• facebook
  • twitter
  • whatsapp
  • telegram

స్టడీ నోట్స్‌.. రెడీ రివిజన్‌!

రాసుకుంటే పునశ్చరణ సులభం!

పాఠాలను సులువుగా ఆకళింపు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీంట్లోని అంశాలను పరీక్షల ముందు ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. మంచి మార్కుల సాధనకు సోపానం లాంటిదే... స్టడీ నోట్సు.

అధ్యాపకులు చెప్పే పాఠాలను విద్యార్థులు శ్రద్ధగా వింటారు. పాఠ్యపుస్తకాలనూ చదువుతారు. అవసరమైన కొంత సమాచారాన్ని అంతర్జాలం నుంచీ సేకరిస్తారు. వీటితోపాటుగా ముఖ్యాంశాలను స్టడీనోట్సులో రాసుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దీన్ని ఎలా రాస్తే ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుందో చూద్దాం. 

కొంతమంది విద్యార్థులు పేపర్ల మీద ముఖ్యాంశాలను రాసుకుంటారు. విడిపేపర్ల మీద రాసుకోవడం వల్ల సమయానికి అవి కనిపించకపోవచ్చు. ఒకవేళ ఇలా రాసుకున్నట్లయితే పేపర్ల మీద నంబర్లు వేసి వాటిని ఫోల్డర్‌లో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. చదువుకున్న తర్వాత వాటిని మళ్లీ అదే క్రమంలో పెట్టుకుంటే సరిపోతుంది. లేదా కొన్ని పేపర్లకు పిన్నులు కొట్టుకున్నా నోట్‌ పుస్తకంలా ఉంటుంది. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిచ్చెనలా ఉపయోగపడే వీటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. 

అర్థం చేసుకుంటూ... 

నోట్సు మీ దగ్గరే ఉంటుంది కాబట్టి దాన్ని ఇష్టమొచ్చినట్టుగా రాసేయకూడదు. గజిబిజిగా రాసేస్తే కొంతకాలం తర్వాత.. మీరేం రాశారో మీకే అర్థంకాకపోవచ్చు. కాబట్టి కొట్టివేతలు, దిద్దడాలు లేకుండా వీలైనంత చక్కగా రాసుకోవాలి. స్పష్టంగా రాయకపోతే దాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. లెక్చరర్లు చెప్పిందీ, పాఠ్యపుస్తకంలోని అంశాలు, ఇంకా ఇతర వనరుల నుంచి వచ్చిన సమాచారాన్ని సాధారణంగా ఇందులో రాస్తారు. కాబట్టి ఇందులోని అంశాలను చదివితే సరిపోతుంది. పదేపదే పాఠ్య పుస్తకాలను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. దీని మీద నిరభ్యంతరంగా మీరు ఆధారపడొచ్చు. అవసరమైతే తగిన మార్పులూ, చేర్పులూ చేసుకోవచ్చు. ఒక అంశాన్ని నోట్సులో రాసే క్రమంలోనే నేర్చుకోవచ్చు కూడా. ముఖ్యాంశాలను పాయింట్ల రూపంలో రాస్తున్నప్పుడే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఆ సమాచారంపైన దృష్టిని నిలిపి రాస్తే మెదడులో నిక్షిప్తమవుతుంది. దాంతో ఆ అంశాన్ని పదేపదే చదవాల్సిన పని ఉండదు. కాబట్టి సమయమూ వృథా కాదు. 

సమాచారాన్ని సేకరించడం 

అధ్యాపకులు బోధించినవాటిలో ముఖ్యాంశాలను సేకరించి విద్యార్థులు సాధారణంగా నోట్సును తయారుచేస్తుంటారు. అధ్యాపకులు సాధారణంగా ఎంతో పరిజ్ఞానం, బోధనలో ఎన్నో ఏళ్ల అనుభవాన్నీ గడించి ఉంటారు. వీరంతా బోధన కోసం ఒక్క పాఠ్యపుస్తకాల మీదే ఆధారపడరు. వివిధ పుస్తకాలను చదివి.. అదనపు సమాచారాన్ని సేకరించి బోధిస్తారు. అలాంటి పాఠాల్లోని ముఖ్యాంశాలను నోట్సులో రాసి భద్రపరుచుకోవడం వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి పాఠం చెప్పడం మొదలుపెట్టకముందే నోటు పుస్తకం, పెన్నుతో సిద్ధంగా ఉండాలి. ఏకాగ్రతతో విన్నప్పుడే అందులోని ముఖ్యాంశాలను గుర్తించి వెంటనే రాయగలుగుతారు. సాంకేతిక పదాలు, నిర్వచనాలు ఉంటే... వాటిని ఎంతో జాగ్రత్తగా విని, రాయాలి. కొన్నిసార్లు పాఠ్యాంశంలోని ముఖ్య సమాచారాన్ని రాసుకోమని అధ్యాపకులూ చెబుతుంటారు. అవి పాఠ్యపుస్తకాల్లోనూ అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏమాత్రం ఆలస్యం, అశ్రద్ధ చేయకుండా వెంటనే స్టడీనోట్సులో రాసుకోవాలి. 

ఉదాహరణలతో...

పాఠ్యపుస్తకంలోని పాఠాలు ఉండే క్రమంలోనే స్టడీనోట్సులోనూ రాసుకుంటే.. వెతుక్కోవాల్సిన పని ఉండదు. కొన్ని పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడం కాస్త కష్టమవుతుంది. అలాంటప్పుడు ఉదాహరణలు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి అవసరమైన వాటికి ఉదాహరణలు రాయడాన్ని మర్చిపోకూడదు. తరగతిలో చెప్పింది చెప్పినట్టుగా కాకుండా.. స్టడీనోట్సును సొంత వాక్యాల్లో రాసుకుంటే ఫలితం ఉంటుంది. దీంతో విషయాలు సులభంగా అర్థంకావడమే కాకుండా ఎక్కువ కాలంపాటు గుర్తుంటాయి కూడా. 

సరైన పద్ధతిలో... 

నోట్సును వ్యాసం లేదా ముఖ్యమైన పాయింట్ల రూపంలో ఎలాగైనా రాసుకోవచ్చు. అయితే ఎలా రాసినా క్రమపద్ధతిలో ఉండేలా చూసుకోవాలి. శీర్షికలు, ఉపశీర్షికలు ఉపయోగించి... వాటి కింద పాయింట్లు సంబంధిత అంశాన్ని రాసుకుంటే మంచిది. శీర్షికలకు వేర్వేరు రంగులను ఉపయోగించాలి. దీనివల్ల అంశాల మధ్య తేడాను సులభంగా గుర్తించవచ్చు. అవసరమైనచోట టేబుళ్లు, డయాగ్రమ్‌లూ వేసుకోవాలి. ముఖ్యమైన సమాచారాన్ని హైలైట్‌ చేసుకుంటే పరీక్షల సమయంలో చదవడం సులువవుతుంది. నోట్సును అర్థమయ్యేలా చేత్తో రాసుకోవడమే మంచిది. ఇలాచేస్తే ఆయా అంశాలు ఎక్కువకాలంపాటు గుర్తుంటాయి. అలాగే ముఖ్యాంశాలను క్రమపద్ధతిలో రాసుకుంటే పరీక్షలోనూ అదే క్రమాన్ని అనుసరించి రాయగలుగుతారు.
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఉచితంగా డిగ్రీ + ఉద్యోగం!

‣ విద్యా సంస్థలకు గ్రేడింగ్‌ ఎలా ఇస్తారు?

‣ టిస్‌ కోర్సుల్లోకి ప్రవేశాలు ప్రారంభం

‣ వావ్‌..! అనిపిస్తారా?

Posted Date : 27-12-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌