• facebook
  • whatsapp
  • telegram

తీర ప్రాంతాలు అతలాకుతలం

యథేచ్ఛగా కొనసాగుతున్న విధ్వంసం

 

 

దేశవ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతాల్లో ప్రకృతిని కాపాడటంలో ప్రభుత్వ వ్యవస్థలు ఘోరంగా విఫలమవుతున్నాయి. తీర వ్యవస్థల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై ఇటీవల భారత కంప్ట్రోలర్‌, ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) సమగ్ర ఆడిట్‌ నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో తీర ప్రాంతాల పరిరక్షణ, యాజమాన్యం, నిర్వహణలో ప్రభుత్వాల వైఫల్యాలను కాగ్‌ ఎండగట్టింది. తీరప్రాంతాల్లో మడ అడవులు, చిత్తడినేలలు, పగడపు దిబ్బలు, ఉప్పునీటి కయ్యలు, ఇసుక నేలల్లో విశిష్టమైన జీవవైవిధ్య సంపద ఉంది. తీర ప్రాంత నియంత్రణ (సీఆర్‌జెడ్‌) నిబంధనలు క్షేత్రస్థాయిలో ఏళ్ల తరబడి పటిష్ఠంగా అమలు కావడం లేదు. తీరంలో ప్రాజెక్టుల మూలంగా పర్యావరణ వ్యవస్థలకు కలుగుతున్న నష్టాన్ని భర్తీ చేయడంలో లేదా నష్ట ప్రభావాన్ని తగ్గించడంపై ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదు. దాంతో తుపానుల మూలంగా తలెత్తే దుష్ప్రభావాలను నియంత్రించడం క్లిష్టతరంగా మారింది. అరుదైన జీవవైవిధ్య సంపద ఉనికి ప్రశ్నార్థకమవుతోంది.

 

లక్ష్యాలకు తూట్లు  

తీర ప్రాంత వనరులు దెబ్బతినకుండా వాటి నిర్వహణ, పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటే తుపానులు, విపత్తుల నష్ట తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చు. నగరీకరణ, తీర నియంత్రణ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న చర్యలు తీరంలోని ప్రకృతి వ్యవస్థల పరిరక్షణకు సవాళ్లు విసురుతున్నాయి. దేశవ్యాప్తంగా తీర ప్రాంత వనరుల పరిరక్షణ కోసం పర్యావరణ పరిరక్షణ చట్టం-1986కు అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం తీరప్రాంత నియంత్రణ (సీఆర్‌జెడ్‌) నిబంధనలను తీసుకొచ్చింది. వాటితో తీరప్రాంతాల్లో చేపట్టే అన్ని అభివృద్ధి కార్యక్రమాలను నియంత్రించి పర్యావరణ వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగాలపై ఉంది. చేపల వేట, ఓడరేవులు, వాణిజ్య నౌకా రవాణా, పర్యావరణ, అటవీ, వన్యప్రాణి, జల సంరక్షణ, తీర రక్షణ, విదేశీ నౌకా నియంత్రణ, ప్రమాదకర వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన అనేక చట్టాలు, నియమాలు తీరప్రాంత పరిరక్షణతో ముడివడి ఉన్నాయి. ప్రాజెక్టులు, పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియలో అడ్డంకిగా ఉన్నాయనే ఉద్దేశంతో సీఆర్‌జెడ్‌ నిబంధనలను పలుమార్లు సవరించారు. దశలవారీగా సవరణలు చేసి చివరికి సీఆర్‌జెడ్‌ నిబంధనలు-2019 తీసుకొచ్చారు. వాటిని సైతం పటిష్ఠంగా అమలుపరచేందుకు అవసరమైన వ్యవస్థలను బలోపేతం చేయడంపై ప్రభుత్వాలు దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో కాగ్‌ బయటపెట్టిన వాస్తవాలు, పరిరక్షణకు చేసిన సిఫార్సులు చర్చనీయాంశంగా మారాయి. తీర ప్రాంత పరిరక్షణకు అమలులో ఉన్న సీఆర్‌జెడ్‌ నిబంధనలు-2019 ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో తీర ప్రాంత ప్రాధికార సంస్థలతో కమిటీలు ఏర్పాటు చేయాలి. అయినప్పటికీ నిర్దేశిత సభ్యులతో జాతీయ స్థాయిలో ప్రాధికార సంస్థను నోటిఫై చేయలేదు. దానివల్ల తీర ప్రకృతి వ్యవస్థల పరిరక్షణకు దీర్ఘకాలిక ప్రణాళికల అమలు కష్టతరమని కాగ్‌ అభిప్రాయపడింది. కొన్ని రాష్ట్రాలు తీర ప్రాంత ప్రాధికార సంస్థలను పునరుద్ధరించడంలో విపరీతంగా జాప్యం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, గోవా, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రాలలో కమిటీల ఏర్పాటులో తాత్సారం చేయడంతోపాటు, నిర్దేశిత విధులను అమలు చేయడానికి సరిపడా సిబ్బంది లేరు. జిల్లా ప్రాధికార సంస్థలకు సంబంధించి 2021 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో అన్ని తీర ప్రాంత జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు కాలేదు. తీర ప్రాంతాల్లో వివిధ పరిశ్రమలు, ప్రాజెక్టులకు పర్యావరణ, సీఆర్‌జెడ్‌ అనుమతుల మంజూరుకు సంబంధించి అమలవుతున్న విధానాలు లోపభూయిష్ఠంగా ఉన్నట్లు కాగ్‌ గుర్తించింది. కేంద్రం గుర్తింపు లేని కన్సల్టెన్సీ సంస్థలు రూపొందించిన పర్యావరణ ప్రభావ మదింపు నివేదికలను పర్యావరణ అనుమతుల ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోవడాన్ని తప్పుపట్టింది. ఈ సంస్థలు పాత సమాచారాన్ని వినియోగిస్తూ- విపత్తులు, ఇతర పర్యావరణ నష్ట ప్రభావాలను సక్రమంగా అంచనా వేయడం లేదని కాగ్‌ విశ్లేషించింది. తీర ప్రాంతాల్లో మడ అడవులు, జీవ వైవిధ్యానికి కలిగే నష్టాలను భర్తీ చేసే ప్రణాళికలను ప్రాజెక్టుల యాజమాన్యాల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తున్నారు. తీర ప్రాంత ప్రకృతి వనరులకు ఏర్పడే ప్రమాదాలను ముందస్తుగా గుర్తించి, చర్యలు చేపట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.

 

సరైన కార్యాచరణ అవసరం

భారత్‌లో తీరప్రాంతంలోని విలువైన వనరులు, జీవవైవిధ్య సంపద, పర్యాటక వాణిజ్యం ద్వారా కోట్ల మందికి ప్రత్యక్ష, పరోక్ష జీవనోపాధి, ఆహార భద్రత లభిస్తాయి. తీర ప్రాంతాలు తుపానుల వంటి విపత్తులను నియంత్రించి, నష్టాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. ఇలాంటి వ్యవస్థలకు కలుగుతున్న హాని మూలంగా విపత్తులతో కలిగే నష్టం పెరిగిపోతుంది. తీరప్రాంతాల పరిరక్షణలో కాగ్‌ గుర్తించిన వ్యవస్థీకృత లోపాలను సరిదిద్దే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా చర్యలు చేపట్టాలి. తీరాల్లో జీవవైవిధ్య పరిరక్షణకు పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలి. ప్రమాదకర వ్యర్థాలను విడుదల చేసే సంస్థలపై కొరడా ఝళిపించడంతోపాటు ప్రాజెక్టులకు అనుమతుల మంజూరులో ఉల్లంఘనలను ముందుగానే గుర్తించేలా వ్యవస్థలను బలోపేతం చేయాలి. అందుకు తీర నియంత్రణ ప్రాధికార సంస్థలకు సరిపడా సిబ్బంది, నిపుణులు, సాంకేతిక, ఆర్థిక వనరులను సమకూర్చాలి. దీర్ఘకాలిక యాజమాన్య ప్రణాళికల రూపకల్పన, అమలు ప్రక్రియలో స్థానికుల భాగస్వామ్యం పెంచాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు దక్కుతాయి.

 

పరిరక్షణలో విఫలం

తమిళనాడు పరిధిలోని గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ దీవుల్లో సజీవమైన పగడపు దిబ్బలు వేగంగా అంతరించిపోయే దుస్థితి నెలకొంది. గుజరాత్‌, గోవాలలో మడ అడవుల పరిరక్షణకు ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు. ఆంధ్ర, గుజరాత్‌ సహా చాలా రాష్ట్రాల్లో తీర ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన మురుగునీటి శుద్ధి ప్లాంట్లపై పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో విషతుల్యమైన రసాయనాలను సముద్ర జలాల్లోకి విడిచి పెడుతున్నాయని కాగ్‌ వెల్లడించింది. 2018లో గుర్తించిన ‘తీవ్రమైన హానికర పరిస్థితులను ఎదుర్కొంటున్న తీర ప్రాంతాల’ పర్యవేక్షణకు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు సమీకృత యాజమాన్య ప్రణాళికలు రూపొందించలేదు. సీఆర్‌జెడ్‌-1 పరిధిలోకి వచ్చే ఆంధ్రప్రదేశ్‌లోని కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆక్వా వ్యర్థాలతో కలుషితం అవుతోంది. ఇక్కడ నిబంధనల ఉల్లంఘనలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సముద్ర జలాల్లోకి రసాయనాలను వదిలే చర్యలను నియంత్రించడంలో కాలుష్య నియంత్రణ మండలి తదితర యంత్రాంగాలు విఫలం చెందినట్లు కాగ్‌ ఆక్షేపించింది. ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని వన్యప్రాణి అభయారణ్యంగా గుర్తించినా- పరిరక్షణ చర్యల్లో వైఫల్యాలను కాగ్‌ బట్టబయలు చేసింది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉగ్రవాద నిరోధం పేరిట కపటనాటకం

‣ ఘనవ్యర్థాల విషవలయంలో పర్యావరణం

‣ అడుగడుగునా ఆంక్షల అడ్డంకి

‣ వరద విధ్వంసం... అభివృద్ధికి విఘాతం

‣ భారత్‌ - రష్యాల వాణిజ్య వృద్ధి

Posted Date: 22-08-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం