• facebook
  • whatsapp
  • telegram

లాటిన్‌ అమెరికాలో డ్రాగన్‌ పాగా

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో దూకుడు

ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ప్రపంచం- అమెరికా, సోవియట్‌ శిబిరాలుగా విడిపోయింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌ యుద్ధం మూలంగా అమెరికా, నాటో దేశాలు ఒకవైపు; రష్యా, చైనా మరోవైపు మోహరించి ప్రపంచంపై పట్టు కోసం పోటీపడే వాతావరణం ఏర్పడుతోంది. ఇప్పటికే ఆసియా, ఆఫ్రికాలలో బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పథకం పేరుతో చొచ్చుకుపోతున్న చైనా- అమెరికాకు పెరడు లాంటి దక్షిణ (లాటిన్‌) అమెరికా ఖండంలోనూ పాగా వేస్తోంది. లాటిన్‌ అమెరికాలో ఇప్పటిదాకా క్యూబా, వెనెజ్వెలాలు మాత్రమే వామపక్ష ప్రభుత్వాలను చూశాయి. ప్రస్తుతం చిలీ, పెరూ, కొలంబియాలలోనూ వామపక్ష భావజాలంగల సర్కార్లు ఎన్నికయ్యాయి. లాటిన్‌ అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన బ్రెజిల్‌ సైతం అక్టోబరు అధ్యక్ష ఎన్నికల్లో వామపక్షీయుడిని ఎన్నుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వామపక్ష ప్రభుత్వాల ఏర్పాటు లాటిన్‌ అమెరికాలో చైనా పాగా వేయడానికి, అమెరికాకు పొగపెట్టడానికి దారితీస్తుంది.

దక్షిణ అమెరికా ఖండంలో చిరకాలంగా అమెరికా మద్దతుతో ఏర్పడిన మితవాద ప్రభుత్వాలు అవినీతికి ఆలవాలంగా పేరుపడ్డాయి. సమాజంలో అసమానతలు తారస్థాయికి చేరాయి. మొక్కజొన్న, సోయాబీన్‌ వంటి ఆహార ధాన్యాలు, చమురు, చెరకు, ఇతర ముడిసరకుల ఎగుమతి ద్వారా ఆర్జించిన మొత్తాలతో పరిస్థితి కొంత మెరుగుపడినా, కొవిడ్‌ దెబ్బతో పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. అమెరికా తమను ఆదుకోవడం లేదని లాటిన్‌ అమెరికా వాసులు భావిస్తున్నారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ఖండిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడానికి అయిదు లాటిన్‌ అమెరికా దేశాలు నిరాకరించాయి. లాటిన్‌ అమెరికా దేశాల నుంచి వలస వెళ్ళేవారిపై అగ్రరాజ్యం ఉక్కుపాదం మోపడం ఆయా దేశాల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. ఐరోపా సైతం తమకు చేసేదేమీ లేదని లాటిన్‌ అమెరికా వాసులు రుసరుసలాడుతున్నారు. అత్యధిక లాటిన్‌ అమెరికా దేశాలు సభ్యులుగా, సహ సభ్యులుగా ఉన్న మెర్కోసుర్‌ సంఘంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఐరోపా సమాఖ్య (ఈయూ) తాత్సారం చేస్తూ వచ్చింది. అంతలో ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ఈయూకు లాటిన్‌ అమెరికాను పట్టించుకొనే తీరిక లేకుండా పోయింది. లాటిన్‌ అమెరికాలో అమెరికా, ఐరోపాల ప్రాచుర్యం తగ్గుతుండగా, చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకొంటోంది. పెరూ, చిలీ, కోస్టారికాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకొని 21 లాటిన్‌ అమెరికా దేశాలను బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పథకంలో భాగస్వాములను చేయడానికి దూసుకెళ్తోంది. 2002లో చైనా-లాటిన్‌ అమెరికాల మధ్య 1800 కోట్ల డాలర్ల మేర వాణిజ్యం జరిగింది. అది అంతకంతకు పెరుగుతోంది. అమెరికాలాగా విపరీత నిబంధనలు విధించకుండా చైనా బేషరతుగా సాయం చేస్తోంది. నిజానికి చైనా షరతులు బయటికి కనపడవు. అది తెలిసేసరికే డ్రాగన్‌ ఆర్థికంగా, సైనికంగా పట్టు పెంచుకొంటుంది. ఇప్పుడు చైనాయే లాటిన్‌ అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.

అర్జెంటీనాలో చైనా సహకారంతో నిర్మించిన 300 మెగావాట్ల సౌరశక్తి పార్కు లాటిన్‌ అమెరికాలోనే అతిపెద్ద సౌర క్షేత్రాల్లో ఒకటి. విద్యుత్తు వాహనాలు, స్మార్ట్‌ఫోన్ల వంటివాటికి కావాల్సిన లిథియం, రాగి, జింక్‌ తదితర లోహాలను లాటిన్‌ అమెరికా నుంచి చైనా దిగుమతి చేసుకొంటోంది. అగ్రరాజ్యం ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌ యుద్ధాల్లో మునిగితేలుతూ లాటిన్‌ అమెరికాను అలక్ష్యం చేయడం చైనాకు కలిసివచ్చింది. బ్రెజిల్‌, అర్జెంటీనా, బొలీవియా, ఈక్వెడార్‌, వెనెజ్వెలాలలో వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి లాటిన్‌ అమెరికాలో చైనా విస్తరణ మొదలైంది. అక్కడ ఎన్నో రహదారి, విద్యుత్‌, రైలు, వంతెన ప్రాజెక్టులను విరివిగా చేపట్టింది. కొలంబియా రాజధాని బొగోటాలో ఒక చైనా కంపెనీ మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మిస్తోంది. బ్రెజిల్‌లో కోటి కుటుంబాలకు విద్యుత్తును సరఫరా చేసే సంస్థ చైనీయుల యాజమాన్యంలోనిదే. లాటిన్‌ అమెరికాకు కొవిడ్‌ టీకాలను అందించడానికి అమెరికా, ఐరోపాలు మొరాయిస్తే చైనా సరఫరా చేసింది. బీజింగ్‌ ఔదార్యం చివరకు లాటిన్‌ అమెరికాపై పెత్తనంగా పరిణమిస్తుందనే భయాలున్నా, ప్రస్తుతం డ్రాగన్‌ దూకుడును అడ్డుకునేవారే లేరు!

- ప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కదన రంగాన కొదమ సింహాలు

‣ విపత్తుల ముట్టడిలో కన్నీళ్ల సాగు

‣ ఉరుముతున్న ఆర్థిక సంక్షోభం

‣ ‘సీపెక్‌’కు నిధుల కటకట

‣ జీవవైవిధ్యం... మనుగడకు ఆధారం!

‣ కష్టాల కడలిలో లంక ఎదురీత

Posted Date: 02-08-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం