• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌తో ఐఐటీ మద్రాస్‌లో ఎంఏ

డెవ‌‌ల‌ప్‌మెంట్ స్ట‌డీస్‌, ఇంగ్లిష్ స్ట‌డీస్‌లో పీజీ

ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఐఐటీ మద్రాస్‌లో ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సులు చదువుకునే అవకాశం వచ్చింది. అన్ని గ్రూపుల విద్యార్థులూ ఈ సీట్లకోసం పోటీ పడవచ్చు. డెవలప్‌మెంట్‌ స్టడీస్, ఇంగ్లిష్‌ కోర్సులపై ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు.  

ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సుల్లో చేరిన విద్యార్థులందరికీ మొదటి రెండేళ్లు ఉమ్మడిగా బోధిస్తారు. మూడో ఏట నుంచి రెండు విభాగాలకు విడిగా బోధన ఉంటుంది. విద్యార్థుల ఆసక్తి, తొలి మూడు సెమిస్టర్లలో చూపిన ప్రతిభ ప్రాతిపదికన కోర్సు కేటాయిస్తారు. ఒక్కో విభాగంలో 26 మందికి అవకాశం ఉంటుంది. ఐఐటీ మద్రాస్‌ హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ కోర్సులు అందిస్తోంది. వీటిని పూర్తిచేసుకున్నవారు మంచి ఉపాధి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు.

పరీక్ష ఇలా...

హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (హెచ్‌ఎస్‌ఈఈ)ను మొత్తం 3 గంటల వ్యవధితో నిర్వహిస్తారు. ఇందులో రెండు భాగాలుంటాయి. తొలిభాగంలో ఆన్‌లైన్‌లో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. వ్యవధి రెండున్నర గంటలు. రెండో భాగం వ్యవధి 30 నిమిషాలు. ఇందులో భాగంగా అడిగిన అంశంలో వ్యాసాన్ని కీబోర్డు సాయంతో ఆన్‌లైన్‌లో రాయాలి. దీన్ని ఆఫ్‌లైన్‌లోనూ పేపర్‌పై పెన్నుతో రాసుకునే అవకాశం ఉంది. ఈ విధానంలో రాయాలనుకున్నవారు ప్రవేశపత్రం డౌన్‌లోడ్‌ చేసుకున్నప్పుడే వివరాలు తెలపాలి. 

ప్రశ్నలు ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి. ఇంగ్లిష్, కాంప్రహెన్షన్‌ స్కిల్‌; ఎనలిటికల్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, జనరల్‌ స్టడీస్‌ (ఇండియన్‌ ఎకానమీ, సొసైటీ, కల్చర్, వరల్డ్‌ ఎఫైర్స్‌), ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఎకాలజీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్, కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌ 25 శాతం, ఎనలిటికల్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ 25 శాతం, జనరల్‌ స్టడీస్‌ ప్రశ్నలకు 50 శాతం వెయిటేజీ ఉంటుంది. 

ఇంగ్లిష్‌ విభాగంలో ప్రామాణిక ఆంగ్లాన్ని ఉపయోగించే విధానంపై ప్రశ్నలు వస్తాయి. కాంప్రహెన్షన్‌ ప్రశ్నల ద్వారా రీడింగ్‌ స్కిల్స్‌ పరిశీలిస్తారు. వాక్యనిర్మాణం, దాన్ని ఉపయోగించే విధానం, కాలాలు, క్రియలు, ఆర్టికల్స్, ప్రత్యక్ష, పరోక్ష ప్రశ్నలను వ్యాకరణంలో భాగంగా అడుగుతారు. 

''రెండోభాగం ఆఫ్‌లైన్‌లోనూ పేపర్‌పై పెన్నుతో రాసుకునే అవకాశం ఉంది. ఈ విధానంలో రాయాలనుకున్నవారు ప్రవేశపత్రం డౌన్‌లోడ్‌ చేసుకున్నప్పుడే వివరాలు తెలపాలి''

జనరల్‌ స్టడీస్‌లో అర్థశాస్త్రం, భారతీయ సమాజం, సంస్కృతి, ప్రపంచ సంబంధాలు, పర్యావరణ అంశాలపై సాధారణ స్థాయి ప్రశ్నలు వస్తాయి. వర్తమానాంశాలు, జనరల్‌ నాలెడ్జ్‌తో ముడిపడి వ్యాసాన్ని రాయమంటారు. దీనిద్వారా అభ్యర్థి ఆలోచనా విధానం, అవగాహన సామర్థ్యం పరిశీలిస్తారు. 

ఎనలిటికల్, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీలో భాగంగా అంకెలు, ఆల్జీబ్రా, కసాగు, గసాభా, క్యాలెండర్, సగటు, నిష్పత్తి, లాభనష్టాలు, శాతాలు, వడ్డీలు, పని, కాలం, డిస్కౌంట్, సరళ సమీకరణాలు, త్రికోణమితిలోని ప్రాథమికాంశాలు, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఎనలిటికల్‌ రీజనింగ్, లాజికల్‌ రీజనింగ్, బ్రెయిన్‌ టీజర్స్, ప్యాటర్న్స్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

గమనించండి

కోర్సులు: డెవలప్‌మెంట్‌ స్టడీస్, ఇంగ్లిష్‌ స్టడీస్‌ 

మొత్తం సీట్లు: 58 

అర్హత: 2020లో ఇంటర్‌ లేదా సమాన కోర్సు ఉత్తీర్ణులు, 2021లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసేవారు దరఖాస్తు చేసుకోవచ్చు..

వయసు: అక్టోబరు 1, 1996 తర్వాత జన్మించినవారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే అక్టోబరు 1, 1991 తర్వాత జన్మించినా అర్హులే. 

పరీక్ష తేదీ: జూన్‌ 13

అందుబాటులోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్‌

ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1200. మిగిలిన అందరికీ రూ.2400

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 15

వెబ్‌సైట్‌: https://hsee.iitm.ac.in/

Posted Date: 09-03-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌