• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అమ్మకాల దళంలో చేరతారా?

సేల్స్‌ఫోర్స్‌ - సరికొత్త ఉద్యోగావకాశాలు

ఏ వ్యాపార సంస్థకైనా వినియోగదారుల సంతృప్తే ముఖ్యం. వారికి అందించే సేవలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడంతోనే  కంపెనీ ఒక్కోమెట్టూ పైకెక్కుతూ ఉంటుంది. ఇందుకు సమాచారాన్ని (డేటా) సరిగ్గా ఉపయోగించడం అవసరం. కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ (సీఆర్‌ఎం) ప్లాట్‌ఫామ్స్‌కు అందుకే ప్రస్తుతం ఆదరణ పెరుగుతోంది. ఇందులో ‘సేల్స్‌ఫోర్స్‌’ మరింత ముందంజలో ఉండి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోంది!


వినియోగదారులతో కంపెనీలు చక్కటి అనుబంధాన్ని కలిగి ఉండేలా చేసే ఈ సేల్స్‌ఫోర్స్‌.. క్లౌడ్‌ బేస్డ్‌ ప్లాట్‌ఫామ్‌. కస్టమర్‌ సపోర్ట్, మార్కెటింగ్‌ ఆటోమెటేషన్, అనాలిసిస్, అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ వంటి అనేకానేక సేవలను దీని ద్వారా పొందవచ్చు. వినియోగదారులకు మేలైన సేవలు అందించడం ద్వారా కంపెనీల లాభాలను వృద్ధి చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంది. ప్రస్తుతం ఉన్న సీఆర్‌ఎం ప్లాట్‌ఫామ్‌లలో సేల్స్‌ఫోర్స్‌ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు... ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్షా యాభై వేల సంస్థల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు.


 

ఉపయోగించడం సులువు..


చిన్నాపెద్దా అన్ని కంపెనీలూ ఉపయోగించేలా దీన్ని తయారుచేశారు. వినియోగదారుల సమాచారాన్ని భద్రపరచడం, దాన్నుంచి అదనపు ఆలోచనలు, అవకాశాలూ సృష్టించడం, విదేశాల్లో మార్కెటింగ్‌ వ్యూహాలు రచించడం, వినియోగదారులతో మమేకం కావడం... ఇలాంటి అనేక పనులు సేల్స్‌ఫోర్స్‌ సాయంతో చేయవచ్చు. 


దీన్ని ఈ-మెయిల్, సోషల్‌ మీడియా, మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ ఇతర కంటెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌తో సులువుగా అనుసంధానం చేసే వీలుంది. 


సంస్థ అవసరాలకు తగ్గట్టు దీన్ని కస్టమైజ్‌ చేసుకునే వీలు కల్పించారు.


 

ప్రొడక్ట్‌లు ఇవీ...

ఇందులో మొట్టమొదట చెప్పుకోవాల్సింది ‘సేల్స్‌ క్లౌడ్‌’ గురించి. ఇది మొత్తం అన్నింటిలోకీ ప్రధానమైన విభాగం... ఎందుకంటే ఏ వ్యాపారానికైనా అమ్మకాలే కదా ముఖ్యమైనవి! కంపెనీల అమ్మకాలను ఏ విధంగా పెంచాలనే పనికి సంబంధించిన విషయాలన్నీ సేల్స్‌క్లౌడ్‌ చూసుకుంటుంది. ప్రధానంగా బిటుబి సంస్థలను లక్ష్యంగా చేసుకుని దీన్ని తయారుచేశారు. ఉత్పత్తుల నిర్వహణ, అమ్మకాల పర్యవేక్షణ వంటి పనులు దీని ద్వారా చేయొచ్చు. ఈ ప్రొడక్ట్‌కు అనుబంధంగా సేల్స్‌క్లౌడ్‌ ఐన్‌స్టైన్, హై వెలాసిటీ సేల్స్, ఇన్‌బాక్స్, సేల్స్‌ఫోర్స్‌ ఎనీవేర్, మాప్స్, లైటెనింగ్‌ డైలర్, షెడ్యూలర్‌ వంటి ప్రొడక్ట్స్‌ ఉన్నాయి. 


‘సీపీక్యూ అండ్‌ బిల్లింగ్‌’ మరో ముఖ్యమైన విభాగం. ధర, కోట్, బిల్లింగ్‌ విధులు ఇది నిర్వహిస్తుంది. ఉత్పత్తికి ఉత్తమ ధర వచ్చేలా ఇన్‌వాయిస్‌ ఇవ్వడం, పేమెంట్లు చేయడం, రెవెన్యూను వృద్ధి చేయడం దీని ప్రధాన విధులు. 


‘సర్వీస్‌ క్లౌడ్‌’ అనే ప్రొడక్ట్‌ వ్యాపారంలో వినియోగదారులకు సహాయంగా ఉండేందుకు వృద్ధి చేశారు. కస్టమర్లు ఈ-మెయిల్‌ లేదా ఫోన్, లైవ్‌ చాట్‌ ద్వారా కంపెనీకి అనుసంధానమయ్యేలా చూడటం,  సమస్యకు తగిన పరిష్కారం చూపించడం వంటి విధులు ఇది నిర్వహిస్తుంది. గుర్తు చేసుకోండి... మీరు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే ఉంటారు కదా, మీతో మాట్లాడిన ఆ సాఫ్ట్‌వేర్‌ బహుశా సేల్స్‌ఫోర్స్‌ ప్రొడక్టే అయి ఉండొచ్చు! దీనికి అనుబంధంగా సర్వీస్‌ క్లౌడ్‌ వాయిస్, కస్టమర్‌ లైఫ్‌సైకిల్‌ అనాలసిస్‌..విభాగాలున్నాయి. 


‘మార్కెటింగ్‌ క్లౌడ్‌’ ఒక సంస్థను మార్కెట్‌లోకి బలంగా తీసుకెళ్లేలా పనిచేస్తుంది. ఈ-మెయిల్, సోషల్‌ మీడియా, మొబైల్‌ యాప్స్, ఎస్‌ఎంఎస్, ఇతర వెబ్‌సైట్స్‌లలో కంపెనీకి ప్రచారం కల్పించేలా దీన్ని సృష్టించారు. ఇందులో జర్నీ బిల్డర్, ఈ-మెయిల్‌ స్టూడియో, మొబైల్‌ స్టూడియో, కస్టమర్‌ డేటా ప్లాట్‌ఫామ్, అడ్వర్టైజింగ్, ఇంటెలిజెన్స్, లాయల్టీ మేనేజ్‌మెంట్, అకౌంట్‌ ఎంగేజ్‌మెంట్‌ వంటి ఉప ఉత్పత్తులు ఉన్నాయి. 


ఒక సంస్థలోని ఉద్యోగులు సంభాషించుకునేందుకు ‘స్లాక్‌’ను తయారు చేశారు. సొంత కంపెనీగా ఉన్న దీన్ని 2020లో సేల్స్‌ఫోర్స్‌ కొనుగోలు చేసి తమ ప్రొడక్ట్స్‌లో భాగం చేసుకుంది. 


ఇవేకాక అనలిటిక్స్‌ క్లౌడ్, కామర్స్‌ క్లౌడ్, ఇంటిగ్రేషన్, ఇండస్ట్రీ క్లౌడ్, సేఫ్టీ క్లౌడ్‌ వంటి ఇతర ప్రొడక్ట్స్‌ ఇందులో ఉన్నాయి.


 

ఉద్యోగాలేం ఉన్నాయ్‌?


ఇది ఇప్పటికే అభివృద్ధి చెందిన స్ట్రీమ్‌ మాత్రమే కాదు... ఇంకా పెరుగుతున్నది కూడా. అందువల్ల కంపెనీలకు సేల్స్‌ఫోర్స్‌ను వివిధ స్థాయుల్లో ఉపయోగించడం తెలిసిన నిపుణులు అవసరం అవుతున్నారు. ప్రస్తుతానికి సేల్స్‌ఫోర్స్‌ అడ్మిన్, డెవలపర్, కన్సల్టెంట్, బిజినెస్‌ అనలిస్ట్, టెక్నికల్‌ ఆర్కిటెక్ట్, టెస్టర్‌ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. అవసరాలు పెరుగుతున్న కొద్దీ ఇందులోనే కొత్త తరహా కొలువులు తయారయ్యే అవకాశం ఉంది.


 

నేర్చుకోవడం ఎలా?


ఐడీసీ (ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌) లెక్కల ప్రకారం సేల్స్‌ఫోర్స్‌ ద్వారా 2024లోపు భారత్‌లో దాదాపు ఐదున్నర లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు రానున్నాయి. అందువల్ల దీన్ని ఉపయోగించడం నేర్చుకుంటే ఆ కొలువులను అందుకునే అవకాశం ఉంది.


సేల్స్‌ఫోర్స్‌ సేవలను లేదా అందులో ఉన్న విభాగాలను ప్రొడక్ట్‌లుగా పిలుస్తున్నారు. ఒక వ్యాపార సంస్థ ప్రతి అవసరాన్నీ తీర్చేలా ఇందులో రకరకాలైన ప్రొడక్ట్‌లున్నాయి. ఇవి దేనికవే ప్రత్యేకం. మనకు ఏ విభాగంలో ఆసక్తి ఉందో గమనించి.. దాని గురించి తెలుసుకుని పట్టు సాధించడం ద్వారా, సంబంధిత ఉద్యోగాలు అందుకోవచ్చు


సేల్స్‌ఫోర్స్‌ నేర్చుకోవాలి అనుకునేవారి కోసం ఆ సంస్థే ట్రైల్‌హెడ్‌ అనే విభాగాన్ని ప్రారంభించింది. ఇదొక ఉచిత లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌. ఇందులో సేల్స్‌ఫోర్స్‌ ప్రొడక్ట్‌ల గురించి టెక్నికల్‌ అంశాలతోపాటు వ్యాపారం, ఉద్యోగంలో అవసరమయ్యే సాఫ్ట్‌ స్కిల్స్‌ను సైతం నేర్చుకునే అవకాశం ఉంది. ప్రారంభంలో అవగాహన, ఆసక్తి పెరిగేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. 


దీన్ని పూర్తిస్థాయిలో కెరియర్‌గా మలుచుకోవాలి అనుకునేవారి కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో శిక్షణ అవకాశాలున్నాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో నిపుణులైన శిక్షకులతో తరగతులు నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లో యుడెమీ, సింప్లీలెర్న్‌ లాంటి సంస్థలు అందిస్తున్నాయి.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇంధన సంక్షోభం ముంగిట ఐరోపా

‣ అంతర్గత ప్రజాస్వామ్యం ఎండమావి

‣ ఎన్‌సీసీతో ఆర్మీలో ఆఫీసర్‌

‣ కొత్త డిగ్రీలు ఎన్నో అవకాశాలు

Posted Date : 14-10-2022 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం