• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప‌క్కాగా ప‌రిచ‌యం!

చ‌క్క‌ని రెజ్యూమ్‌ త‌యారీకి సూచ‌న‌లు

ఉద్యోగ పోటీలో నెగ్గాలంటే మిమ్మల్ని స్పష్టంగా పరిచయం చేసే రెజ్యూమె ప్రధానం. దీనిలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, అభిరుచులు.. రెండు పేజీల్లో నింపేస్తే చాలు. కావాల్సివస్తే గూగుల్‌లో నచ్చిన ఫార్మాట్‌లను అనుసరిస్తే సరి అనుకుంటాం. నిజానికి రెజ్యూమెలో తెలియజేసే వివరాలే మనకు ఉద్యోగాన్ని తెచ్చిపెడతాయి. అనుభవం, చక్కని నైపుణ్యాలు ఉన్నప్పటికీ వాటిని సరిగా పొందుపరచకపోతే అరుదైన అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముంది! ఇంత ప్రాముఖ్యమున్న రెజ్యూమెలోని మూడు ఫార్మాట్ల గురించి తెలుసుకుందాం!


ఫ్రెషర్స్‌ నుంచి అపార అనుభవం ఉన్న నిపుణుల వరకు, ఇతర ప్రత్యేక అర్హతలననుసరించి రెజ్యూమె ఫార్మాట్‌ మారిపోతుంటుంది. ఇలా కొత్తతరహా ఫార్మాట్లలో ఉండే వ్యత్యాసాన్ని ముందుగానే గమనించి, అనుసరిస్తే మిమ్మల్నే ఉద్యోగంలోకి ఎందుకు తీసుకోవాలనేదానిపై రిక్రూటర్లకు స్పష్టత ఏర్పడుతుంది.


రెజ్యూమె కాకుండా ‘సీవీ’ అనడం కూడా వినేవుంటాం. సీవీ.. పూర్తిరూపం ‘కరిక్యులమ్‌ వీటే’. దీనికి ఇన్ని పేజీలంటూ పరిమితుల్లేవు. ఇందులో మీ భవిష్యత్తుపై సమగ్ర వివరాలుంటాయి. అకడమిక్‌ ప్లేస్‌మెంట్‌లు/ విద్యార్హతల్ని అనుసరించి ఇచ్చే ఉద్యోగాల కోసం మాత్రమే దీన్ని ఉపయోగిస్తాం. పేరు, అడ్రసు, సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌ వంటి వ్యక్తిగత వివరాలు, చదువు, వృత్తిరీత్యా అనుభవం, భాష, కంప్యూటర్‌/టెక్నికల్‌ నైపుణ్యాలు, అభిరుచులు/ఆసక్తి ఉన్న విషయాలు, ఇతర ప్రత్యేకతలు, పరిశోధనానుభవం, విద్యేతర నైపుణ్యాలు, రిఫరెన్స్‌.. తదితర సమాచారం ఉంటుంది. జాతీయస్థాయిలోనేకాక అంతర్జాతీయస్థాయి ఉద్యోగాల కోసమూ దరఖాస్తు చేసుకునే ఉత్తమ సాధనం సీవీ. రెజ్యూమె కన్నా ఇది వివరణాత్మకమైనది, సమగ్రమైనది. పైగా వృత్తిపరమైన విషయాలకే ఇందులో ఎక్కువ ప్రాధాన్యం.


 

మూడు రకాలు

రెజ్యూమె అనేది రెండుపేజీలకే పరిమితం. ఇది ఉద్యోగానికీ¨/ ఉద్యోగాన్ని అందించే సంస్థకూ కావాల్సిన సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. ఏ ఉద్యోగానికి  దరఖాస్తు చేసుకోవాలన్నా, కొన్ని మార్పులు చేర్పులు మినహా ఈ ఫార్మాట్‌నే వినియోగిస్తాం. ఇందులో సంప్రదించేందుకు వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌/ఈ-మెయిల్, విషయం, విద్యార్హతలు, పని అనుభవం, నైపుణ్యాలు, ఇతర వివరాలు (అవార్డులు/ కోర్సులు/ సర్టిఫికెట్లు/ ఆసక్తి కలిగించే అంశాలు) ఉంటాయి. రెజ్యూమె ప్రధానంగా మూడు రకాలు.  

క్రోనలాజికల్‌ రెజ్యూమె

ఒక రంగంలో ఐదేళ్లకు మించిన అనుభవం మీకుంటే ఈ ఫార్మాట్‌ను అనుసరించండి. ఇందులో ముందుగా ప్రస్తావించేది.. మీ వృత్తినైపుణ్యాలే! తాజాగా పనిచేసిన సంస్థల వివరాలను నిర్వర్తించిన విధులు, చూపిన ప్రతిభాపాటవాలు, సామర్థ్యాలను విశదీకరిస్తుంది. ఉద్యోగ వివరాల సమాచారం ఈ రెజ్యూమెలో కీలకం. డేటాను సేకరించడం, ఎడిట్‌ చేసి, రిపోర్ట్‌ చేయడం, కంప్యూటింగ్‌లాంటి ప్రాక్టికల్‌ నైపుణ్యాలతోపాటు, నిర్దేశిత సమయంలో పూర్తిచేయగల శ్రద్ధ, సమయపాలన లాంటి సాఫ్ట్‌ స్కిల్స్‌ను నైపుణ్యాల జాబితాలో చేరుస్తుంది. మీరు పూర్తిచేసుకున్న డిగ్రీస్థాయి విద్యార్హతల్ని, అలానే ఏదైనా సర్టిఫికెట్‌ కోర్సును పూర్తి చేసి ఉంటే, ఆ వివరాలన్నంటినీ ఇది తెలియజేస్తుంది.


ఫంక్షనల్‌ రెజ్యూమె

ఫ్రెషర్స్‌ లేదా మొదటిసారి ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు ఈ ఫార్మాటే సోపానం. సంస్థ ఆశించే స్థాయిలో మీరు నిర్దేశించుకున్న భవిష్యత్తు ఉద్యోగ లక్ష్యాలను, మీలోని అత్యుత్తమ నైపుణ్యాలను పేరా నిడివిలో సంక్షిప్తీకరించాలి. వృత్తిపరమైన నైపుణ్యాలు, క్లిష్టసమయాల్లో చాకచక్యంగా వ్యవహరించగల నైపుణ్యాలపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది ఈ రెజ్యూమె. ఇంతకుముందు పనిచేసిన అనుభవాలను సంస్థలవారీగా పొందుపరచాలి. ఇంటర్న్‌షిప్‌ చేసి ఉంటే ఆ కోర్సు వివరాలను, ఇతర వ్యాపకాలను రాయొచ్చు. డిగ్రీ విద్యార్హతలతోపాటు ఇతర సర్టిఫికేషన్‌ పొందిన కోర్సు వివరాలను సైతం జతచేయొచ్చు.


క్రోనలాజికల్, ఫంక్షనల్‌ ·రెజ్యూమె ఫార్మాట్‌ల కలయిక కాంబినేషన్‌  రెజ్యూమె. దీన్ని హైబ్రీడ్‌  రెజ్యూమె అనీ పిలుస్తారు

కాంబినేషన్‌ రెజ్యూమె

ఇది క్రోనలాజికల్, ఫంక్షనల్‌ ·రెజ్యూమె ఫార్మాట్‌ల కలయికగా ఉంటుంది. అందుకే కాంబినేషన్‌ రెజ్యూమె లేదా హైబ్రీడ్‌ రెజ్యూమె అని పిలుస్తారు. ఏదైనా రంగంలో అనుభవం ఉన్నప్పటికీ, కొత్తగా ఇతర రంగంలో చేరాలనుకునేవారికి ఇది ఉపయోగపడుతుంది. నూతన రంగంలో రాణించాలనుకుంటే గతంలో పనిచేసిన మీ అనుభవాలనూ, మీ ప్రత్యేక నైపుణ్యాలనూ ప్రస్తావిస్తూ చిన్న పేరాలా రాయాలి. ఈ ఫార్మాట్‌లో రెండు రకాల నైపుణ్యాలు పొందుపరచవచ్చు. ఇదివరకు మీరు పని చేసిన అనుభవాలను ఎలా వినియోగించుకున్నారనేది ‘సమ్మరీ ఆఫ్‌ స్కిల్స్‌’, మీలోని ప్రత్యేక నైపుణ్యాలను పాయింట్లరూపంలో తెలియజేసేది ‘కీ స్కిల్స్‌’. నిర్దేశిత లక్ష్యాలను ఛేదించిన మీ గత ఉద్యోగానుభవాల్ని ఈ ఫార్మాట్‌ క్లుప్తంగా తెలియజేస్తుంది. మీరు సాధించిన అత్యుత్తమ విద్యార్హతలను, ఏదైనా ఇతర కోర్సుల్లో శిక్షణ పొంది ఉంటే, ఆ వివరాలనూ ఈ తరహా రెజ్యూమె తెలియజేస్తుంది. 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స‌వాళ్లు ఎదురైనా స‌న్న‌ద్ధ‌త ఆప‌లేదు!

‣ అగ్రికల్చర్‌ బ్యాంకులో ఆఫీసర్‌ ఉద్యోగాలు

‣ డేటాసైన్స్‌ ఉద్యోగాలకు డిమాండ్‌!

‣ దిల్లీలో హెడ్‌కానిస్టేబుల్‌ కొలువులు

‣ ఆతిథ్య రంగంలో అవకాశాలు అనేకం!

Posted Date : 27-07-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌