• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎదురుగానే జవాబు అయినా ఎంతో కష్టం!

ఎంసీక్యూలు రకరకాలు

మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు భలే గమ్మత్తుగా ఉంటాయి. జవాబు ఎదురుగానే ఉంటుంది, కానీ గుర్తించలేని విధంగా విద్యార్థులను తికమకపెడతాయి. ప్రవేశ పరీక్షలైనా, పోటీ పరీక్షలైనా... ఇప్పుడు దాదాపు ప్రశ్నపత్రాలన్నీ ఎంసీక్యూలతోనే ఉంటున్నాయి. ఈ ప్రశ్నల్లో స్థిరంగా కొన్ని రకాలున్నాయి. ప్రశ్న ధోరణి ఏమిటనేది తెలుసుకుంటే... సమాధానం రాసేందుకు మరింత సులభంగా ఉంటుంది. మరి దీని గురించి ఇంకాస్త వివరంగా చెప్పుకుందామా!

విద్యార్థులను పరీక్షించే క్రమంలో ఎంసీక్యూ ప్రశ్నలను 20వ శతాబ్దం మధ్య నుంచి ఎక్కువగా అడగటం మొదలుపెట్టారు. ఆప్షన్లు ఇచ్చి అందులో జవాబు గుర్తించమనడం అనేది చూడటానికి సులువుగా అనిపించినా... అందులో కష్టమేంటో రాసేవారికే తెలుస్తుంది. ఇందులో చాలా ఫార్మాట్లు ఉన్నా, ఎక్కువగా కనిపించే వాటిని పరిశీలిస్తే...

ఆప్షన్లన్నీ ఒకేలా...

ఇవి ఎక్కువ మందిని గందరగోళానికి గురిచేసే ప్రశ్నలు. ఆప్షన్లన్నీ దాదాపు ఒకేలా కనిపించేలా చేసి విద్యార్థిని ఇబ్బంది పెట్టడం ఈ ప్రశ్న ప్రధాన లక్ష్యం. బాగా గుర్తున్నవారు తప్ప... జ్ఞాపకం తెచ్చుకుని రాద్దాం అనుకునే విద్యార్థులు ఈ తరహా ప్రశ్నలు రాసేటప్పుడు తప్పు జవాబు ఎంచుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

* ఈ ప్రశ్నలకు జవాబులు గుర్తించేటప్పుడు ముందు ఆప్షన్లలో తేడాలు ఏమున్నాయో గుర్తించాలి. అన్నీ ఒకేలా ఉన్నా ఏదో ఒక పదం వద్ద విభిన్నంగా ఉంటుంది కదా! దాన్ని కీవర్డ్‌గా ఎంచుకోవాలి. ఆ పదం ఆధారంగా, ఆ ఆప్షన్‌ జవాబు అవుతుందా కాదా అన్నది గుర్తించాలి. సంబంధం లేని ఆప్షన్స్‌ను పక్కనపెట్టి సమాధానాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎక్కువగా సైన్స్‌ సబ్జెక్టుల పేపర్లలో ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి. బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఇతర సబ్జెక్టుల్లో విద్యార్థులను తికమక పెట్టే పదాలను గుర్తించి ఈ విధమైన ప్రశ్నలు తయారుచేస్తుంటారు. అందువల్ల మొదట విద్యార్థులు తగిన విధంగా ప్రశ్నను అర్థం చేసుకుని అప్పుడే జవాబు రాయాలి.

ఒకటి కంటే ఎక్కువ

ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్‌ సరైనవి అయ్యే అవకాశం ఉన్నవాటిని ఈ కేటగిరీలోకి చేర్చవచ్చు. ఇలాంటి ప్రశ్నల ఆప్షన్స్‌లో ఆల్‌ ఆఫ్‌ ది ఎబవ్‌ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

* ఈ ప్రశ్నలకు జవాబు గుర్తించడానికి సాధారణంగా తొలి ఆప్షన్‌ చదివి, కరెక్ట్‌ అయితే వెంటనే జవాబు పెట్టేస్తూ ఉంటారు. కానీ అది చాలా పొరపాటు. మొదటిది సరైనదని కచ్చితంగా తెలిసినా సరే, మిగతా ఆప్షన్స్‌ అన్నీ పూర్తిగా చదవాలి. ఎందుకంటే వేరే ఆప్షన్‌ కూడా సరైనది ఇచ్చి ఎ అండ్‌ బి అని మూడో ఆప్షన్‌గా ఇచ్చే అవకాశం ఉంటుంది కదా! అలాగే ఆల్‌ ఆఫ్‌ ది ఎబవ్‌ లేదా నన్‌ ఆఫ్‌ ది ఎబవ్‌  కూడా జవాబు కావొచ్చు. అందువల్ల వెంటనే సమాధానం గుర్తించేయకుండా పూర్తిగా చదవాలి.

రెండేసి పదాలు

ఎక్కువగా ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ పేపర్లలో ఈ తరహా ప్రశ్నలు కనిస్తుంటాయి. ప్రశ్నలో ఒకటి లేదా రెండు పదాల వద్ద ఖాళీ ఇస్తారు. ఆ ఖాళీలో ఏ పదాలు నింపితే సరైన అర్థం వస్తుందో కింద ఉన్న ఆప్షన్స్‌ నుంచి గుర్తించమంటారు. 

* ఒకేలాంటి అర్థం వచ్చే పదాలు ఇచ్చినా... వాటిలో కచ్చితంగా ప్రశ్నకు సరిపోయేవి ఏంటనేది విద్యార్థి గుర్తించాల్సి ఉంటుంది. ఇంకా సులభంగా చేయాలంటే మొదటి ఖాళీలోగానీ, రెండో ఖాళీలో గానీ... సరిగ్గా సరిపోయే పదం ఏంటో మొదట గుర్తించాలి. అప్పుడు అలా సరిపోలని ఒకటి రెండు ఆప్షన్స్‌ను పక్కనపెట్టేయొచ్చు. మిగతా వాటి నుంచి రెండో ఖాళీలో పెట్టే పదం ఏంటో గుర్తించడం సులభమవుతుంది! 

తప్పే జవాబు

అన్నీ సరైన ఆప్షన్లు ఇచ్చి, ఒకటి మాత్రం తప్పు ఇచ్చి, దాన్ని గుర్తించమనే ప్రశ్నలు ఈ కోవలోకి వస్తాయి. ఇందులో ఎక్కువగా నాట్, ఎక్సెప్ట్, నెవర్‌ వంటి పదాలు వాడుతూ ఉంటారు. 

* ఈ ప్రశ్నలను ట్రూ ఆర్‌ ఫాల్స్‌ విధానంలో ఆలోచిస్తే జవాబు వేగంగా రాయడం కుదురుతుంది. అంటే ప్రశ్నలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌... కింద ఇచ్చిన ఆప్షన్లలో ఒక్కో దానికీ సరిపోతుందా లేదా అన్నది నిజమా, కాదా అంటూ పరిశీలించాలి. ప్రతి ఆప్షన్‌నూ చెక్‌ చేశాక అన్నీ ఒక కోవలోకి వస్తూ ఏదో ఒకటి విభిన్నంగా మిగిలిపోతుంది. అదే మన ఆన్సర్‌. అలాగే వీటికి ఎలిమినేషన్‌ మెథడ్‌ కూడా ఉపయోగించవచ్చు. చూడగానే సరికాదని తెలిసిపోయే ఆప్షన్లను పక్కనపెట్టి మిగతావాటిలో మన జవాబు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

కీవర్డ్‌

ఈ తరహా ప్రశ్నల్లో చాలావరకూ ఆప్షన్స్‌ ఒకటే పదంగా ఉంటాయి. ప్రశ్నలో ఒక విషయాన్ని చర్చిస్తూ... అదేంటని అడిగే నిర్వచనాల్లా వీటిని చెప్పొచ్చు. ఇచ్చిన ప్రశ్నకు ఏ ఆప్షన్‌ పూర్తిగా సరిపోతుందో దాన్ని గుర్తించాలి. 

* ఇలాంటి ప్రశ్నల్లో ఎక్కువగా మోస్ట్, మేజర్, మెయిన్, లీస్ట్, లీస్ట్‌ లైక్లీ, బెస్ట్, ప్రోబబ్లీ వంటి పదాలు కనిపిస్తుంటాయి. అలా కనిపించగానే మనం ఈ ప్రశ్న ఉద్దేశం గమనించవచ్చు. ఆప్షన్లు అన్నీ దగ్గరదగ్గర పదాలే అయినా... వాటికి కొద్దిపాటి తేడా ఉంటుందనేది నిజం. ఆ తేడా ఏంటో గమనించగలిగితే వీటికి జవాబులు రాసినట్టే.

కష్టమనిపించేలా...

కొన్ని ప్రశ్నలు చూడగానే ‘అబ్బో.. చాలా కష్టం’ అనిపించేలా ఉంటాయి. పెద్దపెద్ద పదాలు - అంకెలు - సమీకరణాలు వాడటం, పేరాల్లా ఉండటం వల్ల కొందరు విద్యార్థులు చదవడానికే ఎక్కువ సమయం పడుతుందనే ఉద్దేశంతో వీటిని వెనక్కి పెట్టేస్తుంటారు. చివర్లో సమయం చాలక విడిచిపెట్టేస్తుంటారు. 

* పెద్దగా కనిపించిన ప్రతి ప్రశ్నా కష్టమనుకుంటే పొరపాటే. చదవడానికి ఎక్కువ సమయం పట్టించి, విద్యార్థిని కంగారుపెట్టాలనే ఉద్దేశంతో వీటిని ఇస్తుంటారు. కానీ ఇవి చాలావరకూ వెంటనే జవాబు గుర్తించేలాగానే ఉంటాయి. ఒక్కసారి పూర్తి ఏకాగ్రతతో చదివి సరిగ్గా అర్థం చేసుకుంటే జవాబు ఇవ్వడం చాలా సులభం. అయితే సమయం వృథా కాకుండా చూసుకోవడం ప్రధానం.

తక్కువ సమాచారం

ఇవి మరీ కట్టె కొట్టె తెచ్చె తరహాలో ఉండి, విద్యార్థి గుర్తుతెచ్చుకోవడానికి, ఆలోచించడానికి అవసరమయ్యే సమాచారాన్ని దాదాపు ఇవ్వకుండా చేస్తాయి. మరీ ఒక్క వాక్యం, నాలుగైదు పదాల్లోనే ప్రశ్న తేలిపోతూ ఉంటుంది.  * ఎంసీక్యూల్లో నిజానికి ఇవే కష్టమైన ప్రశ్నలు. బాగా సాధన చేసిన వారు, అంశాలన్నీ సరిగ్గా గుర్తున్నవారు మాత్రమే రాయగలుగుతారు. ప్రశ్నలో అదనపు సమాచారం ఏదీ లేకపోవడం వల్ల ఒకసారి ప్రయత్నించి చూద్దాం అనుకునే విద్యార్థులు అటెంప్ట్‌ చేసే పరిస్థితి ఉండదు. వీటిని రాయడానికి మెరుగైన సాధన ఒక్కటే మార్గం. 

చూశారుగా... ఎక్కువగా కనిపించే ఈ రకాలైన ప్రశ్నలతోపాటు జతపరచడం, స్టేట్‌మెంట్లు సరైనవా కాదా అని చెప్పడం, ఇంకా మరికొన్ని విధమైన ప్రశ్నలను వివిధ పరీక్షల్లో అడుగుతున్నారు. ఇలా ప్రశ్నను ఏ విధంగా తయారుచేసుంటారనే ఆలోచనతో సన్నద్ధమైతే... జవాబు కూడా ఎలా రాబట్టాలో అర్థం అవుతుంది. సమాధానం సరిగ్గా తెలియకపోయినా తెలివిగా అంచనా  (ఇంటెలిజెంట్‌ గెస్‌) వేసేటప్పుడూ సులభంగా ఉంటుంది. అయితే... ఈ పరీక్షల్లో నెగ్గేందుకు సాధన, శ్రమను మించిన సూత్రం ఏదీ లేదనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి!
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ తడబడకుండా ప్రసంగం

‣ మరిచిపోతున్నారా... మంచిదే!

‣ ఐఐటీ సహా ప్రసిద్ధ సంస్థల్లో డిగ్రీ

‣ డీఆర్డీవోలో ఉద్యోగాలు

Posted Date : 07-09-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌