• facebook
  • whatsapp
  • telegram

కనుమరుగవుతున్న లంకలు

వాతావరణ మార్పుల దుష్ప్రభావం

వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరిగి మాల్దీవులు, ఫిజి, సీషెల్స్‌ వంటి దీవులు ఈ శతాబ్దాంతానికల్లా కనుమరుగవుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్‌లో లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులూ క్రమంగా సముద్ర కోతకు గురవుతున్నాయి. బంగాళాఖాతం ఉత్తరాగ్రాన పశ్చిమ్‌ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరాల వెంబడి ఉన్న నదీ ద్వీపాలు (లంకలు) సైతం ఉనికిని కోల్పోతున్న విషయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. గంగ, బ్రహ్మపుత్ర, మేఘన నదులు బంగాళాఖాతంలో కలిసే చోట ఏర్పడిన సుందర్బన్‌ డెల్టాలో ఈ లంకలు ఉన్నాయి. సుందర్బన్‌ డెల్టాలో భారత్‌ వైపు 102 లంకలు ఉన్నాయి. వాటిలో 54 లంకల్లో మాత్రమే జనావాసాలు కనిపిస్తాయి. అక్కడ మొత్తం 50 లక్షల మంది నివసిస్తున్నారు. నదీ ప్రవాహ ఉద్ధృతి, సముద్రపు ఆటుపోట్ల వల్ల భారత్‌, బంగ్లా లంకల భూభాగం హరించుకుపోతోంది. వాతావరణ మార్పులు తెస్తున్న అతివృష్టి వల్ల నదులకు వరద అధికమవుతోంది. ఫలితంగా బంగాళాఖాత మట్టం ఏడాదికి 3.14 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతోంది. ఏటేటా తుపానులు మరింత తీవ్రతతో విరుచుకుపడుతూ లంకల క్షయానికి కారణమవుతున్నాయి.

సుందర్బన్‌లో ఏర్పడిన ఘోరమరా దీవి 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం సగానికి తగ్గి అయిదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి కుంచించుకుపోయింది. ఒకప్పుడు అక్కడ 45,000 మంది ప్రజలు నివసించేవారు. ఇప్పుడు వారి సంఖ్య 2,500కు పడిపోయింది. నిరుడు యాస్‌ తుపాను ఘోరమరా దీవిని అతలాకుతలం చేసింది. సముద్రం పొంగి లంకలో పెద్ద భాగాన్ని ముంచెత్తింది. వాతావరణ మార్పుల కారణంగా తుపానుల విజృంభణ పెరుగుతున్నందువల్ల ఈ దీవి సమీప భవిష్యత్తులోనే మునిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. యాస్‌ తుపాను వల్ల ఘోరమరాలో ఇళ్లు, పొలాలను కోల్పోయిన వారిలో వంద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సమీపంలోని సాగర్‌ దీవిలో భూములిచ్చింది. తుపానుల తీవ్రత వల్ల సాగర్‌ లంక సైతం ఏదో ఒకనాడు సముద్రంలో కలిసిపోవచ్చు. ఘోరమరా దీవిలో ఉప్పునీటిని తట్టుకొనే నాణ్యమైన దూదేశ్వర్‌ వరి పండుతుంది. తుపానుల పరంపర ఆ పంటను దెబ్బతీస్తోంది. ఘోరమరాతో పాటు అనేక ఇతర సుందర్బన్‌ లంకల్లో ఇళ్లు కట్టుకొని, అక్కడి సారవంతమైన నేలల్లో వ్యవసాయం, పాడి వృత్తి చేపట్టినవారు తుపానుల కారణంగా సర్వం కోల్పోతున్నారు. సముద్ర జలాలు చొచ్చుకొస్తున్నందువల్ల నేల క్రమంగా చవుడు తేలుతోంది. ప్రతి సంవత్సరం లంక వాసులు తమ బతుకులను మళ్లీ ఆది నుంచి మొదలుపెట్టాల్సి వస్తోంది. చాలామంది ప్రధాన భూభాగానికో, పొరుగున ఉన్న లంకలకో వలస పోతున్నారు. వారిని వాతావరణ శరణార్థులుగా అభివర్ణిస్తున్నారు. వాతావరణ మార్పులు ఈ శరణార్థుల జీవితాల్లో అనిశ్చితిని సృష్టిస్తూ మానసిక సమస్యలను కొనితెస్తున్నాయని సుందరవనాల్లో వైద్య కేంద్రాలు నడిపే స్వచ్ఛంద సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

పశ్చిమ్‌ బెంగాల్‌ పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు సైతం వాతావరణ మార్పుల ముప్పు మరింత అధికం. 19 బంగ్లా కోస్తా జిల్లాల్లో నాలుగు కోట్ల మంది నివసిస్తున్నారని 2011 జనగణన తేల్చింది. బంగ్లాదేశ్‌లో గంగ, బ్రహ్మపుత్ర, మేఘన డెల్టాలోని వందలాది చార్‌ (లంక)లకు నీటి ముంపు బెడద పెరిగిపోతోంది. డెల్టా ముఖద్వారంలోని డాల్‌ లంకలో 1960-62 నుంచి జనావాసం మొదలైంది. 2003 నుంచి ఆ లంక కోతకు గురవుతోంది. ఒకప్పుడు 12 చదరపు కిలోమీటర్లు ఉన్న డాల్‌ లంక విస్తీర్ణం ఇప్పుడు రెండు చదరపు కిలోమీటర్లకు కుంచించుకుపోయింది. ఫలితంగా అక్కడ 95శాతం జనాభా నిరాశ్రయులయ్యారు. పర్యావరణ సంక్షోభం మూలంగా దక్షిణాసియాలో వ్యవసాయోత్పత్తి 30శాతం తెగ్గోసుకుపోతుందని వాతావరణ మార్పులపై అంతరప్రభుత్వాల ప్యానెల్‌ (ఐపీసీసీ) శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

వాతావరణ మార్పుల వల్ల 2050కల్లా ప్రపంచమంతటా 21.6 కోట్లమంది నిర్వాసితులవుతారని, వారిలో నాలుగు కోట్లమంది దక్షిణాసియా వారు ఉంటారని ప్రపంచ బ్యాంకు 2021నాటి నివేదికలో హెచ్చరించింది. ఆ నాలుగు కోట్ల మందిలోనూ సగం బంగ్లాదేశ్‌ వాసులు ఉంటారని తెలిపింది. భారత్‌లో 2020లోనే 38 లక్షల మంది నిరాశ్రయులయ్యారని స్విట్జర్లాండ్‌కు చెందిన అంతర్గత నిర్వాసితుల గణన కేంద్రం (ఐడీఎంసీ) అంచనా వేసింది. వాతావరణ శరణార్థులను భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం లేదు. చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. వారిని ఆదుకోవడానికి ప్రత్యేక పథకాలు, చట్టాలను తేవాల్సిన అవసరం ఉంది.

- ప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ శాస్త్రసాంకేతిక అగ్రశక్తిగా చైనా

‣ అసిస్టెంట్ కొలువుకు ఏఏఐ ఆహ్వానం

‣ సీఎస్ఈ, ఐటీల్లో ఏది ఎంచుకోవాలి?

‣ స్టడీమెటీరియల్‌.. మాక్‌టెస్టులు.. లైవ్‌క్లాసులు ఉచితం!

‣ ఐఎన్‌సీఓఐఎస్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌లు

Posted Date: 06-09-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం