• facebook
  • whatsapp
  • telegram

పీజీసెట్‌కి సిద్ధమేనా?

145 కోర్సుల్లో ప్రవేశం

అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులకోసం పీజీ కోర్సులు ఎదురుచూస్తున్నాయి. ఒక పరీక్ష రాస్తే చాలు- ఆ కోర్సుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా చదువుకునే అవకాశం  పొందవచ్చు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసీజే, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఎడ్,  ఎం.పి.ఎడ్‌., ఎమ్మెస్సీ టెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు( ఏపీ పీజీసెట్‌) ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలో చూపిన ప్రతిభతో ఏపీలోని వివిధ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లోని 145 కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. 

రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు/ సంస్థల్లో చదువుకునే అవకాశం పీజీసెట్‌తో లభిస్తుంది. దీనిద్వారా విడిగా సంస్థలవారీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయి. అలాగే ప్రతి విశ్వవిద్యాలయంలోనూ అన్ని కోర్సులూ ఉండవు. అభ్యర్థి తనకు నచ్చిన కోర్సు, కోరుకున్న సంస్థలో చేరే అవకాశం పీజీసెట్‌తో సొంతమవుతుంది. ఈసారి పరీక్షను యోగి వేమన విశ్వవిద్యాలయం కడప నిర్వహిస్తోంది. 

పరీక్షలు జరిగే సబ్జెక్టులు

‣​​​​​​​ ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌: ఇంగ్లిష్, జనరల్, తెలుగు, లిటరేచర్, సంస్కృతం, హిందీ, ఉర్దూ, తమిళం, ఫోక్‌లోర్, బీఎఫ్‌ఏ, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, పెర్ఫామింగ్‌ ఆర్ట్స్‌ అండ్‌ మ్యూజిక్, పెర్ఫామింగ్‌ ఆర్ట్స్, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, ఎకనామిక్స్, టూరిజం. 

‣​​​​​​​ కామర్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌: కామర్స్, ఎడ్యుకేషన్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌.

‣​​​​​​​  సైన్సెస్‌: లైఫ్‌ సైన్సెస్, ఎఫ్‌ఎన్‌ఎస్, బోటనీ, సెరీకల్చర్, జువాలజీ, మ్యాథమెటికల్‌ సైన్సెస్, స్టాటిస్టిక్స్, ఫిజికల్‌ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, కెమికల్‌ సైన్సెస్, పాలిమర్‌ సైన్స్, జియాలజీ, సైకాలజీ, కంప్యూటర్‌ సైన్స్, జాగ్రఫీ.

పరీక్ష ఇలా:

ఏ సబ్జెక్టు ఎంచుకున్నప్పటికీ ప్రశ్నపత్రం వంద మార్కులకు ఉంటుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే అడుగుతారు. రుణాత్మక మార్కులు లేవు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. పరీక్షలో మూడు లేదా నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఎనాలజీ, క్లాసిఫికేషన్, మ్యాచింగ్, కాంప్రహెన్షన్‌ (రిసెర్చ్‌ స్టడీ/ ఎక్స్‌పరిమెంట్‌/ థియరిటికల్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూ)ల నుంచి వీటిని రూపొందిస్తారు. నిర్దేశిత సిలబస్‌ నుంచి వీటిని మల్టిపుల్‌ చాయిస్‌ రూపంలో అడుగుతారు. ఎంపీఈడీ కోర్సులో ప్రవేశం మాత్రం పరీక్షలో చూపిన ప్రతిభతోపాటు, ఆటల్లో చూపిన ప్రతిభ ప్రాతిపదికన ఉంటుంది. 

విశ్వవిద్యాలయాలు: ఆంధ్రా, శ్రీవెంకటేశ్వర, శ్రీకృష్ణ దేవరాయ, ఆచార్య నాగార్జున, శ్రీపద్మావతి మహిళ, యోగి వేమన, రాయలసీమ, విక్రమ్‌ సింహపురి, ద్రవిడియన్, కృష్ణ, ఆదికవి నన్నయ, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్, డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ, క్లస్టర్, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం, జేఎన్‌టీయూ అనంతపూర్, స్విమ్స్‌ విశ్వవిద్యాలయాలు/ సంస్థలు పరీక్షతో అవకాశం కల్పిస్తున్నాయి. 

5 శాతం సీట్లు నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కోటాకి చెందుతాయి. వీటికి ఏపీ, తెలంగాణ తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల విద్యార్థులూ పోటీ పడవచ్చు.

బీకాం విద్యార్థులు ఎంఏ ఎకనామిక్స్‌ కోర్సుకు అనర్హులు. ఎంఏ లాంగ్వేజ్‌ కోర్సుల్లోకి బీఈ/బీటెక్, బీఫార్మసీ వారికి అవకాశం లేదు. 

అర్హత: కొన్ని కోర్సులకు ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పోటీ పడవచ్చు. మిగిలినవాటికి మాత్రం సంబంధిత/అనుబంధ సబ్జెక్టును డిగ్రీ స్థాయిలో చదవడం తప్పనిసరి. 

పరీక్ష కేంద్రాలు: ఏపీలోని అన్ని పాత జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్‌లోనూ పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ ప్రాధాన్యం ప్రకారం వీటిలో ఏవైనా మూడింటిని ఎంచుకోవాలి. 

దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు    రూ.650. బీసీలకు రూ.750. ఓసీలకు రూ.850.  ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో పరీక్ష రాయడానికి  అదనంగా ఫీజు చెల్లించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 20

పరీక్షలు: ఆగస్టు 17 నుంచి ప్రారంభమవుతాయి.  

వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/

సన్నద్ధత

‣​​​​​​​ సబ్జెక్టులవారీ సిలబస్‌ వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయి. సిలబస్‌లో పేర్కొన్న అంశాలను డిగ్రీ పుస్తకాల నుంచి చదువుకోవాలి.  

‣​​​​​​​ ఏపీ ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌ https://sche.ap.gov.in/ లో సబ్జెక్టులవారీ 2021 ప్రశ్నపత్రాలు జవాబులతో సహా అందుబాటులో ఉంచారు. వీటిని పరిశీలించిన తర్వాత అధ్యయనం కొనసాగించాలి. 

‣​​​​​​​ సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ మూడేళ్ల సిలబస్‌పై గట్టి పట్టు ఉన్నవారు విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల్లో సీటు పొందవచ్చు. 

‣​​​​​​​ పరీక్షలో విజయానికి ప్రాథమికాంశాల్లో పరిణతి ఉండాలి. 

‣​​​​​​​ వీలైనన్ని మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేయాలి. 

Posted Date: 11-07-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌