• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఈఆర్‌పీలో తిరుగులేని ఎస్‌ఏపీ!

విస్తృత ఉద్యోగావకాశాలు

ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ (ఈఆర్పీ) టూల్స్‌లో ఎస్‌ఏపీకి  చాలా ప్రాధాన్యం ఉంది. కోట్ల టర్నోవర్‌ కలిగిన సంస్థలు.. వేలకొద్దీ ఉద్యోగులు.. దేశవిదేశాల్లో విస్తరించిన మార్కెట్‌.. వెరసి వ్యాపారమనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ప్రతి విభాగాన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తూ, వినియోగదారునికి అందించే సేవలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉంటేనే ఎవరైనా విజయం సాధించగలరు. ఇందుకు సాయపడే ఎస్‌ఏపీ (సిస్టం అప్లికేషన్స్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌ ఇన్‌ డేటా ప్రాసెసింగ్‌)ను నేర్చుకోవడం ద్వారా మేనేజ్‌మెంట్, ఐటీ రంగంలో మరింత రాణించే అవకాశం ఉంటుంది. మరి దీని గురించి పూర్తి వివరాలు, ఉద్యోగావకాశాలు.. తెలుసుకుందామా!

ఎస్‌ఏపీ గురించి పూర్తిగా అర్థం చేసుకునేందుకు ఓ ఉదాహరణ చూద్దాం. మీరు పుస్తకాలు కొనుక్కోవడానికి ఓ దుకాణానికి వెళ్లారు అనుకుందాం. అక్కడ ఉన్నవాటిల్లో మీకు కావాల్సినవి వెతికి తీసుకున్నారు. ఒక పుస్తకం దొరక్కపోతే షాపులో పనిచేసే వ్యక్తిని అడిగి ఎక్కడ ఉందో తెలుసుకున్నారు. చివర్లో డబ్బులిచ్చి బయటకు వచ్చారు. ఈ మొత్తం ప్రక్రియలో... వ్యాపారంలో ముఖ్య విభాగాలైన సేల్స్, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్, కస్టమర్‌ రిలేషన్‌షిప్, అకౌంట్స్‌... వంటి విభాగాలు పనిచేశాయి.

కొన్ని ముఖ్యమైన మాడ్యూల్స్‌ గురించి పరిశీలిస్తే... 

ఫైనాన్స్‌ అండ్‌ కంట్రోలింగ్‌ (ఎఫ్‌ఐసీవో-ఫికో)

ఇది రెండు ఈఆర్పీ మాడ్యూళ్ల కలయిక. ఫైనాన్స్‌ అకౌంటింగ్, కంట్రోలింగ్‌లను కలిపి దీన్ని రూపొందించారు. ఇందులో మొదటిది ఓ సంస్థలో ఆర్థిక విషయాలకు సంబంధించిన సమాచారాన్ని భద్రపరుస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఇది ఉపయోగపడుతుంది. రెండోది సంస్థలో అన్ని విభాగాల మధ్య సమన్వయం, పర్యవేక్షణ వంటి పనులు నిర్వహిస్తుంది. సమాచారాన్ని క్రోడీకరించి భవిష్యత్‌ వ్యూహాలు రచించేందుకు ఉపయోగపడుతుంది.

సేల్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎస్‌డీ) 

ఇది అన్నింటిలోకీ చాలా ముఖ్యమైన మాడ్యూల్‌. ఒక సంస్థలో ఉత్పత్తి పంపిణీ, అమ్మకాలను ఇది పర్యవేక్షిస్తుంది. ఒక ఆర్డర్‌ వచ్చిన దగ్గర నుంచి డెలివరీ ఇచ్చే వరకూ పనులన్నీ సజావుగా జరుగుతున్నాయో లేదో దీని ద్వారా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.

మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంఎం) 

ఉత్పత్తికి సంబంధించి పనిచేసే మాడ్యూల్‌ ఇది. లాజిస్టిక్స్, సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్, సేల్స్‌ అండ్‌ డెలివరీ, వేర్‌హౌస్‌ మేనేజ్‌మెంట్, ప్రొడక్షన్‌ అండ్‌ ప్లానింగ్‌ వంటి ఇతర మాడ్యూల్స్‌తో కలిసి పనిచేస్తుంది. వస్తువులు - పదార్థాల సంగతి చూసుకోవడం దీని ముఖ్యవిధి.

లాజిస్టిక్స్‌ ఎగ్జిక్యూషన్‌ (ఎల్‌ఈ)

దీన్ని రెండు సబ్‌ మాడ్యూల్స్‌గా విభజించవచ్చు. గూడ్స్‌ షిప్‌మెంట్‌ (కొనుగోలు చేసిన దగ్గర్నుంచి రవాణా), వేర్‌హౌస్‌ మేనేజ్‌మెంట్‌ (నిల్వ). ఇవి సేల్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్, ప్రొడక్షన్‌ అండ్‌ ప్లానింగ్‌తో అనుసంధానమై పనిచేస్తాయి.

హ్యూమన్‌ రిసోర్స్‌ (హెచ్‌ఆర్‌)

కంపెనీలో ఉన్న ఉద్యోగుల కోసం ఉద్దేశించినది ఈ మాడ్యూల్‌. ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తీసుకోవడం, సంస్థలో వారు ఉన్నన్ని రోజులూ ఎలా పనిచేస్తున్నారనే వివరాలు భద్రం చేయడం ఇతర పనులు ఉంటాయి.

సప్లయర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ (ఎస్‌ఆర్‌ఎం) 

ఒక సంస్థ తన వినియోగదారునితో మంచి సంబంధాలతో ఉండటం అవసరమైనట్టే సప్లయర్‌తోనూ చక్కటి వాణిజ్య సంబంధాలు కలిగి ఉండాలి. వీటిని పర్యవేక్షించేదే ఎస్‌ఆర్‌ఎం. మెటీరియల్, సర్వీస్‌ ఎలా ఉంది అనే విషయాలను దీని ద్వారా పర్యవేక్షించవచ్చు.

కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ (సీఆర్‌ఎం)

వినియోగదారులతో కంపెనీ అనుబంధం ఎలా ఉండాలనే దాని కోసం ఇది పనిచేస్తుంది. అమ్మకాలు, సేవలను సక్రమంగా అందించడం, విపణి అవసరాలకు తగ్గట్టు వ్యూహాలు రచించడం, సమాచారాన్ని క్రోడీకరించడం... మొత్తంగా వినియోగదారుడికి ఉత్తమ సేవలు అందించేలా చేయడం దీని పని.

మాడ్యూల్స్‌ ఇవీ 

ఒక వ్యాపారాన్ని నడిపేందుకు ఎన్నో విభాగాలు పనిచేస్తుంటాయి. దేనికదే ప్రత్యేకంగా ఉంటాయివి. అందుకే ఎస్‌ఏపీలోనూ ప్రతి విభాగానికీ ఒక మాడ్యూల్‌ను సృష్టించారు. వీటన్నింటినీ రెండుగా విభజించారు. మొదటిది ఫంక్షనల్‌ విభాగం. వ్యాపారంలో అవసరమయ్యే ముఖ్యమైన పనులకు సంబంధించిన మాడ్యూల్స్‌ అన్నీ దీనికిందకే వస్తాయి. అమ్మకాలను పర్యవేక్షించేందుకు సేల్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌... ఆదాయవ్యయాలను లెక్కచూసేందుకు ఫైనాన్స్‌ అండ్‌ కంట్రోలింగ్‌... ఇలా అన్నమాట. రెండోది  టెక్నికల్‌ మాడ్యూల్స్‌. వీటిని నేర్చుకోవాలి అనుకునేవారికి కాస్త కోడింగ్‌ తెలిసి ఉండాలి. సర్వర్‌ ఎలా పనిచేస్తుంది... ఆపరేషన్స్‌ ఎలా జరుగుతాయనే కనీస అవగాహన ఉండాలి. మరింత లోతుగా అధ్యయనం చేసేవారికి బిజినెస్‌ సూట్‌లో సీఆర్‌ఎం (కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌), ఎస్‌సీఎం (సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌).. ఇలా విభిన్న మాడ్యూల్స్‌ అందుబాటులో ఉన్నాయి.

ఈ కోర్సు పరిధి కాస్త ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో దాదాపు 150 స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఎవరికి ఏ విభాగంలో ఆసక్తి ఉంది అనేదానిపై... వారు నేర్చుకోవాల్సిన మాడ్యూల్, తీసుకోవాల్సిన సర్టిఫికెట్‌ ఆధారపడి ఉంటాయి. కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగ అర్హత కోసం ఉత్తీర్ణత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఎస్‌ఏపీ సర్టిఫైడ్‌ అసోసియేట్, ఎస్‌ఏపీ యాక్టివ్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్, సర్టిఫైడ్‌ ఎస్‌ఏపీ బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ ప్రొఫెషనల్, ఎస్‌ఏపీ ఈఆర్‌పీ మేనేజర్‌ గవర్నమెంట్‌ సర్టిఫికేషన్‌... ఇలాంటి సర్టిఫికేషన్లు చాలా అందుబాటులో ఉన్నాయి.

ఒక దుకాణం కాబట్టి వెంటనే అన్నీ లెక్క వేసేయొచ్చు. అదే ఆ కంపెనీకి దేశవ్యాప్తంగా ఓ వంద శాఖలు ఉంటే? రోజూ కొన్ని వేలకొద్దీ పుస్తకాలు అమ్ముడవుతుంటే? వందలమంది ఉద్యోగులు పనిచేస్తుంటే? అన్నింటినీ ఒకతాటిపైకి తెచ్చి సమర్థంగా వ్యాపారాన్ని నడిపించేందుకు ఓ సాధనం ఉంటే బాగుంటుంది కదా.. ఆ పనినే సులువుగా చేసేస్తుంది ఎస్‌ఏపీ.

ఎవరు చేయవచ్చు?

ఈ కోర్సు చేసేందుకు ఏదైనా డిగ్రీ లేదా పీజీ పూర్తిచేసి ఉండాలి. కనీస కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఏ మాడ్యూల్‌ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి కాస్త అవగాహన ఉండటం కలిసి వస్తుంది.

ఎలాంటి ఉద్యోగాలున్నాయి?

ఈ కోర్సు చేసినవారికి సేల్స్‌ మేనేజర్, సొల్యూషన్‌ డెవలప్‌మెంట్‌ కన్సల్టెంట్, బిజినెస్‌ ప్రాసెస్‌ అనలిస్ట్, ఏబీఏపీ డెవలపర్, ఎస్‌ఏపీ డెవలపర్, సేల్స్‌ కన్సల్టెంట్, ఇంప్లిమెంటేషన్‌ కన్సల్టెంట్‌ వంటి పలు ఉద్యోగాలున్నాయి.

ఎలా చదవాలి?

పలు ప్రైవేటు శిక్షణ సంస్థలు నియామకాలతో కూడిన కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో యుడెమీ, సింప్లీలెర్న్, కోర్సెరా వంటి సంస్థల ద్వారానూ దీన్ని అభ్యసించే అవకాశం ఉంది. కనీసం ఆరునెలలు శ్రద్ధ పెడితే ఏ మాడ్యూల్‌లోనైనా పట్టు సాధించవచ్చు.

సర్టిఫికేషన్‌ అనంతరం ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చు. అయితే కొత్తవారికంటే కూడా ఎంతోకొంత పని అనుభవం ఉన్నవారికి దీన్ని నేర్చుకోవడం, తదుపరి కెరియర్‌ ఉన్నతికి ఉపయోగించడం సులభమవుతుంది. అందువల్ల కనీసం ఒక ఏడాది ఎక్కడైనా పని చేసి, తర్వాత ఈ కోర్సు నేర్చుకుని.. కొత్త ఉద్యోగానికి ప్రయత్నిస్తే కెరియర్‌ బాగుంటుందని నిపుణుల సలహా.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విద్యార్థినుల సాంకేతిక విద్యకు ఆర్థికసాయం!

‣ అయిదో తరం.. అవకాశాల వరం!

‣ పీజీ విద్యార్థినుల‌కు యూజీసీ ప్రోత్సాహం

‣ డిజిటల్‌ అక్షరాస్యత... మీకుందా?

Posted Date : 26-10-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.