‣ 5జీ టెక్నాలజీతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు
వైర్‌లెస్ టెక్నాలజీలో అధునాతన తరం... 5జీ. ప్రస్తుత 4జీ నెట్‌వర్క్స్ కంటే దీనిలో అత్యంత వేగం, సమాచార వ్యవస్థలో స్వల్ప ఆలస్యం (అల్ట్రా - లో లేటెన్సీ) సాధ్యమవుతుంది. సొంతంగా 5జీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసుకున్న అతి తక్కువ దేశాల్లో భారత్ ఒకటి. స్వదేశీకరణ వైపు ముందడుగు వేస్తున్న ప్రస్తుత తరుణంలో వేలకొద్దీ నిపుణులైన సిబ్బంది కొరత ఏర్పడుతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని సంబంధిత నైపుణ్యాలు నేర్చుకుంటే ఉజ్వల భవిత వైపు దూసుకువెళ్లవచ్చు!
విశ్వసనీయత, భారీ నెట్‌వర్క్ సామర్థ్యాలతో పాటు క్షణంలో ఎన్నో రెట్ల గిగా బిట్స్ (మల్టీ జీబీపీఎస్) వేగంతో డేటా మార్పిడి సామర్థ్యం కలిగిన నెట్‌వర్క్ సేవలు 5జీ ప్రత్యేకత. 4జీలో ఉపయోగించని స్పెక్ట్రమ్‌లను కవర్ చేస్తుంది. దీనికి మాత్రమే పరిమితం కాకుండా వైర్‌లెస్ టెక్నాలజీలను మిళితం చేసే ఏకీకృత, విభిన్న నెట్ వర్క్‌కు మద్దతు ఇవ్వడానికి దీన్ని రూపొందించారు. ఇది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే బ్యాండ్ విడ్త్‌ను పెంచుతుంది.
ముఖ్య ప్రయోజనాలు
‣ తీవ్రమైన వేగం: కొంత డేటా 3జీ నెట్‌వర్క్‌లో 24 గంటలు తీసుకుంటే, 4జీ నెట్‌వర్క్‌తో ఆరు నిముషాలు కావలసివస్తుంది. అదే 5జీ టెక్నాలజీలో కేవలం మూడు సెకన్లు చాలు.
‣ స్వయంచాలక ఆటోమొబైల్ వ్యవస్థలు: ప్రపంచవ్యాప్తంగా ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో వాహన చోదకుల నిర్లక్ష్యమే దీనికి కారణం. 5జీ టెక్నాలజీ ద్వారా అత్యంత వేగంతో కీలక సమాచారం అందుబాటులోకి రావడం వల్ల స్వయంచాలక వాహనాలు మానవ ప్రమేయం లేకుండా తమ మధ్య తామే సమాచారాన్ని చేరవేసుకుని త్వరితగతిన నిర్ణయం తీసుకోగలవు.ఫలితంగా విలువైన ప్రాణాలను కాపాడవచ్చు.
‣ మెరుగైన గేమింగ్ అనుభవాలు: క్లౌడ్ గేమింగ్ సర్వర్లతో ఎవరైనా వినోదాత్మకమైన, ఇష్టమైన కంప్యూటర్ ఆటలను కంప్యూటర్, టాబ్, మొబైల్ ద్వారా తమకు మాత్రమే అనువైన అనుభూతితో ఆడవచ్చు.
‣ రోబోటిక్ వైద్య పురోగతి: దీనిమూలంగా రోగులు సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చు. వృద్ధులు, ముఖ్యంగా దివ్యాంగులు తమ ఇళ్ల నుంచి వైద్య చికిత్స పొందగలుగుతారు.
‣ అనువైన వైద్యసేవలు: 5జీ ద్వారా లభించే అధిక వేగవంతమైన డేటా బదిలీ వల్ల వృద్ధులు, దివ్యాంగులు, బాలింతలు, పసికందులు ఆన్‌లైన్‌లో వైద్యులను సంప్రదించి వారి సేవలు వినియోగించుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారిత డయాగ్నోస్టిక్స్ మానవుల్లో వ్యాధులను గుర్తించగలవు. అస్వస్థతలకు చికిత్స చేసేటప్పుడు కీలకమైన రియల్ టైమ్ విశ్లేషణలను అందిస్తాయి. కేవలం స్మార్ట్ ఫోన్ యాప్‌తో ఆరోగ్య సంరక్షణ మరింత సులభమవుతుంది. హృదయ స్పందన రేటు, రక్తపోటు లాంటి కీలక ఆరోగ్య సూచికలపై డేటాను నిరంతరం అందిస్తూ రోగులను పర్యవేక్షించడానికి 5జీ టెక్నాలజీ, వైఫై కనెక్టివిటీ వీలు కల్పిస్తాయి.
‣ విప్లవాత్మక ఐఓటీ ఉపకరణాలు: నిత్యం ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాల్లోనూ పెనుమార్పులు 5జీ ద్వారా సాధ్యమవుతాయి. ఐఓటీ ద్వారా నిర్మితమైన కాలింగ్ బెల్ కెమెరా నాణ్యతతో కూడుకున్న, స్పష్టమైన వీడియోను రికార్డ్ చేసి మిల్లీ సెకన్లలోనే ప్రసారం చేయగలదు. రెప్పపాటులో 5జీ-ఆధారిత అలారం సిస్టమ్ ప్రాణాలనూ, ఆస్తినీ కాపాడటానికి అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఫిట్‌నెస్ ట్రాకర్లు ఎప్పటికప్పుడు ఆరోగ్య, ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడానికి రియల్-టైమ్ డేటా సరఫరా చెయ్యగల సామర్థ్యంతో ఉంటాయి.
‣ లాజిస్టిక్స్, షిప్పింగ్: లాజిస్టిక్స్, షిప్పింగ్ పరిశ్రమ సరుకు జాడ (గూడ్స్ ట్రాకింగ్), నౌకల నిర్వహణ, కేంద్రీకృత డేటాబేస్ మేనేజ్‌మెంట్, సిబ్బంది విధి నిర్వహణల షెడ్యూలింగ్, రియల్ టైమ్ డెలివరీ ట్రాకింగ్, రిపోర్టింగ్ కోసం స్మార్ట్ 5జీ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు.
విద్యపై ప్రభావం
కొవిడ్-19 ప్రభావంతో విద్యా రంగం డిజిటల్‌గా పరివర్తనకు గురైంది. జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ మీట్ లాంటి వర్చువల్ మీటింగ్ అప్లికేషన్‌లు అభ్యసన అనుభవాన్ని డిజిటల్‌గా మార్చే సామర్థ్యం కారణంగా కస్టమర్ సబ్‌స్క్రిప్షన్‌లలో పెరుగుదలను చవిచూశాయి. ఐతే కరోనా కాలంలో ఆన్‌లైన్లో తరగతులు నిర్వహించినపుడు పల్లెల్లోనే కాదు, పట్టణాలు, నగరాల్లోనూ అంతర్జాల సౌకర్యం తగిన రీతిలో అందుబాటులో లేదు. నిలకడ లేని నెట్‌వర్క్, తక్కువ వేగంతో డేటా సేవలు కలిపి, విద్యార్థులకు నాణ్యమైన చదువు అందుబాటులో లేకుండా చేశాయి. అప్పటికి మనదేశంలో ఇంటర్నెట్ సేవలు 35-40 శాతం వరకు మాత్రమే ఉండేవి. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు అత్యధికంగా నష్టపోయారు. యుద్ధ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఫైబర్ వ్యవస్థ నిర్మించడం ద్వారా ఒక ముఖ్యమైన లోటును ప్రభుత్వం పరిహరించింది. ఇటీవలే ప్రయోగాత్మకంగా ఎనిమిది నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో దేశం మొత్తం ఈ సేవలు విస్తరించబోతున్నాయి. అప్పుడు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు అవకాశం ఉంటుంది. 5జీ సేవల వల్ల లబ్ధి పొందే రంగాల్లో విద్యారంగం అగ్రగామి. మారుమూల పల్లెలకు కూడా అత్యధిక వేగంతో కూడిన మొబైల్ సేవలు లభ్యమవుతాయి. ముఖ్యంగా లభించే ప్రయోజనాలు..
‣ తరగతిలో విద్యార్థుల, ఉపాధ్యాయుల మధ్య మెరుగైన అనుసంధానం
‣ సమయాన్ని ఆదా చేయడం
‣ అనుకూలతకు అనుగుణంగా తరగతులు (ఫ్లెక్సిబుల్ పాఠాలు)
‣ వేగవంతమైన వీడియో డౌన్‌లోడ్‌లు
‣ ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు మెరుగైన సాయం
‣ దృశ్య, శ్రావణ మాధ్యమాల అనువర్తనంతో నాణ్యమైన పాఠ్యాంశాలు అభివృద్ధి చేసి విద్యార్థులందరికీ అందుబాటులోకి తేవటం.
‣ దీనివల్ల విద్యారంగంలో సృజనాత్మకత కలిగిన ఔత్సాహికులు ఎందరో అంకుర సంస్థలు నెలకొల్పి దేశ ప్రగతికి ఉత్ప్రేరకులు కాగలరు.
సరికొత్త ఉద్యోగాలు
ఫేస్‌బుక్, గూగుల్ లాంటి పెద్ద టెక్ కంపెనీలు తమ ప్రకటనల ఆదాయాన్ని పెంచుకోవడానికి 4జీ సహాయపడింది. అలాగే ఇన్‌స్టాగ్రామ్, స్నాప్ చాట్, యూట్యూబ్‌ల పెనువృద్ధి 4జీ లేకపోతే జరిగేది కాదు. కాబట్టి కచ్చితంగా 5జీ నెట్ వర్క్ పనితీరు ఉత్పాదకతను మెరుగుపరుస్తుందనీ, తద్వారా టెక్ కంపెనీల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందనీ అంచనా వేయవచ్చు.
ప్రముఖ వార్తాపత్రిక ‘ఎకనామిక్ టైమ్స్’ నివేదిక ప్రకారం ఈమధ్య కాలంలో 5జీ- నేపథ్యంలోని కొలువుల్లో 15-20% అభివృద్ధి ఉంది. ఈ ఉద్యోగావకాశాలు అధిక శాతం టెలిఫోన్ కంపెనీల్లో ఉంటున్నాయి. ఈ నివేదిక ప్రకారం వచ్చే ఆరు నెలల్లో 5జీ టెక్నాలజీ దాదాపు 45,000 ఉద్యోగాలు సృష్టించనుంది. ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ సంస్థ క్వాల్ కామ్ అంచనాల మేరకు 5జీ టెక్నాలజీ 2035 నాటికి 22 మిలియన్ ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఇంకా 12.3 ట్రిలియన్ డాలర్ల వరకు గూడ్స్ అండ్ సర్వీసెస్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అత్యంత డిమాండ్ వీరికే..
‣ నెట్ వర్కింగ్ ఇంజినీర్లు
‣ ఏఐ - ఎంఎల్ నిపుణులు
‣ యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైనర్లు
‣ క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణులు
‣ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టులు
‣ డేటా సైన్స్, డేటా ఎనలిటిక్స్ నిపుణులు
ఈ మెలకువలు అవసరం
కొత్త టెక్నాలజీల ఆవిష్కరణ ఒక ఎత్తయితే అందులో కొలువులకు అవసరమైన మెలకుల్లో శిక్షణ పొందడం మరొక ఎత్తు. స్థూలంగా 5జీ రంగంలో పాదం మోపాలంటే కింది నైపుణ్యాలు చాలా అవసరం
‣ ఎడ్జ్ కంప్యూటింగ్ విత్ ఐఓటీ
‣ క్లౌడ్ కంప్యూటింగ్ ఫండమెంటల్స్
‣ సైబర్ సెక్యూరిటీ
‣ మీడియా ఫర్ డేటా ట్రాన్స్‌మిషన్
‣ వర్చువల్ రియాలిటీ/ ఆగ్మెంటెడ్ రియాలిటీ ః క్రియేషన్ ఆఫ్ అటానమస్ సిస్టమ్స్
‣ ఎండ్ -టు- ఎండ్ సర్వీసెస్
‣ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్
‣ రోబోటిక్స్
‣ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్
5జీ టెక్నాలజీస్‌పై పీజీ సర్టిఫికెట్ కోర్సును ప్రసిద్ధ ఐఐటీ¨లతో సహా ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలు అందిస్తున్నాయి. డిప్లొమా/ బీఎస్‌సీ/ బీటెక్ లేదా వీటికి సమానమైన సైన్స్/ ఇంజినీరింగ్ డిగ్రీ ఉన్నవారు దీనిలో చేరవచ్చు. ఈ కోర్సు ఫీజు ఎక్కువే. ఈ కోర్సు ఎండ్-టు-ఎండ్ 5జీ ఆర్కిటెక్చర్, కీ టెక్నికల్ పిల్లర్స్, ఎనేబుల్స్, కీ బిజినెస్ ఇష్యూస్, 5జీ సూత్రాలు లాంటి విస్తృత అంశాలపై పాఠ్యప్రణాళికను కవర్ చేస్తుంది. ఇలాంటి 5 జీ నైపుణ్యాలు నేర్చుకోవడానికి వెచ్చించే ధనం, సమయం మెరుగైన కెరియర్‌కు పెట్టే పెట్టుబడిగా భావించుకోవచ్చు!
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ పీజీ విద్యార్థినులకు యూజీసీ ప్రోత్సాహం
‣ డిజిటల్ అక్షరాస్యత... మీకుందా?
‣ మైనారిటీ బాలికలకు ఉపకార వేతనాలు
‣ క్లిష్ట సమయాల్లోనూ ఉద్యోగ సాధన ఎలా?
‣ ఉద్యోగ సంస్థల్లో ఆన్‌లైన్ శిక్షణ