• facebook
  • whatsapp
  • telegram

ఇంధన సంక్షోభం ముంగిట ఐరోపా

గ్యాస్‌ సరఫరా నిలిపేసిన రష్యా

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాను ఆంక్షల పిడికిలిలో బిగించి, ఉక్కిరిబిక్కిరి చేయాలని ప్రయత్నిస్తున్న యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)కు తాజాగా గట్టి దెబ్బ తగిలింది! ఐరోపా ఇంధన భద్రతకు అత్యంత కీలకమైన నార్డ్‌ స్ట్రీమ్‌-1 పైప్‌లైన్‌ను మూసివేస్తున్నట్లు మాస్కో ప్రకటించింది. ఆ మార్గంలో సహజవాయువు సరఫరాను ఎప్పుడు పునరుద్ధరిస్తారనే అంశంపై స్పష్టతనివ్వలేదు. పైప్‌లైన్‌లో లీకేజీలను గుర్తించడం వల్లే ప్రస్తుతానికి దాన్ని మూసివేస్తున్నట్లు రష్యా ప్రభుత్వరంగ ఇంధన సంస్థ ‘గ్యాజ్‌ప్రామ్‌’ చెప్పినా... దాని వెనక అసలు వ్యూహం వేరే ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిధుల కొరతతో పుతిన్‌ సర్కారు సతమతమయ్యేలా చేసేందుకు రష్యా చమురుపై ధరల పరిమితులు విధించాలని జి-7 కూటమి అంగీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే- గ్యాజ్‌ప్రామ్‌ నుంచి ప్రకటన వెలువడటం ఆసక్తి రేకెత్తిస్తోంది.

నార్డ్‌ స్ట్రీమ్‌-1 రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నుంచి బాల్టిక్‌ సముద్రం గుండా ఈశాన్య జర్మనీ వరకు దాదాపు 1,200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 2011లో ప్రారంభమైన ఈ పైప్‌లైన్‌... రష్యా నుంచి జర్మనీకి గరిష్ఠంగా రోజుకు 17 కోట్ల ఘనపు మీటర్ల గ్యాస్‌ను చేరవేయగలదు. నార్డ్‌ స్ట్రీమ్‌-1తో దాదాపు ఐరోపా అంతటికీ గ్యాస్‌ అందుతుంది. ఇంధన అవసరాల్లో బెర్లిన్‌కు జీవనాడిగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ పైప్‌లైన్‌ వల్ల రష్యా నుంచి చాలా తక్కువ ధరలో సహజవాయువు దిగుమతి అవుతుండటంతో జర్మనీలో సరకు ఉత్పత్తి వ్యయం తగ్గుతోంది. ఫలితంగా అంతర్జాతీయ విపణిలో బెర్లిన్‌ ఉత్పత్తులు కాస్త తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నాయి. అందుకే రష్యా నుంచి గ్యాస్‌ సరఫరాను మరింత పెంచుకోవడం కోసం బెర్లిన్‌ నార్డ్‌ స్ట్రీమ్‌-2ను నిర్మించాలనుకుంది. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఆ ప్రాజెక్టు అటకెక్కింది. జర్మనీ, బ్రిటన్‌ సహా పలు ఐరోపా దేశాలు ఇంధన అవసరాల కోసం దీర్ఘకాలంగా మాస్కో సహజవాయువుపైనే ఆధారపడుతూ వస్తున్నాయి. 2021లో ఈయూ దేశాల గ్యాస్‌ అవసరాల్లో దాదాపు 40శాతాన్ని రష్యా నార్డ్‌ స్ట్రీమ్‌-1 ద్వారానే సరఫరా చేసిందంటే ఆ పైప్‌లైన్‌ ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఉక్రెయిన్‌ సంక్షోభంతో పరిస్థితులు మారాయి. కీవ్‌పై యుద్ధానికి దిగినందుకు రష్యాపై- అమెరికాతో కలిసి ఐరోపా దేశాలు అనేక ఆంక్షలు ప్రకటించాయి. వాటిని తిప్పికొట్టేందుకు పుతిన్‌ సహజవాయువును ఓ ఆయుధంగా వాడుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమయ్యాక నార్డ్‌ స్ట్రీమ్‌-1 ద్వారా గ్యాస్‌ సరఫరాను మాస్కో 75శాతం మేర తగ్గించింది.

ఐరోపాలో విద్యుదుత్పత్తికి సహజవాయువే ప్రధాన ఆధారం. శీతాకాలంలో వెచ్చదనాన్నిచ్చే (హీటింగ్‌) వ్యవస్థల కోసమూ ఆ ఖండవాసులు గ్యాస్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాబట్టి శీతాకాలం వస్తున్నవేళ పుతిన్‌ వ్యూహాత్మకంగానే నార్డ్‌ స్ట్రీమ్‌-1ను నిలిపివేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా నుంచి సరఫరా కుదుపులకు లోనవుతుండటంతో ఇప్పటికే ఈయూ దేశాల్లో గ్యాస్‌ ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం ఐరోపాలో ఇంధన ధరలు గత ఏడాదితో పోలిస్తే 450శాతం మేర అధికంగా ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇటీవల గ్యాస్‌ సరఫరాను కుట్రపూరితంగా తగ్గించడం ద్వారా ఐరోపాలో ధరల పెరుగుదలకు పుతిన్‌ కారణమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నార్డ్‌ స్ట్రీమ్‌-1ను మూసివేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా జర్మనీలో పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయి. ఈ శీతాకాలంలో విద్యుత్తు వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవాలంటూ వ్యక్తులు, కంపెనీలను ఆ దేశ సర్కారు కోరనున్నట్లు వార్తలొస్తున్నాయి.

ప్రభుత్వ భవనాల్లో లైటింగ్‌, హీటింగ్‌ వ్యవస్థలను పరిమితంగా ఉపయోగించుకోవడం ద్వారా గ్యాస్‌ అవసరాలను రెండుశాతం మేర తగ్గించుకోవచ్చని బెర్లిన్‌ భావిస్తోంది. స్విట్జర్లాండ్‌, స్పెయిన్‌ కూడా ఇంధనాన్ని పొదుపు చేసేందుకు ఈ తరహా ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకొని... నార్వే, నెదర్లాండ్స్‌, అమెరికా, ఖతార్‌ల నుంచి ఇంధన సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని జర్మనీ భావిస్తోంది. అల్జీరియా నుంచి ఎక్కువ గ్యాస్‌ను దిగుమతి చేసుకునేందుకు ఇటలీ, స్పెయిన్‌ ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆ ప్రణాళికలు ఇప్పట్లో కార్యరూపం దాల్చడం కష్టమే. అందుకే ఇంధన కాంట్రాక్టులకు కట్టుబడి ఉండాలని రష్యాను ఈయూ దేశాలు కోరే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. నార్డ్‌ స్ట్రీమ్‌-1 మూసివేత కారణంగా ఇంధన సంక్షోభం తలెత్తితే... ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. మాంద్యం ముప్పు ముంచుకొస్తుంది. ఈ పరిస్థితుల్లో ఈయూ, రష్యా ఉభయతారక విధానాలను అనుసరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

- నవీన్‌ కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అంతర్గత ప్రజాస్వామ్యం ఎండమావి

‣ ఎన్‌సీసీతో ఆర్మీలో ఆఫీసర్‌

‣ కొత్త డిగ్రీలు ఎన్నో అవకాశాలు

‣ పోటీలో దీటుగా నిల‌వాలంటే?

‣ ఏఈఈ కొలువుల‌కు ఎలా సిద్ధం కావాలి?

‣ ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాల భ‌ర్తీ

‣ ఎదురుగానే జవాబు అయినా ఎంతో కష్టం!

Posted Date: 12-09-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం