• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉద్యోగ సంస్థల్లో ఆన్‌లైన్‌ శిక్షణ

ఉద్యోగ సాధనకు అవసరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం నగర విద్యార్థులతో పోలిస్తే.. చిన్నచిన్న పట్టణాల్లో, గ్రామాల్లో నివసించే విద్యార్థులకు ఉండదు. ఈ లోపం గుర్తించిన జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) విదేశీ విశ్వవిద్యాలయాల సహకారంతో ఈ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగార్హత నైపుణ్యాల పాఠాలను సబ్సిడీ రేట్లతో అందించబోతోంది.  

ఉద్యోగావకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావాలంటే డిగ్రీ, పీజీలు చేస్తేనే సరిపోదు. ఉద్యోగ సాధనకు అవసరమయ్యే నైపుణ్యాలనూ మెరుగుపరుచుకోవాలి. విదేశీ యూనివర్సిటీల్లో చదివినవారికి ఇలాంటి సామర్థ్యాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ అంత సుదూరం వెళ్లి చదువుకునే ఆర్థిక స్తోమత అందరికీ ఉండదు. అలాంటప్పుడు పల్లెల్లోని విద్యార్థులకే విదేశీ యూనివర్సిటీల్లోని అధ్యాపకులతో ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పించాలనే వినూత్న ఆలోచనను ఆచరణలోకి తీసుకొస్తోంది నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌. 

‘స్కిల్‌ ఇండియా మిషన్‌’లో భాగంగా హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్‌ యూనివర్సిటీ నిపుణులు టైర్‌ -2, టైర్‌-3 పట్టణాలూ, పల్లెలోని విద్యార్థులకు ఉపాధి నైపుణ్యాలను బోధిస్తారు. 

ఇవి ఎందుకంటే: ఉపాధి నైపుణ్యాలు ఉన్నవారికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్‌ ఉంటుంది. బహుళజాతి సంస్థలెన్నో మన దేశంలో ఇప్పటికే తమ కార్యాలయాలను ఏర్పాటుచేశాయి. భవిష్యత్తులో మరిన్ని ఎంఎన్‌సీ కంపెనీలూ రానున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధి నైపుణ్యాలున్న ఉద్యోగుల అవసరమెంతో ఉంటుంది. మన దేశంలో పెట్టుబడి పెట్టేలా ప్రముఖ సంస్థలను ఆకర్షించడానికీ ఈ సామర్థ్యాలు అవసరం అవుతాయి. అంతర్జాతీయ స్థాయిలో వివిధ సంస్థల దృష్టిని ఆకర్షించడానికీ తోడ్పడతాయి. 2025 నాటికి సుమారు 3 కోట్ల 50 లక్షల మందికి ఉపాధి నైపుణ్య శిక్షణను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

శిక్షణ ఇలా: ఈ పథకం కింద మూడు నుంచి ఆరు నెలల కాలవ్యవధిలో ఆన్‌లైన్‌ శిక్షణను అందిస్తారు. ఆ తర్వాత ఏడాదిన్నరపాటు ఇంటర్న్‌షిప్‌కు ఎంపికచేస్తారు. ఆ సమయంలో తగిన మొత్తాన్నీ చెల్లిస్తారు. ఎవరికి ఎంత మొత్తాన్ని చెల్లించాలనేదాన్ని శిక్షణ సమయంలో విద్యార్థులు పొందిన మార్కుల ఆధారంగా నిర్ణయిస్తారు. 

రుణ సదుపాయం: ఈ ప్రోగ్రామ్‌లో చేరాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు రుణ సదుపాయం కూడా ఉంటుంది. నాన్‌-బ్యాంకింగ్‌ సంస్థలతో కలిసి ఎన్‌ఎస్‌డీసీ సుమారు రూ.4 లక్షల రుణాన్ని అందజేస్తుంది. దీంతోపాటుగా ఎంపిక చేసిన కొన్ని కోర్సులకు మరో పథకమూ అందుబాటులో ఉంది. అదే ‘లెర్న్‌ నౌ, పే లేటర్‌’. ఈ పథకం కింద ముందుగా నైపుణ్యాలను నేర్చుకుని, ఉద్యోగం వచ్చిన తర్వాత రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. 

ఉపాధి నైపుణ్యాలు పెంచుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఫీజు చెల్లింపు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో ఈ అవకాశాన్ని కల్పించారు. ఉపాధి సామర్థ్య అభివృద్ధికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వశాఖ వివిధ ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలనూ కుదుర్చుకుంది.  

వెబ్‌సైట్‌: https://nsdcindia.org/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆడుకుంటూ చేసుకునే ఉద్యోగాలు!

‣ ఒక్క ఛాన్స్ కాదు... అనేక ఛాన్సులు!

‣ డిగ్రీతో ఐఐటీలో ఉద్యోగాలు

‣ కోర్సు పూర్తి కాగానే కొలువుల్లోకి!

‣ అమ్మకాల దళంలో చేరతారా?

Posted Date : 18-10-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌