• facebook
  • whatsapp
  • telegram

స్వరాజ్యం నుంచి సురాజ్యం వైపు...

క్విట్‌ ఇండియా రగిలించిన స్వాతంత్య్ర స్ఫూర్తి

మహాత్మాగాంధీ 1942 ఆగస్టు 8న ప్రారంభించిన చరిత్రాత్మక క్విట్‌ ఇండియా ఉద్యమం... 1947 ఆగస్టు 15న వలస పాలన నుంచి భారతదేశం విముక్తం కావడానికి దారితీసింది. బొంబాయి గోవాలియా టాంక్‌ మైదానంలో ‘విజయమో, వీరస్వర్గమో...’ అని గాంధీజీ ఇచ్చిన పిలుపు- దేశమంతా ఒక్కటై బ్రిటిష్‌ పాలనకు చరమాంకం పలకడానికి ప్రేరణగా నిలిచింది. తమను తామే పాలించుకుంటూ తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలనే దృఢ సంకల్పం సమష్టిగా భారతీయుల్లో పాదుకుంది. అదే వారికి కొండంత ఆత్మస్థైర్యం, ఉత్సాహాలను ఇచ్చి ముందుకు నడిపింది. వలస పాలకులను దేశం నుంచి తరిమేయడానికి చోదక శక్తిగా పనిచేసింది. గాంధీజీ క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభించిన 80 ఏళ్లకు ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరిట 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్నాం. దీన్నిబట్టి క్విట్‌ ఇండియా ఉద్యమ విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. ఈ సుదీర్ఘయానంలో స్వతంత్ర భారతం సాధించిన విజయాలను గుర్తుచేసుకుందాం. మనం దాటిన మైలురాళ్లను చూసి గర్వపడదాం. మన ముందున్న సవాళ్లను గుర్తించి వాటిని అధిగమించడానికి కలిసికట్టుగా కృషి చేద్దాం.

అహింసే ఆయుధంగా...

బ్రిటిష్‌ నిరంకుశత్వంపై పోరాటానికి కత్తులు, తుపాకులను కాకుండా అహింసను ఆయుధంగా ప్రయోగించడం గాంధీజీకే చెల్లింది. సహాయ నిరాకరణోద్యమంతోపాటు, స్వాతంత్య్ర పోరాటంలో పలు దశల్లోనూ భారతీయులు అహింసనే అస్త్రంగా ప్రయోగించి ఆశించిన లక్ష్యం సాధించారు. అహింసా మంత్రంతోనే భారతీయులను గాంధీజీ ఏకతాటిపై నడిపించారు. అహింస అనేది భారతదేశ సంస్కృతి, నాగరికతల్లో మొదటినుంచీ అంతర్భాగంగా ఉన్నదే. ఆదర్శంగా ఉన్న అహింసను స్వాతంత్య్ర సమరానికి ఆయుధంగా మలచిన ఘనత గాంధీ మహాత్ముడిదే. స్వాతంత్య్రోద్యమానికి- వందేమాతరం, జై హింద్‌, ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ వంటి నినాదాలు; చర్ఖా, రాఖీ, ఉప్పు, ఖద్దరు వంటి శక్తిమంతమైన ప్రతీకలు అదనపు అస్త్రాలుగా తోడయ్యాయి. జనబాహుళ్యాన్ని స్వాతంత్య్రోద్యమంలో ఉత్సాహంగా ఉద్ధృతంగా పాల్గొనేలా పురిగొల్పాయి. అప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏ పోరాటంలోనైనా అహింసే వ్యూహంగా, ఆయుధంగా విజయం సాధించిన సందర్భం చరిత్రలో మరొకటి లేదు. ఇప్పటికీ గాంధీజీ స్ఫూర్తితోనే ప్రపంచంలో పలు ఉద్యమాలు అహింసాయుతంగా సాగుతున్నాయి. అహింసతో అనుకున్నది సాధించవచ్చునని రాజకీయ కార్యకర్తలు విశ్వసిస్తున్నారు. భారతదేశం మొదటి నుంచీ విదేశీ దండయాత్రలు, దోపిడి, లూటీలను, విధ్వంసాన్ని ఎదుర్కొంటూనే వచ్చింది. ‘విభజించి పాలించు’ సూత్రంతో వలస పాలకులు భారతీయులను విడదీసి బానిసత్వంలోకి నెట్టారు. మధ్య యుగాల నుంచి ఆధునిక కాలం వరకు విదేశీ ముష్కరులపై పృథ్వీరాజ్‌ చౌహాన్‌, ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్‌, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, వీర పాండ్య కట్టబ్రహ్మన, లచిత్‌ బోర్ఫుకన్‌, రాణీ అబ్బక్క వంటివారు సాయుధ పోరాటం జరిపి జాతికి చిరస్మరణీయులయ్యారు. అయితే వీరి వీరోచిత పోరాటాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం. అహింసాయుత స్వాతంత్య్రోద్యమంలా దేశమంతటా ఒకేసారి ప్రజ్వరిల్లినవి కావు.

నవ భారతాన్ని నిర్మించాలి

ఇంతవరకు మనం సాధించిన విజయాల స్ఫూర్తినే- మనం ఎక్కవలసిన శిఖరాలను అందుకోవడానికి ఇంధనంగా ఉపయోగించుకోవాలి. ఎన్నో త్యాగాలు, సుదీర్ఘ పోరాటాల ద్వారా మనం సంపాదించుకున్న స్వరాజ్యం సురాజ్యంగా మారాలనే చైతన్యం దిగువ స్థాయి నుంచే వికసించాలి. పేదరికం, నిరక్షరాస్యత, లింగపరమైన దుర్విచక్షణ, అవినీతి, అసమానతలను రూపుమాపడం మనందరి కర్తవ్యం కావాలి. అసమానతలు అంతరించిన సమాజంలో న్యాయమైన, మంచి పరిపాలన సత్వరాభివృద్ధికి దారితీస్తుంది. ప్రాచీన భారత సమాజం సమానత్వం, ఏకత్వం, సమ్మిళిత అభివృద్ధికి పట్టం కట్టింది. జాతీయవాద స్పూర్తితో మనం ఆ ప్రాచీన సాంస్కృతిక వారసత్వాన్ని ఆధునిక కాలంలోనూ కొనసాగించాలి. మన జాతి సృజనాత్మక శక్తుల్ని ప్రయోగించి పటిష్ఠ, పురోగామి నవ భారతాన్ని సాధించాలి. అందరికీ నాణ్యమైన విద్యను, వైద్యాన్ని అందించడం మన ప్రథమ కర్తవ్యం కావాలి. మాతృభాషలో విద్యాబోధనకు ప్రాధాన్యమిచ్చి ఆ రంగంలో విప్లవం తీసుకురావాలి. నవ నిర్మాణ కృషిలో గ్రామీణ భారతం ముఖ్య పాత్రధారి కావాలి. ప్రభుత్వం, ప్రైవేటు రంగం కలిసి గ్రామాల్లో మౌలిక వసతులను వేగంగా విస్తరించాలి. వాతావరణ మార్పులను నిరోధించి ప్రకృతిని సంరక్షించుకోవాలి. ఇది మన ధర్మమని గుర్తించి సమష్టి కృషి జరపాలి. మన పవిత్ర గ్రంథాలు, మత విశ్వాసాలు ప్రకృతిలో దైవాన్ని చూశాయి. ప్రకృతికి మానవుడికి మధ్య విడదీయరాని బంధం ఉందని చాటాయి. మళ్ళీ మన మూలాలకు వెళ్ళి పర్యావరణ పరిరక్షణకు కంకణబద్ధులం కావాలి. భరతమాత పట్ల ప్రేమాభిమానాలే భారతీయులను స్వాతంత్య్ర పోరాటంలో ఏకతాటిపై నడిపించాయి. వలస పాలకుల దోపిడి, అణచివేతల నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి స్వాతంత్య్ర సమరయోధులు చేసిన అసమాన పోరాటాలు, త్యాగాలను సదా మననం చేసుకుంటూ... భావి భారతాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దాలి. సమానత్వం, సిరిసంపదలతో తులతూగే నవ భారతాన్ని నిర్మించాలి.

పటిష్ఠమైన మూలాలు

విదేశీయులు, వలస పాలకులు ఎంత ప్రయత్నించినా- భరత జాతి సాంస్కృతిక, నాగరికతా మూలాలను దెబ్బతీయలేకపోయారు. ఆ మూలాలే ప్రాచీన కాలం నుంచి ఈ జాతికి ప్రాతిపదికగా నిలుస్తున్నాయి. భారతీయులను అనాదిగా ఐక్యంగా ఉంచుతున్న అంతశ్శక్తులవి. శతాబ్దాల అణచివేత, వలస పాలన నుంచి విముక్తమైన భారతదేశం- నేడు ప్రపంచంలోని ప్రధాన రాజ్యాల్లో ఒకటిగా వెలుగుతోంది. గడచిన 75 ఏళ్లలో స్వతంత్ర భారతం ఎన్నో గణనీయ విజయాలు సాధించింది. శతాబ్దాల పరాయి పాలనలోనూ ఆశ వీడకుండా మొక్కవోని స్థైర్యంతో పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్న భారత్‌ ఇప్పటికీ వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలను అందుకోవడానికి అదే స్పూర్తిని కనబరుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభాశీల మానవ వనరులు మనకున్నాయి. యువజనాధిక్యతను ఉపయోగించి ఆర్థిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మేటిగా నిలవడానికి భారత్‌ కృషిచేస్తోంది. ఇప్పటికే ఘనమైన విజయాలను సాధించినా, అంతటితో విశ్రమించకుండా ప్రపంచంలో అగ్రశ్రేణి ఆర్థిక, రాజకీయ, సైనిక శక్తిగా నిలవడానికి దీక్షగా ముందుకు సాగుతోంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం

‣ కుదరని కూర్పు

‣ పరిశోధనలే దన్నుగా పురోగమనం

‣ మాల్దీవులతో స్నేహబంధం

‣ మూడో ప్రపంచ యుద్ధ భయం!

‣ మిగ్‌ పాపం ఎవరిది?

‣ పశ్చిమాసియాలో ఆధిపత్య పోరు

Posted Date: 09-08-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం