• facebook
  • whatsapp
  • telegram

స్టైల్‌ స్టైల్‌గా...

ఫుడ్‌ స్టైలిస్ట్‌ కెరియర్‌లో ప్రవేశాలు

మీరు సరదాగా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నారు... షో మధ్యలో బోలెడన్ని ప్రకటనలు... అందులో వచ్చిన ఒక పిజ్జా యాడ్‌ చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా కనిపించింది. రంగురంగుల్లో వేడివేడి ఆవిర్లు కక్కుతూ చీజ్‌తో నిండిపోయిన ఆ పిజ్జాను వెంటనే తినాలి అనిపించింది మీకు. అనుకున్నదే ఆలస్యం, ఫోన్‌ తీసి ఆర్డర్‌ పెట్టేశారు... ఇంటికొచ్చిన పిజ్జాను సంతృప్తిగా తినేశారు. ఇప్పుడు ఆ పిజ్జాను మీకు అంత అందంగా చూపించి వెంటనే కొనేలా ప్రేరేపించినది ఎవరో తెలుసా?... ఆ ప్రకటన తయారీ వెనకున్న ఓ ఫుడ్‌ స్టైలిస్ట్‌. ఆసక్తి ఉంటే మీరూ ఈ కెరియర్‌లోకి ప్రవేశించవచ్చు!

ఆహారం రుచికి ఎంత బాగుండాలి అనుకుంటామో... కంటికి కూడా అంత ఇంపుగా కనిపించాలని భావిస్తాం. నిజానికి ఏదైనా ఆహార పదార్థాన్ని చూస్తూనే అది ఎలా ఉండబోతోందో ఒక అంచనాకు వచ్చేస్తాం. అందుకే ఫుడ్‌ గార్నిషింగ్‌కు అంత ప్రాముఖ్యం. ఒకప్పుడు ఇది ఏ ఫైవ్‌ స్టార్‌ హోటళ్లకో పరిమితమయ్యేది. కలినరీ కోర్సులు చేసేవారు తమ చదువులో ఒక భాగంగా దీన్ని నేర్చుకునేవారు. కానీ ఇప్పుడు ఆ గార్నిషింగ్‌ కాస్తా ఇంకాస్త ట్రెండీగా తయారై స్టైలింగ్‌గా, ఓ కెరియర్‌ అవకాశంగా రూపాంతరం చెందింది. కొత్త తరహా ఉద్యోగాల్లో ఇది కూడా ఒకటి.

ఇప్పుడు ‘ఫుడ్‌ అప్పియరెన్స్‌’ అనేది పెద్ద వ్యాపారం. దేశవిదేశాల్లో శాఖలు ఉన్న సంస్థలు, హోటళ్ల వంటివి తమ ఉత్పత్తులు వినియోగదారులకు అందంగా కనిపించాలని కోరుకుంటాయి. అందుకోసం మార్కెటింగ్‌లో అనేక రకాల విధానాలు అవలంబిస్తుంటాయి. ఇందుకు చక్కటి చిత్రాలు, వీడియోలు అవసరం. తమ ఆహార పదార్థాలను ప్రపంచానికి చూపించాలి అనుకున్నప్పుడు అవి ఎంతో అందంగా కనిపించేలా చేసేందుకు ఫుడ్‌ స్టైలిస్ట్‌లను ఆశ్రయిస్తున్నాయి.

ఫుడ్‌ స్టైలిస్ట్‌లకు ఆహారం అందంగా కనిపించేలా చేయడం మాత్రమే పని. దాన్ని రుచిగా వండటంతో వారికెలాంటి సంబంధం లేదు. వీరు ఎక్కువగా ఫుడ్‌ ఫొటోగ్రాఫర్లతో కలిసి పని చేయాలి. నటీనటులకు షూటింగ్‌లు, ఫొటోషూట్‌ సమయాల్లో స్టైలిస్ట్‌లు ఎలా సహాయంగా ఉంటారో అలాగే ఆహారానికీ స్టైలింగ్‌ చేయడం వీరి వృత్తి. కంటికి అందంగా కనిపించడం కోసం వారు ఆహారానికి తినకూడని పదార్థాలు (నాన్‌ ఈటబుల్‌) కూడా చేరుస్తుంటారు. ఎలా అయితేనేం ఫొటోలు, వీడియోలు బాగా వచ్చేలా చూడటమే వీరి ప్రధాన లక్ష్యం.

అర్హతలేంటి?

ఇందులో ప్రవేశించడానికి ప్రత్యేకంగా అర్హతలంటూ ఏవీ అక్కర్లేదు. ఫొటోగ్రఫీపై ఆసక్తి, ఆహార పదార్థాల తయారీపై అవగాహన ఉన్నవారు ఇందులోకి ప్రవేశిస్తూ ఉంటారు. హోటల్‌ మేనేజ్‌మెంట్, కలినరీ ఆర్ట్స్, క్యాటరింగ్‌ టెక్నాలజీ, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ సర్వీసెస్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ వంటి పలు రకాల కోర్సులు చేసినవారు ఇందులో పూర్తిస్థాయి నిపుణులుగా రాణించే అవకాశం ఉంటుంది. ఆహార పదార్థాలు ఎలా కనిపిస్తే వినియోగదారులు ఆకర్షితులవుతారనే అంశంపై అంచనా, మార్కెటింగ్‌పై కనీస అవగాహన ఉండాలి.

వివిధ రకాల క్యూజిన్‌లు, ప్రకటన చేస్తున్న ప్రాంతం, యాడ్‌లు ఇస్తున్న మాధ్యమం (ప్రింట్, టెలివిజన్, డిజిటల్‌), ఇలా అనేక రకాల అంశాలపై వీరి ఉద్యోగం తీరు ఆధారపడి ఉంటుంది. అలాగే ఒకరు ఫాస్ట్‌ఫుడ్‌ స్టైలింగ్‌లో రాణిస్తే ఇంకొకరికి బేకరీ ప్రొడక్ట్‌లను అందంగా చూపించే నైపుణ్యం ఉండొచ్చు. ఎవరికి నచ్చిన దాన్ని వారు ఎంచుకుని అందులో కృషి చేయొచ్చు. 

అవకాశాలేంటి?

వీరికి హోటళ్లు, రెస్టారెంట్లలోనే కాకుండా అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీలు, ఆన్‌లైన్‌ ఫుడ్‌ ప్రొడక్షన్‌ చానెల్స్, ఫాస్ట్‌ఫుడ్‌ చెయిన్స్, ఫుడ్‌ మ్యాగజైన్స్‌ వంటి వాటిల్లో అవకాశాలుంటాయి. సృజనాత్మక స్వేచ్ఛ ఉంటూ ప్రయోగాలకు ఆస్కారం ఉన్న రంగం ఇది. కొంత పని అనుభవం తర్వాత ఫ్రీలాన్సర్‌గానూ ప్రయత్నించవచ్చు. సోషల్‌ మీడియా వల్ల ఇప్పుడు ఇందులో మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయి.

కోర్సులు...

ఈ కోర్సు నేర్చుకునేందుకు దేశంలోనేకాక తెలుగు రాష్ట్రాల్లో చాలా విద్యాసంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు అందిస్తున్న దాదాపు అన్ని కాలేజీల్లోనూ దీనిగురించి అధ్యయనం చేసే వీలుంది. ఆర్ట్‌ స్కూల్స్, ఫొటోగ్రఫీ నేర్పించే శిక్షణ సంస్థల్లోనూ చదవచ్చు. ఇవేకాక ఆన్‌లైన్‌లోనూ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కావాల్సినదల్లా ఓపిగ్గా సాధన చేసే ఆసక్తి మాత్రమే! 

సరైన శిక్షణ అనంతరం హోటళ్లు, ప్రొడక్షన్‌ కంపెనీల్లో కొలువులకు ప్రయత్నించవచ్చు. దీంతోపాటు ఆహార వ్యాపారం చేసే సంస్థలకు వారి ఉత్పత్తులను ఫొటోలు, వీడియోలు తీసిపెట్టే కన్సల్టింగ్‌ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిల్లోనూ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు.

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ 160 విద్యాసంస్థల్లోకి... జాట్‌ దారి

‣ ప్రయత్నిస్తున్నా... ప్రతికూల ఫలితాలా?

‣ క్లౌడ్‌లో విహరిద్దామా!

‣ ఫారిన్‌ ట్రేడ్‌.. అద్భుత కెరియర్‌!

‣ అణుశక్తి విభాగంలో కొలువులు

Posted Date: 09-11-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌