• facebook
  • whatsapp
  • telegram

పశ్చిమాసియాలో ఆధిపత్య పోరు

ఆసక్తిరేపిన బైడెన్‌, పుతిన్‌ పర్యటనలు

పశ్చిమాసియా దేశాల నడుమ దౌత్య, రాజకీయ సంబంధాల్లో ఇటీవల కీలక పరిణామాలు సంభవించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ జులై మూడో వారంలో ఇజ్రాయెల్‌, సౌదీ అరేబియాల్లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. జెడ్డాలో గల్ఫ్‌ సహకార కూటమి (జీసీసీ)+3 సదస్సుకు హాజరైన బైడెన్‌, ఆయా దేశాధినేతలతో చర్చల్లో పాల్గొన్నారు. ఇరాన్‌ అణు నిరాయుధీకరణ, పెట్రో ఉత్పత్తుల పెంపు ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నట్లు ఉమ్మడి ప్రకటనను బట్టి తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఇరాన్‌ను ఏకాకిని చేస్తూ, అరబ్‌ దేశాలతో ఇజ్రాయెల్‌ మైత్రిని మరింత బలోపేతం చేయాలన్నది అంతర్లీనంగా ఉన్న ఎత్తుగడగా కనిపిస్తోంది. బైడెన్‌ సౌదీ పర్యటన ముగించుకున్న మూడు రోజులకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇరాన్‌లో అడుగుపెట్టడం అంతకుమించి ఆసక్తిని రేపింది. రష్యాపై నాటో ఆంక్షలు విధించినప్పటికీ ఆ కూటమిలో సభ్యదేశమైన తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో కలిసి పుతిన్‌ ఇరాన్‌ అగ్రనేతలతో త్రైపాక్షిక భేటీ నిర్వహించారు. రెండు అగ్రదేశాల అధినేతలు తమ ప్రయోజనాల అన్వేషణకు పశ్చిమాసియాను కార్యస్థలంగా ఎంచుకోవడం వేడి రాజేస్తోంది.

ఇరాన్‌ను బూచిగా...

జీసీసీలోని సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్‌, ఒమన్‌, బహ్రెయిన్‌, కువైట్‌తో పాటు ఇరాక్‌, ఈజిప్ట్‌, జోర్డాన్‌ దేశాలు (జీసీసీ+3) పూర్తిస్థాయి శక్తి సామర్థ్యాలను వినియోగించి భావితరాల ఇంధన అవసరాలు తీర్చాలని బైడెన్‌ అభిలషించారు. రక్షణ, నిఘా సమాచార వ్యవస్థల పటిష్ఠీకరణ, పశ్చిమాసియా ప్రాంతీయ సమగ్రత, సుస్థిరతకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అక్కడి పేద దేశాల్లో ఆహార భద్రతకు 100 కోట్ల డాలర్ల ప్యాకేజీ ప్రకటించారు. ఇరాక్‌-సౌదీ విద్యుత్‌ గ్రిడ్‌ అనుసంధానం, సౌదీ-ఇజ్రాయెల్‌ మధ్య నేరుగా విమానాల రాకపోకలు వంటి ప్రాజెక్టులు పట్టాలెక్కడం కొత్త పరిణామాలు. ఇంధన, అంతరిక్ష, వైద్య పరిశోధనలు, 5జీ, 6జీ సాంకేతికత అభివృద్ధిలో కలిసి సాగాలంటూ సౌదీతో 18 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొత్తంగా సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సుల్తాన్‌ (ఎంబీఎస్‌)తో కలిసి విజన్‌-2030ని ఆవిష్కరించారు. ఇటీవలే యూఏఈ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌తోనూ పలు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. అయితే, ఈ డిక్లరేషన్ల కంటే బైడెన్‌ పర్యటించిన సమయం, ఆ సందర్భంగా ఆవిష్కృతమైన సన్నివేశాలే మీడియా దృష్టిని ఎక్కువగా ఆకర్షించాయి. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాకు వ్యతిరేకంగా ఈ కూటమి వైఖరిని మార్చాలన్న బైడెన్‌ ఆశ నెరవేరలేదు. ఇప్పటికీ సౌదీ, యూఏఈలు తటస్థ విధానాన్నే అవలంబిస్తున్నాయి. జెడ్డాలో అడుగిడిన అగ్రరాజ్యాధినేతకు సాధారణ ఆహ్వానమే దక్కింది. నాలుగేళ్ల క్రితం జరిగిన పాత్రికేయులు ఖషొగ్గీ హత్యోదంతాన్ని బైడెన్‌ ప్రస్తావించగా, ఎంబీఎస్‌ తిప్పికొట్టిన తీరూ అగ్రరాజ్యం తీరును ప్రశ్నార్థకం చేసింది. తాజాగా ఇజ్రాయెల్‌ పర్యటనలో పాలస్తీనా భూభాగమైన వెస్ట్‌ బ్యాంకును సందర్శించిన బైడెన్‌ ఇరుదేశాల నడుమ క్షేత్రస్థాయి పరిస్థితులు శాంతి స్థాపనకు అనుకూలంగా లేవని దాటవేశారు. పాలస్తీనాకు ఆర్థిక సాయానికి హామీ ఇచ్చారు తప్ప, వివాద పరిష్కారంపై స్పందించలేదు. షియాల ప్రాబల్యమున్న ఇరాన్‌ను బూచిగా చూపుతూ సున్నీ అరబ్‌ దేశాలతో యూదు ఇజ్రాయెలీ మైత్రిని బలోపేతం చేయడమే అగ్రరాజ్యం ఎజెండాగా అవగతమవుతోంది.

ఆంక్షల్లో సారూప్యత...

పశ్చిమ దేశాల ఆంక్షలు ఎదుర్కోవడంలో సారూప్యతలున్న ఇరాన్‌, రష్యాలు చేరువ కావడం అనూహ్యమేమీ కాదు. పైగా రష్యా ప్రస్తుతం రాజకీయ, వాణిజ్య, సైనిక మద్దతు కోసం చైనా, ఇరాన్‌, భారత్‌, ఇతర ఆసియా దేశాల వైపు చూస్తోంది. ఈ క్రమంలోనే పుతిన్‌- తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో కలిసి ఇరాన్‌ అగ్రనేత అయతుల్లా, అధ్యక్షుడు ఇబ్రహిం రైసీలతో త్రైపాక్షిక చర్చలు జరిపారు. పశ్చిమాసియా నుంచి బైడెన్‌ వెనుదిరిగిన వెంటనే వీరు టెహరాన్‌లో కాలూనడం గమనార్హం. ఇప్పటికే రష్యాకు ఇరాన్‌ మానవ రహిత డ్రోన్లు, యుద్ధ సామగ్రిని అందజేస్తుండగా- ఇరుదేశాల నడుమ చమురు, గ్యాస్‌ సరఫరాల నిమిత్తం భూతలంలోనే భారీ పైప్‌లైన్‌ నిర్మించుకోవాలని నిర్ణయించారు. షాంఘై సహకార సంఘంలో ఇరాన్‌కు శాశ్వత సభ్యత్వం దక్కేలా అడుగులు పడ్డాయి. తన చమురు ఉత్పత్తుల సరఫరాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించినందువల్ల తూర్పు దేశాల్లో మార్కెట్‌ను పెంచుకోవాలని, ఇందుకు టెహరాన్‌ సహకారం అవసరమని రష్యా భావిస్తోంది. అదే సమయంలో రష్యా నుంచి పడిపోయిన సరఫరాను గల్ఫ్‌ దేశాల ద్వారా భర్తీ చేసుకోవాలని జీసీసీపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. మొత్తానికి పశ్చిమాసియా అగ్రరాజ్యాలకు మరోసారి ప్రయోగశాలగా మారుతుందా అన్న అనుమానం కలుగుతోంది.

సమతుల్యమే ఇండియా కర్తవ్యం

ప్రధాని మోదీ హయాములో పశ్చిమాసియాతో భారత్‌ సంబంధాలు గతంలో ఎప్పుడూ లేనంతగా బలపడ్డాయి. గల్ఫ్‌ కూటమి, ఇరాన్‌, ఇజ్రాయెల్‌, పాలస్తీనాలతో ఇండియా సమతుల్యం పాటిస్తోంది. సుమారు 90 లక్షల ప్రవాసీయులు అరబ్‌ నేల నుంచే భారత్‌కు అత్యధిక విదేశీ మారకాన్ని పంపిస్తున్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించే మరో క్వాడ్‌ పురుడు పోసుకుంటోంది. బైడెన్‌ ఇజ్రాయెల్‌లో పర్యటించిన సమయంలో భారత్‌, యూఏఈ దేశాధినేతలతో వర్చువల్‌గా ‘ఐ2యూ2 సదస్సు’ నిర్వహించి ఆరు కీలక రంగాల్లో కలిసి సాగాలని పిలుపివ్వడం అందులో భాగమే. అయితే ఇరాన్‌పై ఆంక్షలను భారత్‌పై రుద్దడమే ఆక్షేపణీయం.

దక్కని హామీ

అమెరికాలో మిడ్‌ టర్మ్‌ ఎన్నికలు జరిగే నవంబర్‌ నాటికి చమురు ధరలు నియంత్రణలోకి తీసుకురావాలన్నా, మార్కెట్‌లో నిల్వలు విరివిగా అందుబాటులో ఉండాలన్నా, ఒపెక్‌ ప్లస్‌ దేశాలు ఉత్పత్తిని పెంచడమే మార్గం. కానీ, బైడెన్‌కు ఇదమిత్థమైన హామీ లభించలేదు.

పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ ఆక్రమణ, పౌరులపై కాల్పులు, అరబ్‌ దేశాల్లో రాచరిక పాలనను బైడెన్‌ పశ్చిమాసియా పర్యటనలో ప్రస్తావించలేదు. పైగా ‘వాషింగ్టన్‌ పోస్టు’ పాత్రికేయులు ఖషొగ్గీ హత్యకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న నేటి సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సుల్తాన్‌ను నేరుగా ప్రశ్నించడం విమర్శలకు తావిచ్చింది.

అణ్వస్త్రాల వ్యాప్తి నిరోధకంపై ఇరాన్‌తో 2015లో ఒబామా హయాంలో కుదిరిన ఒప్పందాన్ని అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన బైడెన్‌, నేడు తద్భిన్నంగా వ్యవహరించారు. ఇరాన్‌పై దశాబ్దాలుగా విధిస్తున్న ఆంక్షలను కఠినం చేస్తూ ట్రంప్‌ సర్కారు 2018లో ఈ ఒడంబడిక నుంచి వైదొలగగా, బైడెన్‌ కూడా అదే బాటలో నడిచారు.

- బోండ్ల అశోక్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బ్రిటన్‌ ప్రధాని ఎన్నికపై ఉత్కంఠ

‣ లాటిన్‌ అమెరికాలో డ్రాగన్‌ పాగా

‣ కదన రంగాన కొదమ సింహాలు

‣ విపత్తుల ముట్టడిలో కన్నీళ్ల సాగు

Posted Date: 02-08-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం