• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఈ నైపుణ్యాల్లో మీకెంత పట్టు?

ఇంజినీరింగ్‌ ఉద్యోగార్థులకు నిపుణుల సూచనలు

సాంకేతికంగా, పారిశ్రామికంగా వేగంగా అమల్లోకి వస్తున్న ఆధునికత ఫలితంగా ఇంజినీరింగ్‌ ఉద్యోగాలకు కావాల్సిన విషయ పరిజ్ఞానం, సామర్థ్యాల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఈ పరిణామాలను అవగాహన చేసుకుని, కాలానుగుణమైన సాంకేతిక నైపుణ్యాలనూ, సాఫ్ట్‌ స్కిల్స్‌నూ పెంపొందించుకోవటం విద్యార్థులకు తప్పనిసరి!   

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నాలుగో పారిశ్రామిక విప్లవం (4 IR) జరుగుతోంది. దీని ప్రస్తావన 2016లోనే మొదలైనప్పటికీ ఇప్పుడు దీన్ని విరివిగా వాడుతున్నారు. కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, టీవీలు, కార్లు, విమానాలు, రైళ్లు... మరేవైనా మెకానికల్‌ మెషిన్లతోనే తయారవుతున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), రోబోటిక్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌), ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), త్రీడీ ప్రింటింగ్, బిగ్‌ డేటా ఎనలిటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, డిజిటల్‌ ట్విన్సు అనుసంధానంతో ఉత్పత్తి రంగంలో పెనుమార్పులు వస్తున్నాయి. ప్రత్యేక సాంకేతిక అంశాల్లో ఆసక్తి ఉన్నవాటిని ఎంచుకుని విద్యార్థులు తగిన శిక్షణ, సాధనతో ప్రావీణ్యం సంపాదిస్తే వారి భవితకు ఢోకా ఉండదు. 

ఇవీ ముఖ్యమే

అత్యుత్తమ ఉద్యోగాలు సాధించటం లక్ష్యంగా ఉన్న విద్యార్థులు సాంకేతిక అంశాలతో బాటు సాంకేతికేతర నైపుణ్యాలనూ (Soft skills) పెంపొందించుకోవాలి. వాటిలో ముఖ్యమైనవి.

క్లిష్టమైన సమస్యల పరిష్కారం (Complex problem solving): తనకున్న పరిజ్ఞానంతో క్లిష్టమైన సమస్యలకు తేలికపాటి పరిష్కారాలు చూపించడం

విమర్శనాత్మక ఆలోచన (Critical thinking): క్రమశిక్షణతో కూడిన విమర్శనాత్మక ఆలోచనతో, ఏదైనా ఆమోదించే మనసుతో పరిష్కారాలకు అనుగుణంగా ఉండడం.

సృజనాత్మకత (Creativity): యాదృచ్ఛికంగా వచ్చే ఆలోచనలను పొందుపరచి ఉపయోగపడే పరిష్కారాన్ని అన్వేషించడం.

నిర్వహణ నైపుణ్యం

ఇతరులతో సమన్వయంతో పనిచేయడం

ఇతరులను అర్థం చేసుకొని, వారిని అంచనా వేయగల శక్తి

నిర్ణయం: ఉన్న సమాచారాన్ని విశ్లేషించి అంచనాకు వచ్చి నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోవడం.

సేవా దృక్పథం

ఎవరితోనైనా చర్చలు జరపగల సామర్థ్యం

ఉద్యోగావకాశాలు కోరే ప్రతి విద్యార్థీ తమ బ్రాంచి విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలతో పాటు పై అంశాల్లోనూ పట్టు సాధించటం అవసరం.  

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ - కృత్రిమ మేథ)

మానవ మేధను కంప్యూటర్‌ మేధ సంతరించుకుంటోంది. కంప్యూటరుకు ఉన్న జ్ఞాపకశక్తి, లెక్కవేసే శక్తి, వేగం వల్ల ఏఐ చాలా ప్రాధాన్యం సంతరించుకొంది. కంప్యూటర్‌ తన దగ్గరున్న డేటాలోంచి గణాంక విశ్లేషణ కోసం ప్రత్యేకమైన అల్గారిధంతో విశ్లేషించి అర్థం చేసుకొని ఒక నిర్ణయానికి వస్తుంది. ఏఐని కింది విషయాలలో విరివిగా ఉపయోగిస్తున్నారు.

జీపీఎస్‌:  భూమి, ఆకాశం, సముద్రం లేక విశ్వంలో ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసుకుని గమ్యస్థానం చేరడానికీ, నిజ సమయంలో కదలికల వేగాన్ని కనిపెట్టడానికీ ఈ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ ఉపయోగంలో ఉంది.

వ్యక్తుల గుర్తింపు: ముఖచిత్రం/ వేలిముద్రల ద్వారా వ్యక్తుల గుర్తింపు.

సరిచేయడం:  మనం రాసిన దానిలో తప్పులు సరిదిద్దడం.

రోబోలు: కృత్రిమ మేథ ద్వారా రియల్‌ టైమ్‌లో దారిలో ఉన్న అడ్డంకులను గమనించి, దారి మళ్లి గమ్యాన్ని చేరుకోవడం, పరిశ్రమలు, గిడ్డంగులు, ఆసుపత్రి, పెద్ద వైశాల్యాన్ని శుభ్రపరచడం వంటి వాటిల్లో ఉపయోగంలో ఉన్నాయి.

స్వయంప్రతిపత్తి వాహనాలు: కార్ల ఉత్పత్తి పరిశ్రమలు  స్వయం ప్రతిపత్తి (అటానమస్‌) వాహనాల్లో మనిషిలాగే అడ్డంకులు గమనించే చోదనకు ఏఐను వాడుతున్నాయి.

ఆరోగ్య సంరక్షణ: విభిన్నరకాల ఆరోగ్య సంరక్షణ, సెల్‌ పరీక్షల ద్వారా క్యాన్సరు ప్రథమ దశలో కనుగొనడం, ల్యాబ్‌ టెస్ట్, పాత వైద్య సమాచారం, వైద్య మేధను అన్వయించి కొత్త మందులు కనుక్కోవడంలో ఏఐ ఎంతో ఉపయోగపడుతోంది.

వ్యవసాయం: పరీక్షల ద్వారా భూమిలో పోషక విలువలు గుర్తించడం, డ్రోన్‌ ఫొటోల ద్వారా తెగుళ్లు కనుగొనడం, సరైన క్రిమిసంహారక మందుల సలహాలకు ఉయోగంలో ఉంది.

సోషల్‌ మీడియా: ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విటర్‌ లాంటి వేదికలు, వివిధ భాషా తర్జుమాలుు, మోసాల గుర్తింపు, విద్వేష సందేశాలను గుర్తించి తీసివేయడానికి ఏఐ ఉపయోగపడుతోంది.

మార్కెటింగ్‌: వ్యక్తిగత ఇష్టాయిష్టాలను శాస్త్రబద్ధంగా విశ్లేషించి కొనుగోలుదారుల మనస్తత్వానికి అనుగుణంగా ప్రకటనలు తయారుచేసి అమ్మకాలు పెంచుకోవడానికి ఏఐ సహాయ పడుతోంది.

ఫైనాన్స్‌: పరిశ్రమలు, వినియోగదారులు ద్రవ్య నిధులు ఎలా ఉపయోగిస్తున్నారో ఏఐ గ్రహిస్తూ విశ్లేషణతో సరైన పంథాలో ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతోంది.

ఈ-కామర్స్‌: కొనుగోలుదారుల ఇష్టాలు, ప్రాధాన్యాలను గుర్తించి అందుకు అనుగుణంగా వ్యాపారాభివృద్ధికి ఏఐ ఉపయోగపడుతోంది.

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ)

మేథతో కూడిన తయారీ పరిశ్రమలు, నగరాలు, విద్యుత్‌ సరఫరా లైన్లు, అంచనాతో కూడిన ఉత్పత్తి (ప్రొడక్షన్‌), నివారణ (ప్రివెన్షన్‌), వస్తువులను రవాణా చేసే వాణిజ్య కార్యకలాపాల్లో ఐవోటీ ఎంతగానో ఉపయోగపడుతోంది. సెన్సార్లు, ప్రాసెసింగ్‌ సామర్థ్యం, సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి ఇంటర్‌నెట్‌లో సమాచార మార్పిడిని ఐవోటీ అంటారు. ఇది భౌతిక వస్తువులు, సాధారణ ఇంటి పరికరాల నుంచి పారిశ్రామిక ఉపకరణాలు (టూల్స్‌) వరకు ఉండవచ్చు.

బిగ్‌ డేటా ఎనలిటిక్స్‌ 

పెద్దఎత్తున సమాచారం సేకరించి, విశ్లేషించి అనేక అంతర్గత విషయాలను కనుగొనే ప్రక్రియనే బిగ్‌ డేటా ఎనలిటిక్స్‌ అంటారు. దీన్ని ఆరోగ్య సంరక్షణ, వస్తు తయారీ, బ్యాంకింగ్, వ్యవసాయ విషయాలు, వాతావరణ సూచన మొదలైన వాటిలో విరివిగా వాడుతున్నారు.

సైబర్‌ సెక్యూరిటీ 

కంప్యూటర్లు, సర్వర్లు, మొబైల్‌ పరికరాలు, ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలు, సమాచారాలను హానికరమైన దాడుల నుంచి సంరక్షించడం సైబర్‌ సెక్యూరిటీ. బ్యాక్‌ అప్‌ ప్రణాళిక, అనుమానిత కార్యకలాపాల విశ్లేషణ, శిక్షణ ఉల్లంఘనలను తెలియజేయడం, రక్షణకు ముందు జాగ్రత్తలపై సంస్థలోని అందరికీ తర్ఫీదు ఇవ్వడం... ఈ సెక్యూరిటీ నిపుణుల విధి. 

క్లౌడ్‌ కంప్యూటింగ్‌ 

మనకు అవసరమైనప్పుడు సమాచార నిల్వ (డేటా స్టోరేజ్‌), కంప్యూటరు శక్తిని, సాఫ్ట్‌వేర్‌నూ బయట సంస్థల నుంచి ఉపయోగించడాన్ని క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అంటారు. దీనికి అవసరమైన సమాచార వ్యవస్థ, రక్షణ వ్యవస్థ రూపొందించుకోవడం దీనిలోని భాగం.

డిజిటల్‌ ట్విన్స్‌

కంప్యూటర్ల మీద భౌతిక వస్తువు, వ్యవస్థ, ప్రతులను దాదాపు సమానంగా పనిచేసేట్టు సృష్టించడాన్ని డిజిటల్‌ ట్విన్స్‌ అంటారు. ఇది వస్తు, యంత్ర ఉత్పత్తి పరిశ్రమలు, నగర ప్రణాళిక, నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ, ఆటోమొబైల్‌ పరిశ్రమల్లో ఉపయోగంలో ఉంది.

ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ 

ఏఆర్‌లో వాస్తవ ప్రపంచంలో ఉన్న పరిసరాలకు కంప్యూటర్ల సృష్టి అంశాలను చేరుస్తారు. ఉదాహరణకు అడవిని కెమెరాతో చిత్రీకరించి, కంప్యూటరులో పులి కదలికలు సృష్టించి, రెండిటినీ కలిపి పులి అడవిలో తిరుగుతున్న అనుభూతి కలిగించడం. వీఆర్‌లో వాస్తవ ప్రపంచ పరిసరాలను పూర్తిగా కంప్యూటరులో అనుకరించి, అందులో లీనమయ్యే అనుభూతి కలిగిస్తారు. దీన్ని ఆర్కిటెక్టులు,  కార్ల రూపకర్తలు ఉపయోగిస్తున్నారు. పైలట్, అగ్నిమాపక దళాల శిక్షణలోనూ వాడుతున్నారు.

పైన చెప్పిన ప్రత్యేక అంశాల్లో విద్యార్థులు తమ ఆసక్తులను బట్టి సబ్జెక్టును ఎంచుకుని, దానిలో పరిజ్ఞానం, కంప్యూటరుతో చేయగల నైపుణ్యం సంపాదిస్తే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి.

రోబోటిక్స్‌ 

దీనికి మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్‌ సైన్సుకు సంబంధించిన విజ్ఞానం అవసరం. ఇవి సాంప్రదాయికంగా మానవులు చేసే పనిని చేస్తున్నాయి. అవసరాలకు అనుగుణంగా రూపకల్పన, నిర్మాణం, సాఫ్ట్‌వేర్‌తో ఉపయోగంలో పెడతారు. వస్తు, యంత్ర తయారీ పరిశ్రమలో, శస్త్ర చికిత్సల్లో, శుభ్రపరిచే పనుల్లో, రక్షణ రంగాల్లో రోబోట్లను విరివిగా వాడుతున్నారు. ముఖ్యంగా మానవులకు అపాయకరమైన పనుల్లో ఇవి ఉపయోగంలో ఉన్నాయి.

త్రీడీ ముద్రణ

మామూలుగా అక్షర, చిత్ర ముద్రణ కాగితంమీద జరుగుతుంది. పేపరుకు పొడవు, వెడల్పు రెండు దిశలు. ఏదైరా వస్తువు ఎత్తు కూడా చేర్చితే మూడు దిశలు (త్రీడీ). ఈ మూడు దిశల ముద్రణే త్రీడీ ప్రింటింగ్‌. టూడీ సరళీకరణ చేసిన వైశాల్యంలో ఏదైనా పదార్థాన్ని కొద్దిపాటి మందంతో సంకలితం చేయగలిగితే, దానికి కొంత ఎత్తు వస్తుంది. ఈ వస్తు తయారీ విధానం త్రీడీ ముద్రణ. దీన్ని ఇటీవలికాలంలో క్లిష్టమైన ఆకృతుల తయారీకి ఉపయోగిస్తున్నారు. త్రీడీ ప్రింటింగులో ఏదైనా పదార్థాన్ని (లోహాలు లేదా ప్లాస్టిక్‌) పొరలు, పొరలుగా ఒకదాని మీద మరొకటి కట్టుకుంటూ పోతూ కావలసిన ఆకృతులు తయారు చేయవచ్చు. ఈ పొరలు కరిగి మరల గట్టిపడటం ద్వారా ఏకమై మనకు కావలసిన ఎత్తులో, ఆకృతిలో వస్తు నిర్మాణం జరుగుతుంది. ఇది క్లిష్ట ఆకృతులకు సులభతరమైన, వేగవంతమైన తయారీ విధానం. వస్తువుల తయారీలో పదార్థాలు వ్యర్థం కావు. ఇది తేలికపాటి వస్తు నిర్మాణంలో బాగా ఉపయోగంలో ఉంది. ఈ మధ్యలో కాంక్రీటు భవన నిర్మాణానికీ వాడుతున్నారు.


 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇలా కాలాన్ని సద్వినియోగం చేసుకోండి!

‣ డిగ్రీతో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు

‣ మెయిన్‌లో విజయానికి మెలకువలు

‣ స్టడీ నోట్స్‌.. రెడీ రివిజన్‌!

Posted Date : 03-01-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌