• facebook
  • whatsapp
  • telegram

పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!

ఫుట్‌వేర్‌ డిజైన్‌ కోర్సులు

మన ప్రతి అడుగులోనూ అండగా నిలిచే పాదరక్షలు సౌకర్యంతోపాటు హుందాతనాన్నీ జోడిస్తాయి. చిన్న, పెద్ద... పేద, ధనిక అన్ని వయసులు, వర్గాల వారికీ సేవలు అందిస్తాయి. కోరుకున్న రీతుల్లో... సందర్భానికి తగ్గట్టుగా, ఆకర్షణీయంగా ఇవి రూపొంది, అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పాదరక్షల తయారీలో ఎందరో నిపుణుల సృజన, శ్రమ కీలకం. ఈ విభాగంలో సేవలందించడానికి కొన్ని ప్రత్యేక కోర్సులున్నాయి. వీటికోసమే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తోన్న ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీఐ) ఏర్పాటైంది. ఈ సంస్థకు హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 12 కేంద్రాలున్నాయి. ఇవన్నీ యూజీ, పీజీ స్థాయిలో కోర్సులు అందిస్తున్నాయి. ఆల్‌ ఇండియా స్కిల్‌ టెస్టు (ఏఐఎస్‌టీ)లో చూపిన ప్రతిభతో ప్రవేశం లభిస్తుంది. ఇటీవలే ఆ ప్రకటన వెలువడింది. 

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీఐ) 1986లో ఏర్పాటైంది. ఫుట్‌వేర్, ఫ్యాషన్, రిటైల్, లెదర్‌ యాక్సెసరీలు, లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తుల్లో అర్హులకు శిక్షణ నిర్వహించడం, నాణ్యమైన మానవ వనరులను పరిశ్రమలకు అందించడం, వాటిద్వారా మన్నికైన వస్తువులు రూపొందించి, ప్రపంచ మార్కెట్‌లో భారత్‌ వాటా పెరిగేలా చూడటం.. దీని లక్ష్యాలు. 2017లో ఇది జాతీయ ప్రాధాన్య సంస్థగా గుర్తింపు పొందింది. దీనికి.. హైదరాబాద్, నోయిడా, రోహ్‌తక్, కోల్‌కతా, ఫుర్సత్‌గంజ్, చెన్నై, జోధ్పూర్, చిండ్వారా, పట్నా, చండీగఢ్, గుణ, అంక్లేశ్వర్‌ల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. 

వీటిలో పాదరక్షలు, లెదర్‌ ఉత్పత్తుల తయారీ, వాటి విక్రయాలకు సంబంధించి బ్యాచిలర్, మాస్టర్‌ డిగ్రీలను అందిస్తున్నారు. యూజీ, పీజీల్లో అన్ని సంస్థల్లోనూ 2300 సీట్లు ఉన్నాయి. వీటికి 230 ఎన్‌ఆర్‌ఐ, ఇండస్ట్రీ స్పాన్సర్డ్‌ సీట్లు అదనం. వీటిలో ప్రవేశం ఏఐఎస్‌టీతో లభిస్తుంది. యూజీ, పీజీ కోర్సులకు ప్రత్యేకంగా పరీక్షలు ఉంటాయి. వీటిని ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఈ పరీక్షల స్కోరుతో కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లు నింపుతారు. 

ఇవీ ప్రత్యేకతలు 

పాద రక్షలు, తోలు ఉపకరణాలు, జీవన శైలి ఉత్పత్తులకు సంబంధించి ఉన్నత విద్య అందిస్తోన్న ప్రపంచ స్థాయి మేటి మూడు సంస్థలు/ విశ్వవిద్యాలయాల్లో ఎఫ్‌డీడీఐ ఒకటిగా గుర్తింపు పొందింది.

పాదరక్షల ఉత్పత్తిలో మన దేశం రెండో స్థానంలో దూసుకుపోతోంది. తోలు వస్త్రాల ఎగుమతుల్లో ద్వితీయ, తోలు ఉత్పత్తుల ఎగుమతుల్లో ఐదో స్థానం మనదే. దేశ జీడీపీలో ఫుట్‌వేర్‌ పరిశ్రమ 2 శాతం వాటాతో 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ విభాగం 2030 నాటికి 30 యూఎస్‌ బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా.

కోర్సులు... సీట్లు 

యూజీ

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌: ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌-760, లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ డిజైన్‌-180, ఫ్యాషన్‌ డిజైన్‌-700 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులను నాలుగేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. బీబీఏ: రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్చండైజ్‌-240 సీట్లు ఉన్నాయి. కోర్సు వ్యవధి మూడేళ్లు.  

అర్హత: బ్యాచిలర్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పీజీ

మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌: ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ 120 సీట్లు ఉన్నాయి. రెండేళ్ల వ్యవధితో దీన్ని అందిస్తున్నారు.   

అర్హత: ఫుట్‌వేర్‌/ లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ డిజైన్‌/ డిజైన్‌/ ఇంజినీరింగ్‌/ ప్రొడక్షన్‌/ టెక్నాలజీల్లో బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంబీఏ (రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్చెండైజ్‌)లో 300 సీట్లు ఉన్నాయి. కోర్సు వ్యవధి రెండేళ్లు.

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు, చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఏం నేర్పుతారంటే

కోర్సులో భాగంగా వివిధ పదార్థాలు, ఉత్పత్తులు ఉపయోగించి పాదరక్షలు, తోలు ఉత్పత్తులు, జీవనశైలి ఉపకÛరణాలు ఎలా తయారు చేయాలో నేర్పిస్తారు. యంత్రాల సాయంతో వాటిని డిజైన్‌ చేయిస్తారు. వినియోగదారుల అవసరాలపై అవగాహన కల్పించి, అందుకు అనుగుణంగా ఉత్పత్తులు సృష్టించడంపై దృష్టి సారిస్తారు. వీటితోపాటు రిటైల్‌ మేనేజ్‌మెంట్, కన్జూమర్‌ బిహేవియర్, రిటైల్‌ కమ్యూనికేషన్, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్, రిటైల్‌ ఆపరేషన్, మార్కెటింగ్, బ్రాండ్‌ మేనేజ్‌మెంట్, సేల్స్‌ మేనేజ్‌మెంట్, బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌... తదితర అంశాల్లో అవగాహన కల్పిస్తారు.  

పరీక్ష ఇలా 

యూజీ, పీజీ పరీక్షలను ఆఫ్‌లైన్‌లోనే విడిగా నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ఒక్కో పరీక్ష వ్యవధి 3 గంటలు.

యూజీ: 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. 4 సెక్షన్ల నుంచి మొత్తం 150 ప్రశ్నలు వస్తాయి. మొదటి సెక్షన్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 25 ప్రశ్నలు అడుగుతారు. రెండో సెక్షన్‌లో కాంప్రహెన్షన్‌ నుంచి 10, గ్రామర్‌ యూసేజ్‌...తదితరాల నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. మూడో సెక్షన్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో 35 ప్రశ్నలు వస్తాయి. నాలుగో సెక్షన్‌లో బిజినెస్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 25, డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. మొదటి మూడు సెక్షన్లలో ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. చివరి సెక్షన్‌లో ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. 

పీజీ: ఈ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో 4 సెక్షÛన్ల నుంచి 175 ప్రశ్నలు వస్తాయి. వీటికి 200 మార్కులు కేటాయించారు. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 25 ప్రశ్నలు 50 మార్కులకు, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ ఎనలిటికల్‌ ఎబిలిటీ 50 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరంట్‌ అఫైర్స్‌ 50 ప్రశ్నలు 50 మార్కులు, మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు, ఎనలిటికల్‌ ఎబిలిటీ 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి.

పాత ప్రశ్నపత్రాలు గమనించి, సన్నద్ధమైతే ఈ పరీక్షను సులువుగానే ఎదుర్కోవచ్చు. ప్రశ్నలు మరీ అంత కఠినంగా ఉండవు. పోటీ పరిమితమే. అందువల్ల ఈ కోర్సులపై ఆసక్తి ఉన్నవారు మాదిరిగా శ్రమిస్తే చాలు సీటు పొందడం తేలికే. మొదట ఏర్పాటైన నోయిడా క్యాంపస్‌కు అభ్యర్థులు తొలి ప్రాధాన్యమిస్తున్నారు. 

అవకాశాలిక్కడ...

ఎఫ్‌డీడీఐ సంస్థల్లో డిజైన్‌ కోర్సులు పూర్తిచేసినవారికి ఎక్కువగా పాదరక్షలు, దుస్తులు, లెదర్‌ ఉత్పత్తులు తయారు చేసే సంస్థల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. 

బీబీఏ, ఎంబీఏతో... ఏరియా మేనేజర్, ఫ్లోర్‌ మేనేజర్, స్టోర్‌ మేనేజర్, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ మొదలైన హోదాలతో పాదరక్షలు, తోలు ఉపకరణాలు విక్రయించే సంస్థలు, రిటైల్‌ చెయిన్లలో ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయి.

విస్తృత అవకాశాలు కార్పొరేట్‌ రిటైల్‌ దుకాణాల్లో లభిస్తాయి. 

ఫుట్‌వేర్‌ డిజైన్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి... పాదరక్షల తయారీ విభాగంలోని ఉద్యోగాలతోపాటు పాదరక్షలు విక్రయించే కొలువులూ దక్కుతాయి. 

అడిడాస్, యాక్షన్, బాటా, ప్యూమా, ఫ్యూచర్‌ గ్రూప్, గ్లోబస్, ఖాదిమ్స్, లైఫ్‌స్టైల్, ల్యాండ్‌మార్క్, మ్యాక్స్, రీబక్, లిబర్టీ, రిలయన్స్‌ రిటైల్, వెస్ట్‌సైడ్, ఉడ్‌ల్యాండ్, వీకేసీ, షాపర్స్‌ స్టాప్, ప్యాంటలూన్స్, ... మొదలైన సంస్థలు క్యాంపస్‌ నియామకాల ద్వారా ఎఫ్‌డీడీఐ విద్యార్థులకు ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగాలు అందిస్తున్నాయి.  

ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సులు చదివినవారు కాస్ట్యూమ్‌ డిజైనర్, ఫ్యాషన్‌ కన్సల్టెంట్, పర్సనల్‌ స్టైలిస్ట్, ఫ్యాషన్‌ మర్చండైజర్, ఫ్రీలాన్స్‌ డిజైనర్‌... తదితర హోదాలతో రాణించవచ్చు. కార్పొరేట్‌ దుస్తుల తయారీ కంపెనీల్లో అవకాశాలు లభిస్తాయి.  

ముఖ్య సమాచారం...

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 30

దరఖాస్తు ధర: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.300. మిగిలిన అందరికీ రూ.600.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.

పరీక్ష తేదీ: జూన్‌ 18

వెబ్‌సైట్‌: https://fddiindia.com/
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ నకిలీ వెబ్‌సైట్‌లతో జాగ్రత్త!

‣ అందరి అంచనాల ప్రకారం ఉండాలా?

‣ సొంత నోట్స్‌తో సక్సెస్‌!

‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!

‣ నవతరం బాలలకు నవోదయ స్వాగతం

‣ ఇష్టపడి చదివితే చాలు!

Posted Date: 11-01-2023


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌