• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సొంతంగా నైపుణ్యాలకు మెరుగు!

బీటెక్‌తో రూ.84.5 లక్షల ప్యాకేజీ సాధించిన విద్యార్థిని 

మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈ అమ్మాయి... తొలి నుంచి కష్టపడి చదువుకోవడాన్నే నమ్మింది.అలా చేస్తేనే తన కుటుంబానికి  పేరుతేగలనని అనుకుంది. దానికి తగ్గట్టుగానే మంచి మార్కులు సాధిస్తూ వచ్చింది. ఇప్పుడు చక్కని ప్యాకేజీతో ఇంజినీరింగ్‌ పూర్తికాకముందే ఉద్యోగం సంపాదించింది! తనే విశాఖపట్నానికి చెందిన రేవళ్ల ఈశ్వరి ప్రియ. ఇదెలా సాధ్యమైందో... ఇందుకు తను ఎలా కష్టపడిందో తన మాటల్లోనే... 

సొంతంగా నేర్చుకునేందుకు ప్రయత్నించాలి


బీటెక్‌తో 84.5 లక్షల ప్యాకేజీ సాధించిన ఆంధ్రాయూనివర్సిటీ విద్యార్థిని ఈశ్వరిప్రియ

మా నాన్న ఎలక్ట్రానిక్స్‌ విడిభాగాలు అమ్మే పని చేస్తుంటారు.  అమ్మ గృహిణి, వారికి నేను, అన్నయ్య పిల్లలం. ఒకటి నుంచి పదోతరగతి వరకూ స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదివాను. పదిలో 10 గ్రేడ్‌ పాయింట్లు వచ్చాయి. ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌లో నారాయణ కళాశాలలో చదివాను. అక్కడా 10 గ్రేడ్‌ పాయింట్లు సాధించాను. ఇంజినీరింగ్‌ చదవాలనే కోరికతో ఎంసెట్‌ రాశాను. తొలి ప్రయత్నంలోనే 823 ర్యాంకు వచ్చింది. వెయ్యి లోపు ర్యాంకు కావడంతో ఆంధ్రా యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ సీటు దొరికింది. అంత మంచి కాలేజీలో సీటు రావడంతో చాలా ఆనందంగా చేరాను. 

కరోనా కారణంగా...

అయితే మొదటి సంవత్సరం ఒక సెమిస్టర్‌ కాగానే కొవిడ్‌ కారణంగా కాలేజీ మూతపడి, ఆన్‌లైన్‌లోనే తరగతులకు హాజరుకావాల్సి వచ్చింది. అప్పటివరకూ అస్సలు అలవాటులేని పద్ధతి కావడంతో  మొదట్లో కొంచెం ఇబ్బందిపడ్డాను. కానీ ఆ సమయంలో నేనొక విషయం గమనించాను.  ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల చాలా సమయం మిగిలేది. రోజూ కాలేజీకి వెళ్లడం కోసం గబగబా తయారవ్వడం... బోలెడంతసేపు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం వంటివి లేకపోవడంతో ఆ సమయం మొత్తం మిగిలేది. దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు.. మా కాలేజీలో టెక్‌హబ్‌ తరఫున కోర్సెరాలో మాకు నచ్చిన కోర్సులు చేసేలా అవకాశం కల్పించారు. దాంతో కోడింగ్‌లో కొత్త కొత్త టెక్నిక్స్‌ నేర్చుకోవడం మొదలుపెట్టాను. యూసీ సాండియాగో కోడింగ్‌ అల్గారిథమ్‌ కోర్సు నాకు చాలా విషయాలు నేర్పించింది.  అది విద్యార్థులు తప్పక నేర్చుకోవాల్సిన కోర్సు అని చెప్పగలను. వీటితోపాటు యూట్యూబ్‌లో టేక్‌యూ ఫార్వర్డ్‌ అనే చానెల్‌ నాకు బాగా సాయపడింది. అందులో విద్యార్థులకు కావాల్సిన మొత్తం సమాచారం, టిప్స్, టెక్నిక్స్‌ వంటివి ఉంటాయి. దాన్ని చూస్తూ నన్ను నేను అప్‌డేట్‌ చేసుకున్నాను. హర్ష్‌ గోయల్‌ అనే యూట్యూబర్‌ను కూడా ఫాలో అయ్యేదాన్ని. జాబ్‌ ఓపెనింగ్స్‌ ఎక్కడ ఉన్నాయో వీరి ద్వారా వచ్చే సమాచారం బాగా ఉపయోగపడింది. ఎంత చదవాల్సి ఉన్నా... రోజుకు రెండు ప్రాబ్లమ్స్‌ అయినా కచ్చితంగా కోడ్‌ చేసేదాన్ని.


‣ ప్రస్తుతం నాకు ఉద్యోగావకాశం ఇచ్చిన కంపెనీ ఆస్ట్రేలియన్‌ సంస్థ. మన దేశంలో వారి శాఖ బెంగళూరులో ఉంది. అక్కడికి వెళ్లాలంటే వెళ్లొచ్చు, లేదా ఇంటివద్ద నుంచే పనిచేసే అవకాశం ఉంది. ఏడాదికి 84.5 లక్షల ప్యాకేజీ ఇస్తామన్నారు. ఇదికాక మోర్గన్‌ స్టాన్లీ అనే ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీలో కూడా ఉద్యోగం వచ్చింది. వారు ఏడాదికి 29.5 లక్షలు ఆఫర్‌ చేశారు. ప్రస్తుతం చెన్నైలో ఉంటూ అమెజాన్‌ సంస్థతో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నా. నెలకు 1.4 లక్షల స్టైపెండ్‌ లభిస్తోంది. ఇది పూర్తికాగానే, పరీక్షలు రాసేసి నచ్చిన ఉద్యోగంలో చేరతాను.


‣ ఇప్పుడు ఆర్థికమాంద్యం నేపథ్యంలో ఉద్యోగాలు రావడం చాలా కష్టమని అందరూ భయపడుతున్నారు. అయితే సరైన నైపుణ్యాలు మనవద్ద ఉంటే ఎలాంటి కష్టసమయంలో అయినా మంచి ఉద్యోగాలు వస్తాయి. చాలామంది బీటెక్‌ చదువుతున్నారు, కానీ అందరిలోకీ మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టేవి అదనంగా నేర్చుకున్న స్కిల్స్‌ మాత్రమే! అందుకే ఆ విషయంలో మాత్రం రాజీపడొద్దు. కోడింగ్‌ ఎంత ప్రాక్టీస్‌ చేస్తే... వచ్చే అవకాశాలు అంత బాగుంటాయి. అప్‌స్కిలింగ్‌ అనేది కచ్చితంగా ఉండాలి. అప్పుడే పోటీలో నిలబడగలం.


    ఇంజినీరింగ్‌ మొదటి మూడేళ్లు అలా తరగతులకు హాజరవుతూనే సొంతంగా నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు కొంత సమయం కేటాయిస్తూ వచ్చాను. దీనివల్ల చివరికొచ్చేసరికి నాతోటి వారికంటే కాస్త ఎక్కువ నేర్చుకునే అవకాశం కలిగింది. నాలుగో సంవత్సరం మొదలైననాటి నుంచి వివిధ ఇంటర్వ్యూలకు హాజరుకావడం ప్రారంభించాను. ఉత్తమ కంపెనీలను గుర్తించి దరఖాస్తు చేయడానికి నా మెంటర్‌ ప్రవీణ్‌ సాయం చేశారు. అదే కాదు, మొదటి నుంచి కూడా చదవాల్సిన పుస్తకాలు, నేర్చుకోవాల్సిన స్కిల్స్‌ విషయంలో ఆయన ఇచ్చిన తోడ్పాటు, మా యూనివర్సిటీ ప్రొఫెసర్ల సాయం ఎంతో ఉపయోగపడింది. వారి ప్రోత్సాహంతో సిస్టం డిజైనింగ్‌ కూడా నేర్చుకున్నాను.


   చాలామంది కోడింగ్‌ మొదట ఆసక్తిగా మొదలుపెడతారు. కానీ కష్టమైన సమ్స్‌ వచ్చేసరికి చేయలేక అక్కడితో ఆపేస్తుంటారు. నా స్నేహితుల్లో కొద్దిమందిని ఇలా చూశాను. కానీ అలా చేయడం వల్ల మనకు సబ్జెక్టు రాకుండా పోతుంది. కష్టమైనా మళ్లీ మళ్లీ సాధన చేసి సాల్వ్‌ చేయాలి, నేను అలాగే చేశాను.  ప్రతి విద్యార్థికీ ఒక మెంటర్‌ ఉండాలనేది నా అభిప్రాయం. అప్పుడే మనం సరైన దారిలో వెళ్తున్నామా లేదా అని తెలుసుకునేందుకు, సందేహాలు నివృత్తి చేసుకునేందుకు వీలు కలుగుతుంది.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రతిష్ఠాత్మక బిర్లా సంస్థల్లో ఇంజినీరింగ్‌!

‣ కోస్ట్‌గార్డు ఉద్యోగాల్లో చేర‌తారా?

‣ కోల్‌ఫీల్డ్స్ కొలువులు సిద్ధం!

‣ జీవితబీమాలో ఆఫీసర్‌ ఉద్యోగాలు

‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!

‣ నకిలీ వెబ్‌సైట్‌లతో జాగ్రత్త!

‣ అందరి అంచనాల ప్రకారం ఉండాలా?

‣ సొంత నోట్స్‌తో సక్సెస్‌!

Posted Date : 10-02-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌