• facebook
  • twitter
  • whatsapp
  • telegram

క్లిష్ట స‌మ‌యాల్లోనూ ఉద్యోగ సాధ‌న ఎలా?

నిపుణుల సూచ‌న‌లు, స‌ల‌హాలు

ఇటీవల కొన్ని ప్రముఖ ఐటీ కంపెనీలు తాము నియమించుకున్న కొత్త ఉద్యోగులను సంస్థలో చేరకముందే ఇంటికి పంపేశాయి. తొలుత వారు చేరాల్సిన తేదీని నెలలపాటు వాయిదా వేస్తూ వచ్చాయి. చివరికి పరిస్థితులు బాగాలేవన్న కారణంతో ఈ నియామకాలను రద్దు చేస్తున్నట్లు అభ్యర్థులకు తెలియజేసి, ప్రక్రియను నిలిపివేశాయి.

మరో సంస్థ తమ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో నియమించుకున్న అభ్యర్థులకు చివరి నిమిషంలో వారి నియామకాన్ని రద్దు చేస్తున్నట్లు సంక్షిప్త సందేశాలు పంపింది. ప్రకటనలు, రెవెన్యూలో తగ్గుదల కారణంగా ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఇంటర్న్‌షిప్‌లనూ తగ్గించింది.

మనమేం చేయొచ్చు?

‣ పూర్తిగా నచ్చిన, అన్నివిధాలా మేలైన అవకాశం కోసం ఎదురుచూస్తూ కాలం వృథా చేసుకోకూడదు. ఆసక్తి ఉన్న రంగానికి దరిదాపుల్లో ఏ అవకాశం వచ్చినా చేరిపోయేందుకు ప్రయత్నించాలి. ఏదేమైనా మార్కెట్‌ నుంచి మనం దూరమైపోకుండా జాగ్రత్తపడాలి.

ప్రస్తుతం చిన్న అవకాశమే అయ్యి, భవిష్యత్తులో మీరు కోరుకున్న మంచి ఉద్యోగానికి బాటలు వేసే లాంటి కొలువులు వస్తే చేరిపోవడం ఉత్తమం. ఉదాహరణకు మీరు ఎంబీఏ పూర్తిచేసి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ అవ్వాలని అనుకున్నారే అనుకుందాం... కానీ ఈ సమయంలో అలాంటి ఉద్యోగాలు రావడం కష్టమైతే దానికి అనుబంధంగా ఏ అవకాశం వచ్చినా ముందు చేరి, తరువాత నచ్చిన కెరియర్‌ కోసం ప్రయత్నించాలి. 

వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపించకపోతే... ఏదైనా ఇంటర్న్‌షిప్‌ అయినా చేసేందుకు ప్రయత్నించాలి. స్టైపెండ్‌ ఉన్నా లేకపోయినా ఇవి పరిచయాలు పెరిగేందుకు, ఇతర అవకాశాలు వచ్చేందుకు దోహదం చేస్తాయి. 

పెద్ద పెద్ద సంస్థలు నిర్వహించే కాన్ఫరెన్స్‌లు, ఓపెన్‌ సెషన్స్‌కు వెళ్లడం ద్వారా మీకు ఆసక్తి ఉన్న రంగంపై అవగాహన పెరగడమే కాదు, అక్కడి వారి ద్వారా కెరియర్‌కు ఉపయోగపడే సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. ఆ నెట్‌వర్క్‌ సాయంతో ఉద్యోగావకాశాలూ పెరుగుతాయి. 

మీ చదువుకు సంబంధం లేని ఇతర రంగాల్లోనూ అవకాశాల కోసం ప్రయత్నించవచ్చు. కావాల్సినదల్లా ఆ పని చేసే నైపుణ్యం మీకు ఉందా లేదా అన్నది మాత్రమే. 

మాంద్యం వచ్చినప్పటికీ... అన్ని రంగాలూ ఇబ్బందులకు గురికావు. విద్య, ఆరోగ్యం, ఆహార పరిశ్రమల వంటివి చాలావరకూ స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రస్తుతానికి వీటిలో ఉద్యోగాలు వెతుక్కున్నా... భవిష్యత్తులో           నచ్చినచోటికి మారవచ్చు. 

పరిచయాలు పెంచుకోవడం ఇటువంటి సమయాల్లో బాగా ఉపయోగపడుతుంది. పోటీ ఎక్కువగా ఉండి, అవకాశాలు తక్కువైపోయినప్పుడు... ఆ కంపెనీలో ఉన్న వ్యక్తులతో మీకున్న పరిచయం, మీపట్ల వారికి ఏర్పడిన సదభిప్రాయం, మిగతా వారి కంటే మీకు అధిక ప్రాధాన్యం ఇవ్వడానికి ఉపయోగపడతాయి. 

ఎక్కువ అవకాశాలు లభించేందుకు చిన్నచిన్న పట్టణాల నుంచి పెద్ద నగరాలకు మారవచ్చు. 

ఇలాంటి సమయంలో కొత్తగా ఉద్యోగం పొందడం కొంత కష్టమనే చెప్పాలి. వైఫల్యాలు ఎదురైనా పట్టు వదలకుండా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఆశించవచ్చు.

2023లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రాబోతోందని ఒక అంచనా. కొందరైతే ఇప్పటికే ఆ ప్రభావం మొదలైందని కూడా చెబుతున్నారు. ఇది ఇప్పుడిప్పుడే చదువులు పూర్తి చేసుకుంటున్న వారినీ, ఇప్పటికే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారినే కాదు... ఇదివరకే ఉద్యోగాల్లో చేరిన వారినీ ప్రభావితం చేసే అంశం. అలా అని లేనిపోని భయాలతో ఆందోళన చెందాల్సిన పనిలేదు. విద్యార్థులు, ఉద్యోగార్థులు ముందస్తుగా సన్నద్ధమై ఉంటే ఏ పరిస్థితి ఎదురైనా విజయవంతంగా బయటపడొచ్చు.

కరోనాయే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గట్టిగా దెబ్బ కొట్టింది అనుకుంటే... రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో పుండు మీద కారం చల్లినట్లయ్యింది. చైనా జీరో కొవిడ్‌ పాలసీ, వడ్డీరేట్ల పెరుగుదల, కరెన్సీ విలువ పతనం, ఆహారం -చమురు ధరలు ఆకాశాన్నంటడం వంటివి మార్కెట్లలో అస్థిరతను పెంచాయి. ఇతర కారణాలు కూడా కలిసి మొత్తంగా ప్రపంచం ఆర్థిక మాంద్యం దిశగా నడుస్తోందని నిపుణుల అంచనా. భారత్‌పై కూడా దీని ప్రభావం ఎంతోకొంత ఉంటుందనే అభిప్రాయాలు బలపడుతున్నాయి.


నైపుణ్యాలు పెంచుకోవాలి...

‘‘ఇలాంటి సమయాల్లో కంపెనీలు ఆర్థికభారం తగ్గించుకోవడానికి మొదట కొత్త నియామకాలు నిలిపేస్తాయి. ఆపైన ఉద్యోగులకిచ్చే ప్రోత్సాహకాలు ఆపేయడం, అప్పటికీ పరిస్థితులు మెరుగవ్వకపోతే ఉద్యోగులను తీసేయడం వంటివి జరగొచ్చు. అయితే ఎవరిని తీసేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి జవాబు మనం కాకుండా జాగ్రత్తపడాలి. మనం కంపెనీకి ఆస్తి కావాలే కానీ ఖర్చు కాకూడదు. ఉదాహరణ కొవిడ్‌ తర్వాత చాలా కంపెనీల్లో కొత్తవారిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. అయితే వారిని ప్రాజెక్టులకు కేటాయించలేదు. శిక్షణ కార్యక్రమాలవీ జరుగుతున్నాయి. ఇప్పుడు మాంద్యం ప్రభావం కనుక పడితే మొదటి దెబ్బ తగిలేది ఇలాంటి వారికే. ఆ ఉద్యోగులు కూడా ‘మేం కొత్తవాళ్లం కదా.. అందుకే ఇంకా ప్రాజెక్ట్‌ రాలేద’ని సమాధానపడిపోకూడదు.

  వీలైనంత త్వరగా కంపెనీలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే వచ్చిన కొలువు భద్రంగా ఉండేది. అలాగే ఇప్పటికే ప్రాజెక్టుల్లో ఉన్నవారు ఎప్పటికప్పుడు నైపుణ్యాలకు మెరుగుపెట్టుకోవడం అవసరం. ఐటీలో ఎప్పుడూ కొత్త మార్పులు వస్తూనే ఉంటాయి. వాటిని అందిపుచ్చుకోకపోతే ఆ స్థానం కొత్తవారితో భర్తీ అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ కోణంలో జాగ్రత్త పడటం అవసరం. గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి, కొత్తగా వస్తున్న టెక్నాలజీపై ప్రత్యేకంగా కోర్సులు చేసి ఉద్యోగాల్లోకి వెళ్లాలని ప్రయత్నించే వారికి ఇది కొంత ఇబ్బందిపెట్టే సమయమనే చెప్పాలి. ఇలాంటి వారు కాస్త ఓపిగ్గా ఎదురుచూసి, వీలైనంత వరకూ ప్రయత్నాలు చేస్తే ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది.’’

- ఓ ప్రముఖ 
ఐటీ సంస్థలో సీనియర్‌ 
హెచ్‌ఆర్‌ మేనేజర్‌

ఇబ్బంది పడినా విజయం సాధించా..

2009లో బయోటెక్నాలజీలో ఇంజినీరింగ్‌ పూర్తిచేశాను. 2007-2008 కాలంలో వచ్చిన ఆర్థిక మాంద్యం ప్రభావం అప్పటికీ పూర్తిగా తగ్గకపోవడంతో వెంటనే సరైన ఉద్యోగాలేవీ లభించలేదు. దాంతో కొంతకాలం హైదరాబాద్‌లో ఉంటూ కోడింగ్, టెస్టింగ్‌కు సంబంధించి స్వల్ప కాలవ్యవధి కోర్సులు నేర్చుకున్నాను. 

 కొన్నాళ్లకు హెచ్‌సీఎల్‌ సంస్థలో నియామకాలు జరుగుతున్నాయని తెలిసి ఇంటర్వ్యూకు హాజరయ్యాను. అప్పటికే సబ్జెక్ట్‌ మీద పట్టు సాధించడంతో వెంటనే ఎంపికయ్యాను. ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు... ఎందుకో నాకు మార్కెటింగ్‌ విభాగంపై బాగా ఆసక్తి కలిగింది. దాని గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఎప్పటికప్పుడు వచ్చిన కొత్త కోర్సులు నేర్చుకుంటూ ఉండేదాన్ని. దాంతో గూగుల్‌ సంస్థలో మార్కెటింగ్‌ విభాగంలో మంచి ఉద్యోగం దక్కింది. అక్కడ కొంత కాలం పనిచేసి, అంతకంటే మెరుగైన అవకాశం రావడంతో ప్రస్తుతం లింక్డ్‌ఇన్‌కు మారాను. కొత్త నైపుణ్యాలు ఎంతగా  అలవరుచుకుంటే అంతగా అవకాశాలు లభిస్తాయనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.

- హారిక, పోర్ట్‌ఫోలియో బిజినెస్‌ అనలిస్ట్, లింక్డ్‌ఇన్‌


కేఎంపీజీ సీఈవో అవుట్‌లుక్‌-  2022 ప్రకారం...

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కంపెనీల సీఈవోల్లో 86 శాతం మంది వచ్చే 12 నెలల్లో ఆర్థిక మాంద్యం రానున్నదని అంచనా వేశారు.

వచ్చే ఆరు నెలల్లో తమ కంపెనీల్లో లేఆఫ్స్‌ ప్రకటించనున్నట్లు 46 శాతం మంది తెలియజేశారు.

39 శాతం మంది సీఈవోలు ఇప్పటికే తమ కంపెనీల్లో నియామకాలు నిలిపివేశారు.

‣ కొవిడ్‌ దెబ్బ వల్ల ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మార్కెట్‌లకు ఇది మరింత ఇబ్బంది అని 75 శాతం మంది సీఈవోలు చెప్పారు.

ఏం జరగొచ్చు?

 ఇప్పటికే చదువు పూర్తిచేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు... సరైన అవకాశాలు రాక మరింత పైచదువులు చదివేందుకు మొగ్గుచూపవచ్చు. ఇతర కోర్సులు చేసి నైపుణ్యాలు సంపాదించుకోవడం ద్వారా మెరుగైన అవకాశాలు పొందవచ్చని భావించే అవకాశం ఉంది.

 స్కాలర్‌షిప్, ఫెలోషిప్‌ వంటి మార్గాల ద్వారా ఆర్థిక సహకారం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇంటర్న్‌షిప్‌లకు పోటీ పెరగొచ్చు. 

 పెరుగుతున్న చదువులఖర్చులు తగ్గించుకోవడానికి విద్యార్థులు అధికంగా విద్యారుణాలు తీసుకోవచ్చు.

 కుటుంబాల ఆర్థిక స్థితిగతులు దెబ్బతినడం వల్ల ఫీజు భారమయ్యే పరిస్థితులు తలెత్త వచ్చు.. 

  ఐటీలో ఉద్యోగం ఆశిస్తున్నవారికి  కొలువులు లభించటం ఆలస్యం కావచ్చు.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆడుకుంటూ చేసుకునే ఉద్యోగాలు!

‣ ఒక్క ఛాన్స్ కాదు... అనేక ఛాన్సులు!

‣ డిగ్రీతో ఐఐటీలో ఉద్యోగాలు

‣ కోర్సు పూర్తి కాగానే కొలువుల్లోకి!

‣ అమ్మకాల దళంలో చేరతారా?

Posted Date : 21-10-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌