• facebook
  • whatsapp
  • telegram

ఆతిథ్య నిర్వహణలో శాస్త్రీయ శిక్షణ

విభిన్న కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటనలు

కొవిడ్‌ పరిణామాల నేపథ్యంలో ఆతిథ్య రంగంలో కళ కొంత తప్పినా పరిస్థితులు చక్కబడగానే పూర్వవైభవం తథ్యం. పాక   శాస్త్రంలో ప్రావీణ్యానికీ, ఆతిథ్య నిర్వహణకూ ప్రత్యేకమైన      చదువులున్నాయిప్పుడు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో, కలినరీ     ఆర్ట్స్‌లో చేరితే రుచికరమైన వంటలే కాకుండా పోషకాలు, వంటలో అనుసరించాల్సిన ప్రమాణాలు, వంట సామగ్రి సేకరణ, వండిన పదార్థాలను చక్కగా అలంకరించడం...మొదలైనవి   శాస్త్రీయంగా నేర్చుకోవచ్చు. సంబంధిత నిపుణులుగా ఎదగొచ్చు!

కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ నోయిడా, తిరుపతి క్యాంపస్‌ల్లో బీబీఏ, ఎంబీఏ కలినరీ కోర్సులు అందిస్తోంది. వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది!  ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయంతో కలసి, ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్లు బీబీఏ, ఎంబీఏ కలినరీ కోర్సులు అందిస్తున్నాయి. పరీక్షలో చూపిన ప్రతిభతో వీటిలో ప్రవేశాలు చేపడతారు. ఇక్కడ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు ప్రాంగణ నియామకాల ద్వారా మేటి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. హోటళ్లు, ఆతిథ్య సంస్థలు, విమానయాన సంస్థలు, పర్యాటక సంస్థలు, ఆసుపత్రులు, కార్పొరేట్‌ కంపెనీలు, క్యాటరింగ్‌ సంస్థలు...మొదలైనవాటిలో వీరు సేవలందించవచ్చు. సెలబ్రిటీల వద్ద పనిచేయడానికి అవకాశం ఉంది. సొంతంగా ఫుడ్‌ చెయిన్‌ నిర్వహించవచ్చు. న్యూట్రిషన్‌ నిపుణులుగానూ రాణించవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఈ తరహా కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.

బీబీఏ

సీట్లు: నోయిడా, తిరుపతి ఒక్కో క్యాంపస్‌లో 120 చొప్పున ఉన్నాయి. 

విద్యార్హత: 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం. 

వయసు: జులై 1, 2021 నాటికి 22 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్ల సడలింపు వర్తిస్తుంది. 

పరీక్ష ఇలా: ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, సర్వీస్‌ సెక్టార్‌ ఆప్టిట్యూడ్‌ వీటిలో ఒక్కో విభాగం నుంచి 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. రుణాత్మక మార్కులు లేవు. 

ఎంబీఏ

సీట్లు: ఒక్కో సంస్థలో 30 చొప్పున ఉన్నాయి 

అర్హత: బీఎస్‌సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ లేదా కలినరీ ఆర్ట్స్‌ లేదా హాస్పిటాలిటీ కోర్సులు చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం సరిపోతాయి. 

వయసు: ఆగస్టు 1, 2021 నాటికి 25 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్ల సడలింపు వర్తిస్తుంది. 

పరీక్ష ఇలా: ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఫుడ్‌ ప్రొడక్షన్, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ సర్వీస్, ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్, హ్యూమన్‌ రిసోర్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్, ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఒక్కో విభాగం నుంచి 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. రుణాత్మక మార్కులు లేవు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.  

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 15  

పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు. www.ici.nic.in/

తిరుపతి, నోయిడా రెండు క్యాంపస్‌ల్లోనూ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు సైతం ఉన్నాయి. డిప్లొమాలో 18 నెలల వ్యవధితో ఫుడ్‌ ప్రొడక్షన్, ఎఫ్‌ అండ్‌ బీ సర్వీస్, బేకరీ అండ్‌ కన్ఫెక్షనరీ కోర్సులు అందిస్తున్నారు. సర్టిఫికెట్‌ విభాగంలో 6 నెలల వ్యవధితో ఫుడ్‌ ప్రొడక్షన్, ఎఫ్‌ అండ్‌ బీ సర్వీస్‌ క్రాఫ్ట్‌ కోర్సులున్నాయి. వీటిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.  

ప్రస్తుతావసరం... నైపుణ్యాల మెరుగుదల

కొవిడ్‌ నేపథ్యంలో ఆతిథ్యరంగంలో ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు క్లిష్టంగా మారాయి. అయితే ఇప్పుడు కోర్సుల్లో చేరుతున్నవారు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరు తమ చదువులు పూర్తిచేసుకునేసరికి పరిస్థితులు చక్కబడతాయి. ఇప్పటికే కోర్సులు పూర్తిచేసుకున్నవాళ్లు మాత్రం ఉద్యోగానికి కొన్నాళ్లు వేచిచూడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ లోగా వీరు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంపై దృష్టి సారించాలి లేదా ఇతర ఉద్యోగాల కోసం ప్రయత్నించాలి. 

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు కేవలం ఆతిథ్య రంగానికే కాకుండా ఇతర విభాగాల్లో సేవలు అందించడానికీ ఉపయోగపడతాయి. కోర్సులో నేర్చుకున్న సాఫ్ట్‌ స్కిల్స్, మల్టీ టాస్కింగ్, పీపుల్‌ మేనేజ్‌మెంట్‌...తదితర నైపుణ్యాలు వివిధ రంగాల్లో సేవలు అందించడానికి పనికొస్తాయి. వీరు సేల్స్, రియల్‌ ఎస్టేట్, ఏవియేషన్, రిటైల్‌ విభాగాల్లో ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. పరిస్థితులు చక్కబడేంతవరకు ఏదో ఒక ఉద్యోగంలో కొనసాగడం వల్ల ఆ అనుభవం ఉపయోగపడుతుంది కూడా. 

డిజిటల్, సర్వీస్‌ ఆపరేషన్, డిజైన్, క్వాలిటీ అండ్‌ ఎక్స్‌లెన్స్‌...కోర్సులు పూర్తిచేయడం వల్ల భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు పొందవచ్చు. ఫుడ్‌ ఇండస్ట్రీ కెపాసిటీ అండ్‌ స్కిల్‌ ఇనీషియేటివ్‌ (ఎఫ్‌ఐసీఎస్‌ఐ) ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో ఆన్‌లైన్‌ కోర్సు అందిస్తోంది. ఎడ్‌టెక్‌ సంస్థలు సైతం హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు ఉపయోగపడే కోర్సులు ఆన్‌లైన్‌లో బోధిస్తున్నాయి. వాటిలో చేరడానికి ప్రయత్నించవచ్చు. 

క్లౌడ్‌ కిచెన్‌ కాన్సెప్ట్‌ ఇప్పుడు విస్తరిస్తోంది. ఆన్‌లైన్‌ ఆహార విక్రయ సంస్థలను వేదికగా చేసుకుని మంచి వంటకాలు అందించవచ్చు. అలాగే స్థానికంగా బ్యాకరీ పదార్థాలు, జామ్, జెల్లీలు, పచ్చళ్లు, అప్పడాలు...మొదలైనవాటిని తక్కువ పెట్టుబడితో తయారుచేసి, విక్రయించడంపైనా దృష్టి సారించవచ్చు.

ఆతిథ్యంలో ఎంఎస్‌సీ

బీఎస్‌సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తిచేసుకున్న, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఎంఎస్‌సీ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సును ఐహెచ్‌ఎం సంస్థలు అందిస్తున్నాయి. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో అనుభవం ఉన్నవారు నేరుగా, ప్రస్తుత విద్యార్థులైతే పరీక్ష రాసి పీజీ కోర్సులోకి చేరిపోవచ్చు. ఆతిథ్య రంగంలో మరింత నైపుణ్యాన్ని పొంది, నిపుణులుగా రాణించాలని కోరుకునేవారికీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో ఫ్యాకల్టీగా సేవలందించాలనుకునేవారికీ ఈ కోర్సు ఉపయోగపడుతుంది. 

క్యాంపస్‌లు: దేశవ్యాప్తంగా ఐహెచ్‌ఎం 17 క్యాంపస్‌ల్లో ఈ కోర్సు అందిస్తున్నారు. మొత్తం 550 సీట్లు ఉన్నాయి. ఐహెచ్‌ఎం హైదరాబాద్‌లో 30 సీట్లు ఎంఎస్‌సీ కోర్సులో లభిస్తున్నాయి. 

అర్హత: బీఎస్‌సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు పూర్తిచేసినవారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సు చదువుతున్నవారు ఎంఎస్‌సీ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆతిథ్య రంగంలో అనుభవం ఉన్నవారికి నేరుగా ప్రవేశం కల్పిస్తారు. బీఎస్‌సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు అనంతరం రెండేళ్లకు తగ్గకుండా, మూడు నక్షత్రాల హోటల్‌లో పనిచేసినవారు పరీక్ష అవసరం లేకుండా ప్రవేశం పొందవచ్చు. 

రాతపరీక్ష ఇలా.. వంద మార్కులకు నిర్వహించే రాత పరీక్షలో బీఎస్‌సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుకు సంబంధించి 80 ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. తప్పుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 30

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.900. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.450

పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు. 

వెబ్‌సైట్లు: www.thims.gov.in, www.nchm.nic.in

ఐహెచ్‌ఎంల్లో...

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐహెచ్‌ఎం)ల్లో బీఎస్‌సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సును చదువుకోవచ్చు. వీటిలో ప్రవేశాలకు దôఖాస్తు గడువు తేదీ పొడిగించారు. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ -జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌సీహెచ్‌ఎం- జేఈఈ) పేరుతో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్ష నిర్వహిస్తోంది. ఈ స్కోరుతో కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న 21 జాతీయ ఐహెచ్‌ఎంలతోపాటు 26 రాష్ట్ర స్థాయి ఐహెచ్‌ఎంలు, ఒక పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్, 26 ప్రైవేటు సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. 

తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం ఆధ్వర్యంలోని ఐహెచ్‌ఎం హైదరాబాద్, రాష్ట్రీయ సంస్థలైన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ హైదరాబాద్, స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ తిరుపతి, తెలంగాణ స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంగారెడ్డి ఎన్‌సీహెచ్‌ఎం -జేఈఈతో ప్రవేశం కల్పిస్తున్నాయి. శ్రీశక్తి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్, హైదరాబాద్, లియో అకాడెమీ ఆఫ్‌ హాస్పిటాలిటీ టూరిజం అండ్‌ మేనేజ్‌మెంట్‌ హైదరాబాద్‌ల్లో ప్రవేశం ఈ స్కోరుతోనే లభిస్తుంది. ఐహెచ్‌ఎం హైదరాబాద్‌లో 285, వైఎస్‌ఆర్‌ నిథమ్‌లో 120, తిరుపతి, సంగారెడ్డి ఐహెచ్‌ఎంలు ఒక్కో దానిలో 60 చొప్పున, శ్రీశక్తిలో 120, లియోలో 100 సీట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 74 సంస్థల్లో 12045 సీట్లకు ఈ పరీక్షతో పోటీ పడవచ్చు.

రాతపరీక్ష ఇలా...

రాతపరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలుంటాయి. ఇందులో న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌ 30, రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌ 30, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ 30, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 60, సర్వీస్‌ సెక్టార్‌ ఆప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రతి సరైన సమాధానానికీ 4 మార్కులు. తప్పుగా గుర్తించిన జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో అడుగుతారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జూన్‌ 20 వరకు స్వీకరిస్తారు.

పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు. 

అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. 

వయసు: జులై 1, 2021 నాటికి గరిష్ఠంగా 25 ఏళ్లలోపు ఉండాలి. 1996 జులై 1 తర్వాత జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు గరిష్ఠ వయసులో మూడేళ్లు సడలింపులు వర్తిస్తాయి. 

పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో... హైదరాబాద్, కరీంనగర్‌. 

వెబ్‌సైట్‌: https://nchmjee.nta.nic.in
 

Posted Date: 18-11-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌