• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అందరి అంచనాల ప్రకారం ఉండాలా?

అంచనాలు... విద్యార్థుల జీవితంలో ఇవి భాగం. తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల, బంధుమిత్రుల అంచనాలు అందుకోవడం కోసం మనం చాలా కష్టపడుతుంటాం. ఇవి మన స్థాయికి మించినవి అయితే మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. అలాంటప్పుడు వీటిని అందుకోవాలా? అక్కర్లేదా? అసలు ఈ అంచనాలను ఎలా ఎదుర్కోవాలి?

అన్నింటికంటే ముందు... మనం ఇప్పుడున్న స్థితి బాగానే ఉందనే ఆత్మస్థైర్యంతో ఉండాలి. నిరంతరం అసంతృప్తిలో కూరుకుపోవడం మంచిది కాదు. అది మన ఎదుగుదలపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. 

సాధారణ విద్యార్థుల విషయమే మాట్లాడుకుంటే... చుట్టూ ఉన్నవారి అంచనాలకు, వారి శక్తిసామర్థ్యాలకు మధ్య ఎంతోకొంత వ్యత్యాసం అనేది ఉండకమానదు. టాపర్స్‌ తప్పిస్తే ఇది అందరి విషయంలోనూ జరిగేదే. అందువల్ల కంగారు, ఒత్తిడి అనవసరం. వాటి మధ్య బ్యాలెన్స్‌ తీసుకురావడానికి వీలైనంతగా ప్రయత్నించాలి అంతే. 

తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అంతిమంగా కోరుకునేది మన మంచినే. వారికంటే ఉన్నతంగా మనం ఉండాలనే భావిస్తారు. వారి ఆలోచనాధోరణి నుంచే అంచనాలు సృష్టించుకుంటారు. అయితే అది మన ఆశలు, ఆశయాలకు భిన్నంగా ఉన్నప్పుడు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాం అనేది ముఖ్యం. 

కూర్చుని మాట్లాడుకుంటే యుద్ధాలు సైతం ఆగుతాయి అంటారు. అటువంటిది మన కుటుంబంలో పరిస్థితులు ఎంత? వారి అంచనాలకు భిన్నంగా మనం ఉన్నప్పుడు కాస్త ఇబ్బందికర వాతావరణం తలెత్తడం సహజం. కానీ మనం ఏం కావాలి అనుకుంటున్నాం, ఎలా చేయాలి అనుకుంటున్నాం అనేది చెప్పే విధంగా సావధానంగా చెబితే వినేందుకు ఎదుటివారు సిద్ధపడతారు. ఇందుకోసం మన కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై దృష్టిపెట్టడం అవసరం. 

అదే విధంగా మనపై మనకున్న అంచనాలు ఏంటనేది కూడా తెలుసుకోవాలి. అవి వాస్తవానికి వీలైనంత దగ్గరగా ఉండాలి. ఇది గుర్తించేందుకు కొంత ప్రయత్నం, శ్రమ అవసరం. మనకు అంతిమంగా సంతోషాన్ని కలిగించేవి ఇవే. అందుకే వాటికి కొంత సమయం కేటాయించడం అవసరం.

కొన్నిసార్లు మనం ఏం చేసినా ఎదుటివారు సంతోషించకపోవచ్చు. అటువంటప్పుడు ఆ విషయాన్ని వదిలేసి... మిగతా చోట్ల మనం వారితో ఏ విధంగా సంతోషంగా ఉండగలమో ఆలోచించాలి. ఏదో ఒక విషయంలో మనతో ఏకీభవిస్తారు కదా!

చివరిగా... కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న అంచనాలే మన లక్ష్యాలుగా మారొచ్చు. వాటిని అందుకోవడం మనకు ఆనందాన్ని కలిగించవచ్చు! అందువల్ల వాటిని పూర్తిగా ప్రతికూల దృక్పథంతో చూడాల్సిన పనిలేదు. హ్యాండిల్‌ చేయడం సాధన చేస్తే చాలు!
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ బోధన, పరిశోధన రంగాల్లోకి రహదారి!

‣ నవతరం బాలలకు నవోదయ స్వాగతం

‣ ఇష్టపడి చదివితే చాలు!

‣ మళ్లీ మళ్లీ చదవండి!

‣ చెత్తను వదిలించే చక్కటి ఉద్యోగం!

‣ గ్రూప్‌-2కి సమగ్ర సన్నద్ధత ఎలా?

‣ రివిజన్‌..ప్రాక్టీస్‌.. సక్సెస్‌ సూత్రాలు!

Posted Date : 11-01-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌