• facebook
  • whatsapp
  • telegram

మర్యాదలకూ మేనేజర్లు!

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష ప్రకటన విడుదల

ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఎంచుకోదగ్గ కెరియర్లలో ఆతిథ్యరంగం ఒకటి. దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తున్నాయి. అయితే వాటిలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌(ఐహెచ్‌ఎం)లు విశిష్టమైనవి. వీటిలో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం కల్పిస్తారు. 

కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎం అండ్‌ సీటీ) ఏర్పాటైంది. ఈ సంస్థ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)తో కలిసి బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సును అందిస్తోంది. ఇందులో ప్రవేశాలకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ -జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌సీహెచ్‌ఎం- జేఈఈ) పేరుతో పరీక్ష నిర్వహిస్తోంది. ఈ స్కోరుతో మొత్తం 78 సంస్థల్లో అవకాశం లభిస్తుంది. వీటిలో కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న 21 జాతీయ ఐహెచ్‌ఎంలు ఉన్నాయి. మిగిలినవి రాష్ట్ర స్థాయి, పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్, ప్రైవేటు సంస్థలు. 

తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐహెచ్‌ఎం) హైదరాబాద్, రాష్ట్ర సంస్థలైన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ హైదరాబాద్, స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ తిరుపతి, తెలంగాణ స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంగారెడ్డి ఎన్‌సీహెచ్‌ఎం -జేఈఈతో ప్రవేశం కల్పిస్తున్నాయి. శ్రీశక్తి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్, హైదరాబాద్, లియో అకాడెమీ ఆఫ్‌ హాస్పిటాలిటీ టూరిజం అండ్‌ మేనేజ్‌మెంట్‌ హైదరాబాద్‌ల్లో ప్రవేశం ఈ స్కోర్‌తోనే లభిస్తుంది. 

కేంద్రం ఆధ్వర్యంలో నడిచే ఐహెచ్‌ఎంల్లో మొత్తం 6734 సీట్లకు దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడవచ్చు. ఈ పరీక్షలో సాధించిన స్కోరే ఇందులో చేరడానికి ప్రామాణికం. ఐహెచ్‌ఎం హైదరాబాద్‌లో 300, వైఎస్‌ఆర్‌ నిథమ్‌లో 127, తిరుపతి, సంగారెడ్డి ఐహెచ్‌ఎంలు ఒక్కో దానిలో 64 చొప్పున, శ్రీశక్తిలో 126, లియోలో 105 సీట్లు ఉన్నాయి. ఈ స్కోరుతో దేశవ్యాప్తంగా పలు విద్యా సంస్థలు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి అవకాశం కల్పిస్తున్నాయి.

ఆన్‌లైన్‌ రాతపరీక్ష 

పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 30, రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌- 30, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌- 30, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌- 60, సర్వీస్‌ సెక్టార్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రతి సరైన సమాధానానికీ 4 మార్కులు ఉంటాయి. తప్పుగా గుర్తించిన జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో అడుగుతారు.

కోర్సు స్వరూపం

బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు వ్యవధి మూడేళ్లు. మొత్తం 6 సెమిస్టర్లు ఉంటాయి. ఇందులో భాగంగా ఫుడ్‌ ప్రొడక్షన్, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ సర్వీస్, అకామడేషన్‌ ఆపరేషన్, ఫ్రంట్‌ ఆఫీస్, అకౌంటింగ్, కమ్యూనికేషన్, హోటల్‌ ఇంజినీరింగ్, న్యూట్రిషన్, ఫుడ్‌ సైన్స్, కంప్యూటర్స్, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్, ఫెసిలిటీ ప్లానింగ్, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌ అంశాల్లో తర్ఫీదు నిస్తారు. కోర్సు చివరలో ప్రొజెక్టు వర్కు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం విద్యాసంస్థలు ఏదైనా హోటల్‌ లేదా క్యాటరింగ్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని తర్ఫీదు అందిస్తాయి. ఈ కోర్సును జనరిక్‌ తోపాటు శాకాహారుల కోసమూ అందిస్తున్నారు. వెజిటేరియన్‌ కోర్సు ఎంచుకున్నవారికి వెజ్‌ అంశాల్లో ప్రత్యేక తర్ఫీదు అందుతుంది. వీరు మాంసాహార వంటలను నేర్చుకోనవసరం లేదు.

ఉపాధి అవకాశాలు

కేంద్రం ఆధ్వర్యంలో నడిచే ఐహెచ్‌ఎంల్లో కోర్సులు పూర్తిచేసుకున్నవారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ సంస్థలకు జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు, అవసరాలకు అనుగుణంగా అందిస్తోన్న సమగ్ర శిక్షణ ఇందుకు కారణం. దాదాపు ఈ సంస్థల విద్యార్థులందరూ ప్రాంగణ నియామకాల్లో అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. 

పూర్తిచేసుకున్న స్పెషలైజేషన్‌ ప్రకారం... కిచెన్‌ మేనేజ్‌మెంట్, హౌస్‌ కీపింగ్‌ మేనేజ్‌మెంట్, ఫ్లైట్‌ కిచెన్స్‌/ ఆన్‌బోర్డ్‌ ఫ్లైట్‌ సర్వీసెస్, వివిధ సేవా పరిశ్రమల్లో గెస్ట్‌/ కస్టమర్‌ రిలేషన్‌ ఎగ్జిక్యూటివ్, ఫాస్ట్‌ఫుడ్‌ చెయిన్స్‌లో ఎగ్జిక్యూటివ్, క్యాటరింగ్‌ సంస్థలు, షిప్పుల్లో సప్లై, కిచెన్‌ సెక్షన్‌ ఉద్యోగాలు; పర్యాటక సంస్థలు, కేంద్రాల్లో వివిధ రకాల సేవలు, బహుళజాతి కంపెనీల క్యాంటీన్లు, హౌస్‌ కీపింగ్‌ నిర్వహణ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో ఫ్యాకల్టీ, సొంతంగా ఫుడ్‌ చెయిన్‌ ప్రారంభించడం...తదితర అవకాశాలు దక్కుతాయి. లీలా, ఒబేరాయ్, తాజ్, పార్క్, స్టార్‌ వుడ్, మారియట్‌...ఇలా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు. ఫుడ్‌ చైన్‌ సంస్థలైన కేఎఫ్‌సీ, మెక్‌ డొనాల్డ్స్, పీజాహట్, డామినోస్‌..మొదలైనవి ప్రాంగణ నియామకాల్లో ఎక్కువమందిని తీసుకుంటున్నాయి. ఆర్మీలోనూ జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉన్నత విద్య

బీఎస్సీ తర్వాత ఆసక్తి ఉంటే రెండేళ్ల వ్యవధితో ఎమ్మెస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేసుకోవచ్చు. చాలా ఐహెచ్‌ఎంలు పీజీ కోర్సులు అందిస్తున్నాయి. ఆతిథ్య రంగంలోని నచ్చిన స్పెషలైజేషన్‌తో పీజీ పూర్తిచేసుకునే అవకాశం ఉంది. ఇలా పీజీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు బోధనలో రాణించవచ్చు లేదా ఆతిథ్య రంగంలో ఉన్నత స్థాయి హోదాలతో అవకాశం పొందవచ్చు. పీజీ డిప్లొమా కోర్సులూ ఉన్నాయి. వీటిని ఏడాది/ ఏడాదిన్నర వ్యవధితో ఎన్నో సంస్థలు అందిస్తున్నాయి. కొన్ని కార్పొరేట్‌ హోటళ్లలోనూ ఈ కోర్సులు పూర్తిచేసుకుని అక్కడే ఉపాధి పొందవచ్చు. ఐటీసీ, వెల్‌కమ్‌ గ్రూపులు వీటిని అందిస్తున్నాయి. 

సన్నద్ధత ఎలా?

న్యూమరికల్‌ ఎబిలిటీ, ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలోని ప్రశ్నలకు 9, 10 తరగతుల గణిత పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది. వయసు, పని-వేతనం, చైన్‌ రూల్, సమయం-పని విభాగాల్లో ప్రశ్నలు వస్తున్నాయి. గుణింతాలు, కూడికలు, తీసివేతలు, భాగహారం, కసాగు, గసాభా, సగటు, నిష్పత్తి, భిన్నాలు మొదలైనవాటిలో ప్రాథమికాంశాలపై దృష్టి సారించాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. 

రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌ విభాగంలోని ప్రశ్నలు తర్కంతో ముడిపడి ఉంటాయి. అయితే ఇవి తేలికగానే ఉంటాయి. బ్లడ్‌ రిలేషన్లు, సిరీస్, స్టేట్‌మెంట్‌ అండ్‌ అజంప్షన్స్, వెర్బల్‌ రీజనింగ్‌ విభాగాలను శ్రద్ధతో చదవాలి. 

జీకే, కరంట్‌ అఫైర్స్‌ విభాగంలో ఎక్కువ ప్రశ్నలు జనరల్‌ నాలెడ్జ్‌ (స్టాక్‌ జీకే) నుంచే వస్తున్నాయి. హిస్టరీ, పాలిటీ, జనరల్‌ సైన్స్‌ల్లోని ప్రాథమికాంశాల నుంచి వీటిని ఎక్కువగా అడుగుతున్నారు. అందువల్ల 8,9,10 తరగతుల సైన్స్, సోషల్‌ పుస్తకాల్లోని ముఖ్యాంశాలు చదువుకుంటే చాలు. రాజధానులు, కరెన్సీ, పార్లమెంట్లు, క్రీడలు-విజేతలు, అవార్డులు, పుస్తకాలు-రచయితలు..చదవాలి.  

ఆంగ్ల విభాగంలోని ప్రశ్నలు కూడా ప్రాథమిక స్థాయిలోనే ఉంటాయి. సమానార్థాలు, వ్యతిరేక పదాలు, కంజెంక్షన్లు, ప్రిపొజిషన్లు, పాసేజ్‌ విభాగాల్లో తేలిక ప్రశ్నలే వస్తాయి. 9, 10 తరగతుల్లోని వ్యాకరణాంశాలు చదువుకోవాలి. 

సర్వీస్‌ సెక్టార్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలోని ప్రశ్నలు ఆతిథ్య, సేవారంగాలకు చెందినవిగా ఉంటాయి. ప్రశ్నను బాగా చదివి, ఆలోచించి, విచక్షణతో వీటికి సమాధానం గుర్తించవచ్చు. ఆతిథ్య పరిశ్రమ, సేవరంగంపై అవగాహన పెంచుకుంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. 

పాత ప్రశ్నపత్రాలు బాగా అధ్యయనం చేయాలి. వీటిద్వారా ప్రశ్నలు ఏ అంశాల నుంచి, ఏ స్థాయిలో వస్తున్నాయో అర్థం చేసుకుని సన్నద్ధతను అందుకు అనుగుణంగా కొనసాగించవచ్చు.  

పరీక్షకు ముందు కనీసం పది మాదిరి ప్రశ్నపత్రాలు సాధనచేస్తే మెరుగైన మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది.

గమనించండి...

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: మే 3 సాయంత్రం 5 వరకు.

పరీక్ష తేదీ: మే 28

అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: జులై 1, 2022 నాటికి గరిష్ఠంగా 25 ఏళ్లలోపు ఉండాలి. 1997 జులై 1 తర్వాత జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు గరిష్ఠ వయసులో మూడేళ్లు సడలింపులు వర్తిస్తాయి. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి.

వెబ్‌సైట్‌: https://nchmjee.nta.nic.in
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బ్లాక్‌ టెక్నాలజీలో కొలువుల చెయిన్‌!

‣ IISC: ఐఐఎస్సీలో టెక్నికల్‌ అసిస్టెంట్లు

‣ సివిల్స్‌... గ్రూప్స్‌ ఏది మీ టార్గెట్‌?

‣ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లకు సిద్ధమేనా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 16-02-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌