• facebook
  • whatsapp
  • telegram

మారుతున్న కదన వ్యూహం

ఆయుధాల ప్రయోగశాలగా ఉక్రెయిన్‌

 

 

అమెరికా, ఐరోపా దేశాలు తమ అత్యాధునిక ఆయుధాల సత్తాను పరీక్షించుకోవడానికి ఉక్రెయిన్‌ భూభాగాన్ని ప్రయోగశాలగా ఉపయోగించుకోవాలని ఆ దేశ రక్షణ మంత్రి అలెక్సీ రెజ్నికోవ్‌ ఇటీవల ఆహ్వానించారు. ఇది ఆయుధ వ్యాపార సంస్థలను పరమానందభరితం చేస్తోంది. స్టాక్‌ మార్కెట్లో వాటి షేర్ల ధరలు పైకి ఎగబాకుతున్నాయి. అమెరికా, ఐరోపా దేశాలు అందించిన ఆయుధాలతో రష్యా సేనలను సమర్థంగా తిప్పికొడుతున్నామని, రష్యాను చిత్తు చేయడానికి మరిన్ని ఆధునిక అస్త్రాలను పంపాలని రెజ్నికోవ్‌ కోరారు. ఉక్రెయిన్‌ను ఆయుధ పరీక్షలకు వేదికగా ఉపయోగించుకోవడం అక్కడి ప్రజలకు వినాశం తెచ్చిపెడుతుందని రష్యా రక్షణ ప్రతినిధి మరియా జఖారోవా హెచ్చరించారు. మిత్రదేశాల వినూత్న ఆయుధాలను యుద్ధ రంగంలో పరీక్షించడానికి ఉక్రెయిన్‌ సిద్ధమని ప్రకటించిన రెజ్నికోవ్‌, పోలండ్‌ తయారుచేసిన 155 ఎంఎం క్రాబ్‌ స్వయంచాలిత శతఘ్ని వ్యవస్థను తొలిసారి తామే ప్రయోగించామని వెల్లడించారు. తుర్కియే ఇచ్చిన బైరక్తార్‌ డ్రోన్లను రష్యన్లపై విజయవంతంగా వినియోగించామనీ గుర్తుచేశారు.

 

అమెరికా షరతు

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిన రష్యన్లను అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌లు అందించిన ఆయుధాలతో ఉక్రెయిన్‌ మొదట్లో తిప్పికొట్టింది. కిలోమీటర్ల పర్యంతం బారులు తీరిన రష్యన్‌ ట్యాంకులు, సాయుధ శకటాలు, రవాణా ట్రక్కులపై జావెలిన్‌, ఎన్‌ లా క్షిపణులు, ఎం777 శతఘ్నులు, బైరక్తార్‌ డ్రోన్లను ప్రయోగించింది. దాంతో రష్యా కీవ్‌ ఆక్రమణ నుంచి తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌ల స్వాధీనంపైకి దృష్టి మళ్ళించింది. దాంతోపాటు ఉత్తరాన ఉక్రెయిన్‌ సేనలపై, నగరాలపై శతఘ్నులు, క్షిపణులతో తెరిపి లేకుండా అగ్నివర్షం కురిపించసాగింది. యుద్ధం మొదలయ్యాక మొదటి అయిదు నెలల్లోనే రష్యా తమపై 3,650 క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్‌ తెలిపింది. వాటిలో అత్యాధునిక ఇస్కందర్‌ క్రూయిజ్‌ క్షిపణులూ ఉన్నాయి. ఉక్రెయిన్‌ దగ్గరున్న సోవియట్‌ కాలపు మందుగుండు ఖాళీ అవడంతో రష్యన్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే రష్యన్‌ ఆయుధ డిపోలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేయడానికి అమెరికన్లు హైమార్స్‌ రాకెట్‌ లాంచర్లను, భుజాన మోసుకెళ్లి ప్రయోగించే ట్యాంకు విధ్వంసక జావెలిన్‌ రాకెట్‌ లాంచర్లను ఉక్రెయిన్‌కు అందించారు. బ్రిటన్‌, స్వీడిష్‌ బోఫోర్స్‌ కంపెనీ కలిసి తయారు చేసిన ఎన్‌ లా రాకెట్‌ లాంచర్‌ సైతం ఉక్రెయిన్‌కు చేరింది. రష్యన్‌ ట్యాంకులను, యుద్ధవిమానాలను నాశనం చేయడానికి పాశ్చాత్య దేశాల ఆయుధాలు ఉపకరించాయి.

 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేసేటప్పుడు ఒక షరతు విధించారు. ఆ శస్త్రాలను ఉక్రెయిన్‌ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన రష్యన్‌ సేనలను నిలువరించడానికి మాత్రమే ఉపయోగించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా భూభాగంపైకి ప్రయోగించకూడదని సూచించారు. అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని అగ్రరాజ్యం భావించింది. అమెరికన్‌ హైమార్స్‌ రాకెట్లు వాస్తవానికి 140 నుంచి 300 కిలోమీటర్ల దూరం వరకు దూసుకెళ్ళగలవు. అంటే, అవి నేరుగా రష్యా భూభాగంపై పడతాయి. దాన్ని నివారించడానికి అమెరికా హైమార్స్‌ రాకెట్ల ప్రయాణ దూరాన్ని 80 కిలోమీటర్లకు కుదించి ఉక్రెయిన్‌కు అందించింది. ఇప్పటిదాకా సరఫరా చేసిన 12 హైమార్స్‌లకు తోడు మరో నాలుగింటిని త్వరలో అందిస్తామని వాషింగ్టన్‌ ప్రకటించింది. హైమార్స్‌ రాకెట్లు ఉపగ్రహ జీపీఎస్‌ సంకేతాల సాయంతో దూసుకెళ్ళి శత్రు స్థావరాలపై గురితప్పకుండా విరుచుకుపడతాయి. హైమార్స్‌ లాంచర్‌ వాహనాలు స్థిరంగా నిలిచి ఉన్నప్పుడే కాకుండా వేగంగా ప్రయాణిస్తూ సైతం రాకెట్లను ప్రయోగించగలవు. రష్యా ఆక్రమిత డాన్‌బాస్‌ ప్రాంతంలో రెండు ఆయుధ డిపోలను, జపోరీజియాలో ఒక వైమానిక స్థావరాన్ని హైమార్స్‌ రాకెట్లతో ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ తెలిపింది. అయితే, పేలిపోతున్న రష్యా ఆయుధ కేంద్రం అంటూ ఉక్రెయిన్‌ ప్రచారంలోకి తెచ్చిన ఫొటో వాస్తవానికి రష్యా దాడిలో ధ్వంసమైన ఉక్రెయిన్‌ డిపో అని తరవాత వెలుగులోకి వచ్చింది. నల్లసముద్రంలోని రష్యన్‌ చమురు రిగ్గులపై, అక్కడి స్నేక్‌ ఐలండ్‌లోని రష్యన్‌ సేనలపైనా ఉక్రెయిన్‌ హైమార్స్‌ లేదా హార్పూన్‌ క్షిపణులను ప్రయోగించిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యాతో ఉక్రెయిన్‌కు 2,300 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. దాన్ని రక్షించుకోవడానికి 15 హైమార్స్‌ లాంచర్లు అవసరమవుతాయని, 100 హైమార్స్‌లను అందిస్తే రష్యన్ల పనిపట్టగలమని ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి రెజ్నికోవ్‌ కోరారు. ఈ ఆగస్టు నెల అయిదో తేదీ నుంచి ఇరవయ్యో తారీకు దాకా నాలుగు హైమార్స్‌ లాంచర్లను, అమెరికన్‌ ఎ777 హవిట్జర్‌ శతఘ్నులనూ ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది.

 

భారత్‌తో కలిసి తయారీకి సిద్ధం

రష్యా వద్ద ఓఖోట్నిక్‌, ఓరియన్‌ వంటి అధునాతన డ్రోన్లు ఉన్నా, ఉక్రెయిన్‌పై ప్రయోగించడానికి చవకగా దొరికే ఇరాన్‌ డ్రోన్లను సేకరించాలని పుతిన్‌ ప్రయత్నిస్తున్నారు. పాశ్చాత్య మార్కెట్లలో దొరికే చిప్‌లు, ఇతర మైక్రో ఎలక్ట్రానిక్స్‌ను రష్యన్లు తమ క్షిపణులు, ఇతర ఆయుధాల్లో ఉపయోగించి ఉక్రెయిన్‌పైకి వదులుతున్నారు. పాశ్చాత్య నిపుణులు ఉక్రెయిన్‌లో పట్టుకున్న రష్యన్‌ ఆయుధాల్లో విదేశీ విడిభాగాలు 450 దాకా కనిపించాయి. యుద్ధంలో మందుగుండు, ట్యాంకులు, క్షిపణులను క్రెమ్లిన్‌ భారీగా నష్టపోతోంది. వాటిని మళ్ళీ భర్తీ చేసుకునే పనిలో పడింది. భారత్‌తో కలిసి అత్యధునాతన యుద్ధ విమానాలు, ట్యాంకులు, డీజిల్‌ ఎలక్ట్రిక్‌ జలాంతర్గాములు వంటి వాటిని తయారు చేయడానికి సిద్ధమని క్రెమ్లిన్‌ ప్రకటించింది. దానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్నంతటినీ భారత్‌తో పంచుకోవడానికి సిద్ధమని చెప్పింది. మొత్తంమీద ఉక్రెయిన్‌ యుద్ధం భావి యుద్ధ వ్యూహాలను, ఆయుధ బలాలను సమూలంగా రూపాంతరం చెందించబోతోంది.

 

సరికొత్త క్షిపణుల విజృంభణ

జీపీఎస్‌ సంకేతాల సాయంతో దూసుకెళ్ళే హైమార్స్‌ రాకెట్‌ లాంచర్లను చిత్తు చేయడానికి రష్యా తనకున్న అయిదు ఎలక్ట్రానిక్‌ బ్రిగేడ్లలో మూడింటిని మోహరించింది. సిరియాలో డ్రోన్‌ దాడులను సమర్థంగా ఎదుర్కొన్న అనుభవం ఈ బ్రిగేడ్ల సొంతం. అవి రష్యన్‌ ఝిటెల్‌ జామింగ్‌ వ్యవస్థను ఉపయోగించి అమెరికన్‌, యూరోపియన్‌ జీపీఎస్‌, ఉపగ్రహ కమ్యూనికేషన్లను, డ్రోన్‌, క్షిపణుల మార్గనిర్దేశక వ్యవస్థలను స్తంభింపజేస్తున్నాయి. వాటి దెబ్బకు ఉక్రెయిన్‌ బైరక్తార్‌ డ్రోన్లను ఉపయోగించడం మానేసింది. దాంతో సొంత వేలితోనే రష్యా కన్ను పొడవడానికి అమెరికా హార్మ్‌ యాంటీ రేడియేషన్‌ క్షిపణులను సరఫరా చేసింది. ఆ క్షిపణులు రష్యన్‌ గగనతల రక్షణ వ్యవస్థలను, రాడార్ల ఎలక్ట్రానిక్‌ సంకేతాలను ఆధారంగా చేసుకుని వాటిపై విరుచుకుపడతాయి. హార్మ్‌ క్షిపణులను ఉక్రెయిన్‌ తన యుద్ధ విమానాలకు అమర్చింది.

 

- ఏఏవీ ప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ద్వంద్వ ప్రమాణాలపై భారత్‌ గళం

‣ తీర ప్రాంతాలు అతలాకుతలం

‣ ఉగ్రవాద నిరోధం పేరిట కపటనాటకం

‣ ఘనవ్యర్థాల విషవలయంలో పర్యావరణం

‣ అడుగడుగునా ఆంక్షల అడ్డంకి

‣ వరద విధ్వంసం... అభివృద్ధికి విఘాతం

‣ భారత్‌ - రష్యాల వాణిజ్య వృద్ధి

Posted Date: 22-08-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం