• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప్రాంగణ ఎంపికలకు.. పక్కా సంసిద్ధత

చదువులు పూర్తయ్యే సమయం దగ్గరకొచ్చేసింది. ఇక కొలువులు కొట్టడమే మిగిలుంది. ఒకపక్క పరీక్షలకు సన్నద్ధమవుతూనే మరోపక్క క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు హాజరవుతూ అందరం బిజీబిజీగా ఉంటాô. మరి అంతమంది విద్యార్థుల్లో మనకో మంచి ఉద్యోగావకాశం రావాలంటే.. దానికి తగ్గట్టుగా పూర్తిస్థాయిలో సన్నద్ధమవ్వాలి!

ఏడాదంతా ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలు చాలా ముఖ్యమైన ఘట్టం. కోర్సు పూర్తవుతూనే అధిక ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించి కెరియర్‌ మొదలుపెట్టాలి అనుకుంటారు. మరి ఈ ఆశను నెరవేర్చుకునేందుకు అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి సరిచూసుకోవడం, మెరుగైన అవకాశం అందుకునేలా సన్నద్ధం కావడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో.. ఇంటర్వ్యూలకు హాజరయ్యేముందు మనం దృష్టి పెట్టాల్సిన విషయాలేంటో ఒక్కసారి చూసేద్దాం.

పరీక్ష

వందలాది మంది అభ్యర్థులను వడపోయడానికి రిక్రూటర్లు ముందు రాతపరీక్ష మీద ఆధారపడుతుంటారు. ఇందులో ఉత్తీర్ణులైతేనే ముఖాముఖిని ఎదుర్కొనే అవకాశం దొరుకుతుంది. అందుకే ఈ పరీక్షల్లో వచ్చే వివిధ సబ్జెక్టులను బాగా సాధన చేయాలి. వీలైనన్ని ప్రాక్టీస్‌ పేపర్లు రాయడం, మాక్‌ టెస్టులు తీసుకోవడం ద్వారా ఈ పరీక్షను సులభంగా నెగ్గవచ్చు. మనకు ఎంత మంచి అకడమిక్‌ స్కోరు ఉన్నా, ఎంత చక్కని భాషానైపుణ్యాలు ఉన్నా.. రాతపరీక్షల్లో పాసవ్వకపోతే అవన్నీ వృథానే. అందుకే దీని సాధనలో అలసత్వం ఎంతమాత్రం సరికాదు.

ధ్రువపత్రాలు

ఇప్పటివరకూ పూర్తయిన కోర్సుల ధ్రువపత్రాలు, వాటి నకళ్లు అన్నీ దగ్గర ఉంచుకోవాలి. ఆన్‌లైన్‌లో వివిధ కోర్సులు చేయడం, సొంతంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు ప్రయత్నించడం వంటివి కంపెనీలకు మన పట్ల మరింత ఆసక్తిని పెంచుతాయి. ఇటువంటి చిన్న చిన్న కోర్సుల వివరాలను రెజ్యూమెలో పొందుపరచవచ్చు. కేవలం అకడమిక్‌ వివరాలే కాకుండా ఇతర నైపుణ్యాల గురించి కూడా ఉంటే ఎదుటివారికి మరింత సానుకూల అభిప్రాయం ఏర్పడుతుంది. అందువల్ల వీలైనన్ని సర్టిఫికేషన్స్‌ ఉండేలా చూసుకోవడం ముఖ్యం. తక్కువ కాలవ్యవధి కలిగిన కోర్సులైనా చేయవచ్చు. కావాల్సినదల్లా మిగతావారి కంటే మీరు ఎక్కువగా నేర్చుకునే ఆసక్తి కలిగినవారిగా తెలియజెప్పడమే.

రెజ్యూమె

మనపై ఎదుటివారికి ఒక సానుకూల అభిప్రాయాన్ని కల్పించడంలో ఇది మొదటిమెట్టు. ఆసక్తికరమైన, అప్‌డేటెడ్‌ రెజ్యూమెను తయారుచేసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో మీకున్న నైపుణ్యాలు అన్నింటినీ పొందుపరచండి. ఏవైనా స్కాలర్‌షిప్‌లు అందుకున్నా, ఇంటర్న్‌షిప్‌లు చేసినా తెలియజెప్పండి. కొంత పని అనుభవం ఉండటం అనేది ఎప్పుడూ ఎంపిక కావడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తుంది. ఏవైనా ప్రాజెక్టు వర్క్స్‌ వంటివి పూర్తి చేస్తే వాటి గురించీ చెప్పండి. మొత్తం వివరాలు అన్నీ ఉండేలా చూడండి. చిన్నచిన్నవే కదా అని ఎలాంటి విజయాలను రాయడం మానేయొద్దు. మొత్తంగా కలిసి చదివేటప్పుడు అవీ ప్రభావాన్ని చూపుతాయనే విషయాన్ని గమనించండి. చక్కని క్రమపద్ధతిలో, కంటికి ఇంపైన ఫాంట్స్‌ వాడుతూ.. చదవాలి అనిపించేలా ఆ రెజ్యూమె ఉండాలి.

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌

ఇంటర్వ్యూల్లో మనం ప్రవర్తించే తీరు, మాట్లాడే విధానం చాలా ముఖ్యం. దాన్ని బట్టే అవతలి వ్యక్తి మనపై ఒక అంచనాను, అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటారు. ఈ విషయంలో మనం ఎలా ఉన్నాం అనేది ఒకసారి సరిచూసుకోవాలి. వీలైనంత ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించాలి. భావ ప్రకటన, భాషానైపుణ్యాలు మెరుగ్గా సాధన చేయాలి. ఎటువంటి కంగారు లేకుండా ప్రశాంతంగా మాట్లాడేందుకు ప్రయత్నించాలి. టెన్షన్‌ వల్ల ప్రశ్నలు వినడంలోనూ జవాబులు ఇవ్వడంలో పొరపాట్లు చేయకుండా జాగ్రత్తపడాలి. గ్రూప్‌ డిస్కషన్‌ రౌండ్స్‌ వంటివి ఉంటే.. అక్కడా ఇవే టిప్స్‌ పాటించాలి. ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడం, మన ఆలోచనలను స్పష్టంగా తెలియజేయడం ముఖ్యం.

సాధారణ ప్రశ్నలు

కాలేజీల్లో జరిగే ఇంటర్వ్యూల్లో సాధారణంగా అడిగే ప్రశ్నలకు ముందే జవాబులు ప్రిపేర్‌ కావాలి. ‘మీ గురించి చెప్పండి, మా కంపెనీ గురించి ఏం తెలుసు, మిమ్మల్నిమేం ఉద్యోగంలోకి ఎందుకు తీసుకోవాలి, మాతో ఎందుకు కలిసి పనిచేయాలి అనుకుంటున్నారు, మీ బలాలు - బలహీనతలు ఏంటి...’ ఇటువంటి జనరల్‌ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం సాధన చేయాలి. అలాగే ఆహార్యం పైనా దృష్టి పెట్టాలి. ఉద్యోగానికి తగిన విధంగా ఫార్మల్‌ దుస్తులనే ఎంపిక చేసుకోవాలి.

నిజానికి కాలేజీల్లో ప్లేస్‌మెంట్‌ డ్రైవ్స్‌ జరిగేటప్పుడు ఎంత కాదనుకున్నా కొంత గందరగోళం, గాభరా ఉంటుంది. విద్యార్థులందరికీ ఒకేచోట ఇంటర్వ్యూలు నిర్వహించడం, ఉత్తమ విద్యార్థులను ఎన్నుకోవడం అనేది రిక్రూటర్లకూ పెద్ద టాస్కే. అందుకే వారు తొలుత అకడమిక్‌ ప్రతిభ, సర్టిఫికేషన్స్‌ మీద ఆధారపడాల్సి వస్తుంది. అయితే అంతిమంగా ఎన్నుకునేది అన్నివిధాలా సరైన అభ్యర్థులనే.

అందుకే విద్యార్థులు ఈ సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా వీలైనంత ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూ ఎదుర్కోవడానికి సిద్ధమవ్వాలి!
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ మర్యాదలు చేసేవారికి మంచి మంచి ఉద్యోగాలు

‣ ఎస్‌ఈసీఎల్‌లో కొలువులు

‣ ప్రతిష్ఠాత్మక బిర్లా సంస్థల్లో ఇంజినీరింగ్‌!

‣ సొంతంగా నైపుణ్యాలకు మెరుగు!

Posted Date : 15-02-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌