• facebook
  • whatsapp
  • telegram

అడుగడుగునా ఆంక్షల అడ్డంకి

అఫ్గాన్‌లో మహిళల హక్కులు మృగ్యం

 

 

గులెస్తాన్‌ సఫారీ... తాలిబన్లు మరోసారి అధికారం చేపట్టక ముందుదాకా అఫ్గానిస్థాన్‌లో మహిళా పోలీసు అధికారిగా పనిచేసేవారు. తాలిబన్ల పునరాగమనం తరవాత పోలీసు శాఖలో మహిళలు పనిచేయడానికి వీల్లేదంటూ హుకుం జారీచేశారు. ప్రస్తుతం ఆమె తన కుటుంబ పోషణకు కాబూల్‌లో ఇతరుల ఇళ్లలో పనిచేస్తున్నారు. మోనెసా ముబారెజ్‌ గతంలో అఫ్గాన్‌ ఆర్థిక మంత్రిత్వశాఖలో విధాన పర్యవేక్షణ విభాగంలో సంచాలకులుగా అత్యున్నత పదవిలో ఉండేవారు. ప్రస్తుతం తాలిబన్ల సర్కారులో మహిళలు ఎవరూ లేకపోగా, ఏకంగా మహిళా వ్యవహారాల మంత్రిత్వశాఖనే రద్దు చేశారు. దాంతో అఫ్గాన్‌లో మహిళల హక్కుల కోసం పోరాటంలో ముబారెజ్‌ ముందు వరసలో నిలిచారు. తమ దేశంలో ఒక యుద్ధం ముగిసినా, తమ హక్కుల కోసం మరో సంగ్రామం మొదలైందని ఆమె చెబుతున్నారు. చివరిసారిగా ఈ ఏడాది(2021) మే 10న ముబారెజ్‌ ఒక ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రస్తుతం వీధుల్లో నిరసనలపై ఆంక్షలు ఉండటంతో, ఇళ్లలోనే సమావేశమై తాలిబన్ల చర్యల పట్ల తమ అసమ్మతిని వ్యక్తపరుస్తున్నారు.

 

తాలిబన్లు రెండోసారి అధికారం చేపట్టాక ఈ ఏడాది కాలంలో అఫ్గాన్‌లో ఆడపిల్లలు చదువుకు, మహిళలు ఉద్యోగ,వ్యాపారాలకు దూరమయ్యారు. లింగ సమానత్వం, మహిళా సాధికారత కోసం పనిచేసే ఐరాస మహిళా విభాగం యూఎన్‌ ఉమెన్‌ సంస్థకు అలీసన్‌ డేవిడియన్‌ అఫ్గాన్‌ ప్రతినిధిగా ఉన్నారు. తమ దేశంలో మహిళల దుస్థితిని ఆమె కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్నారు. ప్రపంచంలో అందరికీ ఇంటి నుంచి కాలు బయటపెట్టడం సాధారణ విషయమని, తమ దేశంలో మాత్రం చాలామందికి అది అరుదైన భాగ్యమని అలీసన్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అఫ్గాన్‌లో మహిళలు దూరప్రయాణాలు చేయాలంటే తప్పనిసరిగా సమీప బంధువుల్లోని పురుషులను వెంట తీసుకెళ్ళాల్సిందే. బాలికలు, మహిళల విషయంలో తాలిబన్ల దుర్విచక్షణ వల్లే చాలా దేశాలు అఫ్గాన్‌పై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఫలితంగా విదేశీ సాయం అందక ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. షరియా చట్టానికి లోబడి అందరి హక్కులనూ పరిరక్షిస్తామనేది తాలిబన్ల మాట. చాలా ముస్లిం దేశాల్లో షరియా చట్టం అమలులో ఉంది. కానీ, అఫ్గాన్‌లో ఉన్నంత కఠినమైన ఆంక్షలు ఇంకెక్కడా లేవు. ప్రపంచం మొత్తమ్మీద బాలికలను ఉన్నత పాఠశాల విద్యకు దూరం చేసిన ఏకైక దేశం అఫ్గానిస్థానే. ఈ ఏడాది మార్చిలో మాధ్యమిక పాఠశాలలను బాలికల కోసం తెరుస్తున్నామని ప్రకటించిన తాలిబన్లు, వెంటనే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకొన్నారు. 

 

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ అఫ్గాన్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ఇటీవల వివరించింది. ‘డెత్‌ ఇన్‌ స్లోమోషన్‌: వుమెన్‌ అండ్‌ గర్ల్స్‌ అండర్‌ తాలిబన్‌’ పేరుతో ఆ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. చదువు, ఉద్యోగాలు, బయటకు వెళ్ళడం, దుస్తులు ధరించడం లాంటి విషయాల్లో మహిళలపై ఉన్న ఆంక్షలను ఆ నివేదిక కళ్లకు కట్టింది. మహిళలు, బాలికలపై కొనసాగుతున్న అఘాయిత్యాలనూ ప్రస్తావించింది. చిన్నవయసులోనే అమ్మాయిలకు బలవంతపు పెళ్ళిళ్లు చేయడం అఫ్గాన్‌లో సర్వసాధారణమైందని వెల్లడించింది. అఫ్గాన్‌లో బాలికల చదువు, మహిళల హక్కుల కోసం అంతర్జాతీయ సమాజం ఆ దేశంపై తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది. మహిళలను ప్రజా జీవితంలోకి, రాజకీయ రంగంలోకి అనుమతించాలని గట్టిగా కోరుతోంది. ఇతర దేశాల ఒత్తిళ్లకు తాలిబన్లు లొంగడంలేదు. ప్రస్తుత దుర్భర పరిస్థితుల్లో ఎప్పటికైనా మార్పు రాకపోతుందా అనే ఆశాభావంతో అఫ్గాన్‌లో మహిళలు భారంగా రోజులు వెళ్ళదీస్తున్నారు.

 

- సంజనా రఘురామ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వరద విధ్వంసం... అభివృద్ధికి విఘాతం

‣ భారత్‌ - రష్యాల వాణిజ్య వృద్ధి

‣ ఆరోగ్య సిరులు చిరుధాన్యాలు

‣ భవిష్యత్తుపై కోటి ఆశలతో...

‣ శాంతి జాడ ఎండమావే!

‣ ఈడీ... రాజకీయ అస్త్రమా?

Posted Date: 19-08-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం