• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మాన‌సికంగా దృఢంగా ఉన్నారా? 

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు సంతోషాలను.. మరికొన్నిసార్లు సమస్యలనూ మోసుకొస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మానసికంగా కుంగిపోకూడదు. మరింత దృఢంగా మారి సమస్యలతో పోరాడటానికి సిద్ధంగా ఉండాలి. 


విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఎంతో కష్టపడి చదువుతారు. కానీ కొన్నిసార్లు అనుకున్న ర్యాంకును సాధించలేకపోతారు. దాంతో దిగులు పడటంతోపాటుగా ఆత్మవిశ్వాసాన్నీ కోల్పోతారు. ఇక తాము దేనికీ పనికి రామనే నిర్ణయానికి వచ్చేస్తుంటారు. ఒక్కోసారి ఊహించని ఘటనల వల్ల కూడా అనుకున్న ఫలితాలను పొందలేకపోవచ్చు. ఏడాదంతా కష్టపడి చదివినా సరిగ్గా పరీక్షల సమయానికి అనారోగ్యం బారినపడొచ్చు. లేదా కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యల వల్ల మనసు చదువు మీదకు మళ్లకపోవచ్చు. ఇవన్నీ అనుకోకుండా వచ్చే సమస్యలే. నిజానికి ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనే మరింత ధైర్యంగా ఉండాలి. కొన్ని పద్ధతులనూ అనుసరించాలి. అవేమిటంటే... 


వాస్తవాన్ని అంగీకరించాలి: మంచి ర్యాంకు సాధించాలని ఎంతో ప్రయత్నిస్తారు. కానీ ఫలితం మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది. అంతమాత్రాన నిరాశపడకూడదు. వాస్తవాన్ని అంగీకరించాలి. ఊహించుకున్నది కాదు.. వాస్తవంగా పొందిన ఫలితమే నిజం. కాబట్టి ముందుగా ఆ నిజాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు పరీక్షల ముందే అనారోగ్యానికి గురయ్యారు అనుకుందాం. ‘నాకే ఎందుకిలా జరిగింది’ అని బాధపడుతూ కూర్చుంటే ఎలాంటి ఫలితమూ ఉండదు. దాన్ని భూతద్దంలో చూస్తే పరిస్థితి మరింతగా దిగజారుతుంది. వాస్తవాన్ని అంగీకరించి.. సమస్య నుంచి త్వరగా బైటపడటానికి ప్రయత్నించాలి. మానసికంగా బలహీనంగా ఉంటే.. మీ ఆలోచనలు సమస్య దగ్గరే ఆగిపోతాయి. దృఢంగా ఉంటేనే వాటి పరిష్కారానికి ప్రయత్నించగలుగుతారు. 


ప్రవర్తనలో మార్పు: వాస్తవాలను అంగీకరించడం వల్ల ఆలోచనలు, భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతారు. ప్రవర్తనలో మార్పు రావడానికీ ఇదే ప్రధానం కూడా. కొన్నిసార్లు ఊహించని సమస్యలు రావొచ్చు. ఉదాహరణకు కుటుంబ సభ్యుల అనారోగ్యం, ప్రమాదాల కారణంగా ఆప్తులను కోల్పోవడం లాంటివి. దీంతో మీ దృష్టి చదువు మీదకు మళ్లదు. అయితే ఆ బాధ నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి. అలాగే మీ సమస్యలకు ఇతరులే కారణమని నిందించడం, వారి మీద ఫిర్యాదు చేయడం.. లాంటి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి సమయాల్లో.. ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి నేనేం చేయాలని మాత్రమే ఆలోచించాలి. సమస్యలకు ఇతరులే కారణమని నిందించడం చాలా తేలికే. కానీ కారణాన్ని గుర్తించి పరిష్కారాన్ని కనుక్కోవడమే కష్టం. 


ఆలోచనలను నియంత్రించడం: నిజానికి ఆలోచనలే మనకు అసలైన ఆస్తులు. అవి ఉన్నత శిఖరాలను అధిరోహించేలానూ.. అదఃపాతాళానికి జారిపోయేలానూ చేయగలవు. ఈ ఆలోచనలే కొన్నిసార్లు శత్రువుగానూ మారతాయి. ప్రతికూల ఆలోచనలు చేస్తూ అవే నిజమనుకుంటే.. శత్రువులా కీడు చేస్తాయి. లక్ష్య సాధనకు అడ్డంకిగా మారతాయి. ‘ఈ సబ్జెక్టు మింగుడు పడటం లేదు. దీంట్లో ఎక్కువ మార్కులు సంపాదించడం నా వల్ల కాదు. ఎంత కష్టపడి చదివినా గుర్తుండటం లేదు. నేనేమీ సాధించలేను..’ లాంటి ఆలోచనలన్నీ లక్ష్య సాధనకు ఆటంకంగానే మారతాయి. పదేపదే ఇలాంటి ఆలోచనలే వస్తుంటే స్నేహితులు, కుటుంబసభ్యులతో మీ బాధను పంచుకోవచ్చు. వారి సలహాలతో వీటి నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి గతంలో మీరు సాధించిన విజయాలనూ తరచూ గుర్తు చేసుకోవచ్చు. అప్పుడు మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. దాంతో మానసికంగా దృఢంగా మారి.. ఎలాంటి అవరోధాలైనా సులువుగా అధిగమించగలుగుతారు. 


ఒత్తిడికి దూరంగా: ఒత్తిడిలేని జీవితాన్ని అసలు ఊహించలేం. విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఉద్యోగులు.. ఇలా ఎవరి స్థాయికి తగ్గ ఒత్తిడి వారికి ఉండనే ఉంటుంది. అయితే దాన్ని నియంత్రించుకుని, నిర్దేశిత లక్ష్యాన్ని ఎలా సాధించామనే దాని మీదే మన విజయం ఆధారపడి ఉంటుంది. రోజూ ధ్యానం, యోగా చేయడం ద్వారా దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించొచ్చు. 


తగినంత నిద్ర: చదవడానికి మాదిరిగానే నిద్రకూ నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవాలి. తగినంత నిద్ర లేకపోకపోతే ఏ పనీ చేయాలనిపించదు. ఒకలాంటి నిస్సత్తువ ఆవరిస్తుంది. పోషకాహారం తీసుకుంటూ.. రోజూ వ్యాయామం చేస్తూ.. తగినంత విశ్రాంతీ తీసుకుంటే శారీరకంగానే కాదు.. మానసికంగానూ దృఢంగా ఉండగలుగుతారు.


ఒంటరిగా వద్దు: తక్కువ మార్కులు వచ్చినా.. ఫలితాలు అనుకున్నట్టుగా రాకపోయినా.. మనసు బాలేదంటూ కొంతమంది ఇతరులతో కలవడానికి అసలు ఇష్టపడరు. రోజుల తరబడి ఇంటికే పరిమితం అవుతుంటారు. కానీ ఇవేవీ సమస్యకు పరిష్కారం కాదు. గిరిగీసుకుని కూర్చోకుండా.. మీ పరిధి నుంచి బయటకు వచ్చి నలుగురితో కలవడానికి ప్రయత్నించాలి. దీంతో మనసు తేలికపడటంతోపాటు ప్రతికూల ఆలోచనలూ దూరమవుతాయి. అంతేకాదు మానసికంగా దృఢంగా ఉండటానికి స్నేహితులు, శ్రేయోభిలాషులూ ఇచ్చే సలహాలూ, సూచనలూ ఎంతగానో ఉపయోగపడతాయి.  

మరింత సమాచారం... మీ కోసం!

‣ కేంద్రీయ సంస్థ‌ల్లో యూజీ.. పీజీ!

‣ అత్యున్నత కొలువుకు పోటీపడతారా?

‣ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి ‘మ్యాట్‌’!

‣ డెక‌రేష‌న్ల‌కు కొన్ని కోర్సులు!

‣ వేదికపై ధీమాగా... నలుగురూ మెచ్చేలా!

Posted Date : 17-02-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.