• facebook
  • whatsapp
  • telegram

ఉన్నత చదువులకు ఉపకారవేతనం

యూనివర్సిటీ టాపర్లకు ప్రత్యేకం

యూజీ కోర్సుల్లో ప్రతిభావంతులను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ఏటా స్కాలర్‌షిప్పులు అందిస్తోంది. ఏదైనా డిగ్రీ కోర్సులో సంబంధిత విశ్వవిద్యాలయం స్థాయిలో మొదటి రెండు స్థానాల్లో నిలిచినవారికి వీటిని అందిస్తారు. అయితే వీరు ప్రస్తుతం పీజీలో చేరి ఉండాలి. అర్హత సాధించినవారికి ప్రతి నెలా రూ.3100 చొప్పున రెండేళ్లపాటు అందుతాయి. యూజీసీ పోస్టు గ్రాడ్యుయేట్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ పూర్తి వివరాలు...

దేశ అభివృద్ధిలో ఉన్నత విద్య పాత్ర చాలా కీలకం. ఈ విభాగాన్ని పటిష్ఠపరచినప్పుడే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతోన్న ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర ఉన్నత విద్య చదివేవాళ్ల సంఖ్య చాలా తక్కువ. ఈ లోటును కొంతైనా పూరించడానికి సమర్థులైన యువతను డిగ్రీ నుంచి పీజీ దిశగా అడుగులేయించాలి. దీనికోసం వాళ్లను ప్రోత్సహించాలి. అందులో భాగమే యూజీసీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌. డిగ్రీ స్థాయిలో వివిధ కోర్సుల్లో యూనివర్సిటీ టాపర్స్‌ (మొదటి రెండు స్థానాలు పొందినవారు)కు ఈ స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది. దీని వ్యవధి రెండేళ్లు. యూనివర్సిటీల వారీ టాపర్స్‌గా నిలిచి, పీజీ కోర్సుల్లో చేరితేనే ఈ స్కాలర్‌షిప్‌ అందుతుంది. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించి, వాళ్లు పీజీలో చేరేలా చూడడమే స్కాలర్‌షిప్‌ ముఖ్య ఉద్దేశ్యం.

అర్హత

విద్యార్థులు చదివిన యూనివర్సిటీ స్థాయిలో ఏదైనా బేసిక్‌ కోర్సులో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొంది ఉండాలి. డీమ్డ్‌ సంస్థలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, అటానమస్‌ సంస్థల్లో చదివి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచినా అర్హులే. అలాగే విద్యార్థులు ఏదైనా యూనివర్సిటీ లేదా పీజీ కాలేజీలో ప్రథమ సంవత్సరం కోర్సులో చేరి ఉండాలి. దూరవిద్యలో చదివినవాళ్లు ఈ స్కాలర్‌షిప్పులకు అనర్హులు. వయసు 30 ఏళ్లకు మించరాదు. లైఫ్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్, కెమికల్‌ సైన్సెస్, ఎర్త్‌ సైన్సెస్, మ్యాథమెటికల్‌ సైన్సెస్, సోషల్‌ సైన్సెస్, కామర్స్, లాంగ్వేజెస్‌ వీటిలో ఏ కోర్సైనా యూజీలో చదివి మెరిట్‌ పొందినవారు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. 

ఎన్నేసి.. ఎన్నేళ్లు?

మొత్తం 3000 స్కాలర్‌షిప్పులు ఉన్నాయి. వీటి వ్యవధి రెండేళ్లు. నెలకు రూ.3100 చొప్పున చెల్లిస్తారు. ప్రథమ సంవత్సరంలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు మాత్రమే రెండో సంవత్సరం స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది.

నియమాలు...

పీజీ ప్రథమ సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులు సాధిస్తేనే ద్వితీయ సంవత్సరం స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది.

లైఫ్, ఫిజికల్, కెమికల్, ఎర్త్, మ్యాథమెటికల్, సోషల్‌ సైన్సులు, కామర్స్, లాంగ్వేజ్‌ కోర్సుల్లో వేటిలోనైనా పీజీలో చేరి ఉండాలి. ఎంబీఏ, ఎంసీఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుతోన్నవారికి ఈ స్కాలర్‌షిప్‌ వర్తించదు.

జత చేయాల్సినవి...

యూజీ సర్టిఫికెట్, పీజీలో చేరినట్టు ధ్రువీకరణ సర్టిఫికెట్, యూనివర్సిటీ ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌. సంబంధిత యూనివర్సిటీలు కూడా సబ్జెక్టుల వారీ యూజీ టాపర్స్‌ వివరాలు, పీజీ ప్రథమ సంవత్సరం ప్రోగ్రెస్‌ రిపోర్ట్, స్కాలర్‌ యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌ అందించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 31. 

వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇంటర్‌ పాసైతే స్కాలర్‌షిప్‌లు

‣ ఈఆర్‌పీలో తిరుగులేని ఎస్‌ఏపీ!

‣ విద్యార్థినుల సాంకేతిక విద్యకు ఆర్థికసాయం!

‣ అయిదో తరం.. అవకాశాల వరం!

‣ పీజీ విద్యార్థినుల‌కు యూజీసీ ప్రోత్సాహం

‣ డిజిటల్‌ అక్షరాస్యత... మీకుందా?

Posted Date: 26-10-2022


 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం