• facebook
  • whatsapp
  • telegram

ఆడుకుంటూ చేసుకునే ఉద్యోగాలు!

గేమింగ్‌ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్‌

యువతను సూదంటురాయిలా ఆకర్షిస్తున్నాయి వీడియో గేమ్స్‌! వైవిధ్యకరమైన ఉద్యోగావకాశాలను అందిస్తూ గేమింగ్‌ పరిశ్రమ మనదేశంలో వేగంగా పురోగమిస్తోంది. ఉత్సాహం, ఆసక్తి, సృజనాత్మక ప్రతిభ ఉన్న విద్యార్థులు సంబంధిత నైపుణ్యాలు అందిపుచ్చుకుంటే అద్భుతమైన భవితకు పునాది వేసుకోవచ్చు! ఈ రంగంలో కీలకమైన గేమ్‌ డిజైన్, గేమ్‌ ఆర్ట్‌ విభాగాల విశేషాలు..

వీడియో గేమింగ్‌ ప్రపంచాన్ని నడిపించే సృజనాత్మక దళం గేమ్‌ డిజైనర్లే. ఒక కొత్త గేమ్‌కు సంబంధించి అంకుర స్థాయి నుంచి మొదలుపెట్టి, దాన్ని అభివృద్ధి చేసి విడుదల చేసేంతవరకు కీలక చోదకశక్తిగా నిలిచేది వీరే. ఒక గేమ్‌కు సంబంధించిన జోనర్, ఎన్విరాన్‌మెంట్, గేమ్‌ ప్లే సిస్టమ్, ఆట లక్ష్యాలు, కథ, కథా గమనానికి సంబంధించిన పాయింట్ల రూపకల్పన, క్యారక్టర్లకు ప్రాణం పోయడం, చివరగా ఆ గేమ్‌ని ఆడేవారికి మంచి అనుభూతిని మిగిల్చేలా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం వీరి ప్రధాన బాధ్యతలు. వీరు సృజనాత్మక, సాంకేతిక రంగాలకు బృందాలతో కలిసికట్టుగా పనిచేస్తారు. వారికి ఏం కావాలో చెప్పి చేయించుకుంటారు. వారు ఊహించిన సృజనాత్మక దార్శనిక భావనకు భంగం వాటిల్లకుండా, గేమ్‌ను అనుకున్నట్టుగా తీర్చిదిద్ది, అనుకున్న సమయానికి, నిర్దేశించుకున్న బడ్జెట్‌లోనే పూర్తిచేసి, విడుదల చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. 

ఎలాంటి అర్హతలు అవసరం? 

సృజనాత్మకత, డిజైన్‌ నైపుణ్యం, ప్రతి చిన్న అంశాన్నీ శ్రద్ధాసక్తులతో గమనించగలగడం. 

లోతైన విశ్లేషణాత్మక ఆలోచనా శక్తి, ప్రొడక్షన్‌ ప్రక్రియపై విస్తృత అవగాహన.

రోజువారీ ప్రొడక్షన్‌ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తూనే, కస్టమర్లు, ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, పోటీదారులు, సోషల్‌ ట్రెండ్స్, సాంకేతిక రంగంలో భవిష్యత్తులో రాబోయే మార్పుల వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి (‘బిగ్‌ పిక్చర్‌ థింకింగ్‌’ సామర్థ్యం).  

కోడింగ్, ప్రోగ్రామింగ్‌కు సంబంధించి మంచి సాంకేతిక పరిజ్ఞానం.

గేమింగ్‌ రంగానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లు, సిస్టమ్స్‌పై అవగాహన.

స్టోరీ టెల్లింగ్, ఆటకు సంబంధించిన గేమ్‌ మెకానిక్స్‌లో గట్టి పట్టు.

గేమింగ్‌ పరిశ్రమ, గేమ్స్‌ ఎలా పనిచేస్తాయి, ఈ రంగంలో తాజా ధోరణుల పరిజ్ఞానం.

మంచి కమ్యూనికేషన్, ఇంటర్‌పర్సనల్, నాయకత్వ లక్షణాలు.

గేమ్‌ ఆర్టిస్ట్‌లు గేమ్స్‌ రూపకల్పనకు అవసరమైన 2డీ/ 3డీ క్యారెక్టర్లు, ఎన్విరాన్‌మెంట్, ప్రాప్స్, ఇతర గ్రాఫిక్‌ ఎలిమెంట్స్‌ను సిద్ధం చేస్తారు. గేమ్‌ డెవలపర్లు, మోడలర్లు, ఇతర బృంద సభ్యులతో కలిసి పనిచేస్తారు. ఒక గేమ్‌కు సంబంధించిన కాన్సెప్ట్‌ రూపకల్పన, స్టోరీ బోర్డు సిద్ధం చేయడం, అంతిమంగా గేమ్‌ రూపకల్పనకు వారు తమ సృజనాత్మక, సాంకేతిక/సాఫ్ట్‌వేర్‌ నైపుణ్యాలను వినియోగిస్తారు. చాలా సందర్భాల్లో గేమ్‌ ఆర్టిస్ట్‌లు స్టూడియో అవసరాల్ని బట్టి.. ఇప్పటికే ఉన్న గేమ్స్‌ని మరింత మెరుగుపరచడం, కొత్త గేమ్స్‌ ఎంత ప్రభావశీలంగా ఉన్నాయో పరీక్షించడం, గేమ్స్‌కు అవసరమైన ప్రచార సామగ్రిని సిద్ధం చేయడం, గేమింగ్‌ ట్రెండ్స్‌పై పరిశోధించడంతో పాటు, దీనికి సంబంధించిన ఇతర పనులూ చేయాల్సి ఉంటుంది.

ఎలాంటి అర్హతలుండాలి? 

ఆర్ట్, డిజైన్, డిజిటల్‌ పెయింటింగ్‌ నైపుణ్యాలు.

గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాలపై అపరిమిత ఆసక్తి. 

యూనిటీ లేదా అన్‌రియల్‌ వంటి గేమ్‌ ఇంజిన్స్‌తో విస్తృత పరిచయం. 

జీ బ్రష్, మాయా, 3డీఎస్‌ మ్యాక్స్, సబ్‌స్టెన్స్‌ పెయింటర్, మడ్‌బాక్స్‌ వంటి వాటిలో నైపుణ్యం.

పని ప్రాధాన్యాల్ని నిర్ణయించుకోవడం, ఏకకాలంలో అనేక పనులు చక్కబెట్టగలగడం, ఒత్తిడిలోనూ పనిచేస్తూ, డెడ్‌లైన్‌ను చేరుకోగలగడం. 

మంచి కమ్యూనికేషన్, ఇంటర్‌పర్సనల్, ఆర్గనైజేషనల్‌ నైపుణ్యాలు.

ఓపిక, సునిశిత దృష్టి, ప్రతి చిన్న పనినీ ప్రత్యేక శ్రద్ధతో పూర్తిచేయడం.

సానుకూల దృక్పథం, నిత్య విద్యార్థిగా ఉండటం, గేమింగ్‌ రంగంలో వస్తున్న కొత్త ట్రెండ్స్‌ని అందిపుచ్చుకోవడం.

నైపుణ్యాల కోసం...  

సంబంధిత సంస్థల్లో ప్రత్యేక శిక్షణ పొందినవారినీ, గేమింగ్‌లో ఎంతో కొంత అనుభవం ఉన్నవారినీ నియమించుకునేందుకే సంస్థలు ఆసక్తి చూపుతుంటాయి. గేమ్‌ ఆర్టిస్ట్‌గా ఒక మంచి స్థానం నుంచి కెరియర్‌ ప్రారంభించాలనుకుంటే.. గేమింగ్, డిజైన్‌ లేదా సంబంధిత రంగాల్లో ప్రొఫెషనల్‌ డిగ్రీ, డిప్లొమా చేసి ఉండాలి. అవసరమైన సాంకేతిక, కళాత్మక నైపుణ్యాలను నేర్చుకుని ఉండాలి. ప్రముఖ శిక్షణ సంస్థలు గేమ్‌ డిజైన్, గేమ్‌ ప్రొడక్షన్లలో ప్రత్యేక స్పెషలైజేషన్‌తో కూడిన డిప్లొమా/డిగ్రీ కోర్సులు ఆఫర్‌ చేస్తున్నాయి. ఇంటర్న్‌షిప్, పని అనుభవం ఉంటే మేలు. 

ఉద్యోగ సాధనకు.. 

మీకున్న గేమ్‌ ఆర్ట్‌ నైపుణ్యాల్ని తెలియజేస్తూ ఒక షోరీల్‌ రూపొందించుకోవాలి. దాని నిడివి ఎంత ఎక్కువన్న దాని కంటే నాణ్యతపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. మీరు చేసిన అత్యుత్తమైన వాటినే ఎంపిక చేసుకుని షోరీల్‌ రూపొందించండి. మీ అర్హతల్ని, నైపుణ్యాల్ని తెలియజేస్తూ రెజ్యూమె సిద్ధం చేయండి. మీకు ఉద్యోగం ఇవ్వడం వల్ల ఆ సంస్థకు ఒనగూరే ప్రయోజనమేంటో వివరించేలా కవరింగ్‌ లెటర్‌ జత చేయాలి. ఆ ఉద్యోగానికి మీరే అన్ని విధాలా అర్హతగల వ్యక్తి అని ఎందుకు అనుకుంటున్నారో ఆ లేఖలో వివరించాలి.

హోదాలు

గేమ్‌ ఆర్టిస్ట్‌ - సీనియర్‌ గేమ్‌ ఆర్టిస్ట్‌ - లీడ్‌ ఆర్టిస్ట్‌ - ఆర్ట్‌ డైరెక్టర్‌ - క్రియేటివ్‌ డైరెక్టర్‌

నైపుణ్యాలకు..

వీడియోగేమ్‌ డిజైనర్లకు ప్రోగ్రామింగ్, గ్రాఫిక్‌ డిజైన్, మల్టీమీడియా, స్క్రిప్ట్‌రైటింగ్, గేమ్‌ డిజైన్‌ లాంటి అంశాల్లో కనీసం డిప్లొమా/బ్యాచిలర్స్‌ డిగ్రీ అయినా ఉండాలి. స్వతంత్రంగా చిన్న చిన్న గేమ్స్‌ రూపొందించి, వాటిపై మెంటర్స్‌ అభిప్రాయాలు, సూచనలు తెలుసుకుంటూ నైపుణ్యాలు మెరుగుపరచుకోవచ్చు. వారిచ్చిన సూచనలకు అనుగుణంగా గేమ్‌ను తీర్చిదిద్ది మార్కెట్‌లోకి విడుదల చేయడం ద్వారా గేమర్స్‌ స్పందన తెలుసుకోవచ్చు. 

ఉద్యోగం సంపాదించాలంటే..

యానిమేటర్, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్, స్క్రిప్ట్‌రైటర్‌ లాంటి అంశాల్లో ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగాల్లోనూ, ఇంటర్న్‌షిప్‌లోనూ ప్రవేశించేందుకు మీ అర్హతల్ని తెలియజేస్తూ ఒక పోర్ట్‌ఫోలియో సిద్ధం చేసుకోవాలి. దాని నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ గేమ్‌ డిజైనర్‌గా మారొచ్చు. కాలేజీ చదువు పూర్తయిన వెంటనే నేరుగా జూనియర్‌ గేమ్‌ డిజైనర్‌గా ఉద్యోగం దొరికే అవకాశమూ ఉంది. 

గేమ్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన ఏదైనా విభాగంలో ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగంతో కెరియర్‌ మొదలవుతుంది. డిజైన్‌లో హోదాలు...

జూనియర్‌ డిజైనర్‌  - లీడ్‌ గేమ్‌ డిజైనర్‌

జీతభత్యాలు 

ఫ్రెషర్స్‌కు నెలకు రూ.20,000- రూ.35,000.

సీనియర్లకు (ఐదేళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉన్నవారికి) నెలకు రూ.70,000- రూ.1,00,000, ఆపైన 

గేమ్‌ ఆర్ట్‌

శిక్షణ అవకాశాలు 

ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్లో గేమింగ్‌ కోర్సులను అందిస్తున్న సంస్థలు చాలా ఉన్నాయి. 

కోర్సెరా, యుడెమి, ఎడెక్స్‌ లాంటి ఆన్‌లైన్‌ వేదికల్లో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

హైదరాబాద్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైనార్ట్స్‌ (జేఎన్‌ఏఎఫ్‌ఏ) యూనివర్సిటీ అనుబంధంగా నాలుగేళ్ల గేమింగ్‌ కోర్సులున్నాయి. 

ఇవి అందిస్తున్న కాలేజీలు.. 

క్రియేటివ్‌ మల్టీమీడియా కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ 

బ్యాక్‌స్టేజ్‌ పాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గేమింగ్‌ 

డిజిక్వెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ ఆర్ట్స్‌ & డిజైన్‌ 

ఐసీఏటీ డిజైన్‌ అండ్‌ మీడియా కాలేజ్‌ 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఒక్క ఛాన్స్ కాదు... అనేక ఛాన్సులు!

‣ డిగ్రీతో ఐఐటీలో ఉద్యోగాలు

‣ కోర్సు పూర్తి కాగానే కొలువుల్లోకి!

‣ అమ్మకాల దళంలో చేరతారా?

Posted Date: 18-10-2022


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌