• facebook
  • whatsapp
  • telegram

160 విద్యాసంస్థల్లోకి... జాట్‌ దారి  

ఎంబీఏ/ పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన

దేశంలో మేనేజ్‌మెంట్‌ విద్యలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షల్లో క్యాట్‌ తర్వాత పేరున్నది జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జాట్‌). ఇందులో సాధించిన స్కోరుతో దేశవ్యాప్తంగా 160 బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ/ పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. జాట్‌ను జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, జంషెడ్‌పూర్‌ నిర్వహిస్తోంది. భారత్‌లోని టాప్‌-10 బీ స్కూళ్లలో ఇదొకటి. వచ్చే విద్యా సంవత్సరంలో కోర్సుల్లో ప్రవేశానికి ఎక్స్‌ఏటీ - 2023 ప్రకటన వెలువడింది. ఆ వివరాలు...

జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ), జంషెడ్‌పూర్, జేవియర్‌ అనుబంధ సంస్థల్లో ఎంబీఏ/ పీజీడీఎం కోర్సులో ప్రవేశానికి ఎక్స్‌ఏటీ ఏటా నిర్వహిస్తున్నారు. వివిధ ఐచ్ఛికాలతో ఇక్కడ మేనేజ్‌మెంట్‌ కోర్సులు లభిస్తున్నాయి. హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌లో ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ అత్యున్నతమైందిగా గుర్తింపు పొందింది. దీనికి చెన్నై, ముంబయి, బెంగళూరు, రాంచీ, భువనేశ్వర్, దిల్లీ... తదితర చోట్ల క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిల్లో ప్రవేశం ఎక్స్‌ఏటీ స్కోర్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూలతో లభిస్తుంది. ఇక్కడ చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఆకర్షణీయ వేతనాలతో కార్పొరేట్‌ సంస్థల్లో కొలువులు సొంతం చేసుకుంటున్నారు.   

ఇవీ కోర్సులు

పీజీడీఎం: బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (బీఎం), హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ (హెచ్‌ఆర్‌ఎం), జనరల్‌ మేనేజ్‌మెంట్‌ (జీఎం), ఇన్నోవేషన్, ఆంత్రప్రెన్యూర్‌షిప్, వెంచర్‌ క్రియేషన్‌ (ఐఈవీ). వీటిని ఫుల్‌టైం రెసిడెన్షియల్‌ విధానంలో అందిస్తున్నారు.

ఎఫ్‌పీఎం (ఫెలో ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌): పీజీ పూర్తిచేసుకున్నవారు, ప్రొఫెషనల్‌ కోర్సులు చదివినవాళ్లు, పని అనుభవం ఉన్నవారికోసం ఉద్దేశించిన ఈ కోర్సు నాలుగేళ్ల వ్యవధితో అందుబాటులో ఉంది.  

ప్రవేశపరీక్ష ఇలా

ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో రెండు సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్, డెసిషన్‌ మేకింగ్, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌ 2లో జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలు వస్తాయి. సెక్షన్ల వారీ వ్యవధి నిబంధన లేదు. అభ్యర్థులు తమకు నచ్చిన సెక్షన్‌ నుంచి పరీక్ష ప్రారంభించుకోవచ్చు. ఒక విభాగం నుంచి మరో విభాగంలోకి వెళ్లిపోవచ్చు. మొత్తం పరీక్ష వ్యవధి 3 గంటల 10 నిమిషాలు. అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు కేటాయిస్తారు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి ప్రశ్నకు పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో రుణాత్మక మార్కులు లేవు. ఇందులో సాధించిన స్కోర్‌ గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ నిమిత్తం పరిగణనలోకి తీసుకోరు. 

ఎక్స్‌ఏటీ- 2022లో వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీలో 26, డెసిషన్‌ మేకింగ్‌ ఎబిలిటీలో 21, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో 28, జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి 25 ప్రశ్నలు అడిగారు. పాత ప్రశ్నపత్రాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అలాగే టాపర్స్‌ సూచనలూ అందుబాటులో ఉంచారు.

సీట్లు పెరిగాయి...

ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, జంషెడ్‌పూర్‌ క్యాంపస్‌లో పీజీడీఎం (బీఎం) కోర్సులో సీట్లను 180 నుంచి 240కు పెంచారు. అలాగే దిల్లీ క్యాంపస్‌లోనూ 120 నుంచి 160కి పెరిగాయి.

గత ఏడాది వరకు పరీక్షను ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:40 గంటల వరకు నిర్వహించేవారు. ఈ సంవత్సరం నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:10 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. 

ప్రవేశం కల్పించే కొన్ని మేటి సంస్థలు 

ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, జంషెడ్‌పూర్‌ 

ఫ్లేమ్‌ యూనివర్సిటీ, పుణే 

ఫోర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, న్యూదిల్లీ 

గీతం యూనివర్సిటీ, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు 

గ్రేట్‌ లేక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, చెన్నై 

ఐఎఫ్‌ఎంఆర్, చిత్తూరు 

ఐఐఆర్‌ఎం, హైదరాబాద్‌ 

ఐఎంటీ, హైదరాబాద్, నాగ్‌పూర్, ఘజియాబాద్, దుబాయ్‌ 

ఐఆర్‌ఎం, ఆనంద్‌ 

మైకా, అహ్మదాబాద్‌ 

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంక్‌ మేనేజ్‌మెంట్, పుణే 

పండిట్‌ దీన్‌దయాళ్‌ పెట్రోలియం యూనివర్సిటీ, గాంధీనగర్‌ 

టీఏపాయ్, మణిపాల్‌

విట్, వెల్లూరు

విజ్ఞాన జ్యోతి, హైదరాబాద్‌

కొత్త కోర్సులు 

లాజిస్టిక్‌ సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఎనలిటిక్స్‌లో రెండేళ్ల వ్యవధితో కొత్త కోర్సును అమెరికాలోని రట్‌గర్జ్‌ బిజినెస్‌ స్కూల్‌తో కలిసి అందిస్తున్నారు. 

ఇన్నోవేషన్, ఆంత్రప్రెన్యూర్‌షిప్, వెంచర్స్‌ క్రియేషన్‌లో పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు మొదలవుతోంది.   

గమనించండి! 

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.2000.

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 30

అడ్మిట్‌ కార్డులు: డిసెంబరు 20 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

పరీక్ష తేదీ: జనవరి 8 (ఆదివారం), 2023. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌.

ఫలితాల వెల్లడి: జనవరి 31, 2023. 

వెబ్‌సైట్‌: https://xatonline.in/
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రయత్నిస్తున్నా... ప్రతికూల ఫలితాలా?

‣ క్లౌడ్‌లో విహరిద్దామా!

‣ ఫారిన్‌ ట్రేడ్‌.. అద్భుత కెరియర్‌!

‣ అణుశక్తి విభాగంలో కొలువులు

Posted Date: 09-11-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌