• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మరిచిపోతున్నారా... మంచిదే!

‘బుద్ధిగా చదువుకోవాలి. చదివినవన్నీ అలా గుర్తుండాలి. పరీక్షలు బాగా రాయాలి. ఎక్కువ మార్కులు సంపాదించాలి..’ విద్యార్థులందరూ సాధారణంగా ఇలాగే కోరుకుంటారు. మరి జ్ఞాపకశక్తిని పెంచుకోవడం గురించి కాకుండా చిత్రంగా మరుపు మంచిదే అంటున్నారేంటని ఆశ్చర్యపోతున్నారు కదూ... అక్కడికే వచ్చేద్దాం.

చదివిన విషయాలన్నింటినీ చక్కగా గుర్తుపెట్టుకోవడం మేధావుల లక్షణం. విద్యార్థులుగా మనమంతా కూడా జ్ఞాపకశక్తి బాగా ఉండాలనే కోరుకుంటాం. చదివిన పాఠాలను పదిలంగా గుర్తుపెట్టుకోవడానికే ప్రయత్నిస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగని ప్రతి విషయాన్నీ గుర్తుపెట్టుకోనక్కర్లేదు. అనవసర విషయాలను మర్చిపోవడం కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించిన మంచి లక్షణమేనంటున్నారు నిపుణులు. 

‣ కిందటి ఏడాది పరీక్షల్లో ఊహించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చాయనుకుందాం. ఈ విషయాన్ని అదేపనిగా గుర్తుచేసుకుంటే ప్రస్తుతం చదివేదానిపైనా ఏకాగ్రతను నిలుపలేరు. అంటే మీరు ఇంకా గతంలో జరిగిన విషయాల గురించే ఆలోచించడం వల్ల వర్తమానం, భవిష్యత్తు.. రెండూ దెబ్బతింటాయి. కాబట్టి జరిగిన దాని గురించి మర్చిపోయి సాధించాల్సిన లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించాలి.  

‣ తరగతిలో మిగతావారి కంటే మీరే బాగా చదువుతారు అనుకుందాం. అయినాసరే అటు అధ్యాపకులూ, ఇటు తోటి విద్యార్థులూ ఎవరి నుంచీ మీకు తగిన గుర్తింపు దక్కడంలేదని ఊహించుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని బాధపడటం వల్ల మీ దృష్టి చదువు మీద నిలవదు. ప్రతిభకు చక్కని ప్రవర్తనా తోడైతే గుర్తింపు దానికదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. 

‣ విదేశీ విద్యకు సంబంధించిన సందేహాలను తీర్చుకోవడానికి సీనియర్లను కలిశారు అనుకుందాం. వాళ్లేమో మీరు అడిగిన సందేహాలను తేలిగ్గా తీసిపారేసి.. మీ స్నేహితుడు అడిగిన అనుమానాలను తీర్చడానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. దాంతో ఆ రోజు నుంచీ వాళ్లు మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకోలేదని.. మీ స్నేహితుడికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని అదే పనిగా ఆలోచిస్తారు. నిజానికి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమీ కాదు. దీన్ని అప్పటికప్పుడు మర్చిపోకుండా గుర్తుంచుకోవడం వల్ల విలువైన మీ సమయమెంతో వృథా అవుతుంది.

‣ మీరెంత శ్రద్ధగా చదువుతున్నా ఒక్కోసారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని స్థిమితంగా ఉండనీయకపోవచ్చు. పదేపదే ఈ విషయాన్ని గుర్తుచేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా.. పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేసుకుని వ్యక్తిగత ఖర్చులకు డబ్బు సంపాదించే మార్గాల గురించి అన్వేషించాలి. 

‣ అనారోగ్య సమస్యలు, అనుకోని ప్రమాదాల కారణంగా కొంతమంది విద్యార్థులు కుటుంబ సభ్యులనో, స్నేహితులనో కోల్పోవచ్చు. ఇదే విషయం గురించి అదేపనిగా ఆలోచించడం వల్ల నిరాశా నిస్పృహల్లోకి కూరుకుపోతారు. మీ మీద మీకు సానుభూతి పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న మీలాంటివాళ్లు ఏమీ సాధించలేరనే నిర్ణయానికి మీకు మీరే వచ్చేస్తారు. నిస్సహాయ స్థితిలో మిగిలిపోతారు. దీనికి బదులుగా వాస్తవాన్ని యథాతథంగా అంగీకరించగలిగే మనస్తత్వాన్ని పెంచుకోవాలి. 

‣ కాలేజీ జీవితంలో స్నేహితులతో మనస్పర్థలు, అపార్థాలు రావడం మామూలే. దీన్నో పెద్ద సమస్యగా ఊహించుకుని ప్రపంచం తలకిందులైనట్టుగా విచారించాల్సిన పనిలేదు. జరిగినదాన్ని త్వరగా మర్చిపోయి ఎప్పటిలా కలసిమెలసి ఉండటానికి ప్రయత్నించాలి. ఇప్పుడు చెప్పండి.. అవసరమైన పాఠాలను గుర్తుపెట్టుకుని... అనవసర విషయాలను మర్చిపోవడం విద్యార్థుల మానసిక ప్రశాంతతకు అవసరమే కదూ! 
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఐఐటీ సహా ప్రసిద్ధ సంస్థల్లో డిగ్రీ

‣ డీఆర్డీవోలో ఉద్యోగాలు

‣ ఏ ఉద్యోగ పరీక్షకు సిద్ధం కావాలి?

‣ ఏపీఈఏపీ సెట్‌ ప్రవేశాల్లో మార్పులు

‣ కనుమరుగవుతున్న లంకలు

‣ శాస్త్రసాంకేతిక అగ్రశక్తిగా చైనా

Posted Date : 07-09-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.