• facebook
  • whatsapp
  • telegram

భారత వాణిజ్య రంగానికి ఆశాకిరణం

అంతర్జాతీయ రవాణా నడవా

భారత పరిశ్రమలు పశ్చిమ తీరం నుంచి రష్యా, తూర్పు ఐరోపా, మధ్య ఆసియా దేశాలకు అతి తక్కువ సమయం, ఖర్చుతో తమ ఉత్పత్తులను రవాణా చేసేందుకు అవకాశం లభించనుంది. రష్యాలోని మాస్కో నుంచి రైలులో బయలుదేరిన 39 కంటైనర్ల సరకు ‘అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా నడవా (ఐఎన్‌ఎస్‌టీసీ)’ మార్గంలో కజకిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌ మీదుగా ఇటీవల ఇరాన్‌ చేరింది. తరవాత బందర్‌ అబ్బాస్‌ పోర్టు మీదుగా ముంబయి నౌకాశ్రయానికి చేరుకొంది. భారత్‌, రష్యా, మధ్య ఆసియా, ఐరోపా దేశాల నడుమ దాదాపు 7,200 కిలోమీటర్ల మేర ఈ మార్గంలో సరకు రవాణాకు వీలు కలుగుతోంది. భారత అంతర్జాతీయ వాణిజ్యానికి ఇదో కొత్త మార్గం.

సాధారణంగా భారత్‌నుంచి మధ్య ఆసియాకు సరకులు రవాణా చేయాలంటే పాకిస్థానే ప్రధాన మార్గం. కానీ, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో ఈ మార్గం మూతపడింది. ఐరోపా దేశాలకు సరకు రవాణా చేయాలంటే సూయజ్‌ కాలువే ఆధారం. ఇక జల రవాణాలో కీలకమైన ఈ కాలువతో పాటు టర్కీలోని బాస్ఫొరస్‌ జలసంధిపై పశ్చిమ దేశాలకు బలమైన పట్టు ఉంది. ఆ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో ఎప్పుడైనా ఈ మార్గాలు మూసుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. గతేడాది మార్చిలో ఎవర్‌గివెన్‌ నౌక అడ్డం తిరగడంతో ఎర్ర సముద్రం- మధ్యధరా సముద్రం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి ‘కేప్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌’ మీదుగా వెళ్ళాల్సి వచ్చింది.

భారత్‌, ఇరాన్‌, రష్యాలు వ్యవస్థాపక సభ్యదేశాలుగా 2000 సెప్టెంబర్‌ 12న రవాణాపై జరిగిన యూరో-ఆసియా సదస్సులో ఓ ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీంతో ఐఎన్‌ఎస్‌టీసీ ప్రాజెక్టుకు బీజం పడింది. అనంతరం ఈ ప్రాజెక్టులో తుర్కియే, అజర్‌బైజన్‌, కజకిస్థాన్‌, అర్మీనియా, బెలారస్‌, తజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, ఒమన్‌, ఉక్రెయిన్‌, సిరియాలు సభ్య దేశాలుగా చేరాయి. పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌లూ చేరేందుకు ఆసక్తిగా ఉన్నాయి. ఐఎన్‌ఎస్‌టీసీ ఆసియా దేశాలకు ఓ ఆశాకిరణంలా మారింది. కజకిస్థాన్‌-తుర్క్‌మెనిస్థాన్‌-ఇరాన్‌ రైలుమార్గం 2014 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఐఎన్‌ఎస్‌టీసీ మార్గం 2030 నాటికి ఏటా 2.50 కోట్ల టన్నుల సరకును యూరేషియా-దక్షిణాసియా-గల్ఫ్‌ మధ్య రవాణా చేయగలదన్న అంచనాలు ఉన్నాయి. ఈ మార్గం వినియోగిస్తే రష్యా-భారత్‌ మధ్య సరకు రవాణా వ్యయం 30శాతం తగ్గుతుంది. దూరం 40శాతం వరకు తగ్గిపోతుంది. భారత్‌లోని ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ ఫ్రైట్‌ ఫార్వర్డర్స్‌ అసోసియేషన్స్‌ ఇన్‌ ఇండియా’ నిర్వహించిన సర్వేలో ఈ మేరకు తేలింది.

టెహ్రాన్‌ నుంచి పశ్చిమ ప్రాంతానికి వెళితే తుర్కియే, బాస్ఫొరస్‌ జలసంధి మీదుగా బాల్కన్‌ దేశాలకు చేరవచ్చు. తూర్పు వైపున తుర్క్‌మెనిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, కిర్గిస్థాన్‌ మీదుగా చైనాలోని షింజియాంగ్‌ ప్రావిన్స్‌కు చేరవచ్చు. పాకిస్థాన్‌ను తప్పిస్తూ మన సరకులు మధ్య ఆసియాకు చేరేందుకు ఈ మార్గం ఉపయోగపడుతుంది. మరోవైపు భారత్‌ చాబహార్‌ పోర్టు అభివృద్ధిని వేగవంతం చేసి, దీన్ని ఐఎన్‌ఎస్‌టీసీతో అనుసంధానం చేయాలి. ఈ పోర్టు లక్ష టన్నుల కంటే అధిక సామర్థ్యం ఉన్న నౌకలకు ఆశ్రయం ఇవ్వగలదు. ఇది సాధ్యమైతే సరకు రవాణా మరింత చౌకగా మారే అవకాశం ఉంది. ఈ కారిడార్‌లోని రెండు కీలక దేశాలైన రష్యా, ఇరాన్‌లు అమెరికా ఆంక్షల చట్రంలో ఉన్నాయి. మాస్కో సరకులు పర్షియన్‌ గల్ఫ్‌లోని ఉష్ణజల నౌకాశ్రయాలకు చేరడానికి ఇరాన్‌ అత్యంత చౌక మార్గం. వచ్చే పదేళ్లలో న్యూదిల్లీ-మాస్కో వాణిజ్యం 12 వేల కోట్ల డాలర్లు దాటవచ్చని రష్యాకు చెందిన అల్యూమినియం దిగ్గజం ఒలెగ్‌ డెరిపాస్క్‌ అంచనా వేస్తోంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా అమెరికా ఐఎన్‌ఎస్‌టీసీలో పెట్టుబడులను అడ్డుకొనేందుకు మిగిలిన సభ్యదేశాలపై ఒత్తిడి పెంచే ప్రమాదం ఉంది. ఇటీవల అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన ఐ2యూ2ను ఇరాన్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమిగా అభివర్ణిస్తున్నారు. ఈ కూటమి కార్యకలాపాల విషయంలో భారత్‌ వీలైనంత తటస్థంగా ఉండటమే మేలు. ఇరాన్‌ మళ్ళీ అణుఒప్పందం (జేసీపీఓఏ) కుదుర్చుకొనేందుకు అనువైన వాతావరణం కల్పించడానికి భారత్‌ కృషి చేస్తే మెరుగైన ఫలితాలు ఉండవచ్చు. భవిష్యత్తులో ఐరోపా సమాఖ్యతో న్యూదిల్లీకి స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ మార్గంలో సరకు రవాణా అదనపు బలంగానూ మారుతుంది.

- పి.కిరణ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పంటకాలువల నిర్వహణలో అశ్రద్ధ

‣ స్వరాజ్యం నుంచి సురాజ్యం వైపు...

‣ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం

‣ కుదరని కూర్పు

‣ పరిశోధనలే దన్నుగా పురోగమనం

Posted Date: 15-08-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం