• facebook
  • whatsapp
  • telegram

ఆతిథ్య రంగంలో అవకాశాలు అనేకం!

కరోనా అనంతరం నిపుణులకు పెరిగిన డిమాండ్‌

 

 

ఆతిథ్య రంగంలో రాణించాలని భావించే వారికి ఇది సువర్ణావకాశం. ఎందుకంటే ఈ పరిశ్రమలో ఇప్పుడు ఎన్నడూ లేనంతగా సిబ్బంది కొరత ఏర్పడింది. కరోనా విజృంభణ తర్వాత పర్యటకం పూర్తిగా కోలుకుని కార్యకలాపాలు మొదలైన ఈ తరుణంలో... కిందిస్థాయి ఉద్యోగుల లేమి వ్యాపార సంస్థలను ఇబ్బంది పెడుతోంది. ఈ సందర్భాన్ని తగిన విధంగా ఉపయోగించుకుంటే తక్కువ అర్హతలతోనే సులువుగా కొలువుల్లో స్థిరపడొచ్చు!

 

టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ స్కిల్‌ కౌన్సిల్‌ లెక్కల ప్రకారం 2021-22 ఏడాదిలో దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది సిబ్బంది తక్కువగా ఉన్నారని తేలింది. ఈ స్థానాలు కొత్తవారితో భర్తీ అయ్యి వారికి ఉపాధి దొరకనుంది.

 

కొవిడ్‌ తొలివిడత సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులు... ఇతర సంస్థల్లో పనిచేసే దిగువస్థాయి సిబ్బంది చాలామంది చేస్తున్న పనులను విడిచిపెట్టి పల్లెలకు తరలివెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా కొన్నాళ్లపాటు అదే పరిస్థితి కొనసాగడంతో వేరే పనులకు మారిపోయారు. ఆపైన కార్యకలాపాలు పూర్తిగా మొదలుకావడంతో సిబ్బంది కొరత మొదలైంది. దానికితోడు కొత్తగా ఫుడ్‌కోర్టులు, అవుట్‌లెట్లు, రెస్టారెంట్ల సంఖ్య పెరగడంతో వీరి అవసరం మరింత ఎక్కువైంది.

 

ఏయే కోర్సులు..

పది, ఇంటర్‌ తర్వాత ఏడాదిలోపు కాలవ్యవధి గల స్వల్పకాల (షార్ట్‌టర్మ్‌) కోర్సులు చేయడం ద్వారా టూరిజం - హాస్పిటాలిటీ రంగంలో రాణించవచ్చు. ఇందులో ఫుడ్‌ ప్రొడక్షన్, బేకరీ అండ్‌ కాన్ఫెక్షనరీ, కలినరీ అండ్‌ రెస్టారెంట్‌  మేనేజ్‌మెంట్, ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్, కేటరింగ్‌ టెక్నాలజీ, హోటల్‌ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, హౌస్‌కీపింగ్, సస్టైనబుల్‌ టూరిజం వంటి విభాగాలున్నాయి. వీటిల్లోనే డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు చేయడం ద్వారా మరిన్ని మెరుగైన అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

 

ఏ నైపుణ్యాలు అవసరం?

పేరుకు తగ్గట్టే ఆతిథ్య రంగం పూర్తిగా వినియోగదారుడికి చక్కటి సేవలు అందించడం చుట్టూనే తిరుగుతుంది. దానికి తగిన నైపుణ్యాలు వృద్ధి చేసుకోవడం ముఖ్యం. ప్రశాంతంగా వినడం, బాగా మాట్లాడటం, మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం, బృందంతో కలిసి పనిచేయడం, కస్టమర్‌ను అర్థం చేసుకుని మసులుకోవడం, సమస్యలను పరిష్కరించడం వంటి నైపుణ్యాలు ఉన్నవారికి ఈ రంగం సరైన ఎంపిక. ఎక్కువ భాషలు మాట్లాడటం వచ్చిన వారికి ఇంకా మంచి అవకాశాలు ఉంటాయి.

 

పని అనుభవం ముఖ్యం..

కరోనా సమయంలో తక్కువ సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించడం అలవాటైన నేపథ్యంలో చాలా సంస్థలు ఇప్పటివరకూ అదే విధానాన్ని కొనసాగించాయి. కానీ ఇప్పుడు వ్యాపారాలు పూర్తిస్థాయిలో మొదలుకావడంతో సిబ్బంది అవసరం పెరిగింది. ఈ రంగంలో చదువుకంటే పని అనుభవం ముఖ్యం. 

ఎక్కువ పని గంటలు - షిఫ్టుల్లో పనిచేయడం అవసరమవుతుంది. తెలుగు, ఇంగ్లిష్‌తోపాటు వేరే భాషలు వచ్చి ఉంటే మరీ మంచిది. ఈ బ్లూకాలర్‌ జాబ్స్‌ కోసం కంపెనీలు థర్డ్‌ పార్టీ పేరోల్‌కి అవుట్‌సోర్సింగ్‌ ఇస్తుంటాయి. ఇలాంటి థర్డ్‌ పార్టీ కంపెనీలు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి. వాటిని సంప్రదించడం ద్వారా స్టార్‌ హోటల్స్, ఇతర ఉన్నతశ్రేణి కంపెనీల్లో ఉద్యోగం పొందవచ్చు. - షారుఖ్‌ తిరుమని, సీఈవో, ది ప్లేస్‌మెంట్‌ పార్క్‌

 

త్వరగా పురోగతి సాధిస్తారు..

పదోతరగతి తర్వాత కొన్ని సర్టిఫికెట్‌ కోర్సులు చేయడం ద్వారా ఈ రంగంలోకి ప్రవేశించవచ్చు. ఉదాహరణకు విశాఖపట్నంలోని ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ వంటి వాటిలో తక్కువ కాలవ్యవధి గల కోర్సులు అనేకం ఉన్నాయి. కొవిడ్‌ తర్వాత ఇప్పుడే పరిశ్రమ పూర్తిగా కోలుకుంది. సిబ్బందిగా చేరాలనుకునే వారికి చాలా అవకాశాలు ఉన్నాయి. కిచెన్‌ సెక్షన్, హౌస్‌కీపింగ్, ఫ్రంట్‌ ఆఫీస్, ఇతర అనేక విభాగాల్లో అసోసియేట్లుగా చేరవచ్చు. ముఖ్యంగా వెయిటర్స్‌ కొరత తీవ్రంగా ఉంది.

వినియోగదారుడి అవసరం తెలుసుకుని పనిచేసే నైపుణ్యం, చక్కగా మాట్లాడే తీరు తెలిసిన వారి కోసం పేరున్న సంస్థలు సైతం వెతుకుతున్నాయి. ఇప్పటికే కొంత అనుభవం ఉన్నవారికి విదేశాల్లో అవకాశాలు రావడం, వారు క్రూయిజ్‌లలో పనిచేయడానికి వెళ్లిపోతుండటం కూడా ఇక్కడ సిబ్బంది కొరతకు దారితీస్తోంది. కుక్స్‌ ఎక్కువగా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారుతూ ఉంటారు. దానివల్ల వారు దొరకడమూ కష్టమవుతోంది. పదోతరగతి విద్యార్హతతో హాస్పిటాలిటీ రంగంలోకి ప్రవేశించిన వారికి కనీస జీతం 11వేల రూపాయల నుంచి మొదలవుతుంది. భోజనం, వసతి సౌకర్యం దీనికి అదనం. 

ఇక్కడ ప్రతిభ కనబరిచిన వారు త్వరగా ఎదిగే అవకాశం ఉంటుంది. హౌస్‌కీపింగ్‌లో అసోసియేట్లుగా చేరి జనరల్‌ మేనేజర్‌ స్థాయికి వెళ్లినవారు ఎందరో ఉన్నారు. అందువల్ల చదువుకంటే ప్రతిభకే ప్రాముఖ్యం ఎక్కువ. టూరిజం, హాస్పిటాలిటీ విభాగాల్లోకి మరింత మందిని ఆకర్షించేలా శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరాం. మరింత మంది ఈ పరిశ్రమలోకి రావాలి. - పవన్‌ కార్తిక్, ఉపాధ్యక్షుడు, హోటల్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్‌

 

యువతులకు అవకాశం..

కొవిడ్‌ రెండో వేవ్‌ సమయంలో వ్యాపారం బాగా తగ్గి చాలామంది సిబ్బందిని తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు చాలావరకూ పుంజుకున్నాం. వెళ్లిన వారిని తిరిగి రప్పిస్తున్నాం. రాలేని వారి స్థానంలో ఖాళీలున్నాయి. ఈ మధ్యకాలంలో కొత్తవారు వివిధ కోర్సులు చేసి, కొంత పని తెలుసుకుని వస్తుండటంతో మాకు కూడా సులువుగా ఉంది. రెండుమూడేళ్ల పని అనుభవం ఉంటే మంచి జీతభత్యాలు పొందవచ్చు. కిచెన్‌ సెక్షన్‌లో ఎక్కువగా ఉద్యోగులు మారుతుండటం వల్ల అక్కడ ఖాళీలు ఏర్పడుతున్నాయి. కొవిడ్‌ తర్వాత యువతులు ఈ పరిశ్రమలోకి ఎక్కువగా వస్తున్నట్లు గమనించాం. వారికీ మంచి అవకాశాలున్నాయి. నెలకు కనీసం 12వేల రూపాయల నుంచి 25వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. - ఎస్‌.వెంకటరెడ్డి, అధ్యక్షుడు, హోటల్స్‌ అసోసియేషన్, తెలంగాణ

 

ఇంగ్లిష్‌ తెలియాలి..

తాజ్, ఐటీసీ, ట్రైడెంట్‌ లాంటి సంస్థలు అభ్యర్థులను రిక్రూట్‌ చేసుకున్న తర్వాత కొన్ని వారాలపాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అభ్యర్థులు అక్కడే చాలావరకూ పని నేర్చేసుకోవచ్చు. ఉద్యోగంలో చేరేనాటికి కొంత ఇంగ్లిష్‌ తెలియడం తప్పనిసరి. తడబాటు లేకుండా చిన్నచిన్న వాక్యాలు స్పష్టంగా మాట్లాడటం సాధన చేస్తే ఆ తర్వాత అదే అలవాటైపోతుంది. చాలామంది ఆరునెలల్లోనే పూర్తిస్థాయిలో పని నేర్చుకోగలరు. కుకింగ్, ఫైనాన్స్, కస్టమర్‌ సర్వీస్, బార్‌ టెండింగ్, కంప్లైంట్‌ మేనేజ్‌మెంట్, లాండ్రీ, క్లీనింగ్‌ వంటి విభాగాల్లో ప్రత్యేకంగా కొంత శిక్షణ అవసరం ఉంటుంది. ఈ స్పెషలైజేషన్లతో కూడిన సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు చేయడం ద్వారా ఉద్యోగంలో త్వరగా పురోగతి సాధించగలరు. పదోతరగతి లోపు చదివిన వారు కూడా ప్రయత్నించవచ్చు. - లక్ష్మీ ఎం.కొడాలి, సీఈవో, ఆప్టిమ్‌హైర్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మరోసారి టాప్‌ ర్యాంకులో మద్రాస్‌ ఐఐటీ

‣ పది పాసైతే ప్రభుత్వ ఉద్యోగాలు

‣ మెయిన్‌లో మెరిసేందుకు మ‌రో అవ‌కాశం!

‣ ప్రావీణ్యం పెంచే వృత్తి విద్య

‣ అర్థం చేసుకుంటూ చ‌దివితే..!

Posted Date: 19-07-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌