• facebook
  • whatsapp
  • telegram

పీజీ విద్యార్థినుల‌కు యూజీసీ ప్రోత్సాహం

సింగిల్ గ‌ర్ల్ చైల్డ్ స్కాల‌ర్‌షిప్‌లు

మీరు యువతులా? తల్లిదండ్రులకు మీరొక్కరే సంతానమా? ప్రస్తుతం పీజీ ప్రథమ సంవత్సరం కోర్సు చదువుతున్నారా? అయితే మీకోసమే ఇందిరాగాంధీ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్పులు సిద్ధంగా ఉన్నాయి. వీటికి ఎంపికైనవారికి పీజీలో ఏడాదికి రూ.36,200 చొప్పున రెండేళ్లపాటు అందుతాయి. ఆర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబరు 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రోత్సాహం అందుకున్నవారు   ఇతర స్కాలర్‌షిప్పులకూ ప్రయత్నించుకోవచ్చు.


ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో అమ్మాయిల కంటే అబ్బాయిల సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే ఉన్నత చదువుల్లో చేరుతోన్న విద్యార్థుల వాటాలో మహిళలు తక్కువగా ఉన్నారు. తల్లిదండ్రుల దృక్పథం, సామాజిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యం.. తదితర కారణాలతో చాలామంది విద్యార్థినులు ఆసక్తి ఉన్నప్పటికీ ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. పలు కుటుంబాలు మహిళలను అభివృద్ధిలో భాగంగా గుర్తించలేకపోతున్నాయి. పెళ్లీడుకి రాగానే వివాహం జరిపించి, బాధ్యతలను తీర్చుకుందామనుకునేవాళ్లే ఎక్కువ. దీంతో పీజీలో చేరే మహిళల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడం కోసం అందిస్తోన్నదే పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇందిరాగాంధీ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌. దీనిద్వారా విద్యార్థినులకు ఆర్థికంగా అండగా నిలిచి, చదువులో ప్రోత్సహించి, పీజీ చదివే మహిళల సంఖ్య పెరిగేలా చూడాలన్నది యూజీసీ లక్ష్యం.


.అర్హత: తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె అయివుండాలి. అలాగే మొదటి సంతానంలో ఇద్దరూ కవలలు అది కూడా అమ్మాయిలే అయితే వారిద్దరికీ ఈ స్కాలర్‌షిప్పునకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంటే స్కాలర్‌షిప్పు వర్తించదు. ఈ విద్యా సంవత్సరంలో పీజీ ప్రథమ సంవత్సరంలో చేరినవాళ్లే దీనికి అర్హులు. గరిష్ఠ వయసు 30 ఏళ్లు మించరాదు. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం...కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్లో చేరినవారికి అవకాశం లేదు. అలాగే దూరవిద్యలో పీజీ కోర్సులు చదువుతున్నవాళ్లు కూడా అర్హులు కాదు. ఈ స్కాలర్‌షిప్పు పొందిన విద్యార్థినులు ఇతర ప్రోత్సాహకాలకూ దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.


ఎంత మందికి: ఈ స్కాలర్‌షిప్పును ఏడాదికి 3000 మందికి అందిస్తున్నారు. 


 ఎంపికైతే: ఏడాదికి రూ.36,200 చొప్పున రెండేళ్లపాటు చెల్లిస్తారు. ఈ డబ్బులు నేరుగా విద్యార్థినుల ఖాతాలో జమ అవుతాయి. వీటిని ఫీజు, వసతి, పుస్తకాలు..నిమిత్తం ఉపయోగించుకోవచ్చు. 


పీజీ ప్రథమ సంవత్సరం చదువుతున్నట్టు ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ చేయాలి. దీని ఫార్మాట్‌ కూడా వెబ్‌సైట్‌లో లభిస్తుంది. దానిపై వివరాలు పూరించాలి. సంబంధిత యూనివర్సిటీ/కాలేజీ ప్రిన్సిపల్‌ సంతకం తప్పనిసరి. అలాగే తల్లిదండ్రులకు ఏకైక సంతానమని నిర్ధారిస్తూ అధికారుల ధ్రువీకరణ అఫిడవిట్‌నూ పొందుపరచాలి. ఈ పత్రాలను దరఖాస్తుతో పాటు అప్‌లోడ్‌ చేయాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 31


వెబ్‌సైట్‌:  https://scholarships.gov.in/

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మైనారిటీ బాలిక‌ల‌కు ఉప‌కార వేత‌నాలు

‣ డిజిటల్‌ అక్షరాస్యత... మీకుందా?

‣ క్లిష్ట స‌మ‌యాల్లోనూ ఉద్యోగ సాధ‌న ఎలా?

‣ ఒక్క ఛాన్స్ కాదు... అనేక ఛాన్సులు!

‣ డిగ్రీతో ఐఐటీలో ఉద్యోగాలు

‣ కోర్సు పూర్తి కాగానే కొలువుల్లోకి!

‣ అమ్మకాల దళంలో చేరతారా?

Posted Date: 21-10-2022


 

తాజా కథనాలు

మరిన్ని