• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కుదిరిన వేళల్లో కాస్త సంపాదించుకుంటారా?

పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలకు పెరుగుతున్న డిమాండ్‌

ఇష్టమైన కోర్సులో చేరటం ఒక ఎత్తయితే... దాన్ని అవాంతరాల్లేకుండా పూర్తిచేయటం మరో ఎత్తు! ముఖ్యంగా పట్టణాలూ నగరాల్లో వసతి, భోజనం, కాలేజీ ఫీజు, పుస్తకాలు, ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్‌... ఇలా ఎన్నింటిపైనో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండే విద్యార్థులకు భారమే. అలాంటప్పుడు సొంతంగా ఎంతోకొంత సంపాదించగలిగితే కోర్సును మధ్యలో ఆపేసే పరిస్థితిని తప్పించుకోవచ్చు. ఇందుకోసం కాలేజీ వేళలకు ఇబ్బంది కలగని సమయాల్లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేయటంపై దృష్టి పెట్టవచ్చు! 

కొంతమంది విద్యార్థులు తమ అవసరాలకు డబ్బు సరిపోకపోయిన పరిస్థితుల్లోనూ పనిచేయడానికి సందేహిస్తుంటారు. ఎవరేమనుకుంటారోననే మొహమాటంతో ఇబ్బందులు పడుతుంటారు. నిజానికి పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేయడాన్ని నామోషీగా భావించాల్సిన పనేలేదు. చదువుకుంటూనే కష్టపడి పనిచేస్తున్నారంటే.. మీ మీద గౌరవం పెరుగుతుందేగాని తగ్గదు. కాబట్టి అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని సంపాదించడానికి సంకోచించకూడదు! ‘అనుభవమేమీ లేదు కదా? మనకు ఉద్యోగం ఎవరిస్తారు?’ అని సందేహించాల్సిన అవసరం లేదు. ఫ్రెషర్ల కోసమూ ఎన్నో రకాల పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు అందుబాటులోనే ఉంటున్నాయి. ఎన్నో ఎంట్రీ స్థాయి ఉద్యోగాలకు డిగ్రీతో, అనుభవంతో పని ఉండదు. పదోతరగతి, ఇంటర్‌ పూర్తయిన ఫ్రెషర్లూ వీటిని ఎంచుకోవచ్చు. అనువైన వేళల్లో పనిచేసే అవకాశమూ ఉంటుంది. మార్కెటింగ్, ఫైనాన్స్, కన్సల్టింగ్, హెల్త్‌కేర్‌... మొదలైన రంగాల్లో ఎంట్రీ స్థాయి ఉద్యోగావకాశాలు ఎక్కువ. ప్రస్తుతం దుస్తులు, వివిధ రకాల గాడ్జెట్లను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ఆన్‌లైన్‌ సంస్థల నుంచి కొనుక్కునేవాళ్లూ పెరిగారు. ఇలాంటి వస్తువులను వినియోగదారులకు అందించడానికీ ఉద్యోగుల అవసరమూ ఉంటుంది. వీళ్లు నిర్ణీత సమయాల్లో సేవలు అందిస్తే సరిపోతుంది. కాబట్టి పార్ట్‌టైమ్‌గా ఇలాంటి ఉద్యోగాలనూ ఎంచుకోవచ్చు. 

ట్యూటర్‌: కాలేజీకి వెళ్లి వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌ ట్యూటర్‌గా మారి బోధించవచ్చు. దీంతో సబ్జెక్టు మీద పట్టుతోపాటు బోధన నైపుణ్యమూ అలవడుతుంది. కొద్దోగొప్పో సంపాదించుకునే అవకాశమూ కలుగుతుంది. స్కైప్‌ సౌకర్యం ఉండి, ఏదైనా ఎడ్యుకేషన్‌ ఫోరమ్‌లో మీ వివరాలను నమోదు చేసుకుంటే ఆన్‌లైన్‌ ట్యూటర్‌గా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే ట్యూషన్‌ సెంటర్‌లో చేరి కూడా బోధించవచ్చు. ఎన్నో ట్యుటోరియల్‌ సంస్థలు సబ్జెక్టులవారీగా పార్ట్‌టైమ్‌ ట్యూటర్లను నియమించుకుంటాయి. అలాగే నగరాల్లో హోమ్‌ ట్యూటర్లకూ మంచి గిరాకీ ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను దూరంలో ఉండే ట్యూషన్‌ సెంటర్లకు పంపించడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్లు హోమ్‌ ట్యూటర్లకు ప్రాధాన్యమిస్తుంటారు. కాబట్టి హోమ్‌ ట్యూటర్‌గా మారి ఖర్చులకు అవసరమైన ఆదాయాన్ని పొందవచ్చు. పరిసరాల్లో ఉండే విద్యార్థులకూ ట్యూషన్లు చెప్పొచ్చు. అయితే సబ్జెక్టుల మీద అందరికీ పట్టు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు చిన్న తరగతుల విద్యార్థులకు ట్యూషన్లు చెప్పినా ఫలితం ఉంటుంది. 

ట్రాన్స్‌లేటర్‌: తీరిక సమయంలో పార్ట్‌టైమ్‌ ట్రాన్స్‌లేటర్‌గానూ పనిచేయొచ్చు. ఇంగ్లిష్‌లో ప్రతిభ ఉన్నవాళ్లను అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇంగ్లిష్‌ నుంచి తెలుగులోకి వివిధ అంశాలను అనువదించీ ఆదాయం పొందొచ్చు. ఇంగ్లిష్‌తోపాటు ఇతర ప్రాంతీయ భాషలు తెలిసినవారికి మరిన్ని అవకాశాలుంటాయి. 

డేటా ఎంట్రీ ఆపరేటర్‌: వేగంగా టైప్‌ చేయగల నైపుణ్యం ఉంటే ఈ ఉద్యోగాన్ని ఎంచుకోవచ్చు. ఇచ్చిన అంశాన్ని కచ్చితంగా టైప్‌ చేయగలరనే నమ్మకాన్ని కలిగిస్తే అవకాశాలు పెరుగుతాయి. సమాచారాన్ని కంప్యూటర్‌లో ఫీడ్‌ చేసి దాన్ని ఫైల్‌గా మార్చగలగాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవాళ్లకు ఈ పని సులువు. ఒక్కోసారి విధుల్లో భాగంగా స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించాల్సి వస్తుంది. ఇంట్లో నుంచే పనిచేయొచ్చు. ప్రయాణించాల్సిన అవసరమూ ఉండదు. హాస్పిటళ్లు, ఐటీ కంపెనీలు, అంకౌంటింగ్, రిటైల్, సేల్స్‌ రంగాల్లో వీరికి అవకాశాలుంటాయి.

కంటెంట్‌ రైటింగ్‌: తమ అభిప్రాయాలను ఆలోచింపజేసేలా, ఆకట్టుకునేలా రాయగలిగేవారు కంటెంట్‌ రైటర్‌గా పనిచేయొచ్చు. ఆసక్తి, నైపుణ్యం ఉంటే చదువు పూర్తయిన తర్వాత కూడా ఇదే వృత్తిలో స్థిరపడొచ్చు. జాబ్‌ పోర్టల్స్‌లో అన్వేషించడం ద్వారా ఈ ఉద్యోగాలను పొందొచ్చు. 

బ్లాగర్‌: ఆసక్తికరంగా ఉండే విషయాలను ఎంచుకుని కథనాలు రాయొచ్చు. పాఠకులను ఆకట్టుకునేలా ఎడిటింగ్‌ చేయగలగాలి. కొత్తగా ఆలోచించే నైపుణ్యం, సృజనాత్మకత ఉంటే బ్లాగర్‌గా రాణించొచ్చు. వ్యాపారం, జీవనశైలి, ఫ్యాషన్లు, ఆహారం, పర్యాటక ప్రదేశాలు.. మొదలైన అంశాల మీద బ్లాగ్‌ను నిర్వహించొచ్చు. వీటిల్లో ప్రకటనలను అనుమతించడం వల్ల ఆదాయాన్ని పొందొచ్చు.

యూట్యూబ్‌ వీడియోలు: ఆసక్తికరమైన ఒరిజినల్‌ వీడియోలను రూపొందించి యూట్యూబ్‌లో పోస్ట్‌ చేయడం ద్వారా కూడా ఎంతో కొంత సంపాదించొచ్చు. ఆసక్తి ఉండే సరదా సంఘటనలు, పాటలు, సందేశాత్మక అంశాలు, పర్యాటక ప్రదేశాల విశేషాలతో వీడియోలను అప్‌లోడ్‌ చేయొచ్చు. వ్లాగర్‌గా సొంతంగా ఛానల్‌ను నిర్వహించి తగినంత మంది సబ్‌స్క్రైబర్లను ఆకర్షించగలిగితే ఆదాయం పెరుగుతుంది.

టీచింగ్‌ అసిస్టెంట్‌: తరగతుల నిర్వహణలో టీచర్లకు అన్ని విధాలుగా సహాయపడతారు. కొంతమంది విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటివారికి టీచింగ్‌ అసిస్టెంట్‌ సహాయం అవసరం అవుతుంది. అటెండెన్స్‌ తీసుకోవడం, పరీక్ష పేపర్లు దిద్దడం, విహారయాత్రలకు కార్యాచరణ సిద్ధంచేయడం, తరగతుల నిర్వహణ విషయంలో టీచర్లకు సహాయ సహకారాలు అందించడం లాంటి పనులు చేయాలి. 

గేమ్‌ టెస్టర్‌: ఈ ఉద్యోగంలో ఆడుకుంటూనే సంపాదించే అవకాశం ఉంటుంది. వీడియో గేమ్‌లోని ప్రతి దశలోనూ ఉండే దోషాలను గుర్తించాలి. ఈ సమాచారాన్ని గేమ్‌ను రూపకల్పన చేసిన నిపుణుల దృష్టికి తీసుకెళ్లాలి. సాధారణంగా గేమ్‌ అభివృద్ధి దశలో ఉన్నప్పుడు వీరి సేవలు అవసరం అవుతాయి. వీరు కనుగొన్న లోపాలను సరిదిద్దిన తర్వాత గేమ్‌లను మార్కెట్‌లోకి విడుదల చేస్తారు.

వర్చువల్‌ అసిస్టెంట్‌: వీరు కొన్ని సంస్థలు లేదా కొందరు వ్యక్తుల రోజువారీ కార్యక్రమాల నిర్వహణకు సాయపడుతుంటారు. ఈ-మెయిల్‌ అకౌంట్‌ నిర్వహణ, ప్రయాణాలకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం, అపాయింట్‌మెంట్లను షెడ్యూల్‌ చేయడం, అవసరమైన ఫోన్లు చేయడం, ఫోన్లకు హాజరుకావడం మొదలైన పనులు చేయాల్సివుంటుంది. 

డ్రైవింగ్‌: డ్రైవింగ్‌లో నైపుణ్యం, లైసెన్స్‌ ఉంటే క్యాబ్, టూవీలర్‌ డ్రైవర్‌గానూ కొంత సంపాదించొచ్చు. రోజూ నిర్ణీత సమయాల్లో, సెలవు రోజుల్లో అదనంగానూ పనిచేసి ఆదాయాన్ని పొందొచ్చు. ఉబర్, ఓలాల్లో పార్ట్‌టైమ్‌ డ్రైవర్‌గా పనిచేస్తోన్న విద్యార్థులు, చిరుద్యోగులూ ఎందరో. 

అఫిలియేట్‌ మార్కెటింగ్‌: కొన్ని కంపెనీల ఉత్పత్తులను అమ్మడం ద్వారా ఆయా సంస్థల నుంచి కమిషన్‌ పొందొచ్చు. మీరు ఏదైనా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఆ సంస్థ ఉత్పత్తులను లేదా సేవలను ప్రచారం లేదా అమ్మకం చేయాలి. దీనికి మీకు కమిషన్‌ అందుతుంది. కొనుగోలుదారు, అమ్మకందారుల మధ్య వారధిలా ఉండి కమిషన్‌ పొందొచ్చు. దీని కోసం ముందుగా సొంత వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేసుకోవాలి. దాంట్లో వివిధ వస్తువుల గురించి వివరించొచ్చు. మీ వెబ్‌సైట్‌ నుంచి వ్యాపారి ఎకౌంట్‌కు రీడైరెక్ట్‌ అయిన విజిటర్ల సంఖ్య ఆధారంగా మీ ఆదాయం ఉంటుంది. ఇక్కడ క్రయవిక్రయాలతో సంబంధం ఉండదు. మరో పద్ధతి ‘పే ఫర్‌ సేల్‌’. దీంట్లో అమ్మకాలు జరిగిన తర్వాత మీకు చెల్లించాల్సిన కమిషన్‌ను లెక్కగడతారు. దీన్ని కొందరు వెంటనే చెల్లిస్తారు. మరికొందరు వారానికి, నెలకు, మూడు నెలలకు ఒకసారి లెక్కించి చెల్లిస్తారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఈబే లాంటి వాటిల్లో అఫిలియేట్‌ మార్కెటింగ్‌ చేయొచ్చు.

కస్టమర్‌ సర్వీస్‌: కొన్ని కంపెనీలు కస్టమర్‌ సర్వీస్‌ రిప్రజెంటేటివ్‌లను నియమించుకుంటాయి. వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలను అందించడంలో భాగంగా వీరిని నియమిస్తాయి. ఎలక్ట్రానిక్‌ వస్తువుల వాడకంలో కొంతమంది వినియోగదారులకు అంతగా అవగాహన ఉండదు. అలాంటప్పుడు కస్టమర్‌ సర్వీస్‌ రిప్రజెంటేటివ్‌ల అవసరం ఉంటుంది. వీరు ఫోన్, ఈ-మెయిల్‌ ద్వారా లేదా స్వయంగానూ తమ సేవలను అందిస్తారు. సంస్థ తరపున కొనుగోలుదారులకు అవసరమైన అన్ని రకాల సేవలనూ అందించడమే వీరి విధి.

ఆహార డెలివరీ: ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన ఆహార పదార్థాలను వినియోగదారులకు చేర్చే ఉద్యోగం యువతను ఎక్కువగా ఆకర్షిస్తోంది. వినియోగదారుల ఇళ్లకు ఆహారాన్ని సకాలంలో అందించడానికి స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థలు పార్ట్‌టైమ్‌ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. దీంతో ఆర్డర్ల రద్దీ ఎక్కువగా ఉండే కొన్ని ప్రత్యేక సమయాలను ఎంచుకుని పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదాయ మార్గంగా ఈ ఉద్యోగాన్నీ ఎంచుకోవచ్చు.  

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌: ఈమధ్య కాలంలో ఇంటి నుంచి పనిచేయడానికి అవకాశం కల్పిస్తోన్న సంస్థలూ పెరిగాయి. కాబట్టి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు అవకాశం ఉండే ఆన్‌లైన్‌ ఉద్యోగాలనూ ఎంచుకోవచ్చు. కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ ఉండి ఇంçర్నెట్‌ సదుపాయం ఉంటే చాలు. ఇంటి నుంచే పనిచేసుకుని ఆదాయాన్ని సంపాదించొచ్చు. పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌ల కోసం https://internshala.com/ వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ పేరును నమోదు చేసుకోవచ్చు. ఈ సైట్‌లో ఇంజినీరింగ్, ఎంబీఏ, మీడియా, లా, ఇతర విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉంటాయి. ఉద్యోగావకాశాల కోసం https://in.indeed.com/, https://www.linkedin.com/ లోనూ రెజ్యూమెను అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి

గతంలోకంటే ప్రస్తుతం పార్ట్‌టైం ఉద్యోగాల లభ్యత కాస్త ఎక్కువయ్యింది అంటున్నారు నిపుణులు. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ వస్తుండటంతో తదనుగుణంగా అవకాశాలూ పెరుగుతున్నాయి. అయితే విద్యార్థులు పార్ట్‌టైం ఉద్యోగం చేయాలి అని నిర్ణయించుకున్నాక కొన్ని విషయాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఒకసారి పరిశీలిస్తే...

పార్ట్‌టైం ఉద్యోగం వల్ల పని అనుభవం దొరుకుతుంది. మనం చేసే పని చదువుతున్న డిగ్రీకి సంబంధించినదే అయితే భవిష్యత్తులో ఆ అనుభవం చాలా ఉపయోగపడుతుంది. 

డబ్బు సంపాదించడం, దాన్ని సమర్థంగా వినియోగించడంపై చిన్న వయసు నుంచే అవగాహన పెరుగుతుంది. 

చదువు - ఉద్యోగం... రెండిటికీ సమయం కేటాయించాల్సి రావడం వల్ల సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే విషయంపై అవగాహన ఏర్పడుతుంది. ‘టైం ఈజ్‌ మనీ’ అని నమ్మే నేటి కాలంలో ఇది చాలా ముఖ్యమైన నైపుణ్యం. 

ఉద్యోగ జీవితంలో ప్రాక్టికల్‌గా ఎలాంటి మెలకువలు అవసరం అవుతాయి, నలుగురితో ఎలా మసులుకోవాలి అనే విషయాన్ని ముందు నుంచే నేర్చుకునే అవకాశం దక్కుతుంది. 

పరిచయాలు పెరుగుతాయి. తద్వారా మెరుగైన అవకాశాల దిశగా అడుగులు వేయొచ్చు. 

సాధారణంగా ఉద్యోగంలో ఉండే అదనపు ప్రయోజనాలు  పార్ట్‌టైం ఉద్యోగులకు ఇవ్వరు. అందువల్ల ఇతరులతో సమానంగా పనిచేసినా, ప్రయోజనాలు మాత్రం తక్కువగా లభిస్తాయి.

చదువు, పనితో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యంపై ప్రభావం పడకుండా శ్రద్ధ తీసుకోవాలి. 

కొన్నిసార్లు ఉద్యోగంలో పడి చదువుపై శ్రద్ధ పెట్టలేకపోయే అవకాశం ఉంటుంది. అది మొత్తానికే చేటు చేయొచ్చు. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవటం చాలా అవసరం.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ టెన్త్‌ పాసైతే సాయుధ దళాల్లోకి స్వాగతం!

‣ ‘క్రిటికల్‌’ అంటే నిజంగా క్రిటికల్‌ కాదు!

‣ దివ్య జీవనానికి దృఢమైన ఆసరా!

‣ ఆఫీసర్‌ కొలువుకు నౌకాదళం పిలుపు!

‣ ఉన్నత చదువులకు ఉపకారవేతనం

‣ ఇంటర్‌ పాసైతే స్కాలర్‌షిప్‌లు

‣ ఈఆర్‌పీలో తిరుగులేని ఎస్‌ఏపీ!

Posted Date : 02-11-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌