్పుకోదగిన కృషి చేసింది. 2013 దాకా ఇండియాలో రామ్‌సర్‌ క్షేత్రాల సంఖ్య 26 మాత్రమే ఉండేది. అనంతరం మరో 49 చిత్తడి నేలలను అదనంగా జాబితాలో చేర్చారు. అలా భారత్‌లో రామ్‌సర్‌ క్షేత్రాల సంఖ్య ప్రస్తుతం 75కు చేరింది. మనకన్నా విస్తీర్ణంలో చాలా చిన్నదైన ఇంగ్లాండ్‌లో 175 గుర్తింపు పొందిన రామ్‌సర్‌ క్షేత్రాలున్నాయి. ఆక్రమణలు, పరిశ్రమల ఏర్పాటు, విస్తరణ, ఘనవ్యర్థాలను పారబోయడం, శుద్ధిచేయని వ్యర్థాల విడుదల, శాశ్వత నిర్మాణాలు చేపట్టడం, వేట తదితర పర్యావరణ విధ్వంసక కార్యకలాపాలు రామ్‌సర్‌ క్షేత్రాల్లో పూర్తిగా నిషిద్ధం. అవి సరిగ్గా అమలుకు నోచుకొంటున్న దాఖలాలు కనిపించవు. కొత్తగా రామ్‌సర్‌ జాబితాలో చేరిన ప్రదేశాలు భారత్‌లో పర్యావరణ వైవిధ్యానికి సహకరిస్తాయని వన్యప్రాణి, జీవశాస్త్రవేత్త నేహా సిన్హా వ్యాఖ్యానించారు. నూతన జాబితాలో చేరిన హీరాకుడ్‌ జలాశయం గురించీ ఆమె ప్రస్తావించారు. మానవనిర్మిత చిత్తడినేలలు సైతం పర్యావరణ పరంగా ఎంత ముఖ్యమైనవో ఈ రిజర్వాయర్‌ తెలియజేస్తుందని ఆమె విశ్లేషించారు.

ప్రణాళికా రహితమైన పట్టణీకరణ చిత్తడి నేలలకు పెనుముప్పుగా పరిణమిస్తోంది. 1973 నుంచి 2007 దాకా కర్ణాటక రాజధాని బెంగళూరు 66 చిత్తడి నేలలను కోల్పోయింది. దేశ రాజధాని దిల్లీలో ప్రమాదకర పట్టణీకరణ కారణంగా 232 చిత్తడి భూములు కనుమరుగయ్యాయి. ముంబయి, కోల్‌కతా, చెన్నై తదితర నగరాలదీ అదే కథ. చెత్త డంపింగ్‌, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, వెల్లువెత్తుతున్న పారిశ్రామిక, ఘన వ్యర్థాలు చిత్తడి నేలల సహజావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రాల భాగస్వామ్యంతో జల సంబంధ ఆవరణ వ్యవస్థల పరిరక్షణకు జాతీయ ప్రణాళికా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దేశంలోని గుర్తించిన చిత్తడి నేలల రక్షణ ఈ కార్యక్రమ లక్ష్యం. ఇండియాలో మరిన్ని చిత్తడి నేలలను రామ్‌సర్‌ క్షేత్రాలుగా గుర్తించడంతో పాటు, వాటి పరిరక్షణకు ప్రభుత్వాలు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం అత్యవసరం. మురుగు నీటిని చిత్తడి నేలల్లోకి వదలడాన్ని అడ్డుకోవడం, వ్యర్థ జలాల శుద్ధి, తీరప్రాంత రక్షణ, మడ అడవుల పరిరక్షణ, ప్లాస్టిక్‌, ఘన వ్యర్థాల సమర్థ నిర్వహణ చిత్తడి నేలల పరిరక్షణకు కీలకం. వాటికోసం ప్రభుత్వాలు తగిన ప్రణాళికలు రూపొందించి, కఠినంగా అమలు చేయాలి. ప్రజలను సైతం చిత్తడి నేలల పరిరక్షణలో భాగస్వాములను చేసినప్పుడే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి.

- జి.శ్రీనివాసు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మారుతున్న కదన వ్యూహం

‣ ద్వంద్వ ప్రమాణాలపై భారత్‌ గళం

‣ తీర ప్రాంతాలు అతలాకుతలం

‣ ఉగ్రవాద నిరోధం పేరిట కపటనాటకం

Posted Date: 22-08-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం