• facebook
  • twitter
  • whatsapp
  • telegram

విద్యా సంస్థలకు గ్రేడింగ్‌ ఎలా ఇస్తారు?

ఏయే సంస్థలు ఏ విధంగా పని చేస్తాయి?

చదివే సంస్థ ఎంత ఉన్నతంగా ఉంటే విద్యార్థులూ అంత గొప్పగా ఎదుగుతారు. కెరియర్‌ పరంగానూ ఉత్తమ అవకాశాలను అందిపుచ్చుకోగలరు. అందుకే మన దేశంలో ఉన్న అన్ని విద్యాసంస్థలకూ గ్రేడింగ్‌ ఇచ్చే కొన్ని సంస్థలు ఉన్నాయి. ఇవి ఎలా పనిచేస్తాయి... మన కాలేజీకి, వర్సిటీకి ఉన్న గ్రేడ్‌ ఏంటి అని తెలుసుకోవడం విద్యార్థులకు అవసరం.

నాణ్యతను అంచనా వేయడం ఎక్కడైనా జరగాల్సిన ప్రక్రియ. ముఖ్యంగా ఈ దేశ యువతకు దిశానిర్దేశం చేసే విద్యాసంస్థల్లో ఇది మరింత పకడ్బందీగా జరగాలి. ఆ విధిని చక్కగా నిర్వర్తిస్తున్నాయి ఈ గ్రేడింగ్‌ సంస్థలు. ఎన్‌ఏసీసీ, ఎన్‌బీఏ... ఇలా సంస్థ ఏదైనా తమ రీతిలో ఒక విద్యాసంస్థ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని నాణ్యతను లెక్కిస్తున్నాయి. ఈ గ్రేడ్ల ఆధారంగా వర్సిటీలకు వచ్చే ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌) గుర్తింపు పొందిన ఏ విద్యాసంస్థ అయినా ఎన్‌ఏఏసీ, ఎన్‌బీఏ వంటి సంస్థల గుర్తింపు కోసం తప్పక దరఖాస్తు చేయాలి. 


 

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌


ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ అంటే నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌. ఇది ఎంహెచ్‌ఆర్డీ (మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ) ద్వారా 2015లో ఏర్పాటైంది. దేశంలోని వివిధ విద్యాసంస్థల స్థాయి అంచనాకు ఇది కొన్ని మెథడాలజీలను అనుసరిస్తుంది. ఎంహెచ్‌ఆర్డీ కోర్‌   కమిటీ ఈ విధి విధానాలను నిర్దేశిస్తుంది.

విద్యార్థుల సంఖ్య, విద్యార్థులు - అధ్యాపకుల నిష్పత్తి, పీహెచ్‌డీ స్థాయి అర్హతలు ఉన్న అధ్యాపకులు, ఆర్థిక నిధులు - వాటి వినియోగం, పబ్లికేషన్లు, ఐపీఆర్‌ - పేటెంట్లు, ప్రాజెక్టులు - ప్రొఫెషనల్‌ సాధన, పరీక్షలు, పీహెచ్‌డీ చేసేవారు, మహిళ - దివ్యాంగులు - వెనుకబడిన వర్గాల  విద్యార్థులకు లభిస్తున్న ప్రాధాన్యం వంటి అన్ని అంశాలనూ పరిశీలించి ఈ ర్యాంకులు కేటాయిస్తారు.

ఇంజినీరింగ్, మెడికల్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, లా, ఆర్కిటెక్చర్, డెంటల్‌ కాలేజీలకు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌ ఇస్తోంది.


 

ఎందుకు తెలుసుకోవాలి?


విద్యార్థులు తాము చదవాలి అనుకుంటున్న ఉన్నత విద్యాసంస్థల బలాలు, బలహీనతలు తెలుసుకోవడానికి ఈ గణన ఉపయోగపడుతుంది. అందువల్ల ఎక్కడ ఏ విభాగం బాగుంటుంది, ఎక్కడ ఎటువంటి సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయనే విషయాలన్నీ వారు తెలుసుకోవచ్చు. 

ఫండింగ్‌ ఏజెన్సీలు ఈ గ్రేడ్లు చూసే నిధులిచ్చేందుకు ముందుకొస్తాయి. ఏ ఇన్‌స్టిట్యూట్‌కు ఎటువంటి నిధులున్నాయనే విషయం తెలిస్తే.. అక్కడ విద్యాబోధన, సౌకర్యాలు ఏవిధంగా లభిస్తాయనేది విద్యార్థులు అంచనా వేసుకోవచ్చు. 

మంచి గ్రేడింగ్‌ ఉన్న కాలేజీల్లో సీటు దొరకాలంటే ఎక్కువ మార్కులు సాధించాలి. ఇటువంటి సంస్థలకే ఉన్నతశ్రేణి కంపెనీలు ప్రాంగణ నియామకాలకు వస్తుంటాయి. అందువల్ల  ఏ విధంగా చూసినా ఒక విద్యాసంస్థ స్థాయిని తెలుసుకోవడం, ఉన్నతస్థాయి గల సంస్థలో ప్రవేశం పొందడం విద్యార్థులకు ఎంతో ఉపకరించే అంశం.


 

ఎన్‌ఏసీసీ


ఉన్నత విద్యా సంస్థలు, ముఖ్యంగా స్టేట్‌ యూనివర్సిటీలకు యూజీసీ నుంచి నిధులు రావాలంటే నాక్‌ (ఎన్‌ఏసీసీ) అక్రిడిటేషన్, ర్యాంకు తప్పనిసరి. ఈ నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడేషన్‌ కౌన్సిల్‌ను 1994లో ఏర్పాటుచేశారు.

   ఒక విద్యాసంస్థను పూర్తిస్థాయిలో అంచనా వేయడం దీని పని. బోధించే తీరు, నడుస్తున్న విధానం, విద్యార్థులు నేర్చుకునే సరళి, అధ్యాపకులు, పరిశోధనలు, సౌకర్యాలు... ఇలా అన్ని అంశాల ఆధారంగా ఈ గ్రేడ్లు ఆధారపడి ఉంటాయి.

 నాక్‌ ద్వారా A ++, A +, A వంటి గ్రేడ్లు పొందిన విద్యా సంస్థలు చాలా నాణ్యమైన  విధానాలను పాటిస్తున్నాయని అర్థం. 

 బోధనకూ - నేర్చుకోవడానికీ మధ్య సమతుల్యతకు ఈ సంస్థలు పాటుపడేలా, నాణ్యతను ప్రోత్సహించే కార్యక్రమాల నిర్వహణలో, అకడమిక్‌ కార్యక్రమాల్లో అధ్యాపకులు పూర్తిగా పాల్గొనేలా.. ఈ గణన ప్రోత్సహిస్తుంది. 

 ప్రతి స్థాయిలోనూ విద్యార్థులు తమ ఉన్నతిని పరిశీలించుకోవడానికి ఉపకరిస్తుంది.


 

ఎన్‌బీఏ


ఎన్‌బీఏ అంటే నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌. ఇది ప్రధానంగా టెక్నికల్‌ విద్యాసంస్థలకు అక్రిడిటేషన్లు ఇస్తుంది. తరచూ వాటిలో నాణ్యత ప్రమాణాలను అంచనా వేస్తుంది.

 అకడమిక్స్‌తోపాటు విద్యార్థులకు అదనపు నైపుణ్యాలు అందేలా చేసేందుకు ఎన్‌బీఏ ప్రయత్నిస్తుంది. ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా, వారు చెప్పుకోదగిన స్థాయిలో నైపుణ్యాలు నేర్చుకునేలా ఇది ప్రోత్సహిస్తుంది.

 ఎన్‌బీఏ నుంచి విజయవంతంగా అక్రిడిటేషన్‌ పొందిన విద్యాసంస్థలు అటానమస్‌ స్థాయి పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడు అవి ఏ యూనివర్సిటీ సాయం లేకుండా సొంతంగా పనిచేయవచ్చు. 

 అటానమస్‌ స్థాయి పొందిన విద్యాసంస్థలు గ్రాంట్ల కోసం దరఖాస్తు చేసుకుంటాయి. దీని ద్వారా విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించవచ్చు. 

ఇంజినీరింగ్‌ - టెక్నికల్‌ బ్రాంచ్‌లు, ఆర్కిటెక్చర్, హాస్పిటాలిటీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్, టూరిజం, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, అప్లైడ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ వంటి విభాగాల విద్యాసంస్థలు ఈ అక్రిడిటేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఏకాగ్రతతో ఎలా చదవాలి?

‣ టిస్‌ కోర్సుల్లోకి ప్రవేశాలు ప్రారంభం

‣ అందరూ కామర్స్‌ కోర్సుల్లో చేరుతున్నారు!

‣ సందిగ్ధతను దాటి.. సన్నద్ధత వైపు!

Posted Date : 24-12-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌