• facebook
  • whatsapp
  • telegram

భవిష్యత్తుపై కోటి ఆశలతో...

75 ఏళ్ల ఒడుదొడుకుల పయనం

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా ఇప్పటిదాకా సాధించిన విజయాలు, ఎదురైన సవాళ్లను అవలోకించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సుస్థిర, సుసంపన్న భవిష్యత్తును నిర్మించుకోవడమెలా గన్నదీ చర్చించుకోవడం సందర్భోచితం. భారత్‌ స్వతంత్ర దేశంగా మనలేదని, ముక్కలుచెక్కలవుతుందని బ్రిటిష్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ శాపనార్థాలు పెట్టారు. ఆయన మాటలు తప్పు అని గడచిన 75 ఏళ్లలో నిరూపితమైంది. స్వాతంత్య్రం సాధించుకొన్న తొలినాళ్లలో దేశ భవిష్యత్తుపై భారతీయులందరిలో ఆశాభావం, ఆత్మవిశ్వాసం ఉట్టిపడ్డాయి. పేదరికం, నిరక్షరాస్యత, అజ్ఞానం, వ్యాధులు, అసమానతలను పరిహరించి సుసంపన్న, ప్రజాస్వామిక, ప్రగతిశీల దేశాన్ని నిర్మించడం మనముందున్న సవాలని, దాని సాకారంలోనే స్వాతంత్య్ర సాఫల్యముందని ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఉద్ఘాటించారు. ఇండియాలో విభిన్న భాషలు, మతాలు, సంస్కృతులు, జీవన శైలులు ఉన్నా భిన్నత్వంలో ఏకత్వమే భారత జాతి విశిష్ట లక్షణమని ఈ 75 ఏళ్లూ రుజువు చేశాయి.

అపరిష్కృత కేసుల కొండ

భారత్‌లో అవిచ్ఛిన్నంగా ప్రజాస్వామ్యం కొనసాగడమే అతిపెద్ద విజయం, ఘనత కూడా. భారత్‌ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడంతోనే 1950లో మహిళలకు ఓటు హక్కు లభించింది. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలకు అప్పటికి ఓటు హక్కు లేదు. స్వతంత్ర భారతంలో ప్రజాస్వామ్య మూలస్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల పనితీరులో కొన్ని సమస్యలు, సవాళ్లు ఉన్నా, గత 75 ఏళ్లలో అవి ఆశాజనకంగానే పనిచేశాయి. వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) వంటి కీలక సంస్కరణ గురించి పార్లమెంటులో అన్ని పార్టీలూ కూలంకషంగా చర్చించిన తరవాతే అది చట్టరూపం దాల్చింది. పార్లమెంటు, శాసనసభల్లో విపక్షాల నిరసనలు, అధికారపక్షం మంకుపట్టు వల్ల సమావేశాలు వాయిదాపడటం ఇటీవలి కాలంలో అధికమయ్యింది. 1970ల దాకా చట్టసభల్లో జాతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలపై లోతైన, వివేకవంతమైన చర్చలు జరిగేవి. ఇటీవలి కాలంలో చర్చల నాణ్యత పడిపోయింది. క్షీణించిన పార్లమెంటు, శాసనసభల విశ్వసనీయతను పునరుద్ధరించి జవజీవాలు తొణికిసలాడే ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకోవడం తక్షణావసరం. సమర్థ, నిష్పాక్షిక న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది. గడచిన 75 ఏళ్లలో భారతీయ న్యాయవ్యవస్థ సంతృప్తికరంగా పనిచేసింది. చరిత్రాత్మక తీర్పులు వెలువరించింది. ఎన్నో ప్రజాహిత వ్యాజ్యాలు (పిల్‌లను) స్వీకరించి కీలక ఆదేశాలు జారీచేసింది. అదే సమయంలో అపరిష్కృత కేసులు కొండలా పెరిగిపోయాయి. న్యాయం సులువుగా, సత్వరంగా చేకూరాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఉద్ఘాటించారు. ఆ రోజు త్వరగా సాకారం కావాలి. దేశార్థిక, సామాజిక అభివృద్ధిలో విదేశాంగ విధానం కీలకమైంది. ఇతర దేశాలతో ప్రయోజనకర సంబంధాలను నెరపడంలో భారత్‌ సఫలమైనా, చైనా నుంచి తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. డ్రాగన్‌ విస్తరణ వాదానికి, వాస్తవాధీన రేఖ వెంట దాని దుందుడుకు చర్యలకు సమర్థంగా అడ్డుకట్ట వేయాలి.

స్వాతంత్య్రానికి పూర్వం ఎదుగూబొదుగూ లేని భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ గుర్తించాయి. రెండు దశాబ్దాల్లో భారత ఆర్థికాభివృద్ధి బాగా పుంజుకొంది. సామాజికాభివృద్ధి సూచికలూ మెరుగయ్యాయి. 1951లో భారతీయుల సగటు ఆయుర్దాయం 32 సంవత్సరాలు. 2022 నాటికి అది 70 ఏళ్లకు పెరిగింది. అదేకాలానికి అక్షరాస్యత రేటు 18శాతం నుంచి 78శాతానికి చేరింది. సాటి బ్రిక్స్‌ దేశాలతో పోలిస్తే చాలా అంశాల్లో ఇండియా వెనకంజలోనే ఉంది. ఆర్థిక, సామాజిక అభివృద్ధి పరంగా భారత్‌, చైనాలు 1970ల్లో ఒకే స్థాయిలో ఉండేవి. ప్రస్తుతం చైనా జీడీపీ భారత్‌ కన్నా అయిదు రెట్లు ఎక్కువ. డ్రాగన్‌కన్నా చవకగా విదేశీ మార్కెట్లకు వస్తుసేవల సరఫరాపై ఇండియా దృష్టి సారించాలి. పారిశ్రామికోత్పత్తిని, సేవల రంగాన్ని ఏకకాలంలో అభివృద్ధి చేయాలి.

సాంకేతికత హవా

భారతీయ బ్యాంకులు నిరర్థక ఆస్తులను వదిలించుకొని, తగినంత మూలధనాన్ని సమకూర్చుకొని గతంలోకన్నా బలోపేతమయ్యాయి. ఆధునిక సాంకేతికతలు, ప్రత్యేకించిన సేవలు, సమర్థ వ్యాపార నిర్వహణలతో బ్యాంకింగ్‌ రంగం అభివృద్ధి పథంలో పురోగమిస్తుందని రిజర్వు బ్యాంకు గవర్నర్‌ ఇటీవల ప్రకటించారు. రాబోయే రోజుల్లో అధునాతన సాంకేతికత, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలు రాజ్యమేలనున్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, విద్యా వైద్యాలు, ఆర్థికం, పర్యావరణం... అన్నీ డిజిటల్‌ వైపు మళ్ళుతాయి. ఆర్థిక సంస్కరణలను డ్రాగన్‌ దేశం వ్యవసాయంతోనే మొదలుపెట్టింది. జనాభాలో సగం మందికి జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని ఆధునికం చేయడం ద్వారానే భారత్‌ సమ్మిళిత అభివృద్ధిని సాధించగలుగుతుంది. ఉపాధి అవకాశాల విస్తరణ, మహిళా సాధికారత, అందరికీ విద్యా వైద్యాలు, పోషకాహార లోపాలను పరిష్కరించడం ద్వారా ఇండియా అసలైన అభివృద్ధి సాధించాలి. 2070నాటికి కాలుష్య ఉద్గారాల కట్టడి హామీని నిలబెట్టుకోవాలి. 2020కల్లా భారత్‌ అభివృద్ధి చెందిన దేశం కావాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం కలగన్నారు. కనీసం 2047కన్నా ఆయన స్వప్నాన్ని సాకారం చేయడానికి పాలకులు పాటుపడాలి.

ఎన్నికల సంస్కరణలు అవసరం

స్వాతంత్య్రం వచ్చాక ఎందరో ప్రధానమంత్రులు ఆర్థిక, సామాజిక రంగాల్లో, దేశ భద్రతలో చెప్పుకోదగిన ఫలితాలు సాధించారు. ప్రభుత్వ విధానాలు బాగున్నా వాటి అమలు మాత్రం సంతృప్తికరంగా ఉండదనే భావన సర్వత్రా వ్యాప్తిలో ఉంది. గడచిన 75 ఏళ్లలో ఎన్నో అవినీతి కుంభకోణాలు దేశాన్ని కుదిపేశాయి. ఎన్నికల వ్యయం భారీగా పెరిగిపోవడంతో నిధుల కోసం అడ్డదారులు తొక్కడం అవినీతికి మూలకారణంగా నిలుస్తోంది. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోంది. సమర్థ ఎన్నికల సంస్కరణలు తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం కావాలి.

ప్రతికూల ప్రభావాలు

స్వతంత్ర భారతంలో మౌలిక వసతుల కల్పన, అధిక ఉపాధి అవకాశాలనిచ్చే పారిశ్రామిక రంగంలో ప్రగతి మందకొడిగా ఉంది. యువజనులకు నైపుణ్యాలు గరపడం, మానవాభివృద్ధి సూచికలు, పర్యావరణ సంరక్షణ రంగాల్లో వెనకబాటు కనిపిస్తుంది. వీటిని సరిదిద్దడానికి తక్షణం ప్రభావశీల చర్యలు చేపట్టాలి. ఏటా ఏడు శాతం వృద్ధి రేటు సాధించే సత్తా భారత్‌కు ఉంది. ప్రపంచ జీడీపీ మందగమనం, అధిక ద్రవ్యోల్బణం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఇండియాపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తున్నాయి. భారత్‌ 2035 నాటికిగానీ కొవిడ్‌ నష్టాలను అధిగమించలేదని రిజర్వు బ్యాంకు తాజా నివేదిక కుండ బద్దలుకొట్టింది. అందువల్ల అభివృద్ధిని వేగవంతం చేయడానికి మధ్యకాలిక, దీర్ఘకాలిక విధానాలను రూపొందించి అమలు చేయాలి. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెరగాలి. ఎగుమతులు అధికమైతే జీడీపీ వేగంగా వృద్ధి చెందుతుంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ శాంతి జాడ ఎండమావే!

‣ ఈడీ... రాజకీయ అస్త్రమా?

‣ పెరగని పంట ఉత్పాదకత

‣ ఇంధన విపణిలో కొత్త భాగస్వామ్యాలు

‣ భారత వాణిజ్య రంగానికి ఆశాకిరణం

‣ పంటకాలువల నిర్వహణలో అశ్రద్ధ

Posted Date: 17-08-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం