• facebook
  • whatsapp
  • telegram

ఫారిన్‌ ట్రేడ్‌.. అద్భుత కెరియర్‌!

యూజీ, పీజీ కోర్సులు

ప్రపంచం కుగ్రామమవుతోంది. దేశాల మధ్య వాణిజ్యం, రాకపోకలు బాగా విస్తరిస్తున్నాయి. ఆర్థిక నిబంధనలు, విదేశీ పెట్టుబడుల్లో పరిమితులను సరళీకరించడంతో సంస్థలు విదేశాల్లోనూ శాఖలు ప్రారంభించి ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నాయి. వస్తువులు, ఆహారం, ముడి సరకు... మొదలైన వాటికోసం ప్రతి దేశం మరో దేశంపై ఆధారపడటం తప్పనిసరి. ఈ వ్యవహారాలను సమర్థంగా నిర్వహించడానికి ఇంటర్నేషనల్‌ బిజినెస్‌/ ఫారిన్‌ ట్రేడ్‌లో పట్టుండాలి. పలు సంస్థలు ఈ కోర్సులను యూజీ, పీజీ స్థాయుల్లో అందిస్తున్నాయి. వీటిని పూర్తిచేసుకున్నవారికి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి! 

విశ్వవ్యాప్తంగా ఉన్న వనరులను వీలైనంత ప్రభావవంతంగా ఉపయోగించడానికి ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ తోడ్పడుతుంది. సంస్థలు, పెట్టుబడులు, తయారీ కేంద్రాలు, ఉత్పత్తులు... ఎల్ల్లలు దాటాలంటే ముందుగా ఎన్నో అనుమతులుండాలి. అందుకు సంబంధించిన నిబంధనలపైనా అవగాహన తప్పనిసరి. ఇంటర్నేషనల్‌ బిజినెస్‌/ఫారిన్‌ ట్రేడ్‌పై పట్టున్నవారి సేవలు ఎంతో కీలకం. విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ వర్తకానికి సంబంధించి మనదేశం నిబంధనలు సరళతరం చేయడంతో ఎన్నో విదేశీ సంస్థలు ఇక్కడ విస్తరిస్తున్నాయి. ప్రపంచంలో వేగంగా విస్తరిస్తోన్న విపణిగా భారత్‌ గుర్తింపు పొందుతోంది. అందువల్ల బహుళజాతి సంస్థలు తమ శాఖలు, ఉత్పత్తి, తయారీ కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి. అలాగే మనదేశం నుంచీ విదేశాలకు వివిధ ఉత్పత్తుల ఎగుమతి పెరుగుతోంది. మన సంస్థలూ ఇతర దేశాల్లో సేవలందిస్తున్నాయి. దీంతో ఇంటర్నేషనల్‌ బిజినెస్‌/ ఫారిన్‌ట్రేడ్‌ కోర్సులు చదివినవారికి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి.  

కోర్సులు... అర్హతలు

ఇంటర్నేషనల్‌ బిజినెస్‌/ ఫారిన్‌ ట్రేడ్‌ కోర్సులను ఒకప్పుడు ఎంబీఏలో ఒక స్పెషలైజేషన్‌గా పరిమిత సంఖ్యలో సంస్థలు అందించేవి. అయితే ఇప్పుడు యూజీ స్థాయిలోనే వీటిని అందించే సంస్థలు పెరిగాయి. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో అన్ని గ్రూపుల విద్యార్థులూ యూజీ కోర్సులో చేరవచ్చు. పలు సంస్థలు బీఏ/ బీకాం/ బీబీఏలో భాగంగా ఫారిన్‌ట్రేడ్‌/ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ కోర్సులు అందిస్తున్నాయి. విద్యా నేపథ్యంతో సంబంధం లేకుండా డిగ్రీ అన్ని గ్రూపుల విద్యార్థులూ ఎంబీఏ ఫారిన్‌ట్రేడ్‌/ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ కోర్సులో చేరవచ్చు. కొన్ని సంస్థల్లో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులూ ఈ విభాగంలో ఉన్నాయి. యూజీ తర్వాత వీటిని చదువుకోవచ్చు. అలాగే వృత్తి నిపుణుల కోసం ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ కోర్సును పేరున్న సంస్థలు అందిస్తున్నాయి. ఈ విభాగానికి సంబంధించి బోధనలో స్థిరపడటానికీ, అత్యున్నత స్థాయిని అందుకోడానికీ పీహెచ్‌డీ ఉపయోగపడతుంది. పీజీలో ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ పూర్తిచేసుకున్నవారు డాక్టరేట్‌ కోసం ప్రయత్నించవచ్చు.  

ప్రవేశమిలా...

యూజీ కోర్సులకు ఇంటర్‌ మార్కుల మెరిట్‌తో చేరిపోవచ్చు. కొన్ని సంస్థలు మాత్రం ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం కల్పిస్తున్నాయి. పీజీలో ప్రవేశానికి పరీక్షలో ప్రతిభ చూపడం తప్పనిసరి. అలాగే మేటి సంస్థల్లో సీటు దక్కడానికి పరీక్షతోపాటు, బృందచర్చ, ముఖాముఖిలోనూ రాణించాలి. క్యాట్‌ స్కోరుతో ఎక్కువ సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. మరికొన్ని సొంత పరీక్షలతో ప్రవేశాలు చేపడుతున్నాయి. ఎంబీఏ ఫారిన్‌ట్రేడ్‌ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష ఏదైనప్పటికీ.. క్వాంటిటేటివ్‌ ఎనాలిసిస్, లాజికల్‌ రీజనింగ్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాల నుంచే ఎక్కువ శాతం ప్రశ్నలు వస్తాయి.

ఏం నేర్చుకుంటారు? 

ఈ కోర్సులో చేరినవారికి.. ఎకనామిక్స్, ఇంపోర్ట్‌ ఎక్స్‌పోర్టు మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్, ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్, ఇంటర్నేషనల్‌ లాజిస్టిక్స్, సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్, నెగోషియేషన్స్, టారిఫ్‌లు, కస్టమ్స్, షిప్పింగ్‌ రెగ్యులేషన్లపై అవగాహన కల్పిస్తారు.  

రాణించాలంటే..? 

ప్రపంచ వర్తకం, ఉత్పత్తి రంగం, మార్కెట్‌పై ఆసక్తి, విభిన్న సంస్కృతులు తెలుసుకోవాలనే అభిలాష, దేశాల న్యాయ నిబంధనలపై శ్రద్ధ, దేశాల మధ్య వైవిధ్యంలపై ఇష్టం ఉంటే ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ కోర్సుల్లో చేరవచ్చు. కామర్స్, ఎకనామిక్స్‌పై పట్టుంటే మెరుగ్గా రాణించవచ్చు. ఆంగ్లం మాట్లాడటం, రాయడం రెండూ రావాలి. విదేశీ భాషలపై పట్టు అదనపు ఆకర్షణగా ఉంటుంది.

ఈ విద్యాసంస్థలు కూడా.. 

కొన్ని ఐఐఎంలు, ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్, క్రిస్ట్‌ యూనివర్సిటీ, జైన్, జామియా మిల్లియా ఇస్లామియా, దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్, పాండిచ్చేరి యూనివర్సిటీ, గీతం వైజాగ్‌ క్యాంపస్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్, సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజ్, గ్రేట్‌ లేక్స్, ఇక్ఫాయ్, టీఏపాయ్, ఎస్‌సీఎంఎస్, ఎండీఐ, అలియన్స్, అమిటీ, ఎల్‌పీయూ, పారుల్, జీడీ గొయాంకా, ఇబ్రహీంపట్నం గురుకుల డిగ్రీ కళాశాల...తదితర సంస్థలు యూజీ/ పీజీ స్థాయుల్లో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌/ ఫారిన్‌ ట్రేడ్‌ కోర్సులు నడుపుతున్నాయి. 

అవకాశాలు, హోదాలు 

కోర్సు పూర్తిచేసినవారికి అంతర్జాతీయ బ్యాంకులు, ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌లు, ఎక్స్‌పోర్ట్‌ ఇంపోర్ట్‌ సంస్థలు, అంతర్జాతీయ మార్కెటింగ్, లాజిస్టిక్స్‌ సంస్థలు, ఇంటర్నేషనల్‌ ట్రేడింగ్‌ సంస్థలు, సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ ఫర్మ్‌లు, ప్రభుత్వ కస్టమ్‌ విభాగాలు, బహుళజాతి సంస్థలు, పోర్టులు, కన్సల్టెన్సీలు, ఇంపోర్ట్‌ ఎక్స్‌పోర్ట్‌ ఏజెన్సీలు, హాస్పిటాలిటీ, టూరిజం, ట్రావెల్‌ సంస్థల్లో ఉద్యోగాలుంటాయి. పని చేస్తోన్న సంస్థను బట్టి వీరికి.. ప్రాజెక్ట్‌ మేనేజర్, అసోసియేట్, ఇన్వెస్టిమెంట్‌ బ్యాంకింగ్‌ మేనేజర్, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ డెవలపర్, ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌ మేనేజర్, ఫారిన్‌ పాలసీ అడ్వైజర్, ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ మేనేజర్, ఇంపోర్ట్‌ ఎక్స్‌పోర్టు కన్సల్టెంట్, ఎక్స్‌పోర్ట్‌ మేనేజర్, ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ మేనేజర్, గ్లోబల్‌ బిజినెస్‌ మేనేజర్, ఇంటర్నేషనల్‌ లాజిస్టిక్స్‌ మేనేజర్‌... తదితర హోదాలు దక్కుతాయి. మేటి సంస్థల్లో చదువుకున్నవారు ప్రాంగణ నియామకాల ద్వారా ఆకర్షణీయ వేతనంతో విదేశాల్లోనూ అవకాశం సొంతం చేసుకోవచ్చు.

ఐఐఎఫ్‌టీ ప్రకటన వెలువడింది

అంతర్జాతీయ వర్తకానికి సంబంధించి ఎంబీఏ కోర్సులో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ), న్యూదిల్లీ మేటి సంస్థ. దీనికి కాకినాడ, కోల్‌కతాల్లోనూ క్యాంపస్‌లు ఉన్నాయి. దేశంలో టాప్‌-10 బిజినెస్‌ స్కూళ్లలో ఐఐఎఫ్‌టీ ఒకటి. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ సంస్థ నడుస్తోంది. దేశం నుంచి ఎగుమతులు పెంచడం, ఫారిన్‌ ట్రేడ్‌లో నాణ్యమైన మానవ వనరులను రూపొందించే లక్ష్యంతో ఈ సంస్థను నెలకొల్పారు. కొత్త ఆలోచనలు, కాన్సెప్టులు, నైపుణ్యాలను ఉపయోగించి భారత ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ విపణిలోకి విస్తరించేలా చూడటంలో ఐఐఎఫ్‌టీ కృషి చేస్తుంది. ప్రభుత్వ విభాగాలు, కార్పొరేట్‌ వర్గాలు, విద్యార్థులకు శిక్షణ, మార్గదర్శకాలు అందిస్తుంది. రెండేళ్ల ఫుల్‌ టైం ఎంబీఏ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌తోపాటు మూడేళ్ల పార్ట్‌ టైం కోర్సు నిర్వహిస్తోంది. ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో ఎగ్జిక్యూటివ్‌ మాస్టర్స్, ఎక్స్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికెట్‌ ప్రోగ్రాం, ఎంఏ ఎకనామిక్స్‌ కోర్సు సైతం ఈ సంస్థ అందిస్తోంది. 

ఐఐఎఫ్‌టీలోని రెండేళ్ల ఎంబీఏ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ కోర్సులో ప్రవేశానికి జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్‌టీఏ) ఇటీవల ప్రకటన విడుదల చేసింది. కోర్సు 6 ట్రైమిస్టర్లలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ విద్యనభ్యసించినవారు ప్రాంగణ నియామకాల్లో ఆకర్షణీయ వేతనాలతో బహుళజాతి కంపెనీల్లో మేటి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. 

అర్హత: కనీసం 50 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45) శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతోన్న విద్యార్థులు అర్హులే.  

పరీక్ష ఇలా: కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్షలో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి. వ్యవధి 2 గంటలు. ఇందులో క్వాంటిటేటివ్‌ ఎనాలిసిస్, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ వెర్బల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 

గత ఏడాది: మొత్తం 110 ప్రశ్నలు వచ్చాయి. వీటికి 300 మార్కులు కేటాయించారు. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 25, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లో 16, వెర్బల్‌ ఎబిలిటీలో 19, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో 16, లాజికల్‌ రీజనింగ్‌లో 14 ప్రశ్నలు వచ్చాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున తగ్గించారు. జనరల్‌ అవేర్‌నెస్‌లో 20 ప్రశ్నలు అడిగారు. ఒక్కో దానికి 1.5 మార్కులు. ఈ విభాగంలో తప్పు సమాధానానికి అర మార్కు చొప్పున తగ్గించారు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 14

పరీక్ష తేదీ: డిసెంబరు 18 (ఏపీ, తెలంగాణల్లో పలు కేంద్రాల్లో పరీక్ష రాసుకునే సౌకర్యం ఉంది)

పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జండర్లకు రూ.1250, మిగిలినవారికి రూ.2500.

వెబ్‌సైట్‌: https://www.iift.ac.in/iift/index.php
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రత్యేక అధికారులు

‣ ఆవిష్కరణల అధ్యయనానికీ కోర్సులు!

‣ కుదిరిన వేళల్లో కాస్త సంపాదించుకుంటారా?

‣ కాపీ కొట్టాలని ఎందుకు అనిపిస్తుందంటే?

Posted Date: 07-11-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌