• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌ ఆటలు... కొలువులు కొల్లలు

పెద్ద ఎత్తున ఉద్యోగాలు అందిస్తున్న గేమింగ్‌ రంగం!

చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ ఆన్‌లైన్‌ ఆటల్లో మునిగితేలుతున్నారు. తమకు నచ్చిన క్యారక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేసి కేరింతలు కొడుతున్నారు. మనందరినీ ఇంతగా ప్రభావితం చేస్తోన్న ఆ ఆటల రూపకల్పన వెనుక ఎందరో నిపుణుల సృజనాత్మకత దాగి ఉంది. అందులో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి. ఊహాశక్తి, సృజన, సాంకేతికతపై పట్టు ఉంటే ఆకాశమే హద్దుగా గేమింగ్‌ కెరియర్లో దూసుకుపోవచ్చు! 

‘ఎప్పుడు చూసినా మొబైల్‌లో ఆటలేనా. వేరే పనేమీ లేదా?’- పిల్లలున్న దాదాపు అందరిళ్లలోనూ తల్లిదండ్రుల మందలింపు వినిపిస్తుంటుంది. ‘ఐదే నిమిషాలు..!’ అంటూ పిల్లలు బతిమాలటం. ఆ ఐదు నిమిషాలు కాస్తా అరగంట, గంట అవటం సర్వసాధారణం. ‘అసలు ఇంతకీ వాళ్లేమి ఆడుతున్నారో’నని ఒకసారి చూసిన పెద్దోళ్లు సైతం మొబైల్‌ గేమ్స్‌ మాయలో పడిపోవటం తరచూ జరిగేదే. 

ఆడినంత సేపూ అందులోనే మమేకమై, ప్రపంచాన్ని మరిచిపోవడం ఆన్‌లైన్‌ గేముల ప్రత్యేకత. వీటిని మనసుకు హత్తుకునేలా, ఆహ్లాదకరంగా, అత్యంత సృజనాత్మకంగా రూపొందించి, వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ఎన్నో సంస్థలు ఆన్‌లైన్‌ ఆటలకు సౌకర్యవంతంగా ఉండేలా ప్రత్యేకంగా సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఎక్కువ సామర్థ్యంతో రూపొందిస్తున్నాయి. ధరలు తగ్గడంతో స్మార్ట్‌ ఫోన్‌ అందరికీ చేరువైంది. దీనికి తోడు డేటా సైతం తక్కువ మొత్తానికే వస్తోంది. అలాగే ఎక్కువ ఆటలు ఉచితంగానే లభిస్తున్నాయి. ఈ కారణాలతో ఆన్‌లైన్‌ గేమింగ్‌ తిరుగులేని శక్తిగా రూపొంది, శరవేగంగా వృద్ధి చెందుతోంది. చాలా ఆటలు కుటుంబ సభ్యులూ, స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు అనువుగా ఉన్నాయి. ఒంటరిగా ఉంటే ఒక్కరే ఆడుకునేలా, నలుగురిలో ఉంటే జట్టు కట్టేలా ..ఇలా మనం ఉన్న పరిస్థితి, సందర్భానికి తగ్గట్టుగా ఎన్నో ఆటలు కనువిందు చేస్తున్నాయి. 

ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థలు వెలిశాయి. ఇవన్నీ పెద్ద సంఖ్యలో, భిన్న నైపుణ్యాల్లో కొలువులూ అందిస్తున్నాయి. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియట్‌ తర్వాత కొన్ని కోర్సులు పూర్తి చేసుకుని ప్రయత్నించవచ్చు. 

20 లక్షల మందికి ఉద్యోగాలు 

భారతదేశంలో యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్‌ (ఏవీజీసీ) సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లు ఏర్పాటవుతున్నాయి. ఈ విభాగంలో ప్రపంచ మార్కెట్‌లో 10 శాతం వాటా మనదే. 2027 నాటికి 25 శాతం భారత్‌ ఖాతాలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే 20 లక్షల మందికి ఈ రంగంలో ఉద్యోగాలు లభిస్తాయని నిపుణులు లెక్కలేస్తున్నారు. ప్రపంచంలో ఆన్‌లైన్‌లో ఆటలు ఆడేవారి సంఖ్య 234 కోట్లకు పైగానే ఉంది. ఒక్క మన దేశంలోనే సుమారు 37 కోట్ల మంది ఆన్‌లైన్‌ గేమ్‌ అభిమానులు ఉన్నారు. నాస్కామ్‌ ప్రకారం- దేశంలో వందకు పైగా గేమ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలున్నాయి. 

గేమింగ్‌ పరిశ్రమలో ఎన్నో కెరియర్లు ఉన్నాయి. సృజనాత్మకత, ఊహాశక్తి, సాంకేతికతల మేళవింపే ఆన్‌లైన్‌ గేమింగ్‌గా చెప్పుకోవచ్చు. ఈ రంగంలో ఉద్యోగాలు పొందడానికి ముందుగా సంబంధిత కోర్సులు పూర్తిచేయాలి. వీటిని సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, డిగ్రీ, పీజీ స్థాయుల్లో విశ్వవిద్యాలయాలూ, సంస్థలూ అందిస్తున్నాయి. యూజీ కోర్సులు పూర్తి చేయడం ద్వారా అవకాశాలు పొందవచ్చు. పీజీలో చేరినవారు ఆసక్తి ప్రకారం స్పెషలైజేషన్‌ పూర్తి చేసుకుని ఉన్నత స్థాయి అందుకోవచ్చు. ఇప్పటికే బీటెక్‌/బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తిచేసుకున్నవాళ్లు స్వల్ప వ్యవధి కోర్సుల్లో చేరి రాణించవచ్చు. 

డిగ్రీ స్థాయిలో... 

బీఎస్సీ యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ 

బీఏ యానిమేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ 

బీఏ డిజిటల్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ అండ్‌ యానిమేషన్‌ 

బీఎస్సీ గ్రాఫిక్స్, యానిమేషన్‌ ఖీ గేమింగ్‌

పీజీ స్థాయిలో... 

కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ అండ్‌ గేమ్‌ టెక్నాలజీ 

గేమ్‌ డిజైన్, ఇంటరాక్టివ్‌ డిజైన్‌ ఖీ గేమ్‌ డెవలప్‌మెంట్‌ 

మల్టీ మీడియా అండ్‌ యానిమేషన్‌ 

అవకాశాలు ఎక్కడ?

సంబంధిత నైపుణ్యాలున్నవారికి బోన్‌ఫైర్‌ స్టూడియోస్, ఎలక్ట్రానిక్‌ ఆర్ట్స్, యాక్టివిజన్‌ బిజార్డ్, యుబీసాఫ్ట్, ఎపిక్‌ గేమ్స్, సోనీ గేమ్స్, గేమ్‌లాఫ్ట్, మైక్రోసాఫ్ట్, నింటెండో, ఎలక్ట్రానిక్‌ ఆర్ట్స్, డిజిటల్‌ చాకొలెట్, జింగా, గేమ్స్‌ టు విన్, హ్యాస్టాగ్, ఐ ఎనర్జైజర్, ఒజురా సంస్థలు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ స్పోర్ట్స్‌ సంస్థలు ఆన్‌లైన్‌లో టోర్నమెంట్లను నిర్వహిస్తున్నాయి. ఈఎస్‌ఎల్‌ ఇండియా ప్రీమియర్‌షిప్, ఎన్‌జీఎస్‌ ఛాంపియన్‌షిప్స్, పబ్జి మొబైల్‌ ఇండియా, యుసైఫర్, అల్టిమేట్‌ బ్యాటిల్‌ సంస్థలు స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నాయి. విజేతలకు పారితోషికం అందుతుంది. కొన్ని సంస్థలు ఉద్యోగంలోకీ తీసుకుంటున్నాయి. 

విద్యా సంస్థలు

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ గేమింగ్, ఎరీనా యానిమేషన్, ఐక్యాట్‌ కాలేజ్, బ్యాక్‌ స్టేజ్‌ పాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గేమింగ్‌ అండ్‌ టెక్నాలజీ, మాయ అకాడెమీ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ సినిమాటిక్స్‌.. ఇలా ఎన్నో సంస్థల్లో కోర్సులు పూర్తిచేసుకోవచ్చు. కొన్ని చోట్ల ప్రాంగణ నియామకాలూ జరుగుతున్నాయి.  

కొన్ని ఐఐటీలు యూసీడ్‌ పరీక్షతో, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ సంస్థలు డాట్‌తో, నిఫ్ట్‌లు గాట్‌తో డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఇవి అందించే యానిమేషన్‌ అండ్‌ ఫిల్మ్‌ డిజైన్, ఫిల్మ్‌ అండ్‌ వీడియో కమ్యూనికేషన్, డిజిటల్‌ గేమ్‌ డిజైన్‌ కోర్సులు పూర్తి చేసుకున్నవాళ్లు ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఉద్యోగాల్లో రాణించవచ్చు. 

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్ట్స్‌ ఖీ ఫైనార్ట్స్‌ వర్సిటీకి అనుబంధంగా కొన్ని ప్రైవేటు సంస్థలు యానిమేషన్, గేమింగ్, గ్రాఫిక్‌ కోర్సులు అందిస్తున్నాయి. 

వివిధ సంస్థల్లో సర్టిఫికేషన్‌ కోర్సులూ లభిస్తున్నాయి. వాటిని పూర్తిచేసుకుంటే అవకాశాల పరంగా ముందుండవచ్చు.

హోదాలూ.. విధులూ

గేమింగ్‌లో ప్రొగ్రామర్, రైటర్, ఆడియో ప్రొగ్రామర్, లెవెల్‌ డిజైనర్, మోడెలర్, లైసెన్స్‌ సపోర్ట్‌ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, గేమ్‌ డిజైనర్, గేమ్‌ ప్రొడ్యూసర్, గేమ్‌ యానిమేటర్, గేమ్‌ టెస్టర్, గేమ్‌ ఆర్టిస్ట్, ఆడియో ఇంజినీర్, గేమ్‌ యానిమేటర్‌..తదితర హోదాలతో ఉద్యోగాలు ఉంటాయి.  

గేమ్‌ యానిమేటర్‌/విజువల్‌ ఆర్టిస్ట్‌: వీరు ఆ ఆటలోని దృశ్యాలకు భౌతిక రూపం అందిస్తారు. పాత్రలు, వస్తువులను డిజైన్‌ చేసి యానిమేషన్‌ పూర్తిచేస్తారు. పరిసరాలు, చిత్రాలను సృష్టిస్తారు. 

గేమ్‌ ప్రొడ్యూసర్‌: గేమ్‌ నిర్మాణం మొత్తం వీరి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అన్ని విభాగాలనూ సమన్వయం చేసుకుంటూ గడువులోగా పూర్తయ్యేలా చూస్తారు. బడ్జెట్, అభివృద్ధి, సవరణలు, లైసెన్సింగ్‌.. వ్యవహారాలూ పర్యవేక్షిస్తారు.  

ఆడియో ఇంజినీర్‌: వీడియో గేమ్‌ విజయం ఆడియో నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఆట ఆడేటప్పుడు ఆ సందర్భానికి సరిపోయేలా శబ్దాలు వచ్చి, ఆసక్తిని పెంచేలా ఆడియో ఉండాలి. వీరు సౌండ్‌ ఇంజినీర్ల సూచనల ప్రకారం వాయిస్‌ ఓవర్, నేపథ్య సంగీతం మొదలైనవి అందిస్తారు. 

క్రియేటివ్‌ డైరెక్టర్‌: గేమ్‌ వీరి ఆలోచన ప్రకారమే రూపొందుతుంది. ఆటలోని అన్ని అంశాలు, భావాలను సృజనాత్మకంగా రూపొందేలా చూస్తారు. 

గేమ్‌ డిజైనర్లు: గేమ్‌డిజైన్‌ పనులు చూసుకుంటారు. కథన స్వరూపం, పాత్రల లక్షణం, స్క్రీన్‌పై కనిపించే అన్ని అంశాలనూ డిజైన్‌ చేసేది వీరే.  

గేమ్‌ ప్రోగ్రామర్‌: వీరికి కోడింగ్, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌లో నైపుణ్యం ఉండాలి. గేమింగ్‌లో ముఖ్యమైన విభాగంగా ప్రోగ్రామింగ్‌ చెప్పుకోవచ్చు. తెరపై కనిపించేదంతా ప్రోగ్రామింగ్‌ రాయడం వల్లే జరుగుతుంది. 

గేమ్‌ ఆర్టిస్ట్‌: గేమ్‌లో వచ్చే అక్షరాలు, వాహనాలు, వస్తువులు, దుస్తులు, రంగులు వీటన్నింటికీ దృశ్యరూపం ఇచ్చేది వీరే. వీరు గేమ్‌ డిజైనర్, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సూచనల ప్రకారం తమ పనిని పూర్తిచేస్తారు. 

గేమ్‌ రైటర్‌: వీడియో గేమ్‌ కథనం, కథాంశాలు, డైలాగ్‌లు ఇవన్నీ రాసేది వీరే. సందర్భానికి తగ్గ మాటలు రాసి సన్నివేశాలను ఆసక్తిగా మలుస్తారు. 

గేమ్‌ టెస్టర్‌: వీడియో గేమ్‌ రూపొందించడం పూర్తయిన తర్వాత ఎలా పనిచేస్తుందో తనిఖీ  చేస్తారు. లోపాలుంటే ఆ విభాగాలకు చెందిన వారితో సరిచేసి, పూర్తి కచ్చితత్వంతో ఆట విడుదలయ్యేలా చూస్తారు. 

గేమ్‌ జర్నలిస్ట్‌/ క్రిటిక్‌: కొత్త గేమ్‌లు విడుదలైనప్పుడల్లా కొనుగోలుదారులకు విలువైన సమీక్షలు అందిస్తారు. వీరు గేమ్‌ మొత్తం పరిశీలించి తమ అనుభవాలు పంచుకుంటారు. సంస్థలు ముందుగానే వీరికి తమ గేమ్‌ అందించి సూచనలు తీసుకుంటాయి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇంట‌ర్‌లో మంచి మార్కుల‌కు ఇవిగో మెల‌కువ‌లు!

‣ పరిధి పెద్దదైనా పట్టు పట్టొచ్చు!

‣ ఐటీఐతో నౌకాదళంలోకి!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 07-03-2022


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌