• facebook
  • whatsapp
  • telegram

ఉరుముతున్న ఆర్థిక సంక్షోభం

ప్రపంచం ముంగిట మాంద్యం ముప్పు

 

 

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు ఏమాత్రం బాగాలేవు. వచ్చే ఏడాది తీవ్ర ఆర్థిక మాంద్యం చుట్టుముడుతుందని అందరూ భయపడుతున్నారు. కొవిడ్‌ లాక్‌డౌన్ల కారణంగా స్తంభించిన ఆర్థిక రంగాన్ని పునరుత్తేజితం చేయడానికి ప్రభుత్వాలు భారీగా డబ్బు వెదజల్లాయి. ఆ ఉద్దీపన వల్ల ధరలు పెరిగాయి. దీంతో మార్కెట్లో ద్రవ్య లభ్యతను కట్టడి చేయడానికి కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. కొవిడ్‌ ఇప్పటికీ విడతలవారీగా తలెత్తుతూ ఆర్థిక, రాజకీయ, సామాజిక అనిశ్చితిని పెంచుతోంది. ప్రధాన దేశాల్లో ద్రవ్యోల్బణం ఇప్పుడు ఆరు నుంచి 10 శాతం వరకు పెరిగింది. అమెరికాలో గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ద్రవ్యోల్బణం 8.6 శాతానికి చేరింది. అంతర్జాతీయ ముడి సరకుల ధరలు, రవాణా ఛార్జీలు ఇటీవల కాస్త తగ్గడంతో ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందన్న ఆశలు రేకెత్తాయి. అదే సమయంలో రాగి వంటి మౌలిక లోహాల ధరలు తగ్గినందువల్ల ప్రపంచమంతటా గిరాకీ తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. అంటే పారిశ్రామికోత్పత్తి మందగించే అవకాశం ఉందన్నమాట. వస్తుసేవలకు గిరాకీ తగ్గితే ఉపాధి, వ్యాపారాలు దెబ్బతింటాయి. గిరాకీ పడిపోయినప్పుడు పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యంలో చాలా భాగం నిరుపయోగమవుతుంది. 1940లలో మొత్తం ఉపాధి అవకాశాల్లో 40 శాతం ఉద్యోగాలు పారిశ్రామిక రంగంలోనే ఉండగా, ఇప్పుడది తొమ్మిది శాతానికి తగ్గింది. పారిశ్రామిక ఉద్యోగాలు చైనా, వియత్నాం వంటి అతి కొద్ది దేశాలకే పరిమితమయ్యాయి. చైనా అపార పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకున్నందు వల్ల ఇతర దేశాలు దానితో పోటీపడలేకపోతున్నాయి. ఇది చాలదన్నట్లు అధునాతన సాంకేతికతలు మానవ సిబ్బంది అవసరాన్ని తగ్గించేస్తూ రోబోలు, స్వయంచాలన యంత్రాల పాత్రను పెంచుతున్నాయి. ఆయా పారిశ్రామిక విభాగాలు అతి కొద్ది సంస్థల గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోయాయి. దీనంతటి వల్ల కొత్త ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రావడం లేదు.

 

రుణాల ఎగవేతకు అవకాశం

ఇప్పటికే కొవిడ్‌ వల్ల సరఫరా గొలుసులు విచ్ఛిన్నమై వస్తు సరఫరా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ఆహార ధాన్యాలు, చమురు సరఫరా కూడా పడిపోయి వాటి ధరలు విజృంభించాయి. కొవిడ్‌ కాలంలో కేంద్ర బ్యాంకులు ఉద్దీపన కింద స్వల్ప వడ్డీరేట్లకు భారీ రుణాలివ్వగా ఆ డబ్బు స్టాక్‌ మార్కెట్లలోకి, స్థిరాస్తి, క్రిప్టో కరెన్సీ రంగాల్లోకి ప్రవహించింది. వచ్చే ఏడాది కనుక ఆర్థిక మాంద్యం వచ్చిపడితే ఈ రంగాలన్నీ దెబ్బతింటాయి. 1997 ఆగ్నేయాసియా సంక్షోభం, 2008 ఆర్థిక సంక్షోభం వంటిది మళ్ళీ వచ్చిపడుతుందేమోననే ఆందోళన పెరుగుతోంది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితిలో ఏర్పడిన అనిశ్చితి ఇప్పుడప్పుడే తొలగేలా లేదు. బాండ్ల మార్కెట్‌ను చూస్తే ఈ అంశం తేటతెల్లమవుతుంది. ఒకవైపు ధరలు పెరుగుతుంటే రెండోవైపు బ్యాంకులు రుణాలివ్వడం తగ్గించాయి. పైగా అధిక వడ్డీరేట్లను వసూలు చేస్తున్నాయి. దీనివల్ల వినియోగదారుల చేతిలో డబ్బు ఆడక వస్తుసేవలకు గిరాకీ తగ్గిపోతోంది.

 

మితిమీరి పెరిగిన ద్రవ్యలభ్యతను కట్టడి చేయడానికి అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లను పెంచడంవల్ల- భారత్‌తో పాటు అనేక దేశాల నుంచి పెట్టుబడులు అమెరికాకు తరలిపోయాయి. డాలర్‌ విలువ విపరీతంగా పెరిగిపోవడంతో డాలర్లలో తీసుకున్న పాత అప్పులు మరీ భారమైపోయాయి. అందుకే పలు లాటిన్‌ అమెరికా దేశాలు రుణ కిస్తీలను కట్టలేక ఎగనామం పెట్టాయి. వర్ధమాన దేశాలు రాగల ఏడాది కాలంలో 25,000 కోట్ల డాలర్ల రుణ బకాయిలను చెల్లించాల్సి ఉంది. తాజాగా శ్రీలంక రుణ కిస్తీల ఎగవేతకు పాల్పడింది. అప్పుల భారం పెరిగి, కరెన్సీ విలువ పడిపోవడం వల్ల ఎల్‌ సాల్వడార్‌ బిట్‌ కాయిన్‌ను అధికార కరెన్సీగా ప్రకటించింది. ప్రపంచంలో ఇలాంటి చర్య తీసుకున్న మొట్టమొదటి దేశం ఎల్‌ సాల్వడారే. పాకిస్థాన్‌, ఈజిప్ట్‌, ఘనా, ట్యునీషియాలు తమ విదేశీ రుణాల్లో 20 శాతాన్ని త్వరలోనే తీర్చాల్సి ఉంది. కానీ, అవి కూడా ఎగవేత మార్గం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

ధరల భారం

ఆహారం, చమురు ధరలు పెరిగిపోతూ సామాన్యుడిపై భారం పెంచేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితికి అనుబంధమైన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) వార్షిక ఆహార ధరల సూచీ నిరుడు 23 శాతం మేర పెరిగింది. ప్రపంచ బ్యాంకు ఆహార సరకుల ధరల సూచీ రెండేళ్ల క్రితంకన్నా 80 శాతం పెరిగింది. ఈ సూచీ 2022 మార్చి-ఏప్రిల్‌లో గరిష్ఠ స్థాయిని అందుకుంది. వ్యవసాయ సరకుల ధరలు మిన్నంటడంతో ఆసియా, ఆఫ్రికాలలో ఆకలి బాధలు పెరిగిపోతున్నాయి. ఆసియాలో 2021లో 4.25 కోట్లమంది ఆకలిబాధకు లోనయ్యారని ప్రపంచ ఆహార, భద్రత, పోషకాహార సంస్థ (ఎస్‌ఓఎఫ్‌ఐ) నివేదిక వెల్లడించింది. అన్నార్తుల సంఖ్య 2019లో 3.39 కోట్లు. అది 2020లో 3.98 కోట్లు. ఈ లెక్కన క్షుద్బాధా పీడితుల సంఖ్య ఏటా పెరిగిపోతోందని రూఢి అవుతోంది. నిరుడు ప్రపంచమంతటా పోషకాహార లోపంతో కృశిస్తున్నవారి సంఖ్య ఆరు శాతం పెరిగి 7.68 కోట్లకు చేరిందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఆహార ధరలు పెరగడం భారతీయులనూ ఇబ్బంది పెడుతోంది. భారతీయులు ఏడాదికి 2.5 కోట్ల టన్నుల వంటనూనెలు వాడుతున్నారు. అంటే తలసరి వినియోగం ఏడాదికి 16.5 కిలోలన్నమాట. ఇది అమెరికాలో 8.4, చైనాలో 9.5 కిలోలు మాత్రమే. ఇంతాచేసి భారత్‌ 1.1 కోట్ల టన్నుల వంట నూనెలను మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతోంది. మిగతాదంతా విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటోంది. అంతర్జాతీయంగా వంటనూనెల ధరలు పెరగడం భారతీయుల జేబుకు చిల్లి పెడుతోంది. వంట నూనెలు, ముడి చమురు దిగుమతులు భారతదేశ ఖజానాకు బొర్రె పెడుతున్నాయి. గడచిన 10 నెలల్లో భారత్‌ కేవలం వంటనూనెల దిగుమతికే రూ.90,000 కోట్లను వెచ్చించింది. వంట నూనె అవసరాల్లో 60 శాతానికి, ముడిచమురు విషయంలో 90 శాతానికి దిగుమతులే ఆధారం. ఈ పరిస్థితిలో భారతీయులు ఖర్చులు, రుణ భారం తగ్గించుకుని పొదుపు పెంచుకోవాలి. ప్రజలు, ప్రభుత్వం ఆర్థిక సంయమనం పాటించకపోతే ఏమవుతుందో తెలుసుకోవాలంటే- శ్రీలంకను చూడాలి.

 

అన్ని రంగాల అనుసంధానం

గతానికి భిన్నంగా నేడు ప్రపంచ దేశాల ఆర్థిక సాంకేతిక రంగాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఏదైనా దేశంలో ఆర్థిక సంక్షోభం సంభవిస్తే దాని ప్రభావం ప్రపంచమంతటికీ వేగంగా విస్తరిస్తోంది. నేడు అమెరికా తన బ్యాలన్స్‌ షీటును వారానికి 500 కోట్ల డాలర్ల చొప్పున తగ్గించుకుంటూ వస్తోంది. దీనికే ప్రపంచమంతటా ప్రకంపనలు వ్యాపిస్తున్నాయి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ‘సీపెక్‌’కు నిధుల కటకట

‣ జీవవైవిధ్యం... మనుగడకు ఆధారం!

‣ దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ డిగ్రీ కళాశాలలు

‣ కోరుకున్న కోర్సులకు ఇదుగో ఇగ్నో!

‣ ప‌క్కాగా ప‌రిచ‌యం!

‣ సరైన నిర్ణయం తీసుకోవడానికి కొన్ని సూత్రాలు

Posted Date: 29-07-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం