• facebook
  • whatsapp
  • telegram

అంతర్గత ప్రజాస్వామ్యం ఎండమావి

ప్రహసనంగా కాంగ్రెస్‌ అధ్యక్ష ఎంపిక

భారత్‌లో సుదీర్ఘకాలం అధికారాన్ని అనుభవించి తనకు తాను ప్రజాస్వామ్యానికి పర్యాయ పదంగా అభివర్ణించుకొనే భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రస్తుతం అస్తిత్వ పోరాటంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక సైతం ప్రహసనంగా మారింది. 136 ఏళ్ల చరిత్ర కలిగిన హస్తం పార్టీ ఎలాంటి పోటీ, ఎన్నిక లేకుండానే అధ్యక్షుడిని ఎంపిక చేయనుంది. అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి పార్టీ ఎలక్టోరల్‌ జాబితాను విడుదల చేయాలని తాజాగా కాంగ్రెస్‌ నేత మనీష్‌ తివారీ డిమాండు చేశారు. అయితే అలాంటి జాబితా ఏదీ లేదని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ తరుణంలో పార్టీ అధ్యక్ష ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎలా జరుగుతాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్‌ ఏనాడో నీళ్లొదిలేసింది. పారదర్శకత గురించి నీతులు చెప్పే హస్తం పార్టీ దేశవ్యాప్తంగా తన సభ్యులు, అందులో అర్హులైన ఓటర్ల గురించి స్పష్టమైన వివరాలు లేకుండానే జాతీయ అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియను చేపడుతోంది. పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ఇటీవల షెడ్యూలు విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, చివరకు మిగిలిన అభ్యర్థులు ఉండే జాబితాను ప్రకటించి, అక్టోబరు 17న ఎన్నిక నిర్వహించనుంది. కానీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎవరన్నది ముందుగానే నిర్ణయమైపోతుంది. నిజమైన పోటీదారులంటూ ఎవరూ ఉండరు!

కొరవడిన సంస్కరణలు

ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి 28 రాష్ట్ర కమిటీలు, ఎనిమిది ప్రాదేశిక కమిటీలు ఉన్నాయి. వాటి వద్దా పార్టీకి సంబంధించి సరైన సభ్యుల జాబితా ఉంటుందనుకోవడం భ్రమే అవుతుంది. పార్టీలో స్వేచ్ఛగా, సరైన రీతిలో ఎన్నికలు నిర్వహించడానికి అలాంటి జాబితా తప్పనిసరి. చాలా ఏళ్ల క్రితమే హస్తం పార్టీ అలాంటి వాటికి తిలోదకాలు వదిలేసింది. పార్టీ కాలక్రమంలో కుటుంబ నిర్వహణ సంస్థగా మారిపోయింది. సోనియా కుటుంబం ఇష్టాయిష్టాల ఆధారంగా కార్యవర్గాన్ని నియమించడం, తొలగించడం అలవాటైపోయింది. ఫలితంగా ఎన్నికలు కేవలం ప్రచారానికే తప్ప పార్టీ వాస్తవ నాయకత్వం మాత్రం సోనియా కుటుంబం చేతుల్లోనే ఉంది. 2000 సంవత్సరంలో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి చివరిసారి ఎన్నికలు జరిగినప్పుడు సోనియాపై పోటీ చేసిన దివంగత జితేంద్ర ప్రసాద సైతం పార్టీలో పారదర్శకత కొరవడిన ఎన్నికలపై గళం విప్పారు. కాంగ్రెస్‌ పార్టీని ఇందిరా గాంధీ ప్రైవేటు సంస్థగా మార్చడానికి ముందు- కనీసం ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీల స్థాయిలో నిజమైన పోటీ జరిగేది. సీనియర్‌ పీసీసీ నేతల మధ్య ఏకాభిప్రాయంతో జాతీయ పార్టీ అధ్యక్షుడిని నిర్ణయించేవారు. ఇందిరా గాంధీ హయాములో పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అంతరించిపోయింది. ఆ పరిస్థితి నుంచి నేటికీ హస్తం పార్టీ బయటపడలేదు. ప్రస్తుతం కాంగ్రెస్‌ను శాసిస్తున్న సోనియా గాంధీకి, ఆమె పిల్లలు రాహుల్‌, ప్రియాంకలకు పార్టీ సభ్యులతో సరైన సంబంధాలు లేవు. సోనియా తరవాత కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి వారసుడిగా రాహుల్‌ ఎన్నికయ్యారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో తన కుటుంబం ప్రాతినిధ్యం వహించిన అమేఠీ నుంచి ఆయన ఓటమి పాలయ్యారు. లోక్‌సభలోకి అడుగు పెట్టడానికి కేరళలోని వాయనాడ్‌ స్థానాన్ని రాహుల్‌ ఆశ్రయించాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో అత్యంత కఠినమైన అస్తిత్వ సవాలును ప్రస్తుతం ఎదుర్కొంటోంది. కానీ, పునరుజ్జీవానికి ఆ పార్టీ సరైన ప్రయత్నాలు చేయడంలేదు. పార్టీలో చేపట్టాల్సిన సంస్కరణల ప్రసక్తే తేవడం లేదు.

ఆర్భాటంగా మిగలకూడదు

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ చేపట్టనున్న భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ పాల్గొననున్నట్లు ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. జనాకర్షణ కలిగిన, సరైన ప్రజాదరణ పొందిన నాయకుడు లేనప్పుడు ఈ యాత్ర వల్ల పెద్దగా ఒనగూడేది ఏమీ ఉండదు. అన్ని యాత్రలూ నేతలు కోరుకొన్న ఫలితాలను ఇస్తాయన్న భరోసా లేదు. గతంలో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన భావోద్వేగ అంశం ఆసరాగా భాజపా నేత ఎల్‌కే ఆడ్వాణీ నిర్వహించిన రథయాత్ర ఆ పార్టీ విస్తరణకు తోడ్పడింది. కేంద్రంలో కమలం పార్టీ అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది. మరోవైపు చంద్రశేఖర్‌ దేశవ్యాప్తంగా నిర్వహించిన పాదయాత్ర తన కొత్త పార్టీ ప్రజల్లో విస్తరించడానికి కొంత సహాయపడింది. కానీ, ఆయన ప్రతిష్ఠను పెంచడంలో మాత్రం విఫలమైంది. ప్రజలకు దూరమైపోతున్న కాంగ్రెస్‌ పార్టీకి పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా భారత్‌ జోడో యాత్రను తలపెట్టారు. అయితే, సరైన నిబద్ధత, సత్తా లేని రాజకీయ నాయకుడన్న భావనను ప్రజల మనసుల నుంచి రాహుల్‌ గాంధీ ముందుగా తొలగించుకోవాలి. అప్పటిదాకా ఇలాంటి యాత్రలు ఎన్ని చేపట్టినా కేవలం ఆర్భాటంగానే మిగులుతాయి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎన్‌సీసీతో ఆర్మీలో ఆఫీసర్‌

‣ కొత్త డిగ్రీలు ఎన్నో అవకాశాలు

‣ పోటీలో దీటుగా నిల‌వాలంటే?

‣ ఏఈఈ కొలువుల‌కు ఎలా సిద్ధం కావాలి?

‣ ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాల భ‌ర్తీ

‣ ఎదురుగానే జవాబు అయినా ఎంతో కష్టం!

Posted Date: 12-09-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం