• facebook
  • whatsapp
  • telegram

బ్లాక్‌ టెక్నాలజీలో కొలువుల చెయిన్‌!

అన్ని రంగాల్లోనూ పెరుగుతున్న అవకాశాలు

ఆకాశమే హద్దుగా ప్రపంచం దూసుకుపోతోంది. అయితే మోసాలనే స్పీడ్‌ బ్రేకర్లు దానికి అడ్డుపడుతున్నాయి. వీటిని సమర్థంగా అధిగమించి మరింత వేగంతో ముందుకు వెళ్లడానికి సాంకేతిక నైపుణ్యం అస్త్రంలా ఉపయోగపడుతోంది. అలాంటి ముఖ్యమైన ఆయుధాల్లో బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఒకటి. ఈ నైపుణ్యం అన్ని వ్యవహారాల్లోనూ అద్భుతంగా పనిచేస్తోంది. భూముల వివరాలు, ఆన్‌లైన్‌ లావాదేవీలు, డిజిటల్‌ కరెన్సీ, సర్టిఫికెట్లు... ఇవన్నీ దీని సాయంతో పక్కాగా నమోదుచేసి మోసాలకు చెక్‌ పెట్టవచ్చు. అందుకే బహుళజాతి సంస్థలతోపాటు ప్రభుత్వాలూ దీనిపై దృష్టి పెడుతున్నాయి. ఈ విభాగం సమర్థ మానవ వనరుల కొరతను ఎదుర్కొంటోంది. మరి మీరు బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికత నేర్చుకుని దీనిలో దూసుకుపోవడానికి సిద్ధమేనా! 

బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని తొలిసారిగా 2008లో క్రిప్టో కరెన్సీ బిట్‌ కాయిన్‌లో ఉపయోగించారు. స్వీడన్‌లో భూముల వివరాలన్నీ బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఉపయోగించి భద్రం చేశారు. ఇండోనేసియా లాంటి చిన్న దేశాలు సైతం ఈ టెక్నాలజీని సమర్థంగా ఉపయోగిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం టెక్‌ మహీంద్రా సంస్థతో కలిసి దేశంలోనే తొలి బ్లాక్‌ చెయిన్‌ డిస్ట్రిక్ట్‌ నెలకొల్పింది. ప్రస్తుతం భూముల వివరాలు పకడ్బందీగా అమలుచేస్తోన్న ధరణి పోర్టల్‌లో ఈ టెక్నాలజీనే ఉపయోగిస్తున్నారు. అలాగే చిట్‌ఫండ్ల లావాదేవీలు, విద్యార్థుల సర్టిఫికెట్లు...మొదలైనవి పక్కాగా నమోదు కావడానికి కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018లోనే బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఉపయోగించి లక్షకుపైగా భూరికార్డులను భద్రపరిచింది. ప్రభుత్వ పాలనలో ఈ సాంకేతికతను ఉపయోగించిన తొలి రాష్ట్రంగానూ గుర్తింపు పొందింది.

నేరుగా నేర్చుకోవచ్చు

దేశవ్యాప్తంగా కొన్ని సంస్థలు బీటెక్‌ బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ కోర్సు నేరుగా అందిస్తున్నాయి. కొన్ని చోట్ల బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ స్పెషలైజేషన్లలో భాగంగా బ్లాక్‌ చెయిన్‌ కోర్సు ఉంది. 

విట్, ఎస్‌ఆర్‌ఎం, సత్యభామ, శస్త్ర, యూపీఈఎస్, ప్రెసిడెన్సీ, గ్రాఫిక్‌ ఎరా, శారద, శ్రీనివాస్, అజీంక్య డీవై పాటిల్, జైన్, నార్త్‌క్యాప్‌.. తదితర విశ్వవిద్యాలయాల్లో బ్లాక్‌ చెయిన్‌ విద్య అభ్యసించవచ్చు. 

బీటెక్‌లో చేరినవాళ్లు బ్లాక్‌ చెయిన్‌ ప్రాథమికాంశాలు, దాని ఆర్కిటెక్చర్, ఆ సాంకేతికతకు సంబంధించిన ప్రాక్టికల్, సెక్యూరిటీ అంశాలు తెలుసుకుంటారు. ఎథీరియం, బిట్‌ కాయిన్, క్రిప్టో కరెన్సీ, క్రిప్టోగ్రఫీ, ఆల్గోరిథమ్‌లు, డేటా స్ట్రక్చర్లు, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్, ప్రోగ్రామింగ్‌...ఇవన్నీ కోర్సులో భాగంగా ఉంటాయి. బ్లాక్‌ చెయిన్‌ పనిచేసే విధానం, దాని అనువర్తనాలు, సవాళ్లు, పరిమితులు, కావాల్సిన ఆర్థిక వనరులు..మొదలైనవి తెలుసుకోవచ్చు. 

ఇతర మార్గాల్లో...

ఉద్యోగాలు ఆశిస్తోన్నవారు సాంకేతిక నేపథ్యం లేకపోయినప్పటికీ బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ అభ్యసించవచ్చు. కోర్సులో చేరిన తర్వాత ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు మెరుగుపరచుకోవడం తప్పనిసరి. 

నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ టెక్నాలజీ ఎన్‌హ్యాన్స్‌డ్‌ లర్నింగ్‌ (ఎన్‌పీటీఈఎల్‌) బ్లాక్‌ చెయిన్‌లో 12 వారాల కోర్సును అందిస్తోంది. ఇది పూర్తిగా ఉచితం. ఎవరైనా నేర్చుకోవచ్చు. 

ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్‌ వేదికగా అందించే కోర్సుల్లోనూ చేరవచ్చు. ఇందుకోసం కొంత మొత్తం చెల్లించాలి.  

ప్రైవేటు శిక్షణ సంస్థలు ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు లాంటి చోట్ల బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీపై తరగతులు నిర్వహిస్తున్నాయి వాటిలో చేరి నైపుణ్యం సంపాదించవచ్చు.

గ్రేట్‌ లర్నింగ్, సింప్లీ లర్న్, ఉడాసిటీ, కోర్స్‌ ఎరా, ఎడ్‌ఎక్స్‌... తదితర సంస్థలు ఆన్‌లైన్‌లో నేర్పుతున్నాయి. వాటిలో చేరవచ్చు. 

అవకాశాలు ఎక్కడ?

బ్లాక్‌ చెయిన్‌ నిపుణులకు అన్ని రకాల సంస్థల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, యాక్సెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్‌...ఇలా విఖ్యాత సాఫ్ట్‌వేర్‌ సంస్థలన్నీ దీనిపై దృష్టి పెట్టాయి. ఇవే కాకుండా ఇతర సాఫ్ట్‌వేర్‌ సంస్థలూ తమ క్లయింట్ల అవసరాలను తీర్చడానికి బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికతను వృద్ధి చేస్తున్నాయి. ఇందుకోసం నైపుణ్యం ఉన్నవారిని ఎక్కువ వేతనంతో తీసుకుంటున్నాయి. 

అన్ని రంగాలూ, ప్రభుత్వాలు, సంస్థలు బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీతో మేలు పొందుతున్నాయి కాబట్టి అవకాశాలకు పరిధి, పరిమితులు లేవు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ఈ సాంకేతికతను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నాయి. భూ రికార్డులు కబ్జా చేయడం, నకిలీ డిగ్రీల చలామణీ.. వీటన్నింటినీ బ్లాక్‌ చెయిన్‌ సమర్థంగా నిరోధించగలదు. దీని సాయంతో వాహనాల రిజిస్ట్రేషన్లు ఒక పద్ధతి ప్రకారం చేపట్టవచ్చు. ఇలా ప్రతి రంగం, విభాగంలో బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంది. 

ఫిన్‌టెక్, బీమా, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్, గవర్నమెంట్‌ అండ్‌ పబ్లిక్‌ సెక్టార్, హెల్త్‌కేర్‌ అండ్‌ లైఫ్‌ సైన్స్, రిటైల్‌ అండ్‌ ఈ కామర్స్, ఆటోమోటివ్‌ ...మొదలైన విభాగాల్లో బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీతో ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వాలకైతే దీనిద్వారా పాలన రికార్డులకు సంబంధించి పారదర్శకత మెరుగవుతుంది. లావాదేవీల్లో రహస్యాలకు అవకాశం ఉండదు. విస్తృత సమాచారం సులువుగా ఒకేచోట పొందుపర్చి ఉండడంతో నిర్వహణ సైతం సులువవుతోంది. అందువల్ల ఈ సాంకేతిక నైపుణ్యం ఉన్నవారికి అవకాశాలు పుష్కలం. వేతనాలూ పెద్దమొత్తంలోనే ఉంటాయి.

బ్లాక్‌ చెయిన్‌ అంటే...

డేటా (సమాచారం) సమూహమే బ్లాక్‌. సమాచారం అంతా బ్లాక్‌లవారీ పోగవుతుంది. ఈ బ్లాక్‌లన్నీ గొలుసు మాదిరి ఒకదానికికొకటి అతుక్కుని ఉంటాయి. దీన్నే బ్లాక్‌ చెయిన్‌ అంటారు. ఈ డేటా ప్రవాహానికి అంతం ఉండదు. కొత్తది వచ్చి చేరుతుంది. పాతది పోదు. సమాచారం మార్చడం లేదా తొలగించడం వీలుపడదు. లావాదేవీలన్నీ బ్లాకుల్లో ఎన్‌క్రిప్ట్‌ అవుతాయి. అన్ని బ్లాక్‌లూ కంప్యూటర్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానమైపోతాయి. 

ఇదీ విశిష్టత

ఇందులో కేంద్రీకృత డేటాబేస్‌ (సెంట్రలైజ్డ్‌) అంటూ ఉండదు. దీంతో నమోదైన సమాచారాన్ని ఎవరూ మార్చలేరు. మార్చే అధికారం నిర్వాహకులతో సహా ఎవరికీ ఉండదు. మానవ తప్పిదాలకు చోటు లేదు. మెషిన్‌ పొరపాట్లకు అవకాశం ఉండదు. చేతివాటం సాధ్యం కాదు. సైబర్‌ రిస్క్‌ తట్టుకునేలా రూపొందడం, చిన్న చిన్న వర్తక సమూహాలు సైతం విరివిగా ఉపయోగించడానికి అనువుగా ఉండడం, ట్రేడింగ్, బ్యాంక్‌ లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకతకు పెద్దపీట వేసేలా రూపొందడం..బ్లాక్‌ చెయిన్‌ ప్రత్యేకత. ఖర్చు తక్కువ, ప్రయోజనాలు ఎక్కువ. నాణ్యత, భద్రతలో తిరుగులేదు. సమయం ఆదా, వేగం, కచ్చితత్వం దీని సొంతం. అందుకే ప్రభుత్వాలు, ఆర్థిక సేవల సంస్థలు ఈ టెక్నాలజీపై దృష్టి సారించాయి. 

పని చేస్తుందిలా...

ఒక నెట్‌వర్క్‌ పరిధిలో వేల నోడ్స్‌ ఉంటాయి. ఏదైనా లావాదేవీ జరిగినప్పుడు వీటన్నింటిలోకీ ఆ సమాచారం నిక్షిప్తమవుతుంది. ప్రతి లావాదేవీ క్రిప్టోగ్రఫీ విధానంలో సీల్‌ అవుతుంది. అనంతరం అది ఒక బ్లాక్‌గా ఆవిర్భవిస్తుంది. తర్వాత జరిగిన లావాదేవీలు మళ్లీ ఇదే మాదిరి బ్లాక్‌గా రూపొందుతాయి. ఒక బ్లాక్‌కి మరో బ్లాక్‌ అనుసంధానమవుతుంది తప్ప ఎక్కడా బ్లాక్‌ల మధ్య అవరోధాలు ఏర్పడవు. దీంతో ఆది నుంచి అంతం వరకు సమాచారం అలా పోగవుతునే ఉంటుంది. మధ్యలో మార్పు, చేర్పులు సాధ్యపడవు. ఆ బ్లాక్‌ చెయిన్‌లో భాగమైన వినియోగదారులు లేదా ఖాతాదారులకు డిజిటల్‌ సంతకం కీగా ఉంటుంది దాంతో లోపలికి ప్రవేశించవచ్చు. ఇందులో పబ్లిక్‌ కీ, ప్రైవేటు కీ రెండు ఉంటాయి. అంటే వినియోగదారులకు ఒకరకమైన యాక్సెస్, పర్యవేక్షకులకు మరోరకమైన యాక్సెస్‌ ఉంటాయి. వినియోగదారులే యజమానిగా చలామణి అవుతారు.

రక్షణ ఇలా...

బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీకి కంపెనీలు బ్రహ్మరథం పట్టడానికి కీలకం ఇదే. ఇందులో హ్యాకర్ల నుంచి దాడిని సమర్థంగా ఎదుర్కోవచ్చు. ఎలాగంటే... నెట్‌వర్క్‌ కనీసం వెయ్యి బ్లాక్‌ చెయిన్లతో నిర్మితమవుతుంది. ఇవన్నీ అనుసంధానమై ఉంటాయి. అందువల్ల ప్రతి లావాదేవీ అన్ని చెయిన్లలోనూ నిక్షిప్తమవుతుంది. ఒకవేళ హ్యాకర్లు ఈ సమాచారం మార్చాలని ప్రయత్నిస్తే నెట్‌వర్క్‌లో ఒక బ్లాక్‌లో మార్చినప్పటికీ మిగిలిన బ్లాక్‌లు ఆ మార్పును తీసుకోవు. అంటే అన్ని బ్లాక్‌ల్లోనూ ఒకేసారి మార్చితేనే ఏదైనా చేయడానికి వీలవుతుంది అలా చేయగలగడం దాదాపు అసాధ్యమే. దీంతో సమాచారానికి పూర్తి స్థాయి భద్రత ఉంటుంది. అందువల్లే బ్యాంకులు, ట్రేడింగ్‌ కంపెనీలు, బీమా సంస్థలు, ఆసుపత్రులు... ఒకటేమిటి ఫిన్‌టెక్‌ సంస్థలన్నీ బ్లాక్‌చైన్‌ టెక్నాలజీపై దృష్టి సారిస్తున్నాయి. 

ఎలాంటి ఉద్యోగాలు?

ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఉంటాయి. కోడింగ్‌పై అవగాహన ఉన్నవారికి కొన్ని బాధ్యతలు, కోడింగ్‌ వచ్చినవారికి మరో రకమైన బాధ్యతలు లభిస్తాయి. కోడింగ్‌లో అద్భుత ప్రతిభ ఉన్నవారికి ఇంకో రకమైన హోదా లభిస్తుంది. బ్లాక్‌ చెయిన్‌ డెవలపర్, బ్లాక్‌ చెయిన్‌ స్పెషలిస్ట్, బ్లాక్‌ చెయిన్‌ ఇంజినీర్, బ్లాక్‌ చెయిన్‌ సబ్జెక్ట్‌ మ్యాటర్‌ ఎక్స్‌పర్ట్, క్రిప్టో కరెన్సీ డెవలపర్, బ్లాక్‌ చెయిన్‌ బిజినెస్‌ ఎనలిస్ట్, బ్లాక్‌ చెయిన్‌ సొల్యూషన్‌ ఆర్కిటెక్ట్, క్రిప్టో కరెన్సీ మైనింగ్‌ ఇంజినీర్, బ్లాక్‌ చెయిన్‌ జనరలిస్ట్, స్మార్ట్‌ కాంట్రాక్ట్‌ డెవలపర్, బ్లాక్‌ చెయిన్‌ ప్రొజెక్ట్‌ మేనేజర్, బ్లాక్‌ చెయిన్‌ క్వాలిటీ ఇంజినీర్, బ్లాక్‌ చెయిన్‌ డిజైనర్, బ్లాక్‌ చెయిన్‌ కన్సల్టెంట్‌...తదితర హోదాలు ఉంటాయి. ఆయా సంస్థలను బట్టి ఈ హోదాల పేర్లలో మార్పులు ఉంటాయి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సివిల్స్‌... గ్రూప్స్‌ ఏది మీ టార్గెట్‌?

‣ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లకు సిద్ధమేనా?

‣ గణాంక శాస్త్రంలో ఘనమైన కోర్సులు

‣ మరచిపోకుండా నేర్చుకోవాలంటే...!

‣ SSC CHSL: ఇంటర్‌ ఉంటే.. కొట్టేయవచ్చు కేంద్రం కొలువు!

‣ అటవీ ఉత్పత్తుల వృద్ధిలో నైపుణ్యం పెంచే కోర్సులు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 15-02-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌