• facebook
  • twitter
  • whatsapp
  • telegram

చెత్తను వదిలించే చక్కటి ఉద్యోగం!

వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో కోర్సులు, ఉద్యోగాలు

ఈ భూమిపై ఉన్న ప్రజల సంఖ్య 8 బిలియన్లు. ఒకరోజు గడిచి మరో రోజు మొదలైతే పేరుకునే చెత్త కోట్లకొద్దీ టన్నులు. ఇందులో ఒక్క వంతు మాత్రమే రీసైకిల్‌ చేయగలిగే అవకాశం ఉన్న వ్యర్థాలు. మరి మిగతా వాటి పరిస్థితి ఏంటి? వాటిని ఎలా మేనేజ్‌ చేయాలి? పర్యావరణ హితంగా చెత్తను ఎలా వదిలించుకోవాలి... ఇదంతా చాలా పెద్ద సబ్జెక్ట్‌. అందుకే ఇందులో నిపుణులకు చక్కని కెరియర్‌ అవకాశాలు ఉన్నాయి.


మన దేశం గురించి మాట్లాడుకుంటే... ఏటా టన్నుల చెత్తను పర్యావరణానికి హాని కలగని విధంగా ప్రాసెస్‌ చేయాల్సి వస్తుంది. కాలుష్యాన్ని కలిగించని విధంగా వాటిని మార్చడం, నేల, నీటిలోకి పంపడం, విషవాయువులు జనించకుండా జాగ్రత్తపడటం.. ఇలా చాలా పనులుంటాయి. వీటన్నింటినీ సంబంధిత నిపుణులు జాగ్రత్తగా నిర్వహిస్తుంటారు. ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, సామాజిక బాధ్యత కూడా.  ఈ కెరియర్‌ గురించి మరిన్ని అంశాలు    పరిశీలిస్తే..


చెత్త తయారైనప్పటి నుంచి దాని చివరి డిస్పోజల్‌ వరకూ ఉండే ప్రక్రియను ‘చెత్త నిర్వహణ’ అంటున్నాం. ఇందులో వ్యర్థాలను సేకరించడం, రవాణా, ప్రాసెస్‌ చేయడం, అంతిమంగా పారబోయడం వంటి పనులుంటాయి. వివిధ రకాల పరిశ్రమలు, మానవ సంబంధిత కారణాలతో తయారైన చెత్త అంతటికీ ఇదే సూత్రం వర్తిస్తుంది. గతంలో కంటే ఇప్పుడు భారత్‌లో ఎన్నడూ లేనంతగా చెత్త నిర్వహణకు డిమాండ్‌ పెరిగింది. కనీస డిగ్రీ పొందిన తర్వాత ఇందులో కెరియర్‌ను ఆశించవచ్చు. ఇంటర్‌ స్థాయిలో కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ సబ్జెక్టులు చదువుకున్నవారు ఇందులో ప్రవేశించే అవకాశం ఉంటుంది.


 

అందుబాటులో ఉన్న కోర్సులు..


డిగ్రీ, పీజీ స్థాయిలో దీనికి సంబంధించిన కోర్సులు నేర్చుకునే అవకాశం ఉంది. వేస్ట్‌ అండ్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, ఎయిర్‌ పొల్యూషన్‌ అండ్‌ కంట్రోల్, ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ (వేస్ట్, ఎనర్జీ, వాటర్, ఆయిల్, గ్యాస్‌), ఎన్విరాన్‌మెంటల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ వంటి కోర్సులు బీఎస్సీగా చదివేందుకు అందుబాటులో ఉన్నాయి. అంతకుమించి పీజీ చేయదలచిన వారు వేస్ట్‌ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ... వీటిలో ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. ఆ తర్వాత ముందు చెప్పిన స్పెషలైజేషన్లతో ఎమ్మెస్సీ చేసే అవకాశం ఉంది. ఇవేకాక బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, ఈ-వేస్ట్‌ మేనేజ్‌మెంట్, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి పలు కోర్సులు కూడా చేయొచ్చు. ఆన్‌లైన్‌లో స్వల్పకాల వ్యవధితో రకరకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి.


 

వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కెరియర్‌


ఈ కోర్సులు పూర్తిచేసినవారు వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీసర్‌గా కెరియర్‌ను ప్రారంభించవచ్చు. మన దేశంలో ఇప్పటికే ఈ-వేస్ట్, జీరో వేస్ట్, సాలిడ్‌ వేస్ట్, రీసైక్లింగ్, పేపర్‌ వేస్ట్, బయో వేస్ట్, వేస్ట్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ కంపెనీలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం తరఫునా ఇందుకు సంబంధించి కార్యక్రమాలు, రిక్రూట్‌మెంట్లు జరుగుతూ ఉంటాయి. ఆసక్తి ఉన్న చోట ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు. 


ఈ ఉద్యోగం చేయడానికి పర్యావరణం మీద ప్రేమ మాత్రమే కాదు... సైన్స్‌పై పట్టు కూడా అవసరం. మానవ ఆరోగ్యాన్ని, వచ్చే తరాల భవిష్యత్తును కాపాడే ఉన్నతమైన ఆదర్శం కలిగిన ఈ కెరియర్‌.. లాభదాయకంగానూ సంతృప్తికరంగానూ ఉంటుందన్న మాటలో ఎంతమాత్రం ఆశ్చర్యం లేదు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూప్‌-2కి సమగ్ర సన్నద్ధత ఎలా?

‣ నిరంతరం నైపుణ్యాలకు నగిషీ!

‣ ఆన్‌లైన్‌లో చదివే విధానం ఏమిటంటే?

‣ 50,000 మందికి స్కాలర్‌షిప్‌లు!

‣ ఈ నైపుణ్యాల్లో మీకెంత పట్టు?

‣ ఇలా కాలాన్ని సద్వినియోగం చేసుకోండి!

Posted Date : 07-01-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.