• facebook
  • whatsapp
  • telegram

మైనారిటీ బాలిక‌ల‌కు ఉప‌కార వేత‌నాలు

పేద విద్యార్థినుల‌కు ఆర్థిక సాయం

బాలికల చదువులకు ఆర్థిక సమస్యలే అవరోధం. అందులోనూ మైనార్టీ వర్గాలకు చెందినవారి విషయంలో పేదరికమే పెద్ద సమస్య. దీంతో ఆసక్తి, ప్రతిభ ఉన్నప్పటికీ అర్ధాంతరంగా చదువులను ఆపేయాల్సి వస్తోంది. ఇలాంటి వారికోసమే కొన్ని స్కాలర్‌షిప్పులు ఉన్నాయి. వాటిలో బేగం హజ్రత్‌ మహల్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్పు ముఖ్యమైంది. దీన్ని ఏటా అందిస్తున్నారు. వీటికి దరఖాస్తు చేసుకునే అవకాశం వచ్చింది. ఆ వివరాలు చూద్దాం...


మైనార్టీ వర్గాల్లోని ప్రతిభావంతులైన పేద బాలికలను ఉన్నత చదువులకు ప్రోత్సహించే లక్ష్యంతో బేగం హజ్రత్‌ మహల్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్పును 2003లో ప్రారంభించారు. విద్యాభివృద్ధికి ఆర్థిక స్థోమత అడ్డంకి కాకూడదనే దీన్ని ఏర్పాటు చేశారు. దిల్లీలోని మౌలానా ఆజాద్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ఈ స్కాలర్‌షిప్పు అందిస్తోంది. ఇది మైనార్టీ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది. స్కూలు లేదా కాలేజీ ఫీజు చెల్లించడానికి, కోర్సుకి సంబంధించిన పుస్తకాలు లేదా స్టేషనరీ కొనుక్కోడానికి, ఆహార అవసరాలను తీర్చుకోడానికి స్కాలర్‌షిప్పు ద్వారా అందిన మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. తొమ్మిది, పది, ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం తరగతుల్లో ఉన్న మైనార్టీ వర్గాల విద్యార్థినులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికలో అకడమిక్‌ మెరిట్, కుటుంబ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.


స్కాలర్‌షిప్పు ఎంతంటే... 

తొమ్మిది, పది తరగతులు చదువుతున్న విద్యార్థినులకు నెలకు రూ.5000, ఇంటర్మీడియట్‌వారికి నెలకు రూ.6000 చొప్పున స్కాలర్‌షిప్పు ఇస్తారు. డబ్బు ప్రతి నెలా నేరుగా విద్యార్థినుల ఖాతాలో జమ అవుతుంది. స్కాలర్‌షిప్పు పొందినవాళ్లు ఏదైనా కారణంతో చదువును మధ్యలో ఆపేస్తే వారి ఉపకారవేతనం రద్దవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏవైనా ఉపకారవేతనాలు పొందుతున్న వారు దీనికి అనర్హులు. మొత్తం స్కాలర్‌షిప్పులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆయా మతాల జనాభా ప్రాతిపదికన అందిస్తారు. ఇందుకు 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుంటారు. 

అర్హత:

దేశవ్యాప్తంగా తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులందరూ ఈ స్కాలర్‌షిప్పునకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు మైనార్టీ వర్గాల్లోని ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, పార్సీ, జైన మతాలకు చెంది ఉండాలి. వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ. రెండు లక్షలకు మించకూడదు. ముందు తరగతుల్లో కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి. అంటే ఉదాహరణకు పదో తరగతి విద్యార్థిని స్కాలర్‌షిప్పునకు దరఖాస్తు చేసుకుంటే, ఆమె తొమ్మిదో తరగతి మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకే కుటుంబానికి చెంది, ఒకే తరగతిలో ఉన్న ఇద్దరు విద్యార్థినులకు ఈ స్కాలర్‌షిప్పు వర్తించదు.

దరఖాస్తులు: 

అర్హతలున్న మైనార్టీ బాలికలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు నిమిత్తం ఫీజు చెల్లించనవసరం లేదు. స్కూల్‌ వెరిఫికేషన్‌ ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో వివరాలు నమోదుచేసి ఫొటో అతికించి, దానిపై ప్రిన్సిపల్‌ సంతకం, స్కూల్‌ స్టాంప్‌ వేయించాలి. అనంతరం ఈ ఫారాన్ని స్కాన్‌చేసి అప్లికేషన్‌తోపాటు అప్‌లోడ్‌ చేయాలి. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రాన్నీ జతచేయాలి. దరఖాస్తు ప్రింటవుట్‌ పంపాల్సిన అవసరం లేదు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: అక్టోబరు 31

వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డిజిటల్‌ అక్షరాస్యత... మీకుందా?

‣ క్లిష్ట స‌మ‌యాల్లోనూ ఉద్యోగ సాధ‌న ఎలా?

‣ ఒక్క ఛాన్స్ కాదు... అనేక ఛాన్సులు!

‣ డిగ్రీతో ఐఐటీలో ఉద్యోగాలు

‣ కోర్సు పూర్తి కాగానే కొలువుల్లోకి!

‣ అమ్మకాల దళంలో చేరతారా?

Posted Date: 21-10-2022


 

తాజా కథనాలు

మరిన్ని