• facebook
  • whatsapp
  • telegram

టాప్‌ కొలువులకు..టెక్‌ నైపుణ్యాలు! 

డేటాబేస్, ఎస్‌క్యూఎల్‌

టెక్నాలజీ ఇండస్ట్రీలో ఎటువైపు  వెళ్లాలన్నా డేటాబేస్, SQL నైపుణ్యాలు చాలా అవసరం. ఎంతో డిమాండ్‌ ఉన్న డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, బిజినెస్‌ అనలిస్ట్‌ లాంటి ఉద్యోగాలకు  SQL లో నైపుణ్యం తప్పనిసరి. ఇది నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం, ఉపయోగించడం  సులభం. ఇది ఆంగ్ల భాషను పోలి ఉంటుంది! ఐబీఎం, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్‌ లాంటి పెద్ద కంపెనీలే కాకుండా పరిశ్రమలో   ఆర్‌డీబీఎంఎస్‌తో   పనిచేసే ప్రతి కంపెనీ ఈ SQL ని ఉపయోగిస్తుంది. 

'డేటా అనేది ఇప్పుడు కొత్త చమురు, కొత్త బంగారం - నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి'

'డేటా మనం చేసే ప్రతి పనికీ  శక్తినిస్తుంది - జెఫ్‌ వెయినర్,  పూర్వ సీఈఓ, లింక్డ్‌ ఇన్‌  ' 

యూట్యూబ్‌లో మనం ఏదైనా వీడియో చూస్తే తరువాత నుంచీ మనకు నచ్చడానికి ఆస్కారముండే అదే తరహా వీడియోలు కనపడుతుంటాయి కదా? అలాగే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి వాటిల్లో ఏదైనా ఒక వస్తువు గురించి చూస్తే, తరువాత నుంచి అలాంటి వస్తువులే దర్శనమిస్తుంటాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌/ మెషిన్‌ లర్నింగ్‌ ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌లు నిర్మించే సాఫ్ట్‌వేర్‌ల వల్లనే ఇదంతా సాధ్యపడుతోంది. ఈ సాఫ్ట్‌వేర్‌లు పనిచేయడానికి కీలకమైనది డేటా. ఒక కారో, బైకో నడవాలంటే ఇంధనం ఎంత ముఖ్యమో- ఈ సాఫ్ట్‌వేర్స్‌కి డేటా అనేది అంత ముఖ్యం!    

ఏదైనా ఒక కంపెనీ యాప్‌ లేదా వెబ్‌సైట్‌లో మనం లాగిన్‌ కోసం ఇచ్చే వ్యక్తిగత వివరాల దగ్గర నుంచి రోజూ వాట్సాప్‌లో పంపే మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి వాటిల్లో పెట్టే పోస్టులు, స్టోరీలు, యూట్యూబ్‌లో చూసే వీడియోలు, అమెజాన్‌లో ఆర్డర్‌ చేసుకునే వస్తువులు, జీ-మెయిల్‌లో పంపుకునే ఫైల్స్‌- ఇలా వీటన్నిటినీ ‘డేటా’ అనవచ్చు.

డేటాబేస్‌ అంటే?

డేటాబేస్‌ అంటే మన దగ్గర ఉన్న డేటాని క్రమపద్ధతిలో పెట్టుకోవడం. ఆ డేటాబేస్‌లో డేటాను నిల్వ (స్టోర్‌) చేయడానికీ, యాక్సెస్‌ చేయడానికీ, సురక్షితంగా ఉంచడానికీ, నిర్వహించడానికీ ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌నే డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (డీబీఎంఎస్‌) అంటారు.   ఒక యాప్‌ లేదా వెబ్‌సైట్‌ని ఒకేసారి లక్షల మంది వాడుతూ ఉంటారు. ఉదాహరణకు ఫ్లిప్‌కార్ట్‌లో జరిగే బిగ్‌ బిలియన్‌ డే. మరి ఒకేసారి వెబ్‌సైట్‌లోకి అంతమంది వచ్చినా వెబ్‌సైటు నెమ్మదించకుండా ఎటువంటి ఇబ్బందీ లేకుండా పనిచేయాలి కదా?  ఇలా పనిచేసేలా చేయడానికి కంపెనీలు డేటాబేస్‌ టెక్నాలజీల మీదనే ఆధారపడతాయి.  

ఒక కంపెనీ దగ్గర ఉండే డేటాలో వ్యక్తిగత వివరాలు, బ్యాంకు లావాదేవీలు, ఫొటోలు, వీడియోల్లాంటి సురక్షితంగా ఉంచాల్సిన సమాచారం ఉంటుంది. ఇటువంటి ముఖ్యమైన డేటాని ఎవరు, ఎంతవరకు యాక్సెస్‌ చేయగలరు అని అనుమతులు పెడుతూ డేటాని సురక్షితంగా ఉంచడానికి డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ ఉపయోగపడతాయి.

రెండు రకాలు

డేటాను స్టోర్‌ చేయడానికి ఉపయోగించే డేటాబేస్‌లో ముఖ్యంగా రెండు రకాలుంటాయి.    

1. రిలేషనల్‌ డేటాబేస్‌

ఏదైనా ఒక డేటాను టేబుల్‌ (పట్టిక) ఫార్మాట్‌లో స్టోర్‌ చేస్తే దాన్ని రిలేషనల్‌ డేటాబేస్‌ అంటారు. ఇటువంటి డేటాబేస్‌లను మేనేజ్‌ చేయడానికి వాడే సాఫ్ట్‌వేర్‌ని రిలేషనల్‌ డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ అంటారు. ఉదా: Oracle, MySQL, SQL Server, IBM, DBM2, PostgreSQL, SQLite’. 

2. నాన్‌ రిలేషనల్‌ డేటాబేస్‌ 

కొన్ని అవసరాలకు తగ్గట్టుగా డేటాను టేబుల్‌ ఫార్మాట్‌లో కాకుండా కొన్ని నిర్దిష్ట పద్ధ్దతుల్లో నిల్వ చేస్తారు. దీన్ని నాన్‌ రిలేషనల్‌ డేటాబేస్‌ అంటారు. దీన్ని నిర్వహించడానికి నాన్‌ రిలేషనల్‌ డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఉపయోగిస్తారు. ఉదా: MongoDB, Elasticsearch, CouchDB, DynamoDB, Cassandra, Redis. (. సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో చాలావరకూ కంపెనీలు రిలేషనల్‌ డేటాబేస్‌నే ఎక్కువగా ఉపయోగిస్తాయి. అందుకని ఏదైనా ఒక రిలేషనల్‌ డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఆర్‌డీబీఎంఎస్‌) నేర్చుకోవడం చాలా అవసరం.

SQL అంటే.. 

ఆర్‌డీబీఎంఎస్‌లో డేటాను స్టోర్‌ చేయాలన్నా, డేటాను మార్చాలన్నా, తొలగించాలన్నా.. SQLఅనే లాంగ్వేజ్‌ వాడతారు. అంటే స్ట్రక్చర్డ్‌ క్వరీ లాంగ్వేజ్‌. దీన్ని SEQUEL అనీ వ్యవహరిస్తారు. ఐబీఎం, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్‌ లాంటి పెద్ద కంపెనీలే కాకుండా పరిశ్రమలో ఆర్‌డీబీఎంఎస్‌తో పనిచేసే ప్రతి కంపెనీ కూడా ఈSQLని ఉపయోగిస్తాయి.

ఒక్క నిమిషంలో.. 

ప్రపంచవ్యాప్తంగా 2020 

సంవత్సరంలో వినియోగదారులు కేవలం ఒక్క నిమిషం వ్యవధిలో- 

ఇన్‌స్టాగ్రామ్‌లో 2.70 లక్షలకు పైగా స్టోరీలను చూశారు.

వాట్సాప్‌లో నాలుగు కోట్లకు పైగా మెసేజ్‌లు పంపుకున్నారు. 

యూట్యూబ్‌లో 45 లక్షల వీడియోలను వీక్షించారు. 

ఇలా ఇంటర్నెట్‌లో వివిధ వెబ్‌సైట్‌లలో ఒక్క నిమిషంలోనే చాలా డేటా అనేది తయారవుతుంది. చిన్న చిన్న అంకుర సంస్థల నుంచి మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్‌ లాంటి పెద్ద కంపెనీల వరకూ అందరికీ వారి బిజినెస్‌ ఎదగడానికి డేటా అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఇంత భారీ మొత్తంలో ఉన్న డేటాని కంపెనీలు ఎలా నిర్వహిస్తాయి? దీని కోసం కంపెనీలు డేటాబేస్‌ టెక్నాలజీలను ఉపయోగిస్తాయి.

డేటా సైంటిస్ట్‌

డేటా సైంటిస్టులు వివిధ రకాల ముఖ్యమైన డేటాను సేకరించి వాటి నుంచి ఇన్‌సైట్స్‌ను తెస్తారు. వీటిని ఉపయోగించి ఆ కంపెనీ చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. ఒక కంపెనీ ఏదైనా కొత్త ఉత్పత్తిని మార్కెట్‌లోకి విడుదల చేయాలన్నా,   కొత్త ఫీచర్‌ తీసుకురావాలన్నా... ఇలా ఏ పని చేయాలన్నా డేటా మీద ఆధారపడే నిర్ణయాలు తీసుకుంటాయి. ఉదాహరణకు- వినియోగదారులు ఎటువంటి వస్తువులు ఎక్కువ కొంటున్నారో పరిశీలించి వాటిని మళ్ళీ కొనేలా ఆఫర్లు ఇవ్వడం లాంటివి. ఇలా కంపెనీల ఎదుగుదలలో డేటా సైంటిస్టుల పాత్ర చాలా ముఖ్యమైనది.

అప్లికేషన్‌ డెవలపర్‌ 

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, జొమాటో, ట్విటర్‌ లాంటి యాప్స్‌ను అభివృద్ధి చేసేవారిని అప్లికేషన్‌ డెవలపర్లు అంటారు. ఏ అప్లికేషన్‌ (యాప్‌) తీసుకున్నా డేటా చాలా ముఖ్యం. ఇలా డేటాని ఉపయోగించి అప్లికేషన్‌ని నిర్మించడం, డేటాని నిర్వహించడం లాంటివి ఈ అప్లికేషన్‌ డెవలపర్లు చేస్తారు. ఉదాహరణకు వాట్సాప్‌లో మెసేజ్‌ పంపిస్తే దాన్ని సేవ్‌ చేయడం, తిరిగి ఓపెన్‌ చేసినప్పుడు ఆ మెసేజ్‌లను మనకు చూపించడం లాంటివి. అలాగే అమెజాన్‌లో మన ఆర్డర్‌లను సేవ్‌ చేసి, కావాలన్నపుడు ఆ వివరాలు చూపించడం. ఇంకా డెలివరీ స్టేటస్‌ చూపించడం లాంటివి జరిగేలా ఈ అప్లికేషన్‌ డెవలపర్లు సాఫ్ట్‌వేర్‌లను రూపొందిస్తారు.

లక్షల్లో జీతాలు

పే స్కేల్‌ సంస్థ అధ్యయనం ప్రకారం- మనదేశంలో డేటా సైంటిస్టుల వేతనం సుమారు రూ.8 లక్షలు. అదే అమెరికాలో అయితే రూ.70 లక్షలు. మనదేశంలో డేటా అనలిస్ట్, బిజినెస్‌ అనలిస్టుల జీతం సుమారు రూ.6 లక్షలు; అమెరికాలో సుమారు రూ.50 లక్షలు. ఈ ఉద్యోగాలన్నిటికీ SQL లో నైపుణ్యం తప్పనిసరి.

నేర్చుకోవడం ఎలా?

డేటాబేస్‌ టెక్నాలజీల్లో నైపుణ్యం ఉన్నవారికి లక్షల్లో వేతనాలు ఇవ్వడానికి కంపెనీలు సిద్ధంగా ఉంటున్నాయి. ఈ నైపుణ్యాలు నేర్చుకున్నవారు సంవత్సరానికి రూ. 4.5 లక్షల నుంచి 9 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించవచ్చు. యుడెమి, కోర్స్‌ఎరా లాంటి వేదికల్లో డేటాబేస్‌ టెక్నాలజీలను మనం నేర్చుకోవచ్చు. నెక్స్‌ట్‌ వేవ్‌ వారి సీసీబీపీ టెక్‌  4.0 ఇంటెన్సివ్‌ ప్రోగ్రాం ద్వారా 4.5 నెలల్లోనే పరిశ్రమకు సిద్ధమయ్యేలా డేటా బేస్‌ టెక్నాలజీల్లో ప్రాథమిక స్థాయి నుంచి శిక్షణ లభిస్తోంది.

వెబ్‌సైట్‌: ccbp.in/intensive

ఈ-మెయిల్‌: support@nxtwave.techz

ఇంకా ఎన్నో ప్రైవేటు శిక్షణ సంస్థలు కోర్సులు నిర్వహిస్తున్నాయి. - రాహుల్‌ అత్తులూరి, సీఈఓ, నెక్స్‌ట్‌ వేవ్‌  
 

Posted Date: 10-06-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌