‘సిట్యుయేషన్ క్రిటికల్‌గా ఉంది...’ అని ఎవరైనా అంటే అయ్యో అంటాం. కానీ క్రిటికల్ అన్నది అన్నివేళలా చెడ్డదేం కాదు! ముఖ్యంగా ఐటీలో ‘క్రిటికల్ రిసోర్స్’ అన్న పదానికి చాలా ప్రాముఖ్యం ఉంది.
ఏ సంస్థ అయినా సరే... విజయవంతంగా నడిచేందుకు అత్యంత ఆవశ్యకమైన మానవ వనరులను క్రిటికల్ రిసోర్స్ అంటున్నారు. చాలామంది విద్యార్థులు బాగా చదివి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు పొందాలి అనుకుంటారు. ఆ సంస్థలు కూడా తమకు విధేయంగానూ పని పట్ల నిబద్ధతతోనూ పనిచేసేవారినే వెతుకుతుంటాయి. అందువల్ల చదువులు పూర్తిచేస్తున్నప్పుడు... ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడుతున్నప్పుడే సంస్థలు ఏం కోరుకుంటాయో తెలుసుకుంటే విద్యార్థులు ఆ నైపుణ్యాలు పొందేందుకు ప్రయత్నించవచ్చు. తద్వారా ఆ సంస్థలో అత్యంత ఆవశ్యకమైన మానవవనరుగా ఎదగొచ్చు. అది సుస్థిరమైన కెరియర్‌కు బాటలు వేస్తుంది.
‣ ఇప్పటి అభ్యర్థులు చాలా తక్కువ సమయంలోనే ఉద్యోగంలో ఎదగాలని ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టే క్రిటికల్ రిసోర్స్ అవ్వాలంటే ఏళ్లతరబడి అనుభవం ఉండాల్సిన అవసరం లేదు. సంస్థకు సంతృప్తినిచ్చే స్థాయిలో మనం పనిచేస్తే చాలు. ఇందుకు అలవరుచుకోవాల్సిన మూడు ముఖ్య లక్షణాలు..
1. ఏపని చేసినా మనం కాకపోతే ఈ పని ఇంకెవరూ ఇంత సమర్థంగా చేయలేరు అనిపించేలా చేయాలి. అలాగే బృందంలో ఉన్నప్పుడు మనకు ఇచ్చిన పని మాత్రమే చేస్తామని గిరిగీసుకుని కూర్చోవడం సరికాదు. దానికి అనుబంధంగా ఏ పని ఉన్నా అందుకుని చేయడం, ఇతరులకు సందేహాలు - సమస్యలు వచ్చినప్పుడు సాయపడటం ద్వారా పనిపై త్వరగా పట్టు సాధించడమే కాదు... కంపెనీలో మన స్థానాన్నీ సుస్థిరం చేసుకోగలం.
2. మనల్ని ఏ కారణం చేతనైనా తొలగిస్తే అంత త్వరగా మళ్లీ ఆ స్థానాన్ని సమర్థులతో భర్తీ చేయలేమనే భావన కల్పించగలగాలి. అది మన నైపుణ్యాలు, పనిలో చూపే వేగం, సహోద్యోగులతో నెరిపే మంచి సంబంధాలతో ముడిపడి ఉంటుంది. ఆ స్థానానికి మనమే ఉత్తమ ఎంపిక అనే అభిప్రాయాన్ని సంపాదించుకోవాలి.
3. సంస్థ సజావుగా నడిచేందుకు, ఎక్కడ ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు... వీరు మనకి కచ్చితంగా అవసరం అనే భావన యాజమాన్యానికి కల్పించడం మూడోది. లాభనష్టాల్లో వెన్నంటి ఉండటం, వ్యూహ రచనల్లో మన అభిప్రాయానికి విలువనిచ్చే స్థాయికి ఎదగడం చేయగలగాలి. సంస్థ మనల్ని కోల్పోకుండా జాగ్రత్తపడాలి. అప్పుడే విజయవంతంగా ఉద్యోగ జీవితాన్ని ఆస్వాదించగలం!
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ టెన్త్ పాసైతే సాయుధ దళాల్లోకి స్వాగతం!
‣ దివ్య జీవనానికి దృఢమైన ఆసరా!
‣ ఆఫీసర్ కొలువుకు నౌకాదళం పిలుపు!
‣ ఇంటర్ పాసైతే స్కాలర్‌షిప్‌లు