• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డిజిటల్‌ అక్షరాస్యత... మీకుందా?

అక్షరాస్యులంటే చదువుకున్న వారని మనకు తెలుసు. ఒకప్పుడు మంచి ఉద్యోగాలు సంపాదించడానికీ, మెరుగ్గా జీవించడానికీ ఇది సరిపోయేది. కానీ ఇప్పుడంతా టెక్నాలజీ కాలం. అచ్చంగా పుస్తక జ్ఞానం సరిపోవడం లేదు. అందుకే ‘డిజిటల్‌ అక్షరాస్యత’ అవసరం పెరిగింది. మరి మీరు డిజిటల్‌ లిటరేట్‌ అవునో కాదో చూసుకోండి!


75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో వందశాతం అక్షరాస్యత సాధించేందుకు నిరంతరం కృషి చేశాం. ఇప్పుడిక అంతా డిజిటల్‌ యుగం. మన రోజువారీ జీవితం ఎలా ఉంటుందో, డిజిటల్‌గానూ ప్రత్యేకంగా అవసరాలు, జీవితం ఉంటున్నాయి. అందులో ఎలా నడుచుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ప్రగతికి ఎలా ఉపయోగించుకోవాలనేదే ‘డిజిటల్‌ లిటరసీ’. ఇది విద్యార్థులు, ఉద్యోగార్థులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం.


కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్వచనం ప్రకారం... డిజిటల్‌ లిటరసీ అంటే వ్యక్తులు - సమూహాలు తమ అవసరాల కోసం టెక్నాలజీని సమర్థంగా సురక్షితంగా ఉపయోగించుకునే సామర్థ్యం. కరోనా విజృంభణ తర్వాత దీని అవసరం మరింత పెరిగింది. నేషనల్‌ శాంపిల్‌ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌వో) లెక్కల ప్రకారం భారత్‌లో పట్టణాల్లో 23.4 శాతం, గ్రామాల్లో 4.4 శాతం మంది ప్రజలకు ఇళ్లలో కంప్యూటర్లు ఉన్నాయి. ఇందులోనూ పట్టణాల్లో 42శాతం, గ్రామాల్లో 14.9 శాతం కంప్యూటర్లకు ఇంటర్నెట్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇక మొబైల్‌లో ఇంటర్నెట్‌ వాడేవారి సంగతి అయితే చెప్పనక్కర్లేదు. వీరంతా డిజిటల్‌ లిటరసీని అలవర్చుకుంటేనే భద్రంగా దీన్ని వినియోగించగలరు.


అంటే ఏంటి?


‘మేము రోజూ ఫేస్‌బుక్‌ చూస్తాం, యూట్యూబ్‌లో వీడియోలు చూస్తాం, ఇన్‌స్టా వాడుతున్నాం... మాకు డిజిటల్‌గా అన్నీ తెలుసు కదా’ అనుకుంటే పొరపడినట్లే. ఇవి కేవలం సామాజిక మాధ్యమాలు మాత్రమే. ఇంతకుమించి తెలుసుకోవడానికి చాలా ఉంది. కనీస పరిజ్ఞానం, అంటే... వివిధ రకాలైన డివైజ్‌లను ఉపయోగించడం, సాఫ్ట్‌వేర్లు - అప్లికేషన్లను వినియోగించి పనులు పూర్తిచేసుకోవడం, వివిధ ఫార్మాట్లలో సమాచారాన్ని చేరవేయడం - అందుకోవడం, గూగుల్‌ డాక్స్‌ వంటి వాటిని వినియోగించగలగటం... ఇవన్నీ డిజిటల్‌ లిటరసీలోకే వస్తాయి!


ఎందుకు నేర్చుకోవాలి?


 ఒక్కసారి ఊహించుకోండి... మీరు పక్క రాష్ట్రంలోని విశ్వవిద్యాలయంలో చేరాలని అనుకుంటే.. ఆ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో పూర్తిచేయడానికి ఏం చేయాలో, ఎలా చేయాలో అవగాహన ఉండాలి కదా! అదే విదేశాలకే వెళ్లాల్సి వస్తే ఇంకెంత అవసరం ఉంటుంది?... కాలేజీ దరఖాస్తు, వీసా, పాస్‌పోర్ట్, బ్యాంక్‌ లోన్, ఇతర అవసరాల కోసం ఎంతో పని ఉంటుంది. అలాగే ఉద్యోగంలో చేరాక కంప్యూటర్‌తో బోలెడు పనులుంటాయి. అవన్నీ చేయడం మనకు కళాశాలలో నేర్పొచ్చు, నేర్పకపోవచ్చు. కానీ కనీస వినియోగం తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎందుకంటే వివిధ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లను సమర్థంగా వినియోగించడం రాకపోతే ఆ పనులన్నీ చేసేందుకు పక్కవాళ్ల మీద ఆధారపడాల్సి వస్తుంది... అందుకే డిజిటల్‌ పరిజ్ఞానం అవసరం. 


యునిసెఫ్‌ ఉద్దేశం ప్రకారం పెరుగుతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఈతరం విద్యార్థులపై అధిక ప్రభావం చూపనుంది. వారు డిజిటల్‌ ప్రపంచం గురించి ఎంత బాగా తెలుసుకుని, అర్థం చేసుకుని వినియోగిస్తారో... అంత బాగా చక్కని చదువులు, ఉద్యోగావకాశాలు అందుకోగలుగుతారు. విద్యార్థి వయసును అనుసరించి వారు ఎంతవరకూ దీన్ని తెలుసుకోవాలి అనేది ఆధారపడి ఉంటుంది.


పరిమితం కాదు


డిజిటల్‌ లిటరసీ అంటే కంప్యూటర్‌ను ఉపయోగించే పరిజ్ఞానం మాత్రమే అనుకుంటే పొరపడినట్లే. ఆన్‌లైన్‌ వాతావరణంలో ఎలా మసులుకోవాలి, సామాజిక మాధ్యమాల్లో ఎలా ప్రవర్తించాలి, టెక్నాలజీని ఎలా అవసరమైన మేరకు మాత్రమే ఉపయోగించాలి, మన ప్రొఫైల్‌ను ఎలా హుందాగా ఉంచాలనే విషయాలన్నీ ఈ కోవలోకి వస్తాయి. డిజిటల్‌ ప్రపంచంలో ఎటువంటి నైపుణ్యాలను వృద్ధి చేసుకోవాలి, సురక్షితంగా ఉంటూనే ఈ సేవలను ఎలా సమర్థంగా వినియోగించుకోవాలనే అన్ని అంశాల కలయిక ఇది.


విమర్శనాత్మక పరిశీలన  


ఇంటర్నెట్‌ ఒక సమాచార సముద్రం. అందులో లక్షలాది మార్గాల్లో డేటా లభ్యమవుతూ ఉంటుంది. అందులో నిజాలు, అబద్ధాలు, అపోహలు... అన్నీ ఉంటాయి. ఏది నమ్మవచ్చు, ఏది నమ్మకూడదనే విచక్షణను మనమే వృద్ధి చేసుకోవాలి. ఇది డిజిటల్‌ లిటరసీలో అతి ముఖ్యమైన అంశం. ఇలాంటి అవగాహన లేకే సైబర్‌ నేరగాళ్ల చేతిలో ఎంతోమంది మోసపోతున్నారు. అక్కర్లేని విషయాలు సెర్చ్‌ చేయడం, అవసరం లేని లింక్‌లపై క్లిక్‌ చేయడం మానుకుంటే డిజిటల్‌ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే వివిధ రకాలైన వనరుల నుంచి నమ్మకమైన సమాచారాన్ని గుర్తించి, దాన్ని అర్థం చేసుకుని వినియోగించేందుకు విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలు అవసరం. ఆ డేటాను వాస్తవ ప్రపంచానికి అన్వయించుకుని ఉపయోగించుకునే సామ ర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. వ్యక్తిగత గోప్యత పాటించడం, అనవసరపు ఆలోచనలు - ఒత్తిడితో మానసిక సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడం కూడా ఇందులో ప్రధానం.


నిజమా కాదా?


ఇప్పుడు టెక్నాలజీ తాకని రంగమంటూ ఏదీ లేదు. రోజువారీ పనులు కూడా ఈ టూల్స్‌తో ముడిపడి ఉంటున్నాయి. దీనివల్ల ఉద్యోగాలు చేసే విధానం కూడా చాలావరకూ మారింది. అదే సమయంలో అసత్యపు ప్రచారాలు, అబద్ధపు వార్తలు సైతం పెరిగిపోయాయి. ఇవి అందరికీ నేరుగా నష్టం చేయకపోయినా.. తప్పుడు అభిప్రాయాలను కల్పించే విధంగా ఉంటాయి. ఇలాంటి వాటిని గుర్తించేలా అవగాహన పెంచుకోవాలి.


ఏకాగ్రత నిలపాలి


నెట్‌లో ఉన్నప్పుడు మనం చేస్తున్న పనిపై ఏకాగ్రత తప్పించేలా చాలా అక్కర్లేని విషయాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని అనుసరించి వెళ్తే సమయం వృథా అవుతుంది. పరధ్యానానికి కారణమయ్యే వీటిని పక్కన పెట్టడం ఎలాగో నేర్చుకోవడం కూడా అవసరం. ఇంటర్నెట్‌ ఎంత ఉపయోగకారో అంత ప్రమాదకారి కూడా. అందులో మనం ప్రవర్తించే తీరు, వెతికే అంశాలు, ఉంచే సమాచారం... ప్రతిదీ నమోదవుతుందనే విషయాన్ని గమనించాలి. వ్యక్తిగత వివరాలు, చిత్రాల వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇవన్నీ తెలుసుకుని  21వ శతాబ్దపు డిజిటల్‌ లిటరేట్‌గా మారండి! 


పెంపొందించుకోవడం ఎలా?

డిజిటల్‌ లిటరసీని అలవరుచుకునేందుకు ఈ కింది మార్గాలు అవలంబించవచ్చు.


విద్యార్థులు, ఉద్యోగార్థులు తమకు పనికొచ్చే సాంకేతికాంశాల వినియోగంపై అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నించాలి. తాము ఉద్యోగం ఆశిస్తున్న రంగంలో భవిష్యత్తులో ఎలాంటి డిజిటల్‌ మార్పులు సంభవించే అవకాశం ఉంది.. దాన్ని ఎలా అందిపుచ్చుకోగలరనే విషయాలపై దృష్టి పెట్టాలి. 


కనీస నైపుణ్యాలకు పదునుపెట్టాలి. డిజిటల్‌ స్కిల్స్‌ గురించి నేర్పించేందుకు గంటల నుంచి వారాల వ్యవధి గల కోర్సులను కోర్సెరా, యుడెమీ వంటి ఆన్‌లైన్‌ సంస్థలు అందిస్తున్నాయి. వాటిని నేర్చుకోవడం ద్వారా దీనిపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. 


 అనంతరం కాస్త పైస్థాయిలో ఏఐ, మెటావర్స్‌ వంటి వాటి గురించి తెలుసుకోవచ్చు. అలా అని ఇందులో నిష్ణాతులు కావాల్సిన అవసరం లేదు. కానీ కనీస అవగాహన ఉండాలి. 


 వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ అంచనాల ప్రకారం 2025 పూర్తయ్యేనాటికి ప్రపంచవ్యాప్తంగా 8.5 కోట్ల ఉద్యోగాలు మనుషుల నుంచి యంత్రాల చేతుల్లోకి వెళ్లిపోనున్నాయి. అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకురానున్నాయి. వీటన్నింటికీ డిజిటల్‌ నైపుణ్యాలు అవసరం అయ్యే అవకాశం ఉంది. 


గతంలో ఏదైనా ఒక రంగంలో చెప్పుకోదగ్గ మార్పులు రావాలంటే కనీసం పదేళ్లయినా పట్టేది. కానీ ఇప్పుడది మూడు నాలుగేళ్లలోనే జరిగిపోతోంది. ఈ వేగవంతమైన మార్పును తట్టుకుని మార్కెట్‌లో నిలబడేలా మనమూ మారాలి. అందుకే ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండటం అవసరం.  ఆన్‌లైన్‌ కోర్సులు, వీడియో ట్యుటోరియల్స్, ఆడియోబుక్స్‌ లాంటివి ఇందుకు దోహదం చేస్తాయి.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ క్లిష్ట స‌మ‌యాల్లోనూ ఉద్యోగ సాధ‌న ఎలా?

‣ ఒక్క ఛాన్స్ కాదు... అనేక ఛాన్సులు!

‣ డిగ్రీతో ఐఐటీలో ఉద్యోగాలు

‣ కోర్సు పూర్తి కాగానే కొలువుల్లోకి!

‣ అమ్మకాల దళంలో చేరతారా?

Posted Date : 21-10-2022 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం