• facebook
  • whatsapp
  • telegram

ఉచితంగా డిగ్రీ + ఉద్యోగం!

ఇంటర్మీడియట్‌ అర్హతతో సైన్యంలో కొలువు

యూపీఎస్‌సీ ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ 2023 (1) ప్రకటన వెలువడింది. సైన్యంలో అత్యున్నత హోదాతో సేవలు అందించాలనే ఆశయం ఉన్నవారు రాయాల్సిన ముఖ్యమైన పరీక్ష ఇదే. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారు అర్హులు. మహిళలకూ అవకాశం ఉంది. పరీక్షలో చూపిన ప్రతిభ, మౌఖిక పరీక్షతో నియామకాలుంటాయి. ఎంపికైనవారిని బీఏ/బీఎస్సీ/బీటెక్‌ ఉచితంగా చదివిస్తారు. శిక్షణ అనంతరం ఉద్యోగంలోకి తీసుకుంటారు. వీరు ఆర్మీ/ నేవీ/ ఎయిర్‌ ఫోర్స్‌ల్లో లెవెల్‌-10 హోదాతో సేవలు అందించవచ్చు. భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు! 

ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తున్నందువల్ల ఈ పరీక్షను లక్ష్యంగా చేసుకుంటే విజయం సాధించవచ్చు. నియామక ప్రక్రియ కఠినంగా ఉన్నప్పటికీ 40 శాతం మార్కులు పొందితే ఏదో ఒక సర్వీస్‌ ఖాయమవుతుంది. వీరు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ, పుణేలో.. బీటెక్, బీఎస్సీ, బీఏ కోర్సులు, నేవల్‌ అకాడెమీ, ఎజిమాళలో బీటెక్‌ (నేవల్‌ ఆర్కిటెక్చర్‌) విద్య అభ్యసించవచ్చు. వసతి, భోజనం, బట్టలు... అన్నీ ఉచితమే. విజయవంతంగా చదువు పూర్తిచేసుకున్నవారికి జేఎన్‌యూ, న్యూదిల్లీ డిగ్రీలు అందిస్తుంది. అనంతరం సంబంధిత విభాగాల ట్రేడ్‌ శిక్షణకు పంపుతారు. ఇది సుమారు ఏడాది నుంచి 18 నెలలు కొనసాగుతుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ అందుతుంది.  

సన్నద్ధత ఎలా?

ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ పరీక్ష కష్టం అనే భావన వీడాలి. విజయానికి 40 శాతం మార్కులు సరిపోతాయని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరంలో ఉన్నవాళ్లు వారి గరిష్ఠ వయసు ప్రకారం కనీసం ఏడెనిమిది సార్లు ఈ పరీక్ష రాసుకోవచ్చు. అందువల్ల నిబద్ధతతో శ్రమిస్తే విజయానికే అవకాశాలెక్కువ. ఒకవేళ విఫలమైనా డిగ్రీ అర్హతతో నిర్వహించే సీడీఎస్‌ఈ కోసమూ ప్రయత్నించవచ్చు. ఇతర పరీక్షలకూ ఈ సన్నద్ధత ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆశావహ దృక్పథంతో చదవడాన్ని ప్రారంభించాలి.

తాజా అభ్యర్థులు ముందుగా ప్రాథమికాంశాలపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం 8, 9, 10 తరగతుల మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ పాఠ్యపుస్తకాలను బాగా చదివి, ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి. అనంతరం సంబంధిత సబ్జెక్టుల్లో సీబీఎస్‌ఈ 11, 12 తరగతుల పుస్తకాలూ అధ్యయనం చేయాలి.   

సిలబస్‌ వివరాలు ప్రకటనలో పేర్కొన్నారు. అందులోని పాఠ్యాంశాలను ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచి 12వ తరగతి స్థాయి వరకు చదవాలి.  

పాఠ్యాంశాలు చదవడం పూర్తయిన తర్వాత పాత ప్రశ్నపత్రాలు నిశితంగా పరిశీలించాలి. వీటి నుంచి.. ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, వాటిని ఏ స్థాయిలో అడుగుతున్నారు, ఏ అంశాలకు ప్రాధాన్యం ఉందో గమనించాలి. తుది సన్నద్ధతను అందుకు తగ్గట్టుగా మలచుకోవాలి. గతంలో నిర్వహించిన ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ ప్రశ్నపత్రాలన్నీ యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. జవాబులూ పొందుపరిచారు.

అధ్యయనం పూర్తయిన తర్వాత మాక్‌ పరీక్షలు మొదలు పెట్టాలి. కనీసం పదైనా రాయాలి. వీటిని రాస్తున్నప్పుడే సమయానికి ప్రాధాన్యమివ్వాలి. ఫలితాలు విశ్లేషించుకోవాలి. వెనుకబడుతోన్న విభాగాలను మరోసారి బాగా చదవాలి. 

రుణాత్మక మార్కులు ఉన్నాయి అందువల్ల తెలియనివి వదిలేయాలి. 

క్కువ సమయం అవసరమయ్యే ప్రశ్నలను చివరలో ప్రయత్నించాలి. 

మొత్తం ఖాళీలు: 395 

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీలో 370, నేవల్‌ అకాడెమీ (10+2 క్యాడెట్‌ స్కీం)లో 25 ఉన్నాయి. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీకి సంబంధించి ఆర్మీ 208 (పది మహిళలకు), నేవీ 42 (మూడు మహిళలకు), ఎయిర్‌ ఫోర్స్‌ - ఫ్లయింగ్‌ 92 (రెండు మహిళలకు), గ్రౌండ్‌ డ్యూటీ టెక్‌ 18 (రెండు మహిళలకు), గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్‌ 10 (రెండు మహిళలకు) ఉన్నాయి. నేవల్‌ అకాడెమీలోని 25 ఖాళీలూ పురుషులకే. 

అర్హత: ఆర్మీ వింగ్‌ పోస్టులకు ఏదైనా గ్రూపుతో ఇంటర్‌. ఎయిర్‌ ఫోర్స్, నేవల్‌ వింగ్స్‌ (ఎన్‌డీఏ), 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ (ఇండియన్‌ నేవల్‌ అకాడమీ) ఖాళీలకు ఎంపీసీ గ్రూపుతో ఇంటర్‌. ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: జులై 2, 2004 - జులై 1, 2007 మధ్య జన్మించినవారు అర్హులు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జనవరి 10 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు.

ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు.

పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 16.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, వరంగల్‌. 

వెబ్‌సైట్‌: https://upsc.gov.in/

విధుల్లోకి చేరిన తర్వాత అందరికీ లెవెల్‌ 10 మూలవేతనం రూ.56,100 చెల్లిస్తారు. దీనికి అదరంగా మిలటరీ సర్వీస్‌ పే రూ.15,500 ఉంటుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు అందరికీ దక్కుతాయి. ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్‌ లెఫ్టినెంట్, ఎయిర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాలు కేటాయిస్తారు. ఇవన్నీ సమాన స్థాయివే. రెండేళ్ల అనుభవంతో ప్రమోషన్‌ పొందవచ్చు. ఆరేళ్ల తర్వాత మరొకటి, పదమూడేళ్లకు మరో పదోన్నతి దక్కుతుంది. 13 ఏళ్లు పనిచేసినవాళ్లు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ల్లో వరుసగా... లెఫ్టినెంట్‌ కల్నల్, కమాండర్, వింగ్‌ కమాండర్‌ స్థాయికి చేరుకుంటారు. అనంతరం ప్రతిభ ప్రాతిపదికన మిగిలిన హోదాలు దక్కుతాయి. అత్యున్నత ప్రతిభ చూపినవారు భవిష్యత్తులో సంబంధిత విభాగాలకు, త్రివిధ దళాల మొత్తానికీ అధిపతి కాగలరు. 

పరీక్ష, ఇంటర్వ్యూ ఇలా...

ఇందులో రెండు పేపర్లు. వీటికి 900 మార్కులు. పేపర్‌-1 మ్యాథ్స్‌ 300 మార్కులకు 120 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండున్నర మార్కులు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. పేపర్‌-2 600 మార్కులకు జనరల్‌ ఎబిలిటీ విభాగంలో ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో.. పార్ట్‌ ఎ ఇంగ్లిష్‌ 200, పార్ట్‌ బి జనరల్‌ నాలెడ్జ్‌ 400 మార్కులు. ఇంగ్లిష్‌లో 50, జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో.. ఫిజిక్స్‌ 25, కెమిస్ట్రీ 15, జనరల్‌ సైన్స్‌ 10, చరిత్ర, స్వాతంత్య్రోద్యమం 20, భూగోళశాస్త్రం 20, వర్తమానాంశాల నుంచి 10 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో మూడో వంతు తగ్గిస్తారు. పరీక్షలో అర్హత పొందడానికి ప్రతి సబ్జెక్టులోనూ 25 శాతం మార్కులు తప్పనిసరి. ఇలా అర్హత సాధించిన వారిలో మెరిట్‌ ప్రకారం ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. వీరికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో యూపీఎస్‌సీ ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తుంది. ఈ విభాగానికి 900 మార్కులు. ఇందులో భాగంగా గ్రూప్‌ టెస్టులు, గ్రూప్‌ డిస్కషన్, గ్రూప్‌ ప్లానింగ్, అవుట్‌డోర్‌ గ్రూప్‌ టాస్క్‌లను ఐదు రోజులపాటు రెండంచెల్లో నిర్వహిస్తారు. తొలిరోజు పరీక్షల్లో అర్హత సాధించినవారే మిగిలిన నాలుగు రోజుల్లో పాల్గొనగలరు. రాత పరీక్ష, సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మొత్తం మార్కులు, వైద్య పరీక్షల ఆధారంగా తుది నియామకాలుంటాయి.  

ఇంటర్వ్యూలో: అభ్యర్థి రక్షణ రంగంలో సేవలు అందించగలరా, లేదా పరిశీలిస్తారు. తెలివితేటలతోపాటు దృఢ సంకల్పం, మానసిక పరిణతి కనబర్చాలి. నాయకత్వ నైపుణ్యాలు ఏ మేరకు ఉన్నాయో గమనిస్తారు. ఆత్మ విశ్వాసంతో జవాబులు చెప్పాలి. భారత రక్షణ రంగంపై ఆవగాహన ఉండాలి. అభ్యర్థుల నేపథ్యంపైనా కొన్ని ప్రశ్నలుంటాయి.  

గత కటాఫ్‌ ఎంతంటే..

2022 ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఎ (1)లో 900 మార్కులకు నిర్వహించిన పరీక్షలో 360 పొందినవారు ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. తుది నియామకాల్లో 1800 (పరీక్షకు 900, ఇంటర్వ్యూకు 900) మార్కులకు 720 వచ్చినవారు ఏదో ఒక విభాగంలో అవకాశం పొందారు. 2021 ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఎ(2) పరీక్షలో 355 మార్కులు పొందినవారు ఇంటర్వ్యూకు, తుది నియామకాల్లో 726 మార్కులు వచ్చినవారు ఏదో ఒక సర్వీస్‌కు ఎంపికయ్యారు. 

సబ్జెక్టుల వారీగా..

మ్యాథ్స్‌: ఈ విభాగం ఎంపీసీ గ్రూపు విద్యార్థులకు అనుకూలం. మిగిలినవాళ్లు వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధిస్తే మెరుగైన మార్కులు పొందవచ్చు. ముందుగా ప్రాథమికాంశాలు, సూత్రాలు, అనువర్తనంపై దృష్టి సారించాలి. ఈ పేపర్‌లో మ్యాట్రిసెస్‌ అండ్‌ డిటెర్మినెంట్స్‌ 30, ట్రిగనోమెట్రీ 30, కాలిక్యులస్‌ 20, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌ 20, ప్రాబబిలిటీ 10, కాంప్లెక్స్‌ నంబర్స్‌ 10 వరకు ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల వీటిని అధిక ప్రాధాన్యంతో చదవాలి. ఎక్కువ ప్రశ్నలు సాధన చేయాలి. 

ఫిజిక్స్‌: ముఖ్యమైన నియమాలు, సూత్రాలు బాగా చదవాలి. కాన్సెప్ట్‌ ఆధారిత ప్రశ్నలు అడుగుతున్నారు. అనువర్తనంపై అవగాహన పెంచుకోవాలి.

కెమిస్ట్రీ: ఫార్ములాలు, రియాక్షన్లకు ప్రాధాన్యం ఉంది. మూలకాలు, మిశ్రమాలు, సమ్మేళనాలు, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, రసాయన సమీకరణాలు, అణుసమ్మేళనాలు... ఈ అంశాలన్నీ చదవాలి. మోల్‌ కాన్సెప్ట్, పీ బ్లాక్‌ నుంచి ప్రశ్నలు తరచూ వస్తున్నాయి.

జనరల్‌ సైన్స్‌: సెల్స్, టిష్యూస్, రిప్రొడక్షన్, హ్యూమన్‌ బాడీ ఆర్గాన్స్, ప్లాంట్స్, యానిమల్స్‌... తదితర అంశాలు బాగా చదవాలి.  

హిస్టరీ, జాగ్రఫీ: సిలబస్‌లో పేర్కొన్న అంశాలను ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచి చదువుకుంటే సరిపోతుంది. 

ఇంగ్లిష్‌: వ్యాకరణం, పదసంపదకు ప్రాధాన్యం ఉంది. రోజూ కొత్త పదాలను తెలుసుకోవాలి. వాక్యంలోని పదాలు ఒక క్రమంలో అమర్చమనే ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. అర్థాలు, వ్యతిరేకపదాలు, తప్పుని గుర్తించడం, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్, కాంప్రహెన్షన్, ఖాళీని పూరించడం... ఈ విభాగాల్లో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి. ప్యాసేజ్‌ల కోసం ఆంగ్ల వ్యాసాలు, పుస్తకాలు బాగా చదవాలి. 

కరెంట్‌ అఫైర్స్‌: పరీక్ష తేదీకి 9 నెలల వెనుక వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో నెలకొన్న కీలక పరిణామాలపై ప్రశ్నలు రావచ్చు. ఎన్నికలు, నియామకాలు, క్రీడలు, ప్రముఖుల పర్యటనలు, పుస్తకాలు - రచయితలు, అవార్డులు, అంతర్జాతీయ, జాతీయ రక్షణ రంగంలోని తాజా అంశాలపై దృష్టి పెట్టాలి. ఏదైనా పత్రికను అనుసరించి, ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి. 

పుస్తకాలు: టాటా మెక్‌ గ్రాహిల్స్‌/ అరిహంత్‌ పుస్తకాలను పరిశీలించవచ్చు. జీకే ప్రశ్నలకు లూసెంట్స్‌ జనరల్‌ నాలెడ్జ్‌ ఉపయోగపడుతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జాగ్రఫీ, జనరల్‌ సైన్స్‌లకు ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లోని ముఖ్యాంశాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. 

విద్య, శిక్షణ... 

ఎన్‌డీఏకు ఎంపికైనవారికి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ (ఎన్‌డీఏ), పుణెలో మూడేళ్ల పాటు చదువు, శిక్షణ అందిస్తారు. ఆర్మీని ఎంచుకుంటే బీఎస్సీ/ బీఎస్సీ (కంప్యూటర్‌)/ బీఏ కోర్సుల్లో ఏదైనా చదువుకోవచ్చు. నేవీకి ఎంపికైనవారు బీటెక్, ఎయిర్‌ ఫోర్స్‌ విభాగమైతే బీఎస్సీ లేదా బీటెక్‌ విద్య అభ్యసిస్తారు. నేవల్‌ అకాడెమీకి (10+2 టెక్నికల్‌ క్యాడెట్‌ ఎంట్రీ స్కీం) ఎంపికైనవాళ్లు ఎజిమాల, కేరళలోని నేవల్‌ అకాడెమీలో నాలుగేళ్లపాటు బీటెక్‌ విద్య అభ్యసిస్తూ శిక్షణ పొందుతారు. ఎన్‌డీఏలో మూడేళ్ల శిక్షణ, చదువు అనంతరం ఆర్మీ క్యాడెట్లను దేహ్రాదూన్‌లోని ఇండియన్‌ మిలటరీ అకాడమీకి; నేవల్‌ క్యాడెట్లను ఎజిమాలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీకి; ఎయిర్‌ ఫోర్స్‌ క్యాడెట్లను హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీకి సంబంధిత ట్రేడ్‌ శిక్షణ కోసం పంపుతారు. అనంతరం ఉద్యోగంలోకి తీసుకుంటారు.  
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ విద్యా సంస్థలకు గ్రేడింగ్‌ ఎలా ఇస్తారు?

‣ టిస్‌ కోర్సుల్లోకి ప్రవేశాలు ప్రారంభం

‣ వావ్‌..! అనిపిస్తారా?

‣ ఏకాగ్రతతో ఎలా చదవాలి?

‣ అందరూ కామర్స్‌ కోర్సుల్లో చేరుతున్నారు!

‣ బొగ్గు గనుల్లో ఉద్యోగాలు

‣ సందేహాలు వదిలేసి పరీక్షలకు సిద్ధంకండి!

Posted Date : 26-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌