• facebook
  • whatsapp
  • telegram

ఆ స్కోరుతో వెయ్యి సంస్థల్లో అడ్మిషన్‌!

సీమ్యాట్‌ నోటిఫికేషన్‌ విడుదల

మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించే కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టు (సీమ్యాట్‌) వాటిలో ఒకటి. ఇటీవలే ఆ ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలో సాధించిన స్కోరుతో సుమారు వెయ్యి సంస్థల్లో ఎంబీఏ/పీజీడీబీఏ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 

విభాగాలవారీ..

లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌: అభ్యర్థి ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలు వస్తాయి. ఖాళీలు పూరించడం, వ్యాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమ పద్ధతిలో అమర్చడం, కాంప్రహెన్షన్‌..తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. హైస్కూల్‌ స్థాయి ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుంటే ఎక్కువ మార్కులు పొందడం సులువే. 

క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌: శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, వయసు నిర్ణయించడం, రైళ్లు, పడవ వేగాలు, క.సా.గు., గ.సా.భా., వైశాల్యాలు, ఘనపరిమాణాలు మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. వీటిలో దాదాపు అన్ని అంశాలూ హైస్కూల్‌ మ్యాథ్స్‌ పుస్తకాల్లోనివే. వాటిని బాగా చదువుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే సరిపోతుంది. నంబర్‌ ఎనాలజీ, నంబర్‌ క్లాసిఫికేషన్, ఫిగర్‌ ఎనాలజీ, వెన్‌ డయాగ్రమ్స్, నంబర్‌ సిరీస్, కోడింగ్‌ డీకోడింగ్, వర్డ్‌ బిల్డింగ్‌...మొదలైన విభాగాల నుంచీ ప్రశ్నలు అడుగుతారు. సంఖ్యలు, అంకెలపైనే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు సాధించడం ద్వారా వీటికి సమాధానాలు గుర్తించవచ్చు. 

లాజికల్‌ రీజనింగ్‌: అజంప్షన్లు, కన్‌క్లూజన్‌లు, ఇన్ఫరెన్స్‌లు, కాజ్‌ అండ్‌ ఎఫెక్ట్, ఎనలిటికల్‌ రీజనింగ్, లీనియర్‌ అరేంజ్‌మెంట్, బ్లడ్‌ రిలేషన్లు, నంబర్‌ సిరీస్, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌.. తదితర అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగాల్లో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధనచేస్తే మెరుగైన స్కోరు పొందవచ్చు. 

జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలోని ఎక్కువ ప్రశ్నలకు సాధారణ పరిజ్ఞానంతోనే జవాబులు గుర్తించవచ్చు. దైనందిన జీవితంతో ముడిపడినవే అడుగుతారు. పర్యావరణాంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. రోజువారీ సంఘటనలనేే ప్రశ్నలగా రూపొందిస్తారు. వీటితోపాటు భారత్‌- పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్‌ అంశాల నుంచీ ప్రశ్నలు ఉంటాయి. హైస్కూల్‌ సోషల్, సైన్స్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదివి, తాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. 

ఇన్నోవేషన్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌: ఇందులో ఏదైనా సందర్భానికి ఎలా స్పందిస్తారో తెలుసుకునేలా ప్రశ్నలు వస్తాయి. వివిధ కొత్త ఆవిష్కరణలపై అవగాహన పెంచుకోవాలి. కొత్త వ్యాపారం, స్టార్ట్‌అప్‌లకు సంబంధించి పథకాలు, ప్రోత్సాహకాలపై పరిజ్ఞానం ఉండాలి. తాజా వ్యాపార ధోరణులు, పెట్టుబడులు, ఎఫ్‌డీఐ, స్కిల్‌ డెవలప్‌మెంట్, వెంచర్‌ క్యాపిటలిస్ట్, ఫైనాన్షియల్‌ అసిస్టెన్స్‌.. తదితర అంశాలు తెలుసుకోవాలి. 

ప్రాథమిక అధ్యయనం పూర్తయిన తర్వాత సీమ్యాట్‌ పాత ప్రశ్నపత్రాలు పరిశీలించాలి. వీటిద్వారా ప్రశ్నలు ఏ విధంగా అడగవచ్చు, వాటి స్థాయి, అందుకు ఎలా సన్నద్ధం కావాలో తెలుస్తుంది. పరీక్షకు ముందు వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయాలి. సూత్రాలు ఉపయోగించే విధానం తెలుసుకోవాలి. షార్ట్‌ కట్‌ మెథడ్స్‌పై పట్టు సాధించాలి. ఐసెట్, మ్యాట్‌ సన్నద్ధత సీమ్యాట్‌కూ ఉపయోగపడుతుంది. అందువల్ల ఆ పరీక్షల పాత, మాదిరి ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయడం వల్ల ఎక్కువ మార్కులు పొందవచ్చు. 

పరీక్ష ఇలా..

ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షలో ఒక్కో సెక్షన్‌ నుంచి 20 చొప్పున 5 విభాగాల్లో వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. అవి.. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రెటేషన్, లాజికల్‌ రీజనింగ్, లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్, జనరల్‌ అవేర్‌నెస్, ఇన్నోవేషన్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రతి ప్రశ్నకు 4, మొత్తం ప్రశ్నపత్రానికి 400 మార్కులు. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ ఒక మార్కు తగ్గిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. 

ముఖ్య సమాచారం..

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం చివరి సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు నిబంధన లేదు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మార్చి 6 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు. 

దరఖాస్తు ఫీజు: జనరల్‌ కేటగిరీ పురుషులకు రూ.2000. మిగిలిన అందరికీ రూ.1000

పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.

పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌. (అభ్యర్థులు ప్రాధాన్యం ప్రకారం 4 పరీక్ష కేంద్రాలు ఎంచుకోవాలి)

వెబ్‌సైట్‌: https://cmat.nta.nic.in/
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎంపికైతే ఉన్నత విద్య, బ్యాంకులో ఉద్యోగం!

‣ మేటి స్కోరుకు ఇదిగో రూటు!

‣ డిజిట‌ల్ ఉప‌వాసం ఉంటే మేలు!

‣ మాన‌సికంగా దృఢంగా ఉన్నారా?

‣ కేంద్రీయ సంస్థ‌ల్లో యూజీ.. పీజీ!

‣ ప్రాంగణ ఎంపికలకు.. పక్కా సంసిద్ధత

‣ మీ లెర్నింగ్‌ స్టైల్‌ ఏంటి?

Posted Date: 20-02-2023


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌